వాతావరణ మార్పులు – రైతుల సాగు విధానాల్లో మార్పులు అవసరం

వ్యవసాయం ప్రకృతిపై అత్యధికంగా ఆధారపడే రంగం. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, సూర్యకాంతి వంటి వాతావరణ అంశాల్లో స్వల్ప మార్పులు కూడా పంటల పెరుగుదల, పుష్పించడం, కాయలు ఏర్పడడం, దిగుబడి మరియు నాణ్యతపై ప్రభావం చూపుతాయి. ఇటీవలి సంవత్సరాల్లో అకాల వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, తక్కువ వ్యవధిలో అధిక వర్షపాతం, వర్షాల విరామాలు వంటి వాతావరణ అస్థిరతలు వ్యవసాయంలో సవాళ్లను పెంచుతున్నాయి.

ఎల్‌నినో (El Niño) లాంటి పరిస్తితులు కూడా కొన్ని సంవత్సరాల్లో వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపి, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే, ఎల్‌నినో ఒక్కటే ప్రతి ప్రాంతంలో ఒకే విధమైన వర్షాభావానికి కారణమవుతుందని భావించకూడదు. స్థానిక వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల   వ్యవస్థ, నేల స్వభావం, పంట కాలం మరియు సాగు విధానాలు కూడా పంటలపై ప్రభావం చూపుతాయి.

అందువల్ల “వాతావరణం మారినప్పుడు వ్యవసాయ విధానం కూడా మారాలి” అనే దృక్పథంతో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలి. వాతావరణ మార్పులను పూర్తిగా నియంత్రించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు (Climate-resilient agriculture) అవలంబించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు.

వాతావరణ మార్పులు పంటలపై ఎలా ప్రభావం చూపుతాయి?
పంటల పెరుగుదలలో ప్రతి దశకు నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు తేమ అవసరం. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడినప్పుడు మొక్కలలో ఆవిరిపోతనం (భాస్పోత్సేకం) మరియు నేల నుండి నీరు ఆవిరి అవ్వడం పెరుగుతుంది. ఫలితంగా నేలలోని నీరు వేగంగా తగ్గిపోతుంది. నీటి కొరత ఏర్పడినప్పుడు మొక్కలు తమ రంధ్రాలను మూసుకోవడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి, మొక్కల పెరుగుదల మందగిస్తుంది.

పుష్పించే దశలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడితే పుష్పాలు రాలిపోవడం, పుప్పొడి జీవనశక్తి తగ్గడం, ఫలదీకరణలో అంతరాయం ఏర్పడటం వల్ల కాయధారణ మరియు గింజల సంఖ్య తగ్గవచ్చు. ముఖ్యంగా పుష్పించే మరియు గింజ పోసుకునే దశల్లో ఏర్పడే ఉష్ణోగ్రత ఒత్తిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే నేల కోత, నీటి నిల్వ, పోషకాలు కొట్టుకుపోవడం, వేర్లకు ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనికి విరుద్ధంగా వర్షాల మధ్య ఎక్కువ విరామం ఏర్పడితే మట్టిలో తేమ కొరత (moisture stress) ఏర్పడి పంట పెరుగుదల దెబ్బతింటుంది. అందువల్ల వాతావరణ మార్పుల నేపథ్యంలో “ఎక్కువ నీరు వచ్చినప్పుడు సంరక్షించడం, తక్కువ నీరు వచ్చినప్పుడు సమర్థంగా వినియోగించడం” అనే రెండు వ్యూహాలు రైతులకు అత్యంత ముఖ్యమైనవి.

రైతుల సాగు విధానాల్లో చేయాల్సిన ముఖ్యమైన మార్పులు

  1. వాతావరణ ఆధారిత పంటల ప్రణాళిక
    విత్తనాలు వేయడానికి ముందు స్థానిక వాతావరణ సూచనలు, వర్షపాత అంచనాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/వ్యవసాయ శాఖలు అందించే వ్యవసాయ వాతావరణ సలహా సేవలను రైతులు పరిశీలించాలి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైతే వెంటనే సాధారణ పంటలనే వేయకుండా తక్కువ కాలంలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం కలిగిన పంటలు లేదా రకాలను ఎంపిక చేయడం మంచిది.

