ఔషధ మొక్క…. పనస

పనస 20 మీ. ఎత్తు పెరిగే వృక్షం. బెరడు నలుపు రంగులో లేదా ఆకుపచ్చ మచ్చలతో నునుపుగా ఉంటుంది. మానులోపల పసుపు రంగులో ఉంటుంది. దీని ఆడ, మగ పూలు లేత ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. పూలు మానుపైనే ఏర్పడతాయి. ఆడ కంకులలోని పూలన్నీ ఫలదీకరణం చెంది ఒకే పెద్ద పండు తయారవుతుంది. పండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : జాక్‌ఫ్రూట్ ట్రీ శాస్త్రీయ నామం : ఆర్టోకార్పస్ హిటరోఫిల్లస్ కుటుంబం: మోరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పనస ఆకులు, వేర్లు, పండ్లు, గింజలు, చెక్క, పాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో పిండిపదార్థాలు, అమైనోఆమ్లాలు, బీటాకెరోటిన్ ఉంటాయి. పండులోపల గల జిగురులాంటి పదార్థంలో ల్యూసిన్, ఐసోల్యూసిన్, టైరోసిన్, వాలైన్ ఉంటాయి.
  • మానులోపలి కర్రభాగంలో మోరిన్, ఆర్టోకార్పిన్ మొదలగు రసాయనాలుంటాయి. లేత ఆకులను వాపులకి, గాయాలకు కాపుపెట్టడానికి ఉపయోగిస్తారు.
  • లేత పనస కాయకూర మేధస్సును వృద్ధి చేస్తుంది. బలం, వీర్యపుష్టినిస్తుంది.
  • గింజల పొడిని గిరిజనులు ఆహారంగా ఉపయోగిస్తారు. పనస చెట్టు చెక్క మరియు కొద్దిగా మిరియాలు కలిపిన పొడి మందు గజ్ౙి, తామర, దురదలను పోగొడుతుంది. దీనిని విరేచనాలు అరికట్టడానికి, కడుపులో పుండ్ల నివారణకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • పనస ఆకుద్రావణం పర్యావరణహిత లార్విసైడ్‌గా పనిచేస్తుంది. ఇది బ్రూకస్‌పైసోరం, ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ ఒరైజెపై కీటకనాశక చర్యను కూడా ప్రదర్శించింది (నాయిర్ అండ్ కర్వేకర్, 2017).
  • పనస గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఎస్కరిచియాకోలి, సూడోమోనాసఈరూజినోసా, స్టెఫైలోకోకస్ ఆరియస్‌లపై అత్యంత సమర్ధవంతమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (జా అండ్ శ్రీవాస్తవ, 2013).
  • పనస లేటెక్స్ హెక్సనాయిక్, మిథనాలిక్, పెట్రోలియం ఈదర్, క్లోరోఫాం ద్రావణాలు స్పోడోప్టెరాలిటూర లార్వాలను 90-95% చంపాయి. ఇవి లార్వాల బరువును గణనీయంగా తగ్గించాయి (ఉపాధ్యాయమ్, 2013).
  • పనస వేర్లు, కాండాలు, ఆకులు, గింజలలో ఉండే అసిటోజెనిన్స్ శక్తివంతమైన పురుగు మందు లక్షణాలు కలిగి ఉంటాయి (నజ్‌ముల్‌హక్, 2006).
  • పనస పచ్చి ఆకులను మేకలకు మేతగా వేస్తారు.
  • ఎండిన ఆకులను వంటచెరకుగాను, కంపోస్టు తయారీకి, ఆచ్ఛాదన చేయడానికి ఉపయోగిస్తారు (ప్రాక్టికల్ మాన్యువల్, 2006).
  • పనస కాండం, వేరుబెరడు, కాండం, వేరుహార్ట్‌వుడ్, ఆకులు, కాయలు, గింజల మిథనాల్ ద్రావణాలు అనేక బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (ఖాన్, అతని అనుచరులు, 2003)
  • పనస డైక్లోరోమిథేన్ ద్రావణం పల్స్ బీటిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లు పెట్టకుండా, పెద్ద పురుగులు విడుదలవకుండా నిరోధించాయి (జయకుమార్, అతని అనుచరులు, 2005)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… ఉత్తరేణి

ఏకవార్షిక లేదా బహువార్షిక మొక్క. ఇది ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక ప్రదేశాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఉత్తరేణి నిలువుగా 2 మీ. ఎత్తు వరకు పెరిగే మొక్క. దీని కాండం మొదలులో కొయ్యలా తయారవుతుంది. ఆకులు చిన్నకాడలు కలిగి పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రిందివైపు లేత ఆకుపచ్చ రంగులోను ఉంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూవులు చిన్నవిగా, ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటాయి. పూలు పెరిగిన కొద్దీ క్రిందికి వంగి కాండానికి దగ్గరగా వత్తుకుంటాయి. కాయలు పదునైన మొనలతో నారింజ రంగు నుండి ఎరుపు ఊదారంగులో ఉంటాయి.

