బ్రహ్మి

బ్రహ్మి లేదా గోటుకోలా మొక్కలో ట్రైటెర్పినాయిడ్స్ అదికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆసియాటికోసైడ్స్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి.

ఈ మొక్క చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు యాంటీఆక్సీడెంట్ స్థాయిలను పెంచుతుంది. గాయపడిన ప్రాంతానికి రక్తప్రసరణ మెరుగుపడటానికి, కొత్త కణాలు మరియు కణజాలం ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

బ్రహ్మి ఆకుల రసాన్ని చిన్న గాయాలు, కాలిన గాయాలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలపై సంప్రదాయంగా లేపనంగా ఉపయోగిస్తారు. గాయపడిన లేదా కాలిన భాగంలో కొత్త కణాల ఏర్పాటుకు, కణజాల వృద్ధికి మరియు చర్మ దృఢత్వం పెరగడానికి ఇది సహాయపడుతుంది. దీనిలోని ఆసియాటికోసైడ్స్ సంధాన కణజాలం ఏర్పడటాన్ని ప్రోత్సహించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అందువల్ల చిన్న గాయాలు, మచ్చలు, శస్త్రచికిత్స అనంతరం ఏర్పడే గాయాలు, కాలిన చర్మ గాయాలు మరియు వెరికోస్ అల్సర్లలో సహాయకంగా ఉపయోగించబడుతుంది.

బ్రహ్మీ ఆకులను శుభ్రంగా కడిగి తయారు చేసిన పసరును సంప్రదాయంగా గాయంపై లేపనంలా పూసి, గాజు గుడ్డతో కట్టు కడతారు. అయితే లోతైన గాయాలు, తీవ్రమైన కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్ ఉన్న గాయాలకు స్వయంగా ఆకు పసరు లేదా ఇతర పదార్థాలు ఉపయోగించకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

బ్రహ్మీ/గోటుకోలా ఆధారిత గుళికలు, క్రీములు మరియు ఆయింట్‌మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని వైద్యుల లేదా అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సూచన మేరకు ఉపయోగించడం మంచిది.

బ్రహ్మీ/గోటుకోలా సాగు సాంకేతికతః

  1. అనుకూలమైన నేల
    సారవంతమైన, మంచి నీటి పారుదల కలిగిన ఇసుక-లోమి లేదా లోమి నేలలు అనుకూలం. నేలలో సేంద్రియ పదార్థం అధికంగా ఉండటం మంచిది. నీరు నిలిచిపోయే నేలలను నివారించాలి. సుమారు ఉదజని 5.5-7.0 మధ్య నేల అనుకూలంగా ఉంటుంది. తేమను నిలుపుకునే నేలలో మంచి పెరుగుదల ఉంటుంది.
  2. వాతావరణం:
    ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణం అనుకూలం.
  • సుమారు 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మంచి పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
  • అధిక తేమ మరియు మితమైన నీడలో కూడా బాగా పెరుగుతుంది.
  • నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.
  1. నీటి పారుదలః
    బ్రహ్మీకి నేలలో తగినంత తేమ నిరంతరం ఉండటం అవసరం. వేసవిలో సాధారణంగా 3-5 రోజులకొకసారి, నేల పరిస్థతిని బట్టి నీరు ఇవ్వవచ్చు. డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతులను ఉపయోగించవచ్చు. నీరు నిలిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  2. ఎరువుల యాజమాన్యం:
    భూమిని సిద్ధం చేసేటప్పుడు బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేయాలి. సాధారణంగా హెక్టారుకు సుమారు 10-15 టన్నుల సేంద్రియ ఎరువు ఉపయోగించవచ్చు. నేల పరీక్ష ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఇవ్వడం మంచిది. సేంద్రియ సాగులో వర్మీకంపోస్ట్, జీవ ఎరువులను ఉపయోగించవచ్చు. సమతుల్య పోషక యాజమాన్యం పాటించాలి.
  3. కోత మరియు దిగుబడి:
    నాటిన తరువాత సుమారు 3-4 నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. నేలకు దగ్గరగా ఆకులు మరియు కొమ్మలను కోయాలి. తగిన నీరు, పోషకాలు అందిస్తే తదుపరి కోతలు కూడా తీసుకోవచ్చు. సాగు విధానం, నేల, వాతావరణం మరియు నిర్వహణను బట్టి సాధారణంగా హెక్టారుకు సుమారు 10-20 టన్నుల తాజా ఆకులు/హెర్బ్ లభించవచ్చు.
  4. విలువ ఆధారిత ఉత్పత్తులు:
    బ్రహ్మీ ఆకులను తాజా రూపంలో లేదా ఎండబెట్టి వివిధ ఉత్పత్తులుగా మార్చుకోవచ్చు.
    • బ్రహ్మీ ఆకుల పొడి
    • బ్రహ్మీ టీ
    • బ్రహ్మీ హెర్బల్ డ్రింక్
    • బ్రహ్మీ జ్యూస్/స్క్వాష్
    • బ్రహ్మీ ఎక్స్‌ట్రాక్ట్
    • బ్రహ్మీ క్యాప్సూల్స్ మరియు టాబ్లెట్లు
    • బ్రహ్మీ హెర్బల్ ఆయింట్‌మెంట్/క్రీమ్
    • బ్రహ్మీ సబ్బులు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులు
    • హెర్బల్ హెయిర్ ఆయిల్
    • బ్రహ్మీ ఆధారిత న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులు
    విలువ జోడింపు ద్వారా తాజా ఆకులు కంటే నిల్వ కాలం పెంచడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఔషధంగా లేదా వ్యాధి చికిత్స కోసం విక్రయించే ఉత్పత్తులకు సంబంధిత నాణ్యత, భద్రత మరియు నియంత్రణ ప్రమాణాలను పాటించాలి.