పంటల ఎంపికలో ప్రధానంగా:

  • తక్కువ కాల పరిమితి గల రకాలు
  • బెట్టను తట్టుకునే రకాలు
  • స్థానిక వాతావరణానికి అనుకూలమైన రకాలు
  • తక్కువ నీటి అవసరమున్న పంటలు
  • మిశ్రమ మరియు అంతర పంటలు ……….వంటి విధానాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  1. నేలలో తేమను సంరక్షించాలి
    వాతావరణ మార్పుల సమయంలో నేలలో తేమ సంరక్షణ పంట ఉత్పాదకతకు కీలకం. వర్షం పడిన వెంటనే నీరు పొలాన్ని వదిలి వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు నీరు నేలలోకి చొచ్చుకుపోయేలా చర్యలు చేపట్టాలి. దీనికి:
  • పంట అవశేషాలను నేలపై ఉంచడం
  • మల్చింగ్ చేయడం
  • పొలంలో చిన్న కట్టలు/బండ్లు ఏర్పాటు చేయడం
  • కాంటూర్ బండింగ్
  • అవసరమైన ప్రాంతాల్లో వేసవి లోతు దుక్కులు చేపట్టడం
  • సేంద్రియ పదార్థాలు వేసి నేలను గుల్లబర్చడం
  • తక్కువ దుక్కి లేదా సంరక్షణ వ్యవసాయ పద్ధతులు వంటివి ఉపయోగపడతాయి.

పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం లేదా ఉపరితలంపై మల్చ్‌గా ఉపయోగించడం వల్ల నేల ఉష్ణోగ్రతల తీవ్ర మార్పులు తగ్గడంతో పాటు, నేల తేమ ఆవిరైపోవడం తగ్గుతుంది. దానితో పాటు కలుపు మొలకెత్తకుండా చూసుకోవచ్చు.

  1. నేల సారాన్ని పెంచడం – వాతావరణ ప్రతిఘటనకు పునాది
    సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల నేలలో సేంద్రియ కార్బన్ (Soil Organic Carbon) పెంపు వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కొనే ముఖ్యమైన వ్యూహం. పంట అవశేషాలు, పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, గొర్రెలు ఆపడం, పంటల అవశేషాల నిర్వహణ వంటి పద్ధతులను అవలంబించాలి.

అయితే కేవలం సేంద్రియ ఎరువులపైనే ఆధారపడకుండా సమీకృత పోషక యాజమాన్యం (Integrated Nutrient Management) పాటించాలి. నేల పరీక్ష ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అవసరమైన సూక్ష్మపోషకాలను సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా పొటాషియం మొక్కల నీటి సమతుల్యత, కణాల దృఢత్వం మరియు వివిధ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి నేల పరీక్ష ఆధారంగా పొటాషియం లోపం ఉన్న నేలల్లో తగిన మోతాదులో పొటాషియం ఎరువులు అందించడం ప్రయోజనకరం. కొన్ని నేలల్లో పోటాష్ ఎక్కువగా ఉన్నప్పటికీ మొక్కకు అందుబాటులోకి రాదు. ఇలాంటి పరిస్థితులలో పోటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా వంటివి ఉపయోగకరంగా ఉంటాయి.

  1. నీటి యాజమాన్యంలో మార్పులు
    వాతావరణ మార్పుల పరిస్థితుల్లో నీటిని అపరిమితంగా ఉపయోగించే సాగు విధానాలకు బదులుగా “More crop per drop” సూత్రాన్ని అనుసరించాలి.

