జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.
జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
ప్రతి తేనె పెంపకం పరిశ్రమలో కనీసం ఒకటి లేదా రెండు పట్టులు దూకుడుగా (Aggressive) ఉంటాయి. అనగా కుట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తేనెటీగల పెంపకందారులకు ఈ లక్షణం ఉన్న పట్టులంటే ఇష్టము. ఎందుకనగా ఇలాంటి పట్టులు మంచి తేనెను సేకరించే లక్షణము, వ్యాధి నిరోధక శక్తిని లేక ఇతర విలువైన లక్షణాలను కలిగి ఉంటాయని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దూకుడుగా వ్యవహరించే పట్టులకు నెమ్మదిగా ఉండు రాణి ఈగలను రక్షించాలనే మనస్సాక్షి గల తేనెటీగల పెంపకం దారులు ఏ సంకోచం లేకుండా చేస్తారు. తేనెటీగల పట్టులలో దూకుడు గల లక్షణం అనేది వంశపారంపర్యమైన లక్షణం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అంతేకాకుండా పెద్ద పట్టులు ఎప్పుడూ దూకుడుగానే ఉంటాయి. ఎందువలన అనగా ఆ పట్టులో ఎక్కువ సంఖ్యలో తేనెటీగలుంటాయి కాబట్టి ఏది ఏమైనా బలమైన సులువుగా యాజమాన్యం చేయగల పట్టులు అలానే ఉండాలనేది తేనెటీగల పెంపకందారుల లక్ష్యం కూడాను.
సామన్యమైన, సూటిగా రాణి ఈగ ఎంపిక అనేది బాగా స్థిరపడిన విషయమే కాకుండా ఈ ప్రక్రియ ఆ ప్రాంతంలో తేనెటీగల స్వభావమును మార్చుతుంది. సంవత్సరాలుగా తేనెటీగలను నెమ్మదిగా ఉండే, వ్యాధి నిరోధకత కల్గి, తేనె ఉత్పత్తి ఎక్కువగా చేయగల తక్కువ ప్రపోలిస్ ను, ఎక్కువ పుప్పొడిని సేకరించు లక్షణాలు గల పట్టుల ఈగలను (Selection) ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో గల పట్టులు ఖచ్చితంగా తేనెటీగల స్వభావము మీద ఆ ప్రాంత ప్రభావము ఉంటుంది. ఇంకా పొరుగువారి తేనె పట్టులకు చాలా దగ్గరగా పనిచేసినట్లయితే తరుచుగా ఆ ప్రాంతమంతటి మీద కలిగే ప్రభావముగా ఫలితం ఉంటుంది.
పోతుటీగలు వీటిన్నింటి మీద ఒక కారకము (Factor) ఎందువలన అనగా సగం జన్యు పదార్ధము పోతుటీగల వైపు నుండి వస్తుంది. పోతుటీగల లద్దె పురుగులను, కోశస్థ దశలను దూకుడుగా ఉన్న పట్టులలో నాశనం చేసినపుడు దూకుడు అనే లక్షణాన్ని మోసుకెళ్ళే పోతుటీగల జన్యువులు పట్టులో తగ్గిపోతాయి. ఇది ఒక ఎంపిక మాత్రమే అయినప్పుటికీ సమయం చాలా తీసుకునే (Time consuming) ప్రక్రియ. ఇంకొక ఎంపిక ఏమంటే పోతుటీగల కృత్రిమ మైనపు అట్టను పట్టుకు సరఫరా చేయడం లేదా మంచి పట్టుల నుండి పోతుటీగలున్న లద్దె పురుగుల ఫ్రేములను సరఫరా చేయవలెను.
బాగా కుట్టే స్వభావము గల పట్టులలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలు మనల్ని కుట్టకుండా రాణి ఈగను గుర్తించడం బహుశా అన్నిటికంటే కష్టమైన పని. తరచుగా ఇలాంటి పట్టులన్నింటిలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలుంటాయి. రాణి ఈగను కనగొనడం చాలా కష్టము. కొన్నిసార్లు అసాధ్యముగా అనిపిస్తుంది. సాధారణంగా బాగా కుట్టే పట్టులకు ఎక్కువ మోతాదులో పొగ ఇచ్చి బాగా కుట్టే స్వభావము గల పట్టులను పరిశీలిస్తుంటాము. రాణి ఈగ పట్టును వదిలి తేనె పెట్టెలో ఏ భాగములోకైనా వెళుతుంది. బాగా పొగబారించినపుడు కూలి ఈగలు పట్టులోను మరియు పట్టుకు వెలపల గుంపులు గుంపులుగా ఏర్పడతాయి, ఒకవేళ రాణి ఈగ ఈ గుంపులలో ఉన్నట్లయితే రాణి ఈగను గుర్తించడం అసాధ్యము.
బాగా కుట్టే పట్టులలో రాణి ఈగను కనుగొనడానికి రెండు పద్దతులున్నాయి. రెండు పద్దతులలో కొంత ఎక్కువ సమయము మరియు కృషి అవసరమవుతుంది. ఈ రెండు పద్దతులను కూడా కూలి ఈగలు ఆహారం సేకరణకు వెళ్ళినపుడు, వెచ్చని వాతావరణములో (Warm days) చేయవలసి ఉంటుంది. పొలములో ఎక్కువ మోతాదు లో పుప్పొడి మరియు మకరందము లభ్యమయ్యేటప్పుడు మంచిది. ఎందుకంటే ఎక్కువ కూలి ఈగలు పొలానికి వెళతాయి కాబట్టి.