డా. యం.ఆర్. భానుశ్రీ, డా. వి. జయశ్రీ, డా. యం. జగన్‌మోహన్‌రెడ్డి
వ్యవసాయ కళాశాల, పాలెం, నగర్ కర్నూల్ జిల్లా. ఫోన్ : 9618874445

Read More

ఔషధ మొక్క… దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఒక నిత్యహరిత చెట్టు. కాండం బలంగా 30-60 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. బెరడు సుమారు 10 మి.మీ. మందంగా బూడిద రంగులో ఉంటుంది. సాధారణంగా ఇది ఒక దట్టమైన పొద. లేత కొమ్మలపై బెరడు నునుపుదనం కలిగి పాలిపోయిన గోధుమరంగు లేదా గోధుమబూడిద రంగులో ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా ఏర్పడి వాసననిస్తాయి. ఆకు కాడ 1-2 సెం.మీ. పొడవుంటుంది. పూలు చిన్నవిగా 3 మి.మీ. వ్యాసం, పాలిపోయన పసుపు రంగులో ఉంటాయి. కాయ అండాకారంలో 1-2 సెం.మీ. పొడవుండి పండినపుడు నలుపు రంగులో ఉంటాయి.

సాధారణ నామం : సిన్నమోమ్ శాస్త్రీయ నామం : సిన్నమోమం వెరమ్/సిన్నమోమం జీలానికం కుటుంబం: లారేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • సంప్రదాయ ఔషధాలలో దీర్ఘకాలంగా దాల్చిన చెక్కను ఇతర హెర్బల్ మొక్కలతో కలిపి ఉపయోగిస్తున్నారు. దీనిని కీళ్ళనొప్పులు, గుండెదడ, డిస్మెనోరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పురాతన ఈజిప్షియన్లు దాల్చిన చెక్క కలిపిన పరిమళ ద్రవ్యంలో మార్పుకు గురికాకుండా వస్తువులను నిల్వ చేసేవారు.
  • దీనిని పళ్ళునొప్పులు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఆరోగ్యాన్ని పెంచే టానిక్‌గా ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజ, గొంతు నొప్పులను తగ్గిస్తుంది. స్త్రీలలో బహిష్టు సమయంలో కలిగే అసౌకర్యాలకు ఉపశమనం కలిగిస్తుంది.
  • భారతదేశంలో ఆయుర్వేద ఔషధాలలో మొలలు, డయేరియా, పళ్ళనొప్పి, అమీబియాసిస్, గుండె జబ్బులు, జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి అనేక సమస్యలను తీరుస్తుంది.
  • దాల్చిన చెక్కలో యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ప్రతిరోజు దాల్చిన చెక్క టీని త్రాగితే మానవులలో ఒత్తిడి తగ్గుతుంది. మూత్రం స్రవించడానికి, విసర్ౙనానికి దోహదపడుతుంది. సెక్స్ కోరికలను పెంచుతుంది. బాలింతలలో చనుబాల ఉత్పత్తిని పెంచుతుంది.
  • దాల్చిన చెక్కను అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. డోనట్స్, యాపిల్‌పై, బన్స్, క్యాండీస్, టీ, వేడికోకో, లిక్కర్లలో ఉపయోగిస్తారు. చిక్కని సూపులు, డ్రింక్స్, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
  • ఆయుర్వేద ఔషధం దాల్చిన చెక్క శ్వాసకోశ, జీర్ణాశయ, గర్భాశయ సమస్యలకు మంచి మందు. ఈ చెట్టు బెరడు, ఆకులు, పూలు, కాయలు, వేర్లు ఔషధ లేదా వంటకాల విలువలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు బెరడుని ఎండబెట్టి భారతదేశంలో అన్ని వంటకాలలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • ఈ మొక్కని, దాని కషాయాలను అనేక జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ద్రావణాలను గాస్ట్రో ఇంటస్టెåనల్ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జీర్ణాశయంలో ఏర్పడిన వాయువు విడుదలవడానికి సహాయపడుతుంది. అధికంగా వాయువు ఏర్పడటం వలన పొట్టలో కలిగే నొప్పులకు ఉపశమనం కల్గిస్తుంది.
  • మూత్రకోశాన్ని శుభ్రపరచి జబ్బులను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నివారించి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. జలుబు, ఫ్లూజ్వరాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తారు. తీవ్ర తలనొప్పిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క, తాజా నిమ్మరసంతో పేస్టు తయారు చేసి మొటిమలపై పూసి వాటిని నయం చేయవచ్చు.