సాధారణ నామం : చాఫ్ ఫ్లవర్ శాస్త్రీయ నామం : అకిరాంథస్ ఆస్పెర కుటుంబం: అమరాంతేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వినాయక చవితి రోజు జరిపే గణేశ వ్రత పూజలో ఉపయోగించే 21 ఆకులలోఇది ఒకటి. ఈ మొక్క రసాన్ని గోడకు వేసే సున్నంలో ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు.
  • ఉత్తరేణి భారతీయ సంస్కృతిలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. దీనిని పూర్వకాలం నుండి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు దీనిని గర్భస్రావానికి మందుగా ఉపయోగించేవారు.
  • ఉత్తరేణిని పశువుల వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఆస్త్మా, దురదలు, హిస్టీరియా, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేర్లను క్యాన్సర్, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడినప్పుడు చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఉత్తరేణి ఇథైల్ ఎసిటేట్ ద్రావణం వంగ పంట నాశించి తీవ్ర నష్టం కలిగించే అక్షింతల పురుగు, హెనోసెపిలాక్నా విజింటియాక్టోపంక్టేటపై అత్యధిక యాంటిఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (జయశంకర్, అతని అనుచరులు, 2013).
  • తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, ఈశ్వర వేరు, అరిస్టొలోకియా బ్రాక్టియేట, అడవి ఆముదం (జట్రోఫాకర్కాస్), వేప, ఐలాంతాస్ ఎక్సెల్సా,తుమ్మి (ల్యూకాస్ ఆస్పెరా), జిల్లేడు ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సహజ హెర్బల్ పురుగు మందు పంటలలో పురుగులు, తెగుళ్ళను నివారిస్తుంది. ఈ హెర్బల్ మొక్కలన్నిటినీ ఎండబెట్టి పొడిచేసి ఆవుపేడ, ఆవు మూత్రంతో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. 1 లీ. పులిసిన ద్రావణాన్ని 20 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపింది (భగవాన్,అ తని అనుచరులు, 2008).
  • ఉత్తరేణి కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ కార్నియస్ శిలీంద్ర పెరుగుదలను 300 పిపియం వద్ద అరికట్టింది (మిశ్రా, అతని అనుచరులు, 1992).
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఆలుగడ్డ, వంగ పంటల ఆకులను తిని అధికంగా నష్టపరిచే హెనోస్ ఎపిలాక్న విగ్నింట యాక్టోపంక్టేటని నివారిస్తుంది (కుప్పుసామి ఎలుమలై, అతని అనుచరులు, 2014).
Read More

ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు, శిక్షణ

రసాయన ఎరువులు- మందులు వినియోగించకుండా.. సహజ పద్ధతుల్లో సేద్యంతో పర్యావరణానికి, రైతులకు, ఆయా ఉత్పత్తుల వినియోగంతో ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన విజయవాడకు చెందిన వైద్య దంపతులు డాక్టర్‌ చదలవాడ సుధ, డాక్టర్‌ నాగేశ్వరరావులు ఈ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు తమవంతు సేవలు అందించాలని, 11 ఏళ్ల క్రితం ఏపీలోని నూజివీడు సమీప కొండపర్వ గ్రామంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అక్కడ 38 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వేర్వేరు పంటలు పండిస్తున్నారు. రసాయనాలు విని యోగించకుండా సాగుచేయడం, ప్రకృతి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. దేశవిదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. విషపూరిత రసాయనాలతో వ్యవసాయం చేయకూడదన్న ప్రధాన లక్ష్యంతో ఈ దంపతులు మూడేళ్ల క్రితం ఫౌండేషన్‌కు అనుబంధంగా కృష్ణసుధా అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీని స్థాపించారు. కొండపర్వలోనే అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశా లను అందుబాటులోకి తెచ్చారు.
”సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పటివరకు సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌, ఆగ్రో ఫారెస్ట్రీ, ట్రీ-హబ్‌, స్విట్జర్లాండ్‌లోని ది రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ సంస్థలతో.. సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాం” అని చదలవాడ సుధ తెలిపారు. శిక్షణ కోసం 85002 83300 నంబరులో సంప్రదించాలని సూచించారు. https://Krishnasudha academy.org / లోనూ సంప్రదించవచ్చు.

Read More