మొదటి పద్ధతిలో, మొదటిగా పట్టులో లద్దె పురుగులు, కోశస్థ దశలో ఉన్న (Brood nest) ఫ్రేములను గుర్తించి, పెట్టెతో సహా 50 నుండి 75 అడుగుల దూరం వరకు మోసుకెళ్ళి ఒక పొద చాటున లేక ఇతర అడ్డుగా ఉన్న (Obstrucion) నీడలేని ప్రదేశంలో ఉంచాలి. వయస్సు మళ్ళిన కూలి ఈగలు, పాలంకెళ్ళిన కూలి ఈగలు, కాపలా కాసే ఈగలతో సహా అన్ని తిరిగి వాటి పాత స్థానంలోకి ఎగరి వెళతాయి. కారణం వాటికి తెలిసిన వాటి పాత ఇల్లు అదే అని, దానిని కాపాడుకోవాలని అంతే తప్ప ఈ కొత్త స్థలం కాదు కాబట్టి. పైన చెప్పబడిన చిట్కా కూడ, కుట్టే ఈగల పట్టును తెరచి పరీక్షించునపుడు, మరియు ఇతరులకు చూపేటపుడు (Live demonstration) ఉపయోగపడుతుంది. పట్టును ఎత్తుకొని వేరే చోటుకి వెళ్ళడము ద్వారా ఎదురాడే కూలి ఈగలు ఎగిరి తిరిగి వాటి అసలు స్థానానికి వెళతాయి.
ఒకసారి లద్దె పురుగులున్న పెట్టె మరియు రాణి ఈగ, వేరు స్థానానికి మార్చినపుడు, తక్కువ పొగ అవసరముంటుంది. వెదకే విషయంలో మందుకు వెళ్ళవచ్చును. పొగ ఉపయోగించడం వల్ల తేనెటీగలకు రాణి ఈగతో సహా దిక్కు దిశ తెలియకుండా అవుతుంది. సాధారణ పరిస్థితులలో, నెమ్మదిగా ఉన్న పట్టులో రాణి ఈగ, లద్దెపురుగులున్న ప్రేములపై కనబడుతుంది. ఎక్కువ పొగ పట్టుకు ఇచ్చినపుడు రాణి ఈగ ఎక్కడైనా ఉండవచ్చును. రాణి ఈగను గుర్తించే రెండవ పద్ధతిలో (కుట్టే ఈగలు గల పట్టులలో) తేనె పట్టును విభజించి రాణి ఈగను వేరు పరుచు జల్లెడను ప్రతి భాగము (మీద పిల్లల గది మరియు తేనె గదిపై) పై ఉంచి పట్టు ద్వారమును మూసివేయవలెను. ఈ విధంగా చేయడం వల్ల మనకు రాణి ఈగ ఒక దానిలో ఖచ్చితంగా ఉoటుందని నమ్మవచ్చును. మూడు లేక నాలుగు రోజులు తర్వాత గుడ్లన్నీ రాణి ఈగ లేని భాగములో (Hive Part) పొదగబడతాయి. దేనిలో గుడ్లు ఉంటాయో దానిని (ఆ భాగమును) ఒక ప్రక్క ఉంచి అడుగు బల్ల మరియు పై మూతను పెట్టాలి. తిరిగి వయస్సు మళ్ళిన కూలి ఈగలు వాటి పాత స్థానమునకు తిరిగి వెళతాయి. అదే రోజున గాని, తరువాత రోజు గాని రాణి ఈగ కొరకు తక్కువ సంఖ్యలో ఉన్న కూలి ఈగలు పట్టులో తక్కువగా ఉన్నందువలన సులువుగా రాణి ఈగను కనగొనవచ్చును.
మన లక్ష్యం ఇక్కడ అసలు పట్టులో (Original) రాణి ఈగను తిరిగి ప్రవేశ పెట్టడం (Requeening). పట్టు తనంతట తానుగా రాణి ఈగను తయారు చేసుకోనివ్వకూడదు. అలా కొత్తగా వచ్చిన రాణి ఈగ తన తల్లి నుండి అనవసరమైన లక్షణాలు ఏమైన పొందుకొనవచ్చునని ఆలోచించాలి.
పట్టులో నూతనంగా తిరిగి రాణి ఈగను ఉత్పత్తి చేసుకోనవలయుననుకుంటే తగిన శ్రేష్టమైన మార్గము ఏమంటే ఒక వార్తా పత్రికను (News paper) పాత పట్టుపై ఉంచి పైభాగాన ఉంచే పిల్లల గదిని దానిపై పెట్టుకోవాలి. పై భాగమున ఉన్న పిల్లల గదిలో మంచి లక్షణాలు గల నూతనముగా సంపర్కము చెందిన రాణి ఈగ ఉండేటట్లుగా చూసుకొనవలెను. వార్తా పత్రికను కూలి ఈగలు నెమ్మదిగా నమిలి పట్టులు రెండు నెమ్మదిగా కలిసిపోతాయి. మీ సొంత తేనె పట్టుల సామర్థ్యమును త్వర త్వరగా పెంచుకోవాలనుకుంటే మీరే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉండే ఫలవంతమైన తల్లియైన రాణి ఈగల ద్వారా చేసుకొనవచ్చును.