వ్యవసాయరంగంలో

  • దాల్చిన చెక్క ఆకునూనె దోమల లార్వాలను సమర్దవంతంగా చంపుతుంది. దీనిని పురుగు వికర్షిణిగా సిఫారసు చేశారు. దాల్చిన చెక్కను ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి జీవ పురుగు మందు తయారీలో ఉపయోగిస్తారు. దీనిని పాటింగ్ మట్టితో కలిపి లేదా పంటలపై చల్లి పురుగులను నివారించవచ్చు (డోటి, 2012).
  • దాల్చిన చెక్కలో ఉన్న యూజినాల్ కీటకనాశన చర్య కలిగి ఉంది. మాటన్, అతని అనుచరులు సిన్నమోమ్ ఆయిల్ సహజ యాంటి మైక్రోబియల్ ఏజెంట్ అని రిపోర్టు చేశారు. ఇది వివిధ బాక్టీరియా (పీడియోకోకస్ హాలోఫిలస్, స్టెఫైలోకోకస్ ఆరియస్), శిలీంద్రాల (ఆస్పర్ౙిల్లస్‌ఫ్లేవస్, మ్యూకార్ ప్లంబియస్, పెనిసిలియం రాక్విఫోర్టి, యూరోషియం స్పీ.) పెరుగుదలనరికడుతుంది (విశ్వేశ్వరరావు అండ్ హుయాగాన్, 2014).
  • దాల్చిన చెక్క (సిన్నమోమమ్ జీలానికం) ఎసెన్షియల్ ఆయిల్ టమాట లీఫ్ మైనర్, టుట ఆబ్సల్యూట లార్వాలను 100% చనిపోయేలా చేసింది (అడిల్, అతని అనుచరులు, 2015).
  • దాల్చిన చెక్క (సిన్నమోమమ్ జీలానికం) ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజెలను 98% మరియు 80% చంపగలిగింది (జ్యోతిక బ్రారి అండ్ ఠాకూర్, 2015).
  • దాల్చిన చెక్క (సిన్నమోమమ్‌వెరమ్) నీటి ద్రావణం ఆహారాన్ని పాడు చేసే 3 గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా (స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సెరియస్, ఎంటరోకోకస్ ఫీకాలి), 2 గ్రామ్ నెగటివ్ బాక్టీరియా (ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిరాబిలిస్)లపై యాంటి బాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. దీనిని సహజ ఆహార సంరక్షిణిగా ఉపయోగించవచ్చు (మధుమిత రక్షిత్ అండ్, రామలింగం, 2011).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ (33.3%) నిమ్మ, మాండరిన్ కాయల తోటల్లో తొక్కలపై మచ్ౘ్లు కలిగించి మార్కెట్ విలువ తగ్గించే శిలీంద్రం గ్విగ్నార్డియా సిట్రికార్ప పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. షేడ్‌హౌస్‌లో జరిపిన ప్రయోగాల్లో లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపిన ద్రావణం టమాట మొక్కల నాశించే ఎర్లీబ్లెåట్ ఆకుమచ్చ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (ఇయోల్, అతని అనుచరులు, 2014).
  • దాల్చిన చెక్క చెట్టు ఆకుల ఇథనాల్ ద్రావణం ఆర్టెమియా సరిన లార్వాలపై లార్విసైడల్ చర్యను, సైటోఫిలస్ ఒరైజెపై పురుగు మందు ప్రభావాన్ని చూపింది. (ఉదయ ప్రకాష్, అతని అనుచరులు, 2014).
  • సిన్నమాల్డిహైడఅల్లిసిన్ ఫార్ములేషన్ పంటలను నులిపురుగులు, శిలీంద్ర తెగుళ్ళు, పురుగులు, నల్లుల నుండి కాపాడుతుంది.
    దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ పిచికారి చేసిన 4 గంటలలో టమాట పంటనాశించే లీఫ్‌మైనర్, టుట ఆబ్సల్యూట లార్వాలు 100% చనిపోయాయి. ఎసెన్షియల్ ఆయిల్ లీఫ్‌మైనర్ లార్వాలపై శక్తివంతమైన వికర్షక మరియు కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (అడిల్, అతని అనుచరులు, 2015).
  • దాల్చిన చెక్క (సిన్నమోమం ఇంప్రెస్సినర్వియం) ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, ఆల్టర్నేరియా ఆల్టర్నేటలపై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (80%). ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై 78.6% శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (భూయాన్, అతని అనుచరులు, 2015).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజాలపై స్పర్శ, ఫ్యూమిగెంట్ విషచర్యలను ప్రదర్శించింది (జ్యోతిక అండ్ ఠాకూర్, 2015).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్‌పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (కార్మొ, అతని అనుచరులు, 2008).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ కంది వీవిల్‌ని 24 గంటల తర్వాత 100% చంపింది. ఎసెన్షియల్ ఆయిల్ అధిక కీటకనాశక, వికర్షక లక్షణాల వల్ల దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు (గ్రేస్, ఆమె అనుచరులు, 2017).
  • దాల్చిన చెక్క హెక్సేన్ మరియు మిథనాల్ ద్రావణాలు (3 మి.లీ./లీ. నీరు) టమాట ఎర్లీబ్లెåట్ శిలీంద్రం ఆల్టర్నేరియా సొలాని పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. దాల్చిన చెక్క ద్రావణం (2 మి.లీ./లీ.) టమాట మొక్కలనాశించే ఎర్లీబ్లెåట్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (ఇయోల్, అతని అనుచరులు, 2014).
  • దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ (1%) అలసంద బీటిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను వికర్షించింది. ఎసెన్షియల్ ఆయిల్‌ని అలసంద బీటిల్ సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమంలో విజయవంతంగా ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (ఫౌయాజ్, 2013).
    భవిష్యత్ సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమాలలో దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్‌తో సహా అనేక ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. (కౌల్, 2008).
  • దాల్చిన చెక్క, నిమ్మగడ్డి ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమంతో తయారు చేసిన కెయొలిన్ టాబ్లెట్లు వరి నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగు సైటోఫిలసఒరైజే పురుగులను గణనీయంగా తగ్గించాయి. 6 నెలల కాలంలో గింజలకు కలిగే నష్టం గణనీయంగా తగ్గింది. 6 నెలల తర్వాత కేవలం 5% కెయొలిన్ టాబ్లెట్ల బరువు నష్టం గమనించబడింది. వరి రకం సువండల్‌లో ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం కీటక నాశక చర్యను అత్యధికంగా గమనించడం జరిగింది (పరనగమ అండ్ మదువంతి, 2015).
  • విశిష్ట చర్యలు గల పదార్థాలు కలిగిన సహజ వనరులను ఉపయోగించి రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా కొత్త పురుగు మందు ఫార్ములేషన్స్‌ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజ్‌మేరి, దాల్చిన చెక్క, మెంతి ఎసెన్షియల్ ఆయిల్స్‌లోని టెర్పిన్స్‌ను ఉపయోగించి ఇకోస్మార్ట్ టెక్నాలజీస్ బొటానికల్‌పెస్టిసైడ్ ఫార్ములేషన్‌ని వృద్ధి చేస్తున్నారు. (గ్రెచెన్ పాలుచ్, 2010).
  • లవంగం, నల్లమిరియాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, నట్‌మెగ్, నల్ల జీలకర్ర, పసుపు, ఎర్రకారం, జీలకర్ర, ఆకుపచ్చ యాలకులు, పొడులు మినుముల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను 100% చంపి మినుము గింజలను కాపాడాయి. లవంగం, నల్లమిరియాలు అధిక సమర్ధవంతంగా చంపాయి (మహది అండ్ రహమాన్, 2008).
  • దాల్చిన చెక్క ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ కుందేళ్ళనాశించే మేంజినల్లి, సోరోప్టెస్ కునికులిని సమర్ధవంతంగా చంపాయి. నల్లులాశించిన కుందేళ్ళపై ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణాన్ని పిచికారి చేసి నల్లులను సమర్ధవంతంగా నివారించవచ్చు (ఫిచి, అతని అనుచరులు, 2007).

