మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు
సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.