సాధ్యమైన చోట:

  • డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతులు
  • పంట అవసరానికి అనుగుణంగా నీటిపారుదల
  • ఉదయం లేదా సాయంత్రం నీటి వినియోగం
  • నేల తేమ ఆధారంగా నీటి నిర్ణయం
  • పొలంలో వర్షపు నీటి సంరక్షణ పద్దతులైన కాంటూర్ గట్లు చేపట్టాలి.
    నీటి కొరత ఉన్న సమయంలో పంటకు అత్యంత కీలకమైన పుష్పించే, కాయఏర్పడే దశ మరియు గింజ నిండే దశల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతతో వినియోగించాలి.
  1. పంటల వైవిధ్యీకరణ – ఒకే పంటపై ఆధారపడకండి
    వాతావరణ అనిశ్చితి పెరిగినప్పుడు ఒకే పంటపై ఆధారపడటం రైతుకు అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందువల్ల పంటల వైవిధ్యీకరణ (Crop diversification) అవసరం. ధాన్య పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు మరియు స్థానికంగా అనుకూలమైన పంటలను పంటల ప్రణాళికలో చేర్చాలి.
    ఉదాహరణకు వర్షాధార ప్రాంతాల్లో జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము వంటి పంటలు పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే అంతర పంటలు (Intercropping) కూడా ప్రతికూల వాతావరణ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక పంట ప్రతికూల వాతావరణంతో నష్టపోయినా, మరో పంట ద్వారా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
  2. ఎరువుల వినియోగంలో సమతుల్యత
    వాతావరణ ఒత్తిడి సమయంలో అధిక నత్రజని వినియోగం ఎల్లప్పుడూ ప్రయోజనకరం కాదు. అధిక నత్రజని వల్ల మృదువైన, అధిక శాఖీయ పెరుగుదల ఏర్పడి, కొన్ని పరిస్థితుల్లో నీటి ఒత్తిడి మరియు పురుగు/తెగుళ్ల సమస్యలకు పంట సున్నితంగా మారవచ్చు. అందువల్ల నేల పరీక్ష ఆధారిత సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి.

వర్షాభావం ఉన్నప్పుడు నేలలో తగిన తేమ లేకుండా అధిక మోతాదులో ఎరువులు వేయడం నివారించాలి. తేమ అందుబాటులో ఉన్న సమయంలో సిఫార్సు చేసిన విధంగా ఎరువులను అందించాలి. అవసరాన్ని బట్టి శాస్త్రీయంగా సిఫార్సు చేసిన పంట పైన పోషక ద్రావణాలను కూడా పిచికారి చేసుకోవచ్చు. అయితే పంట, దశ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే వాటిని ఉపయోగించాలి.

  1. అధిక ఉష్ణోగ్రతల సమయంలో పంట రక్షణ
    ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు పంటలో నీటి నష్టం వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో:
    మల్చింగ్ + నేల తేమ సంరక్షణ + సరైన నీటి యాజమాన్యం + సమతుల్య పోషక యాజమాన్యం అనేవి అత్యంత ముఖ్యమైన సమగ్ర విధానం.
    పుష్పించే దశలో తీవ్ర వేడి ఉంటే పుష్పాలు రాలడం లేదా పరాగసంపర్కం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల పంటకు కీలక దశల్లో తేమ ఒత్తిడి రాకుండా ముందస్తు నీటి ప్రణాళిక అవసరం.
  2. అధిక వర్షాల సమయంలో కూడా ముందస్తు చర్యలు అవసరం
    వాతావరణ మార్పు అంటే కేవలం వర్షాభావం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో తక్కువ సమయంలో అధిక వర్షపాతం కూడా పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

అందువల్ల పొలంలో:

  • అదనపు నీరు బయటకు వెళ్లే కాలువలు
  • సరైన డ్రైనేజీ
  • నీటి నిల్వను నివారించడం
  • నేల కోత నియంత్రణ
  • వర్షం తరువాత పోషక లోపాల నివారణ వంటి చర్యలు చేపట్టాలి.

నీరు ఎక్కువసేపు నిలిచే పరిస్థితుల్లో వేర్లకు ఆక్సిజన్ అందక వేరుకుళ్ళు మరియు ఇతర తెగుళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల తరువాత పొలాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

  1. పురుగులు మరియు తెగుళ్లపై నిరంతర నిఘా
    ఉష్ణోగ్రత మరియు తేమలో మార్పులు అనేక పురుగులు, తెగుళ్ల జీవచక్రాన్ని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల వాతావరణ మార్పుల నేపథ్యంలో సమీకృత తెగుళ్ల మరియు పురుగుల యాజమాన్యం మరింత ప్రాధాన్యం పొందుతుంది.