Smokers- పొగ డబ్బా అనేక సంవత్సరముల వరకు తేనెటీగల పెంపకముదారులు మండే ఎండిన చెక్కను (punk wood), గట్టిగా కట్టిన ఎండుగడ్డిని మరియు ఇతరమైన వాటిని తేనెపట్టులో పొగబారించుటకు వాడేవారు. ఈ పదార్దములు మండి పొగను ఉత్పత్తి చేయుట వలన అట్టలపై అడ్డముగా పొగబారించేవారు. ఇవి కొద్దిమొత్తములోనే పొగ ఉత్పత్తి చేసేవి. కోపముతోవున్న పట్టులను అదుపుచేయుటకు సరిపడునంతగా ఉండేది కాదు
మోజస్ క్విన్బి(Moses Quinby) 1875వ సంవత్సరములో మొట్టమొదటి ఆచరణాత్మకమైన పొగడబ్బాని, ఈ పొగడబ్బాలో మంట మండించే స్తలము (fire pot) మరియు గాలితిత్తులు (bellows), ఒక విధముగా ఆధునిక తేనెటీగల పెంపకము చేపట్టిన తరువాత ఆలస్యముగా కనుగొనబడిన పొగడబ్బానుండి, పొగను గురిపెట్టి అవసరమైనచోటకు పడేలా గొట్టం ద్వారా పొగడబ్బా చివర కొనకు అమర్చబడివుంటుంది.
మండుచున్న పొగడబ్బాల వలన, చుట్టు ప్రక్కల వున్నకట్టెలు, గడ్డి అంటుకొని అనవసరమైన కార్చిచు ప్రారంభమవుతుంది. ఇది పొగడబ్బాలోని నిప్పు సులువుగా అంటుకొనే పదార్ధము లేక వేడినిప్పురవ్వలు పొగ మూతి నుండి వెలువడడము ద్వారా జరుగుతుంది. తేనెటీగల పెంపకముదారులు పొగడబ్బాను మండించిన తరువాత గుప్పెడు పచ్చగడ్డిని మంటపై భాగమున వుంచుతారు. ఎందుకనగా వేడి పొగను చల్లబరచి, మంటనుండి వెలువడు నిప్పురవ్వలను పొగడబ్బా మూతి నుండి (nozzle) వెలువడకుండా ఆపుతుంది. తేనెపట్టులున్న ప్రాంతములో కొన్నిసార్లు వాడిన పొగడబ్బాలో వున్న మంటను ఆర్పకుండా, బయట పడవేయడము వలన మంటల వ్యాప్తికి కారణమవుతంది.
Smoking Honey bee colonies- తేనెపట్టు దూకుడుగాను మరియు పట్టులోని ఈగలు దాడిచేయుటకు ముందుగా నెమ్మదిగా వుంచుటకు పొగబారించుట ముఖ్యము. ఒక్కసారి కాపలాకాయు ఈగలు ప్రమాదమును పసిగట్టి నట్లయితే, హెచ్చరిక వాసనను (alarm odour) బయటకు పంపిస్తాయి. అలాంటి పరిస్థితిలో తరచుగా ఆ పట్టు మరియు చుట్టు ప్రక్కల వున్నపట్టులను నియంత్రించుట కష్టము.
తేనెపట్టులున్న ప్రాంతములోనికి ప్రవేశించుటకు ముందుగానే, పొగడబ్బాను వెలిగించుకొని సరైన స్థితిలో ప్రవేశించవలెను. పని ప్రారంభించుటకు ముందుగానే పట్టులన్నింటికి పొగనివ్వనవసరము లేదు. ఎందువలననగా ఎవైనా కంపనములు (vibrations) మొదటి పట్టునుండి వెలుపడినట్లయితే అవి ఇతర పట్టులను రేపుతాయి. అయినప్పటికిని పట్టులన్నింటికి స్టాండువద్ద పొగ బారించవలెను.
మొదటి పట్టును తెరచునపుడు పొగబారించునపుడు, గుర్తుపెట్టుకొనవలసినదేమనగా అన్ని పట్టులు ద్వారములవద్ద కాపలాకాయు కూలిఈగలుంటాయి. మకరందము లభించనప్పుడు పట్టుద్వారము వద్ద ఎక్కువ సంఖ్యలో కాపలాకాయు ఈగలుంటాయి మరియు కొద్ది సంఖ్యలో బాగా తేనె లభించు కాలములో కాపలా కాయు ఈగలుంటాయి. ఒక అడుగు దూరమునుండి రెండు లేక మూడుసార్లు పట్టుద్వారము వద్ద పొగను పారించిన యెడల, కాపలాకాయు ఈగలను నిరాయుధులుగా (disarm) చేస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ద్వారములున్నట్లయితే అన్ని ద్వారముల ముందు ఇలాగే పొగబారించవలెను. తరువాత పై మూతను తీసి పట్టుకొని, అలాగే పొగనివ్వవలెను. లోపలిమూతను వాడినపుడు కూడ ఇలానే పొగనివ్వవలెను
తరువాత సూపర్ గదిలోవున్న ఏ ఫ్రేమును తీయవలెనని చూడవలెను. చాల సుళువుగా తీయగల్గిన ఫ్రేము, మొదటి ఫ్రేము. ఈ ఫ్రేముమీదనే అతితక్కువ తేనెటీగలుంటాయి మరియు వికృతరూపము (burr) గల్గిన మైనపు అట్టలుంటాయి. ఈ విధముగా ఏ ఈగలు కూడా నలిగిపోకుండా, ఇతర ఫ్రేములపై వున్న తేనెటీగలకు కోపము రాకుండా చేయడము సులువు. సాధారణముగా ప్రక్కనున్న ఫ్రేమును మొదటిగా తీస్తారు. మొదటి ఫ్రేముల చివరలకు పొగబారించవలెను, ఈ విధముగా దారిలో ఈగలు లేకుండావుండి, చేతి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొనవచ్చును.