ఫార్ములేషన్ తయారీ
సిన్నమాల్డిహైడ్{అల్లిసిన్ (10%) – 30% నుండి 50%
సోయాబీన్ ఆయిల్ – 50% నుండి 80%
ఎమల్సిఫయర్ – 3% నుండి 12%
ఆర్గానోఫిలిక్‌హెక్టొరైట్‌క్లే – 0.8% నుండి 2.0%
ప్రొపిలిన్‌కార్బొనేట్ – 0.5% నుండి 3.0%
నానఅయానిక్ సర్ఫెక్టంట్ – 0.5% నెండి 2.0%

  • నులి పురుగుల నివారణకు ఈ ఫార్ములేషన్‌ని భూమికి లేదా మొక్కల పై పిచికారి చేయాలి.
  • కెయొలిన్ పెల్లెట్స్‌ని దాల్చిన చెక్క (సిన్నమోమం జీలానికం) { సిట్రొనెల్లా (సింబోపోగాన్‌నార్డస్) ఆకుల ఎసెన్షియల్ ఆయిల్స్ మిశ్రమంతో శుద్ధి చేసి దీని ప్రభావాన్ని వరి ధాన్యం నిల్వపై పరీక్షించారు. ఈ మిశ్రమంలోని ప్రధాన రసాయనాలైన యూజినాల్, సిట్రొనెల్లాల్, జరానియాల్ సైటోఫిలస్ ఒరైజె పెద్ద పురుగుల సంఖ్యను 6 నెలల నిల్వ కాలమంతటా గణనీయంగా తగ్గించాయి (పరనగమ అండ్ మధువంతి, 2017).
  • దాల్చిన చెక్క (సిన్నమోమం జీలానికం) ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ (2.5 మి.లీ. 10% నుండి 0.03% వరకు పారాఫిన్ ఆయిల్‌లోకుందేళ్ళనాశించే మేంజి నల్లిప్సోరోప్టెస్ కునికులిపై వీటి ప్రభావాన్ని పరీక్షించారు. 24 గంటల తర్వాత 0.10-10% మధ్యగాఢతలో మంచి నల్లి నాశక చర్యను ప్రదర్శించాయి. కుందేళ్ళపై 0.16-10% మధ్య గాఢతలు కుందేళ్ళ నాశించిన నల్లులను సమర్ధవంతంగా నివారించాయి (ఫిచి, అతని అనుచరులు, 2007).
  • దాల్చిన చెక్క (సిన్నమోమంజీలానికం) బెరడు ఎసెన్షియల్ ఆయిల్ ప్రభావాన్ని మానవుల తలలో పేలు (పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటస్), వాటి గుడ్లపై పరీక్షించారు. ఎసెన్షియల్ ఆయిల్, దానిలోని మిశ్రమాలు మానవుల తలలోని పేలను నివారించే శక్తి కలిగి ఉన్నాయి (యాంగ్, అతని అనుచరులు, 2005).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వంటింటి తోట – ఇంటి అవసరాలకు తాజా కూరగాయల సాగు

ఆరోగ్యకరమైన జీవనశైలిలో తాజా కూరగాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం కూరగాయలపై పెరుగుతున్న ధరలు, మార్కెట్లో లభించే కూరగాయల తాజాదనం, పురుగుమందుల అవశేషాలపై ప్రజల్లో ఉన్న ఆందోళన వంటి కారణాల వల్ల ఇంటి వద్దనే కూరగాయలను పండించాలనే ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వంటింటి తోట (Kitchen Garden) ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబానికి అవసరమైన తాజా, నాణ్యమైన కూరగాయలను పరిమిత స్థలంలోనే పండించుకోవచ్చు.

వంటింటి తోటకు పెద్ద భూమి అవసరం లేదు. ఇంటి పెరడు, ఖాళీ ప్రదేశం, బాల్కనీ, టెర్రస్ లేదా అందుబాటులో ఉన్న చిన్న స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సరైన పంటల ఎంపిక, మంచి విత్తనాలు, సేంద్రియ పదార్థాల వినియోగం, నీటి యాజమాన్యం మరియు సమగ్ర చీడపీడల నిర్వహణతో ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలను పండించవచ్చు.