రైతులు వారానికి కనీసం ఒకసారి పొలాన్ని పరిశీలించి:

  • పురుగుల ఉనికి
  • గుడ్లు/లార్వా
  • ఆకుల నష్టం
  • తెగుళ్ల లక్షణాలు గుర్తించాలి
  • శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి.
  1. వాతావరణ సమాచారాన్ని రైతు నిర్ణయాల్లో భాగం చేయాలి
    ఈ రోజుల్లో వాతావరణ సమాచారం రైతులకు చాలా ఉపయోగకరమైన సాధనంగా మారింది. వర్ష సూచనలు, ఉష్ణోగ్రత, గాలివేగం, తేమ వంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని:
  • విత్తనాలు వేసే సమయం
  • ఎరువులు వేయడం
  • పురుగుమందుల పిచికారీ
  • నీటిపారుదల
  • కోత
  • పంట సంరక్షణ…….వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.

“వాతావరణ సూచనను తెలుసుకుని – వ్యవసాయ నిర్ణయం తీసుకోవడం” భవిష్యత్ వ్యవసాయంలో ముఖ్యమైన భాగం కావాలి.

రైతు మాత్రమే కాదు – శాస్త్రవేత్తల పాత్ర కూడా కీలకం

వాతావరణ మార్పులను ఎదుర్కోవడం రైతు బాధ్యత మాత్రమే కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ, వాతావరణ శాస్త్రవేత్తలు కలిసి స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను రైతులకు అందించాలి.

శాస్త్రవేత్తల స్థాయిలో:

  1. కరువు మరియు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాల అభివృద్ధి
  2. తక్కువ నీటితో అధిక ఉత్పాదకత సాధించే పద్ధతుల అభివృద్ధి
  3. వాతావరణ ఆధారిత పంటల సిఫార్సులు
  4. నేల తేమ సంరక్షణ సాంకేతికతల ప్రదర్శనలు
  5. పంటల వైవిధ్యీకరణ నమూనాలు
  6. వాతావరణ ఆధారిత పురుగు–తెగుళ్ల హెచ్చరిక వ్యవస్థలు
  7. గ్రామస్థాయిలో వ్యవసాయ సలహాలు అందించడం …….వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • చివరిగా….* వాతావరణ మార్పులు వ్యవసాయానికి ఒక దీర్ఘకాలిక సవాలు. అయితే శాస్త్రీయ పద్ధతులు, ముందస్తు ప్రణాళిక మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగు విధానాలను అవలంబించడం ద్వారా వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. సరైన పంట + సరైన రకం + సరైన సమయంలో విత్తడం + నేలలో తేమ సంరక్షణ + సమతుల్య పోషక యాజమాన్యం + సమర్థవంతమైన నీటి వినియోగం + సమగ్ర పంట రక్షణ + వాతావరణ ఆధారిత నిర్ణయాలు ఇవే వాతావరణ అనుకూల వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు. రైతులు వాతావరణ మార్పులను కేవలం సమస్యగా కాకుండా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవాల్సిన వ్యవసాయ ప్రమాదంగా చూడాలి. ఒకే పంట, ఒకే సాగు విధానం, ఒకే నీటి వనరుపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శాస్త్రీయ సలహాలను కలిపి అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరమైనది, లాభదాయకమైనది మరియు వాతావరణ ప్రతిఘటన కలిగినదిగా మార్చవచ్చు.

“వాతావరణాన్ని మనం మార్చలేము; కానీ వాతావరణానికి అనుగుణంగా మన వ్యవసాయాన్ని మార్చుకోవచ్చు. ముందస్తు ప్రణాళికే రైతు నష్టాన్ని తగ్గించే మొదటి అడుగు.”