మొదటి ఫ్రేమును తీసినపుడు, పట్టుపరిశీలన మధ్యలోవున్నపుడు, అవసరమైనయెడల మరలా ఒకసారి పొగనివ్వవచ్చును. ఫ్రేముల మధ్యలో తేనెటీగలు అలవాటు పడియుండుటను చూడవచ్చును. ఎప్పుడైతే అయిదు నుండి పదిహేను ఈగలు రెండు ఫ్రేముల మధ్యవాటి తలలుంచి చూచుచున్నపుడు, పొగ ఇవ్వవలసిన సమయము అదే అని భావించవలెను. రెండు, మూడు పఫ్ ల పొగను ఫ్రేములపై అడ్డముగా బారించినపుడు నెమ్మదిగా తేనెటీగలన్నియు వెనుకకు వెళ్ళతాయి. రెండు ఫ్రేముల మధ్య తొంగి చూచుచున్న ఈగలు పొగ బారించినను వెళ్ళకపోయినట్లయితే, నెమ్మదిగా వుండకపోతే అవి ఎగిరి కుట్టవచ్చును. పట్టులోని ఈగలు ఒక్కొక్కటి రేపబడి, అన్ని ఈగలు కూడా ఈ విధముగా సహకరించి పనులు చేసుకుంటాయి.
Fuel for smokers – పొగడబ్బాలో వాడు ఇంధనము పొగడబ్బాలో వాడవలసిన శ్రేష్ఠమైన ఇంధనము ఏది అనునది తేనెటీగల పెంపకదారుల మధ్య జరిగే తీవ్ర చర్చయైయున్నది. పొగ ఎందుకు తేనెటీగలను నెమ్మది పరుస్తుంది అను విషయమైన దానిలో తక్కువ పరిశోధన జరిగినది. ఆధునిక ఆలోచన ఏమనగా పట్టును తెరవగానే కూలిఈగలు హెచ్చరిక ఫిరమోనును స్పర్శకముల మీదవున్న స్పర్శగ్రాహకములు గ్రహించకపోవుట వలన అని. ఇది నిజమైనట్లయితే, ఏ ఇంధనమైనను ఎక్కువ పరిమాణములో పొగను ఉత్పత్తి చేయునదైతే తేనెటీగలను నెమ్మది పరుస్తుంది. పొగడబ్బాలో వాడు ఇంధనము విషయమైన ముఖ్య సమస్య ఏమనగా ఎక్కువ సేపు మండకపోవుట, అనగా త్వరగా కాలిపోవుట మరియు పొగడబ్బాను నిరంతరముగా మండునట్లుగా రీచార్జి (recharge) చేయుట. తేనెటీగల పెంపకదారులు ఆకులను, గడ్డిని, గోనెసంచి గుడ్డలు లేక ఇతర పాతగుడ్డలు, అరిగిపోయిన త్రాళ్ళు, చెక్కపొట్టు, చెక్కముక్కలు ఒక అంగుళము సైజుగలవి (బ్లాక్స్ రూపములో తయారుచేసి) వాడుదురు. ఇవి ఎక్కువ సమయము మండుతాయి మరియు కొంతమంది తేనెటీగల పెంపకము దారులు వాడుచున్నారు.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Phone: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
భారతదేశంలో పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారంగా నిలుస్తోంది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలు మరియు మొబైల్ ఆధారిత సేవలు రైతులకు పశువుల ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మరియు ఆర్థిక సేవలను సులభతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక రంగంలో సేవలందిస్తున్న ముఖ్యమైన AI ఆధారిత డిజిటల్ వేదికల గురించి తెలుసుకోవడం అవసరం.
పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాలలో రైతులకు డిజిటల్ సేవలు అందిస్తున్న ముఖ్యమైన ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు Stellapps, MoooFarm, Animall, Anitra AI, mooPay, AniMeta మరియు AgriTech. ఈ సంస్థలు డిజిటల్ పశు ఆరోగ్య సేవలు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, జాతి అభివృద్ధి, పాల ఉత్పత్తి నిర్వహణ, డిజిటల్ చెల్లింపులు మరియు AI ఆధారిత పశుసంపద నిర్వహణ వంటి రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి భారతదేశంలో పశుసంవర్ధక రంగ డిజిటలీకరణకు గణనీయంగా దోహదపడుతున్నాయి.