వంటింటి తోట ప్రయోజనాలు
వంటింటి తోట ద్వారా కుటుంబానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

  • ఇంటి అవసరాలకు సరిపడా తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి.
  • కూరగాయలను కోసిన వెంటనే వంటలో ఉపయోగించడం వల్ల తాజాదనం, రుచి మరియు పోషక విలువలు మెరుగ్గా ఉంటాయి.
  • మార్కెట్పై కొంతమేర ఆధారపడటం తగ్గుతుంది.
  • ఇంట్లో లభించే కూరగాయల వ్యర్థాలు, ఆకులు వంటి సేంద్రియ పదార్థాలను కంపోస్టుగా ఉపయోగించుకోవచ్చు.
  • ఇంటి పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారతాయి.
  • పిల్లల్లో మొక్కలు, ప్రకృతి మరియు వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
  • శారీరక శ్రమకు అవకాశం కలగడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

వంటింటి తోటకు స్థల ఎంపిక
వంటింటి తోటకు రోజుకు కనీసం కొన్ని గంటలు తగినంత సూర్యకాంతి అందే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా కూరగాయల పెరుగుదల, పూత మరియు కాయల అభివృద్ధికి మంచి వెలుతురు అవసరం.
నీరు నిల్వ ఉండని, మంచి నీటి పారుదల కలిగిన ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. ఇంటి గోడలకు లేదా పెద్ద చెట్లకు చాలా దగ్గరగా కాకుండా, మొక్కలకు తగినంత గాలి మరియు వెలుతురు అందేలా స్థలాన్ని ఏర్పాటు చేయాలి.

స్థలం తక్కువగా ఉన్నవారు గ్రో బ్యాగులు, కుండీలు, ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్లు, పునర్వినియోగ పాత్రలు వంటి వాటిలో కూడా కూరగాయలను పెంచుకోవచ్చు. అయితే పాత్రలకు అడుగుభాగంలో నీరు బయటకు వెళ్లేందుకు తగిన రంధ్రాలు ఉండాలి.

ఏ కూరగాయలను సాగు చేయాలి?
వంటింటి తోటలో కుటుంబ అవసరాలు, అందుబాటులో ఉన్న స్థలం మరియు స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి.

ఆకుకూరలు
తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను తక్కువ స్థలంలోనే సులభంగా సాగు చేయవచ్చు. వీటిని దశలవారీగా విత్తడం ద్వారా నిరంతరంగా తాజా ఆకుకూరలను పొందవచ్చు.

కాయగూరలు
బెండ, వంకాయ, మిరప, టమాటా వంటి పంటలు ఇంటి తోటకు అనుకూలంగా ఉంటాయి. వీటిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా కొద్ది మొక్కలను పెంచుకోవచ్చు.

తీగజాతి కూరగాయలు
చిన్న స్థలంలో కూడా పందిరి లేదా నిలువు మద్దతు ఏర్పాటు చేసి బీరకాయ, కాకరకాయ, సొరకాయ, చిక్కుడు, దోసకాయ వంటి తీగజాతి కూరగాయలను పెంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

నేల తయారీ
వంటింటి తోట విజయానికి మంచి నేల మిశ్రమం ఎంతో ముఖ్యం. నేల గట్టిగా ఉండకుండా మెత్తగా, సారవంతంగా మరియు నీరు సులభంగా బయటకు వెళ్లే విధంగా ఉండాలి.

తోట నేలలో బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా నాణ్యమైన కంపోస్టును కలపడం ద్వారా నేల భౌతిక లక్షణాలను మెరుగుపరచవచ్చు. ఇంట్లో ఉత్పత్తయ్యే కూరగాయల తొక్కలు, ఆకులు వంటి సేంద్రియ వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్టును కూడా ఉపయోగించుకోవచ్చు.

అయితే పూర్తిగా కుళ్లని సేంద్రియ వ్యర్థాలను నేరుగా మొక్కల వద్ద వేయకూడదు. అవి బాగా కుళ్లి కంపోస్టుగా మారిన తర్వాత మాత్రమే ఉపయోగించడం మంచిది.

విత్తనాల ఎంపిక
మంచి విత్తనాల ఎంపిక వంటింటి తోటలో విజయానికి మొదటి మెట్టు. అధిక మొలక శాతం, మంచి నాణ్యత కలిగిన విత్తనాలను విశ్వసనీయ వనరుల నుంచి సేకరించాలి.

చాలా ఎక్కువ విత్తనాలను ఒకేసారి విత్తకుండా, కుటుంబ అవసరాలకు అనుగుణంగా చిన్న పరిమాణాల్లో విత్తడం మంచిది. ముఖ్యంగా ఆకుకూరలను దశలవారీగా విత్తడం ద్వారా ఒకేసారి ఎక్కువ ఉత్పత్తి కాకుండా నిరంతరంగా కోత పొందవచ్చు.

నారు పెంపకం మరియు నాటడం
టమాటా, మిరప, వంకాయ వంటి కొన్ని పంటలను ముందుగా నారు పెంచి తర్వాత ప్రధాన ప్రదేశంలో నాటడం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా, బలంగా ఉన్న నారును మాత్రమే ఎంపిక చేయాలి.

నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం ఉండేలా చూడాలి. మొక్కలను చాలా దగ్గరగా నాటితే గాలి ప్రసరణ తగ్గి చీడపీడలు మరియు తెగుళ్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

నీటి యాజమాన్యం
వంటింటి తోటలో నీటి వినియోగాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. చిన్న మొక్కలకు అధికంగా నీరు ఇవ్వడం వల్ల వేర్లకు నష్టం కలగవచ్చు. అదే విధంగా నీటి కొరత వల్ల మొక్కల పెరుగుదల దెబ్బతింటుంది.

ఉదయం లేదా సాయంత్రం సమయంలో అవసరాన్ని బట్టి నీరు అందించడం మంచిది. కుండీలు, గ్రో బ్యాగుల్లో పెంచే మొక్కలకు నీటి అవసరం నేలలో పెంచే మొక్కలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి నేలలో తేమను పరిశీలించి నీటిని అందించాలి.