*డా. ఎస్. బాలాజీ నాయక్, 9177340314, సీనియర్ శాస్త్రవేత్త (భూసార శాస్త్రం)
డా. పి. సుజాతమ్మ, ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త
ఏరువాక కేంద్రం, కర్నూలు

Read More

వ్యవసాయంలో బయోచార్ ఉపయోగాలు

బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పంటల పెరుగుదల, దిగుబడి మరియు సాగు స్థిరత్వాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవి:

• నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి భూసారం మెరుగుపడుతుంది.
• నేలలో పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి, మొక్కలకు అవి క్రమంగా అందుబాటులోకి వస్తాయి.
• నత్రజని వంటి పోషకాలు వర్షం లేదా నీటితో కొట్టుకుపోవడం (లీచింగ్) తగ్గి, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
• నేల నిర్మాణం మెరుగుపడి, గాలి ప్రసరణ మరియు వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
• నేలలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరగడంతో ఎండ పరిస్థితుల్లో కూడా పంటలు మెరుగ్గా తట్టుకుంటాయి.
• ఆమ్ల నేలల్లో నేల ప్రతిచర్య (pH) సమతుల్యంగా ఉండేందుకు కొంతవరకు సహాయపడుతుంది.
• బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు మరియు వానపాములకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.
• నేలలో పోషకాల నష్టాన్ని తగ్గించడం ద్వారా రసాయన ఎరువుల అవసరాన్ని కొంత మేర తగ్గించవచ్చు.
• నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
• వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే వాతావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికతగా బయోచార్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది.
• బయోచార్‌లోని విస్తారమైన ఉపరితల వైశాల్యం మరియు సూక్ష్మ రంధ్రాల నిర్మాణం నీరు, పోషకాలను నిల్వ ఉంచడంతో పాటు నేలలోని ఉపయోగకరమైన జీవసంపద అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలోని కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ICAR-CIAE), భోపాల్ శాస్త్రవేత్తలు పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు చిన్న స్థాయి మరియు పైలట్ స్థాయి బయోచార్ యూనిట్లను అభివృద్ధి చేశారు. పైలట్ ప్లాంట్‌లో ఒక్క సారి సుమారు 300 కిలోల పంట అవశేషాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించి రియాక్టర్‌ను పరోక్షంగా వేడి చేస్తారు. బ్లోయర్ సహాయంతో దహన ప్రక్రియను కొనసాగిస్తారు. ఫర్నేస్‌ను అగ్నినిరోధక ఇటుకలతో నిర్మించగా, ఉష్ణోగ్రత సుమారు 350°C వరకు చేరుతుంది. ఈ విధానంలో సుమారు 33% బయోచార్ లభిస్తుంది. ఈ యూనిట్ ధర సుమారు రూ. 2.0-2.5 లక్షలు.

ఈ సాంకేతికత ద్వారా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా నాణ్యమైన బయోచార్‌గా మార్చి, నేల సేంద్రియ కార్బన్‌ను పెంచడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామీణ వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా ఈ యూనిట్ల వినియోగాన్ని విస్తరించడం ద్వారా స్థిరమైన, వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా అంతర్జాతీయ మెట్ట పరిశోదన కేంద్రం శాస్త్రవేత్తలు, చిన్న రైతుల కోసం సులభంగా తరలించగల పోర్టబుల్ బయోచార్ యూనిట్ ను అభివృద్ధి చేశారు. ఈ యూనిట్‌ను నేరుగా పొలంలోనే ఉపయోగించవచ్చు. పంట అవశేషాలను ఒకచోట చేర్చి బహిరంగంగా కాల్చే బదులు, నియంత్రిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చవచ్చు. ఈ సాంకేతికత తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా, చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు సులభంగా వినియోగించేలా రూపొందించబడింది.

ఈ యూనిట్‌లో తయారైన బయోచార్ నాణ్యత ప్రయోగశాలలో తయారైన బయోచార్‌కు సమానంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్ధారించబడింది. బయోచార్‌లో స్థిర కార్బన్ శాతం అధికంగా ఉండటం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ పెరుగుతుంది, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది, నేల ఆరోగ్యం బలపడుతుంది. అదే సమయంలో పంట అవశేషాల దహనం తగ్గి, గాలి కాలుష్యం మరియు హరితగృహ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. ఈ వికేంద్రీకృత సాంకేతికత ద్వారా పంట అవశేషాలను “వ్యర్థం నుంచి విలువైన వనరుగా ” మార్చి, స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ అనుకూల వ్యవసాయానికి తోడ్పడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More