Stellapps: భారతదేశంలో డైరీ రంగాన్ని డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్న ప్రముఖ అగ్రిటెక్ సంస్థ “Stellapps”. ఈ సంస్థ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పశుపోషకులకు సమగ్ర డిజిటల్ సేవలను అందిస్తోంది. Stellapps అభివృద్ధి చేసిన “mooOn” వంటి స్మార్ట్ సెన్సర్లు పశువుల ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఎద గుర్తింపు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఇవే కాకుండా పాల సేకరణ, పాల నాణ్యత పరీక్ష, శీతలీకరణ గొలుసు నిర్వహణ మరియు రైతులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
MoooFarm ఇది ముఖ్యంగా పాల ఉత్పత్తిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేసి వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషణ మరియు ఉత్పత్తి పనితీరును పర్యవేక్షించవచ్చు. MoooFarm టెలీ-వెటర్నరీ సేవలను అందించడం ద్వారా రైతులు నిపుణులైన పశువైద్యులను ఆన్‌లైన్‌లో సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. పశువుల గర్భధారణ, ఈస్ట్రస్ చక్రం, టీకాల షెడ్యూల్ మరియు మేత నిర్వహణకు సంబంధించిన సూచనలు రైతులకు సమయానుకూలంగా అందుతాయి. దీనివల్ల పశువుల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుంది.
Animall భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ పశువుల మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటి. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు ఆవులు, గేదెలు, మేకలు మరియు ఇతర పశువులను నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతు నుండి రైతుకే లావాదేవీలు జరగడం దీని ప్రత్యేకత. పశువుల జాతి, వయస్సు, పాల ఉత్పత్తి, ఆరోగ్య స్థితి వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతను పెంచుతుంది. Animall రైతులకు మార్కెట్ ధరల సమాచారం, కొనుగోలుదారుల వివరాలు మరియు పశుసంవర్ధకానికి సంబంధించిన వివిధ సలహాలను కూడా అందిస్తుంది. ఫలితంగా రైతులు తమ పశువులకు సరైన ధరను పొందగలుగుతున్నారు.
Anitra AI Anitra AI అనేది కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఇది పశువుల గుర్తింపు, వాటి విలువ అంచనా, మేత నిర్వహణ మరియు ఆరోగ్య పర్యవేక్షణ వంటి సేవలను అందిస్తుంది. రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేయడం ద్వారా వాటి సుమారు మార్కెట్ విలువను తెలుసుకోవచ్చు. అలాగే మేత ఖర్చులను తగ్గించేందుకు సరైన మేత పరిమాణం మరియు పోషకాహార సూచనలు కూడా అందుబాటులో ఉంటాయి. పశువులకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, వాటి కొనుగోలు–అమ్మకాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వేదిక సహాయపడుతుంది. దీంతో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పశుసంవర్ధకాన్ని నిర్వహించి ఉత్పాదకతను పెంచుకోవచ్చు.
mooPay: mooPay అనేది పాడి పరిశ్రమకు ప్రత్యేకంగా రూపొందించబడిన డిజిటల్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్. పశువుల కొనుగోలు, డైరీ అభివృద్ధి మరియు పశుసంవర్ధక కార్యకలాపాల కోసం రైతులకు రుణాలు, బీమా మరియు ఇతర ఆర్థిక సేవలను అందిస్తుంది. mooScore™ వంటి డిజిటల్ క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థల ద్వారా రైతుల ఆర్థిక అర్హతను అంచనా వేసి త్వరితగతిన రుణాలను మంజూరు చేస్తుంది. పాల సేకరణ కేంద్రాల ద్వారా చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అయ్యే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ విధంగా గ్రామీణ పశుపోషకులకు సులభంగా ఆర్థిక సేవలను అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోంది.
AniMeta AgriTech (YourFarm) AniMeta AgriTech (YourFarm) అనేది పశువుల ఆరోగ్యం, పోషణ మరియు ఉత్పాదకత మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తున్న డిజిటల్ అగ్రిటెక్ సంస్థ. ఈ ప్లాట్‌ఫారమ్ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను ఉపయోగించి పశువులలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడుతుంది. రైతులకు మేత నిర్వహణ, పోషకాహార ప్రణాళికలు మరియు సంప్రదాయ చికిత్సలపై సూచనలు అందిస్తుంది. పశువుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పాల ఉత్పత్తి మరియు మొత్తం ఉత్పాదకతను పెంచడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ పశుసంవర్ధక పద్ధతుల ప్రాచుర్యానికి AniMeta AgriTech మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ వేదికలు పశుసంవర్ధక రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయి. పశువుల ఆరోగ్య పర్యవేక్షణ, మేత నిర్వహణ, పాల ఉత్పత్తి పెంపు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, ఆర్థిక సేవలు మరియు శాస్త్రీయ సలహాలను రైతులకు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీనివల్ల సమయం, శ్రమ మరియు ఖర్చు తగ్గడంతో పాటు పశువుల ఉత్పాదకత, రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిజిటల్ సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా, స్థిరంగా మరియు ఆధునికంగా తీర్చిదిద్దుకోవచ్చు. అందువల్ల రైతులు ఈ డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకొని, వాటిని తమ దైనందిన పశుసంవర్ధక కార్యకలాపాల్లో వినియోగించడం అవసరం.