మల్చింగ్ ఉపయోగం
మొక్కల చుట్టూ ఎండిన ఆకులు, గడ్డి లేదా ఇతర అనుకూల సేంద్రియ పదార్థాలతో పలుచని మల్చింగ్ పొరను ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల నేలలో తేమ కొంతకాలం నిల్వ ఉండటంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించవచ్చు.

మల్చింగ్ పదార్థం మొక్క కాండానికి నేరుగా తగలకుండా కొంత ఖాళీ ఉంచాలి.

ఎరువుల యాజమాన్యం
వంటింటి తోటలో నేల సారాన్ని బట్టి కంపోస్టు, వర్మీకంపోస్టు లేదా బాగా కుళ్లిన సేంద్రియ ఎరువులను ఉపయోగించవచ్చు.

మొక్కల పెరుగుదల, పూత మరియు కాయల అభివృద్ధి దశలను బట్టి పోషకాల అవసరాన్ని గమనించాలి. అధికంగా ఎరువులు వేయడం వల్ల మొక్కలకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి “అధికం కంటే అవసరమైనంత” అనే సూత్రాన్ని పాటించాలి.

చీడపీడలు మరియు తెగుళ్ల నిర్వహణ
వంటింటి తోటలో చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఆకులపై రంధ్రాలు, మచ్చలు, ముడతలు, రంగు మార్పులు, పురుగుల ఉనికి వంటి లక్షణాలను తరచుగా పరిశీలించాలి.

తెగుళ్లు సోకిన ఆకులు లేదా మొక్క భాగాలను తొలగించి సురక్షితంగా పారవేయాలి. తోటలో అధిక తేమ నిల్వ ఉండకుండా చూడాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటించడం ద్వారా గాలి ప్రసరణను మెరుగుపరచవచ్చు.
సాధ్యమైనంత వరకు సమగ్ర చీడపీడల యాజమాన్యం (IPM) పద్ధతులను అనుసరించాలి.

సహజ పద్ధతులకు ప్రాధాన్యత
వంటింటి తోటలో జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా చీడపీడల సమస్యలను కొంతవరకు నిర్వహించవచ్చు. పూల మొక్కలను తోటలో భాగంగా పెంచడం ద్వారా పరాగసంపర్క కీటకాలను ఆకర్షించవచ్చు.

అదేవిధంగా ఆరోగ్యకరమైన మొక్కలను ఎంపిక చేయడం, పంట అవశేషాలను తొలగించడం, తోటను పరిశుభ్రంగా ఉంచడం, పంటల మార్పిడి పాటించడం వంటి సాంస్కృతిక పద్ధతులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

నిలువు తోట – తక్కువ స్థలంలో ఎక్కువ పంట
పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్న కుటుంబాలకు నిలువు తోట (Vertical Garden) మంచి ప్రత్యామ్నాయం. గోడలకు లేదా ప్రత్యేక ఫ్రేమ్లకు కుండీలు, గ్రో బ్యాగులు అమర్చి ఆకుకూరలు, కొన్ని కాయగూరలు మరియు సుగంధ ద్రవ్య మొక్కలను పెంచుకోవచ్చు.

తీగజాతి కూరగాయలకు పందిరి లేదా నిలువు మద్దతు ఏర్పాటు చేయడం ద్వారా నేల విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ మంచి వినియోగాన్ని పొందవచ్చు.

పంటల మార్పిడి
ఒకే కుటుంబానికి చెందిన పంటలను అదే ప్రదేశంలో వరుసగా సాగు చేయకుండా పంటల మార్పిడి పాటించడం మంచిది. ఉదాహరణకు ఒక దశలో ఆకుకూరలు సాగు చేసిన తర్వాత మరొక దశలో కాయగూరలు లేదా ఇతర కుటుంబానికి చెందిన పంటలను సాగు చేయవచ్చు.

కొన్ని నేల సంబంధిత చీడపీడలు మరియు తెగుళ్ల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కోత మరియు వినియోగం
కూరగాయలను అవసరమైనప్పుడు, సరైన పరిపక్వ దశలో కోయడం వంటింటి తోటలోని ప్రధాన ప్రయోజనం. ఇంటి అవసరానికి సరిపడా మాత్రమే కోసుకోవడం వల్ల తాజా కూరగాయలను నేరుగా వంటలో ఉపయోగించవచ్చు.

బెండ, బీరకాయ, కాకరకాయ వంటి పంటల్లో సరైన దశలో తరచుగా కోత చేయడం ద్వారా తదుపరి కాయల ఉత్పత్తిని ప్రోత్సహించవచ్చు. ఆకుకూరలను కూడా అవసరానికి అనుగుణంగా కోసుకోవచ్చు.

తక్కువ స్థలంలో సమర్థవంతమైన సాగు
వంటింటి తోటలో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి పంటలను ఎత్తు ఆధారంగా అమర్చుకోవచ్చు. తక్కువ ఎత్తు పెరిగే ఆకుకూరలను ఒక ప్రాంతంలో, మధ్యస్థ ఎత్తు మొక్కలను మరో ప్రాంతంలో, తీగజాతి కూరగాయలను పందిరిపై పెంచవచ్చు.

అలాగే ఒకేసారి అన్ని పంటలను విత్తకుండా దశలవారీగా విత్తడం ద్వారా ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకోవచ్చు.

వంటింటి తోట అనేది కేవలం కూరగాయలను పండించే పద్ధతి మాత్రమే కాకుండా కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ మరియు ఇంటి వనరుల సమర్థ వినియోగానికి ఉపయోగపడే ఒక మంచి జీవన విధానం. పెద్ద భూమి లేకపోయినా చిన్న ప్రదేశంలో, కుండీలు లేదా గ్రో బ్యాగులలో కూడా కూరగాయలను పండించుకోవచ్చు.

