సరిపడా యూరియా నిల్వలు

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్‌ కోసం ఏర్పాటుచేసిన యాప్‌ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్‌, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.

సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్‌ సేవలు అందించాం. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్‌, మణికుమార్‌, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్‌కుమార్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌ జాదవ్‌, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More

నల్లబర్లీ సాగును అరికట్టాలి

వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

నల్లబర్లీ పొగాకు సాగును అరికట్టాలని, తెల్లబర్లీ పొగాకును సాగు చేసే రైతులు సంబంధిత కంపెనీలతో 100% కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సూచించారు. బర్లీ పొగాకు సాగుపై గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… తెల్లబర్లీ పొగాకు కొనుగోలుకు ఇకపై ప్రభుత్వం ఎలాంటి బాధ్యతా వహించదని, అనధికార నల్లబర్లీ పొగాకు సాగు కట్టడి చేయడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల్ని చైతన్యం చేయాలని సూచించారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారి 11,990 మంది రైతుల నుంచి 19.79 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేశామని, రూ.146 కోట్లు విడుదల చేశామని వివరించారు. తెల్లబర్లీ పొగాకు సాగుదారుల జాబితాతోపాటు కొనుగోలు ఒప్పందాల వివరాల్ని జత చేసి ఇవ్వాలని డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీని ఆదేశించారు.

Read More

జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాలని ఆదేశం

తెలంగాణా రాష్ట్రంలో ఇంకా ప్రారంభంకాని జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాల్సిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ మరియు సీసీఐ అధికారులను వ్యవసాయాశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం మంత్రి దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యకక్షుడు రవీందర్‌తో కూడా మాట్లాడిన మంత్రి, మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుండి 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి సేకరించామని పేర్కొంటూ, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.

Read More
  • 1
  • 2