సరిన్ కె. కున్నత్, అసోసియేట్ ప్రొఫెసర్, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పశువైద్య కళాశాల, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్-30. Ph: 9381572408
జె. సాయి ప్రసన్న, సీనియర్ శాస్త్రవేత్త, పశు పరిశోధనా కేంద్రం, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్. Ph: 8008910925
వివిధ జాగ్రత్తలు తీసుకొనినప్పటికిని తేనెటీగలను పెంచుకునేవారు, తేనెటీగల కాట్లకు (stings) అలవాటు పడిపోతారు. అయినప్పటికిని, పరిశ్రమలోవున్న వారందరును, వీటినుండి తప్పించుకొనుట ఎలా అను విషయమును తెలుసుకొనవలెను. కొన్ని సామాన్య నియమములు వున్నవి. వీటిని పాటించి కనీసము, కుట్టు సమయములను తగ్గించుకొనవచ్చును.
• తేలిక రంగు, మృదువుగా గల వస్త్రములను ధరించుకొనవలెను. ఇలాంటి వస్త్రములు ధరించుకున్నపుడు కుట్టే అన్నికీటికములు కూడా తక్కువగా కుడతాయి.
• తలకు రాసుకునే హెయిర్ ఆయిల్, గడ్డము గీచుకున్న తరువాత వాడు లోషన్లు (after shaves) పరిమళాలు (perfumes) మరియు ఇతర ఇంపైన సువాసనలు (sweet smellings) వెదజల్లు పదార్ధములను వాడరాదు. ఇవి కుట్టే కీటకములను ఆకర్షిస్తాయి. తీయటి వాసనలుగల, సువాసనలు వెదజల్లు పుష్పములమీద ఆహారము సేకరించుకునే కీటకములు, పరిమళములు పూసుకున్న వ్యక్తి వద్దకు పొరపాటున ఆహారమూలమని (food) ఆకర్షించబడతాయి.
• ప్రతిదినము స్నానము చేయవలెను. శుభ్రమైన వస్త్రములను ధరించవలెను. కుట్టేకీటకములకు చెమట, చికాకును కల్గిస్తుంది. తేనెటీగల పెంపకదారులు గమనించినదేమనగా తేనెటీగలు చాల తరచుగా, చెమటతో నిండిన చేతిగడియారము ప్రాంతములో కుట్టడము.
• శరీరమును సాధ్యమైనంత పూర్తిగా కప్పుకొనవలెను. పొలములో నడిచేటపుడు మోకాళ్ళ వరకు వుండే బూట్లు ధరించడము మంచిది. లేక తెలుపు కాటన్ సాక్సులు ధరించవలెను. తలను, వెంట్రుకలను గడ్డిటోపీతో (straw hat) లేక తేలికరంగులో వున్న చేతి రుమాలుతో కప్పుకొనవలెను. ఇలా చేసినట్లయితే కుట్టే తేనెటీగలు తలవెంట్రుకలలో చిక్కుకొనకుండా ఆపుచేయవచ్చును.
• వెచ్చని దినములలో కొత్త స్థలములో కూర్చొని, భూమిమీద మరియు చెట్లపైన కందిరీగల గూళ్ళు వున్నవేమోనని, ఎగురుచున్న కందిరీగలను గమనించవలెను. వసంత కాలములో సాంఘిక జీవనము చేయు కందిరీగలు వాటి గూళ్ళను కట్టుకుంటాయి. వర్షానంతరము కల్లా ఒకేఒక అడకీటకము ప్రారంభించిన గూటిలో అనేక వేల కందిరీగలు వుండవచ్చును. సంఖ్య పెరిగేకొలది ఎగిరే కీటకముల సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కసారి వెచ్చని వాతావరణము వచ్చిన తోడనే పెద్దసంఖ్యలో కందిరీగలను కనిపెట్టవచ్చును. మరియు నాశనము చేయవచ్చును.
• వదిలివేయబడిన ఆహారమును, చెత్తను తొలగించవలెను. లేనిచో కందిరీగలు వాటిని ఆహారముగా తీసుకుంటాయి. అనేక సాంఘిక జీవనము చేయు కందిరీగలు పట్టణాలలో నివసిస్తాయి. వయోజన కందిరీగలు, సోడా, పాలు, జామ్ మొదలగువాటిని ఆహారముగా తీసుకుంటాయి. ఇవి రొట్టెను, ఇతర వదిలివేయబడిన ఆహారములను వాటి లద్దెపురుగుల కొరకు సేకరించుకుంటాయి.
• ఒక వ్యక్తి అనేక కుట్టే కీటకములచే ఒకేసారి దాడిచేయబడినప్పుడు పరుగెత్తవలెను. ఒక పట్టును కలవరపరచినపుడు లేక విరుగగొట్టిన సమయములో మాత్రమే ఇలాంటి దాడి మనుషుల మీద వుంటుంది. తలుపులు మూసివున్నగదిలోనికి గాని లేక ఇతర ఏస్థలము కనబడని పక్షములో నీటిలోనికి దుమకవలెను. అవకాశముంటే బహిరంగస్థలముకంటే గూడ నీడగల ప్రదేశములోనికి పరుగెత్తుట ఉత్తమము. కోపముతో నిండిన కుట్టే కీటకములకు పొదలలోగాని అరణ్యములోనికిగాని వెంటబడి తరుముట కష్టము.