సరైన స్థల ఎంపిక, నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ పదార్థాల వినియోగం, తగిన నీటి యాజమాన్యం, సమతుల్య పోషక నిర్వహణ మరియు సమగ్ర చీడపీడల యాజమాన్యంతో ప్రతి ఇంటినీ ఒక చిన్న కూరగాయల తోటగా మార్చుకోవచ్చు. కుటుంబ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని, దశలవారీగా సాగు చేయడం ద్వారా ఏడాది పొడవునా తాజా కూరగాయలను ఇంటి నుంచే పొందడం సాధ్యమే.

డా. టి. థామ్సన్, డా. టి. తేజస్విని, డా. వి. సుధావాణి
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం
ఫోన్ : 9494963291

Read More

ఆస్పరాగస్ ఫెర్న్ – తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఆదాయం ఇచ్చే పంట

పూలను బొకేలు, పూల అలంకరణల్లో అందంగా కనిపించడానికి పచ్చని ఆకులను కలుపుతారు. అలాంటి పచ్చని ఆకుల్లో ఆస్పరాగస్ ఫెర్న్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ పంటకు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. నాటిన సుమారు 6 నెలల తర్వాత మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత 10–20 సంవత్సరాల వరకు అదే మొక్కల నుంచి ఆకులను కోసుకుని అమ్ముకోవచ్చు. అందువల్ల పూల రైతులకు ఇది మంచి అదనపు ఆదాయ పంటగా ఉపయోగపడుతుంది.

పంట గురించి: ఆస్పరాగస్ ఫెర్న్ ఒక అలంకరణ కోసం పెంచే పచ్చని ఆకుల మొక్క. దీని సన్నని, దారం లాంటి పచ్చని ఆకులను: పూల బొకేల్లో, పూల దండలు, అలంకరణల్లో, వివాహాలు మరియు ఇతర శుభకార్యాల అలంకరణలలో, ఇళ్లలో కుండీలు, వేలాడే బాస్కెట్లలో ఉపయోగిస్తారు. మొక్క బాగా పెరిగిన తర్వాత ఎండను కూడా కొంతవరకు తట్టుకోగలదు. దీని వేర్లు భూమిలోకి బాగా విస్తరించి, దుంపల మాదిరిగా ఉండే వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. మొక్కలను తరచూ కత్తిరించకపోతే అవి దట్టంగా పెరిగి సుమారు 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మంచి నాణ్యమైన పచ్చని కొమ్మలు రావాలంటే క్రమం తప్పకుండా కత్తిరించాలి.

ముఖ్యమైన రకాలు
ఆస్పరాగస్ ఫెర్న్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి:
Asparagus densiflorus ‘Myersii’
Asparagus myriocladus
Asparagus sprengeri
వీటిలో Sprengeri రకం వాణిజ్యంగా ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీనికి మంచి ఆకుల దిగుబడి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి.

ఎలాంటి నేలలో సాగు చేయాలి: ఆస్పరాగస్ ఫెర్న్ను దాదాపు అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. అయితే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న నేలలో మొక్కలు బాగా పెరుగుతాయి, దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది.
మొక్కలు బాగా స్థిరపడిన తర్వాత తక్కువ నీటితో కూడా కొంతకాలం పెరగగలవు.

పొలం తయారీ: పొలాన్ని 3–4 సార్లు దున్ని మెత్తగా చేసుకోవాలి. చివరి దుక్కిలో ఎకరానికి సుమారు 10 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు (FYM) వేయాలి. నీరు నిల్వ ఉండకుండా ఎత్తైన మడులు/బెడ్లు తయారు చేసుకోవాలి.

ఆస్పరాగస్ ఫెర్న్ను రెండు విధాలుగా పెంచవచ్చు:

విత్తనాల ద్వారా

వేర్లను విడదీసి నాటడం ద్వారా

విత్తనాలు మొలకెత్తడానికి సాధారణంగా 3–4 వారాలు పడుతుంది.
అయితే రైతులు ఎక్కువగా నర్సరీల్లో పెంచిన మొక్కలను కొనుగోలు చేసి నాటుతారు. ఇలా చేస్తే మొక్కలు ఒకే విధంగా పెరగడం, త్వరగా పొలంలో స్థిరపడటం జరుగుతుంది.

నాటే సమయం: జూలై–ఆగస్టు నెలలు నాటడానికి అనుకూలమైన సమయం.
ఎకరానికి సుమారు 8,000–10,000 మొక్కలు అవసరం. మొక్కల మధ్య దూరం సుమారు 60 × 60 సెం.మీ. ఉంచాలి.

ఎరువుల యాజమాన్యం: పొలం తయారు చేసేటప్పుడు బాగా కుళ్లిన పశువుల ఎరువు వేయాలి. 6 నెలల తర్వాత ప్రతి చదరపు మీటరుకు సుమారు 5 కిలోల వర్మీకంపోస్ట్ లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువు వేయవచ్చు. సిఫారసు చేసిన పోషకాలను ఆందించాలి

నీటి యాజమాన్యం: నాటిన మొదటి నెలలో నేల తేమ, వాతావరణ పరిస్థితులను బట్టి క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మొక్కలు బాగా పెరిగిన తర్వాత నీటి కొరతను కొంతవరకు తట్టుకోగలవు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే నీరు ఆదా అవుతుంది. కలుపు మొక్కలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.

కత్తిరింపు చాలా ముఖ్యం: ఈ పంటలో మంచి ఆదాయం రావాలంటే కత్తిరింపు (ప్రూనింగ్) సరిగ్గా చేయాలి. మొక్కలు దట్టంగా పెరిగినప్పుడు పాత, పొడవైన కొమ్మలను కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల కొత్త పచ్చని కొమ్మలు ఎక్కువగా వస్తాయి. మార్కెట్కు కావాల్సిన మంచి నాణ్యత గల ఆకులు లభిస్తాయి. సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి కోత/కత్తిరింపు చేయవచ్చు.

