వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుతో అనేక ప్రమాదాలు
ధూమపానం చేసే వారి నిర్లక్ష్యంతో, విద్యుదాఘాతంతో ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం పంట వ్యర్థాల దహనం పేరిట, పెట్టే మంటలకు సమీప రైతుల ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంటలను తగలబెట్టడం మంచిది కాదని హితబోధ చేస్తున్నా, పెడచెవిన పెడుతున్న వ్యక్తులతో నిత్యం ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉన్నాయి. పచ్చని చేలు సైతం బూడిదగా మారుతున్నాయి. ఈ ఏడాది మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా కోతలు ముమ్మరంగా సాగగా, ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. కోతల అనంతరం ఖరీఫ్‌కు చేలను సిద్ధం చేయాలన్న ఆలోచనలో రైతులు, కంకులు విరవగా, ఉన్న పంట వ్యర్థాలను తగలబెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఒకరిని చూసి, మరొకరు ఇదే పనికి పూనుకుంటున్నారు. ఏ చేను చూసిన మసిగా మారి కన్పిస్తోంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెళ్తున్న అగ్నిమాపక శకటాలకు సరైన దారిలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుండటంతో సకాలంలో ఆర్పలేకపోతున్నారు.
20కి పైగా ప్రమాదాలు: మైలవరం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఆరు మండలాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 20 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ పొలాల్లో నిప్పు పెట్టినవే. విలువైన జామాయిల్ పంటలతో పాటు సాగునీటి సరఫరా సామగ్రి దగ్ధమ య్యాయి. ఎండలు మండుతున్న తరుణంలో, పూర్తిగా ఎండిన చేలల్లో అగ్గిపుల్ల గీసేసి వెళ్తుండటంతోనే పక్క చేలకు వ్యాపించి, ప్రమాద స్థాయి పెరుగుతోంది. కొన్నిసార్లు మంటలార్పేందుకు మేము దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అని మైలవరం అగ్నిమాపక అధికారి అన్నారు.