• ఒకే ఒక కుట్టే కీటకము వెంబడిస్తూ వున్నట్లయితే మఖమును క్రిందకు పెట్టుకొని నేలమీద పడుకొనవలెను. కందిరీగలు మరియు తేనెటీగలు కళ్ళు, ముక్కు మరియు చెవుల చుట్టూ కుట్టడానికి ఎక్కువ అవకాశములుంటాయి. ఎందుకనగా వీటిని కదులుతూ లేక కదులుతూవున్న ఛాయచిత్ర రూపములుగా తేనెటీగలు కనుగొంటాయి.
• కారు అద్దం గుండా కుట్టే ఈగ ప్రవేశించినట్లయితే కారును ఆపుచేయవలెను. కందిరీగగాని లేదా తేనెటీగ గాని, కదిలే కారులోనికి ప్రవేశిస్తే, అది కుట్టడం కన్నా, కారు నుండి తప్పించుకొనడానికే ప్రయత్నిస్తుంది. అలాంటపుడు కారును నెమ్మదిగా ఆపి, రోడ్డు మార్జిన్లో దించి, సాధ్యమైనంతవరకు కదలకుండా వుండవలెను. కారును ఆపిన తరువాత అన్ని అద్దాలను తెరవవలెను. ఆ కీటకము త్వరగా తప్పించుకొనుటకు మార్గమును కనుగొంటుంది.
First aid for bee stings – తేనెటీగల కాటుకు ప్రాధమిక చికిత్స ఒక కూలిఈగ కుట్టినపుడు, దాని యొక్క ఉదరపు (tip of the abdomen) కొన తన మిగతా శరీరభాగములకు సమాంతరముగా ఉండి తన శత్రువును కుట్టినపుడు ముల్లు (sting) యొక్క పొడవులో కనీసము సగభాగము, శత్రువు శరీరములోనికి దించి తిరిగి వెనుకకు లాగుకుంటుంది. భౌతికముగా ముల్లు శరీరంలోకి దిగినందు వలన మరియు తేనెటీగలో ఉన్న విషం వలన నొప్పి వెను వెంటనే కలుగుతుంది.
ప్రాధమిక చికిత్సలో భాగముగా శరీరము నుండి ముల్లును వెంటనే తీసి వేయవలెను. ఎక్కువ మంది తేనెటీగల పెంపకము దారులు ముల్లును శరీరము నుండి వదిలించు కొనుటకుగాను, హైవ్ టూల్ లేదా గోటితో తీసివేస్తుంటారు. కొంత సమయం తీసుకొని కత్తికొరకు వెదకి ముల్లును తీసివేయుట కొరకు సమయాన్ని వృధా చేయడం అనవసరము. తేనెటీగలను పట్టుకొని బలవంతముగా ముల్లును బయటకు లాగి గోరుమీద ఉంచినట్లయితే విషమంతా వెంటనే వేగముగా దాదాపు బయటకు రావడము కన్పిస్తుంది. తేనెటీగ విషము అనేక సంక్లిష్ట పదార్దములు అనగా నొప్పిని, వాపును మరియు దురదను, అనేక దినముల వరకు కలుగజేయు విధముగా రూపొందించబడింది. ఒక్కసారి విషము శరీరములోనికి ప్రవేశించినపుడు దానిని తొలగించు మార్గము లేదు, విషప్రభావమును తొలగించు పదార్ధములు గాని విరుగుడు గాని లేదు. ప్రాధమిక చికిత్సలో భాగముగా, శరీరంలో కలిగే నొప్పిని ఉపశమనం పొందుటకును గాయమునకు సూక్ష్మజీవులు సంక్రమించకుండా (Infection) గురికాకుండా చేసికొనవలెను.
తేనెటీగ కుట్టినపుడు మంచుగడ్డ (ice)ను ఆ భాగము మీద ఉంచినట్లయితే బాగా ఉపశమనము పొందవచ్చును, ఇతర ఏ రకమైన చికిత్సల కంటే కూడ, ఆల్కహాల్ ను రుద్దడము ద్వారా ఆల్కహాలు ఆవిరయ్యి చల్లదనమును శరీరము మీద కలుగజేస్తుంది. దీనిని కూడా ప్రాధమిక చికిత్సలో భాగంగా చెప్పుకొనవచ్చును. వ్యాపార పరంగా తేనెటీగలను పెంచుకొనువారికి దాదాపుగా ప్రతిరోజు తేనెటీగలు కుడుతూనే ఉంటాయి. వారు తేనెటీగల విషానికి తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటారు.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం కొంతమంది రైతులకు ముఖ్యమైన ఉపాధి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే పశుపాలనగా ఇది గుర్తింపు పొందింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల తగ్గుదల, పచ్చిక కొరత, పశుపోషణ లోపాల వల్ల గొర్రెలు, మేకలు తినరాని కొన్ని స్థానిక మొక్కలను తిని విషబాధకు గురవడం మన రాష్ట్రంలో తరచూ కనిపిస్తోంది. ఈ సమస్య వల్ల జంతువులు అనారోగ్యానికి గురై, కొన్నిసార్లు మరణించడమూ జరుగుతుంది. అందుకే రైతులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
విషపూరిత మొక్కలు అంటే ఏమిటి? గొర్రెలు, మేకలు సాధారణంగా పచ్చిక, ఆకులు, కొమ్మలు తింటాయి. కానీ కొన్ని మొక్కల్లో సహజంగానే విషపదార్థాలు ఉంటాయి. అలాంటి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఆ విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ, నరాలు, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దీనినే మొక్కల వల్ల వచ్చే విషబాధ అంటారు.