కోత: నాటిన సుమారు 6 నెలలకు మొదటి కోత వస్తుంది. దాని తర్వాత 3–4 నెలలకు రెండో కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరం నుంచి సుమారు ప్రతి 3 నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. అంటే సంవత్సరానికి దాదాపు 4 కోతలు పొందవచ్చు.

దిగుబడి మరియు ధర: ఒక కోతకు ఎకరానికి సుమారు 5,000 కట్టల ఆకులు లభించవచ్చు. ఒక్క కట్టలో సుమారు 50 కొమ్మలు ఉంటాయి. సాధారణంగా ఒక కట్ట ధర సుమారు రూ. 15 ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్లో ధర రూ. 20–30 వరకు కూడా ఉండవచ్చు.

ఉదాహరణకు: 5,000 కట్టలు × రూ. 15 = రూ. 75,000
అంటే ఒక కోతలో సుమారు రూ. 75,000 స్థూల ఆదాయం రావచ్చు.

రెండో సంవత్సరం నుంచి లాభం ఎందుకు పెరుగుతుంది?
మొక్కల వయసు పెరిగే కొద్దీ వాటి కింద ఉన్న వేర్ల దుంపలు పెద్దవుతాయి. దాంతో ఆకుల దిగుబడి కూడా పెరుగుతుంది.
రెండో సంవత్సరం నుంచి కొత్తగా మొక్కలు కొనుక్కొని నాటాల్సిన అవసరం ఉండదు. అందువల్ల:
మొక్కల కొనుగోలు ఖర్చు తగ్గుతుంది
సాగు ఖర్చు తగ్గుతుంది
దిగుబడి పెరుగుతుంది
లాభం ఎక్కువ అవుతుంది
మొక్కలు బాగా స్థిరపడిన తర్వాత దిగుబడి దాదాపు రెండింతలు అయ్యే అవకాశం ఉంది.
ఎకరానికి ప్రారంభ ఖర్చు
మొదటి సంవత్సరం ఎకరానికి సుమారు రూ. 1 లక్ష వరకు ఖర్చు కావచ్చు.
ఇందులో ఎక్కువ ఖర్చు మొక్కల కొనుగోలుకే అవుతుంది.
ఒక మొక్క ధర సుమారు రూ. 6 అయితే, 10,000 మొక్కలకు: 10,000 × రూ. 6 = రూ. 60,000
అంటే సుమారు రూ. 60,000 మొక్కలకే ఖర్చు అవుతుంది.
మిగిలిన ఖర్చు పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్, నీటి సౌకర్యం, కూలీల ఖర్చు మరియు ఇతర సాగు పనులకు ఉంటుంది.

రైతులకు ముఖ్యమైన విషయం
ఆస్పరాగస్ ఫెర్న్ను ఒక్కసారి నాటితే చాలా సంవత్సరాల పాటు కోతలు తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం మొక్కల కొనుగోలు వల్ల ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, రెండో సంవత్సరం నుంచి ఆ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పూలు పండించే రైతులు తమ పొలంలో కొంత భాగాన్ని ఈ పంటకు కేటాయిస్తే, పూలతో పాటు పచ్చని ఆకుల ద్వారా కూడా నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

  • ఎం. ఆర్. భానుశ్రీ, కె. సాధన, ఇ. జయశ్రీ, ఇ. బిందు మాధవి, కె. కవిత మరియు. వి. అనిత
    వ్యవసాయ కళాశాల, పాలెం, నాగర్కర్నూల్ జిల్లా : 509215, ఫోన్ నంబర్: 9618887445

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

సాగు ఖర్చును తగ్గించే ‘మట్టికుండ రసాయనం’

తయారీ విధానం – కావల్సిన వస్తువులు :

  • 100 గ్రాముల విటెక్స్ నెగుండ ఆకులు (వావిలాకులు)
  • 100 గ్రాముల కలోట్రాపిస్ ఆకులు (జిల్లేడు)
  • 100 గ్రాముల వేపాకులు
  • 50 గ్రాముల పప్పు (ఏదైనా)
  • 1 లీటరు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ
  • 1.5 లీటర్లు మంచి నీరు ముందుగా మూడు రకాల ఆకులను మెత్తటి గంధంలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. దీనికి నీరును చేర్చాలి. దీనిని ఒక కుండలో పోసి మూతికి గుడ్డ కట్టాలి. కుండలోని మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తిర్లమర్ల కలపాలి (కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి). పదిహేను, ఇరవై రోజుల తరువాత సేంద్రియ జీవ రసాయనం తయారవుతుంది. తయారైన జీవ రసాయనాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పొలం మీద పిచికారి చేయాలి. ఇది ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. పిచికారీని ఆకుల మీదే చేయాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం పొద్దు గూంకే వేళలో పిచికారి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఇది వివిధ రకాల కీటకాలనాశినిగానే కాక మొక్కలకు పోషకాలను అందించి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా రసాయనాల వలన వాతావరణం, నేల విషపూరితం కాకుండా కాపాడుతుంది.
Read More

సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపైసర్టిఫికేషన్‌ కోర్సు

మనుషుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నిరోధించుకోవాలంటే సేంద్రియ సాగు విధానంపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను తినాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మైలవరం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప ప్రిన్సిపల్‌ పి. రంగారావు పేర్కొన్నారు. కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపై సర్టిఫికేషన్‌ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. పూల మొక్కల నుంచి పండ్లు, కూరగాయలను ఇళ్లల్లోనే పెంచుకోవచ్చని విభాగాధిపతి జె. రాముడు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరిబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More