విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఖరీఫ్‌ సీజన్‌లో వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలోని గ్లోబల్‌ విశ్రాంతి భవనంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. రైతులంతా ఒకేరకమైన పంటలు వేయడంతో ధరల్లో తేడాలు వస్తున్నాయన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు సి. చిన్నమ్మ తల్లి, వి. సన్యాసినాయుడు, ఆర్‌. ఈశ్వరరావు, పి. మహేష్‌ తదితరులు మంత్రిని సన్మానించారు.

Read More

పసుపు పంటకు నిజామాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్‌ అనే విత్తనంలో కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్‌ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్‌ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్‌ పాల్గొన్నారు.

Read More

చిరుధాన్యాల సాగు, వినియోగం భారీగా పెరగాలి

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంపై ఎఫ్‌ఏవో నివేదిక

ఆకలి, పోషకాహార లోపం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య ప్రభావం, ఆహారభద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు... చిరుధాన్యాల సాగు, వినియోగం పెద్దఎత్తున విస్తరించాలని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సూచించింది. ఈ మేరకు సాగు మరింతగా అభివృద్ధి చెందాలని, విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని, కొత్త వంగడాలకు రూపకల్పన చేయాలని పేర్కొంది. ఉత్పత్తుల మార్కెటింగ్‌ మరింత విస్తృతం కావాలని సూచించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రాముఖ్యంపై తాజాగా ఎఫ్‌ఏవో నివేదికను విడుదల చేసింది. వివిధ దేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం తదితర అంశాలపై చేపట్టిన అధ్యయనం... నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం నివేదికను రూపొందించింది. నివేదికలో చిరుధాన్యాల సాగు, వినియోగం విస్తృతికి పలు సిఫార్సులు చేసింది. ముఖ్యాంశలివీ..
  • బాల్యం నుంచే పిల్లలకు చిరుధాన్యాల ఆహారం అందించాలి. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలను ప్రవేశపెట్టాలి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ఇతర ఉత్పత్తులకు బలమైన ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు మారాలి.
  • జన్యువైవిధ్యంతోపాటు సాంకేతికతను మెరుగు పరిచి విజ్ఞానమార్పిడి జరగాలి. స్థానిక సంస్థలు, రైతులు, మహిళలు, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
  • జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా చిరుధాన్యాల సాగు చేపట్టాలి. విత్తన సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. రైతులు తమకు అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. స్థిరమైన ఉత్పత్తికి సమీకృత పంటల విధానం అనుసరిణీయం.
  • చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అత్యుత్తమ ఫలితాలిస్తాయి. సంప్రదాయ ఆహారంతో పోలిస్తే వైవిధ్య, స్థితిస్థాపకంగా ఉండే చిరుధాన్యాలు రైతుల జీవనోపాధిని నిలబెట్టాలి. దీనికోసం స్థిరమైన విత్తన పరిరక్షణను బలోపేతం చేయాలి. చిన్న కమతాల రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నందున వారికి చేయూతనివ్వాలి. నీటి పొదుపు ద్వారా సాగు సజావుగా సాగే ప్రణాళిక ఉండాలి. నేరుగా వంగడాలను రూపొందించడంతో పాటు కలుపు తీయడం, కోత, నిల్వ, ఉత్పత్తుల శుద్ధి శిక్షణకు సులభతర అవకాశాలను కల్పించాలి.
    మరింతగా మార్కెటింగ్‌…
  • స్థిరమైన ఉత్పత్తి, యాంత్రీకరణతోపాటు రైతులకు పంటలు లాభదాయకంగా మారేలా మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలి.
  • చిరుధాన్యాల కోసం ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. పంట శుద్ధి అనంతరం పిండి, రవ్వ, ఇతర పదార్థాలుగా మార్చి ప్యాకేజింగ్‌ ద్వారా పంపిణీ జరగాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వారాంతపు సంతల్లోనూతత… సూపర్‌ మార్కెట్లు, కిరణా దుకాణాల్లోనూ విక్రయాలు సాగాలి.
  • ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లు, ఈ-కామర్స్‌ వేదికల ద్వారా ఇళ్లకే నేరుగా సరఫరా చేయడం ద్వారా విక్రయాలు సులభతరం చేయాలి.
  • చిరుధాన్యాల ఉత్పత్తి ప్రదర్శనలు నిర్వహించాలి. యాంత్రీకరణ, ఆహారశుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు గ్రాంట్లను ఇవ్వాలి.

ఉత్పత్తిలో మేటి భారత్‌
చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్‌, దేశంలో ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని చిరుధాన్యాలు సాగవుతాయి. తరి, ఖుష్కి, భూముల్లోనూ పెరుగుతాయి. చీడపీడలను సమర్ధంగా ఎదుర్కొంటాయి. నీటి వినియోగం తక్కువ. వీటి సాగువల్ల నేల సాంద్రత పెరుగుతుంది. పోషకాల పరంగా చిరుధాన్యాలతో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, మినరల్స్‌, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమకూరుతాయి. పూర్వకాలం నుంచి చిరుధాన్యాల సాగు, వినియోగం జరుగుతోంది. ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దక్షిణాసియా, సబ్‌సహారా ప్రాంతాల్లో 85 శాతం కంటే ఎక్కువ వినియోగమవుతున్నాయి. భారత్‌, నైజీరియా, నైగర్‌, చైనా, మాలి చిరుధాన్యాల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

Read More