ఈ విషబాధ ఎక్కువగా: • వేసవిలో పచ్చిక కొరత ఉన్నప్పుడు • కరవు పరిస్థితుల్లో • అడవుల్లో మేపేటప్పుడు • పొలాల అంచుల్లో నిర్లక్ష్యంగా మేపినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణలో సాధారణంగా కనిపించే విషమొక్కలు
లంతెన (గండ్ల పూల చెట్టు)
ఈ మొక్క తెలంగాణ అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. దీని ఆకులు, పువ్వులు తిన్న గొర్రెలు, మేకల్లో: • ఆకలి తగ్గిపోవడం • నోరు పచ్చగా మారడం • కడుపు ఉబ్బడం • బలహీనత • క్రమంగా చనిపోవడం కనిపిస్తాయి.
తుమ్మ చెట్టు
తుమ్మ ఆకులు ఎక్కువగా తింటే: • నోటిలో గాయాలు • మేత తినకపోవడం • జీర్ణక్రియ లోపించడం వంటివి వస్తాయి
కందగడ్డి / అడవి కంద
ఇవి తిన్నప్పుడు: • వాంతులు • విరేచనాలు • నడవలేకపోవడం • అకస్మాత్తుగా పడిపోవడం కనిపిస్తాయి.
నల్ల ఉసిరి / అడవి ఉసిరి
ఇది తినడం వల్ల: • కాలేయానికి నష్టం • కళ్లు పసుపు రంగులో మారడం • మూత్రం ముదురు రంగులో రావడం వంటివి కనిపిస్తాయి.
అడవి పొగాకు
ఈ మొక్క తిన్న మేకల్లో: • నరాల బలహీనత • వణుకు • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది • చనిపోవడం కూడా జరుగుతుంది.
విషబాధకు కారణాలు
పచ్చిక కొరత వేసవిలో పచ్చిక దొరకకపోవడంతో జంతువులు దొరికిన మొక్కలన్నీ తింటాయి.
ఖనిజాల లోపం ఉప్పు, ఖనిజాల లోపం ఉన్నప్పుడు జంతువులు అసాధారణంగా ఇతర మొక్కలను తింటాయి.
అడవుల్లో నిర్లక్ష్య మేపకం అడవుల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా మేపితే విషమొక్కలు తినే ప్రమాదం ఎక్కువ.
పొలాల్లో రసాయనాల ప్రభావం మందులు పిచికారీ చేసిన తర్వాత మేపడం వల్ల విషబాధ వస్తుంది.
లక్షణాలు (గుర్తించే విధానం) విషమొక్కలు తిన్న గొర్రెలు, మేకల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి: • మేత తినకపోవడం • ఎక్కువగా నోరు నుంచి నురుగు రావడం • కడుపు నొప్పి, ఉబ్బరం • విరేచనాలు లేదా మలబద్ధకం • నడవలేక కూలిపోవడం • శ్వాస వేగంగా తీసుకోవడం • అకస్మాత్తుగా మరణం
లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. చికిత్స (ప్రాథమిక చర్యలు)
వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి
అనుమానాస్పద మొక్కలు తినకుండా జంతువులను వేరుచేయాలి
శుద్ధమైన నీరు ఇవ్వాలి
డాక్టర్ సూచన మేరకు: o యాంటీడోట్ మందులు o గ్లూకోజ్ డ్రిప్ o కాలేయ రక్షక మందులు ఇవ్వాలి
గమనిక: ఇంటి చిట్కాలు వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.
నివారణ చర్యలు (అత్యంత ముఖ్యమైనవి) • పశువులకు సరిపడా పచ్చిక, ఎండుగడ్డి అందించాలి • ఉప్పు, ఖనిజ మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి • పొలాల అంచుల్లో, అడవుల్లో విషమొక్కలను తొలగించాలి • మందులు పిచికారీ చేసిన పొలాల్లో మేపకూడదు • రైతులకు విషమొక్కలపై శిక్షణ ఇవ్వాలి
సారాంశం తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక మొక్కల వల్ల వచ్చే విషబాధలు రైతులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ సరైన అవగాహన, జాగ్రత్తలు, సమయానికి చికిత్స ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు ఆర్థికంగా ముందుకు సాగగలడు. అందుకే ప్రతి పశుపోషకుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
ఆవశ్యకత : ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.
మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.
నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-
తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
నీటిని ఆదా చేసుకోవచ్చు.
కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.
నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు రకాల ఎంపిక :- ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు : ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి. సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు : ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204 కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు : ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449, ఆర్.ఎన్.ఆర్ – 15048
నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్‌తో వేసుకోవడం మంచిది. వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.
విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్‌తో విత్తన శుద్ధిచేయాలి.
విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని 20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.
విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.
దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్‌సీడరు ద్వారా విత్తుకోవచ్చు.
మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :
వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.
జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.
కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.
నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.
ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.
విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది. సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 9 వరకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రైతువారోత్సవాలను వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన, రెండో రోజు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యం, మూడో రోజు సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజీలు, రుణ సదుపాయాలపై అవగాహన, నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌర శక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఐదో రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖలు.. పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపుపై, చివరి రోజు సాగునీటిశాఖ.. వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తాయని మంత్రి తుమ్మల తెలిపారు.
అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.