35 వేల మంది డ్వాక్రా మహిళలకు వెదురు సాగుతో జీవనోపాధి

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లోని చిన్న, సన్నకారు మహిళా రైతులకు జీవనోపాది కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురుసాగును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది 3వేల మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురుసాగు చేపట్టింది. ఈ ఏడాది దాన్ని మరో 35 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సాగుచేసిన జిల్లాలతోపాటు మరో 10 జిల్లాల్లో ఈ ఏడాది సాగును విస్తరించనున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో సాగును చేపట్టనున్నారు. నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నాలుగో ఏడాది రూ.30-50వేలు, ఆ తర్వాత రూ.70వేల నుంచి రూ. లక్ష వరకు ఇలా 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం రూ.50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుచేసింది.
వెదురు సాగు లాభదాయకంగా ఉండేందుకు త్రిపుర నుంచి కొత్త రకం వెదురు మొక్కలు తీసుకొస్తున్నారు. బాంబుసా బాంబుసా, బాంబుసా టుల్డా, బాంబుసా న్యూటన్స్ మొక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుని పెరిగేవిగా అధికారులు గుర్తించారు. ఒక్కో మొక్క ధర రూ.5-6 వరకు ఉండనుంది.

Read More

ప్రత్యామాయ పంటల సాగుకు ప్రభుత్వం అండ

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు రైతుల్ని మళ్లించేలా ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని, ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల పరిధిలో 15 లక్షల హెక్టార్లలో పంట మార్పిడికి ప్రణాళిక తయారు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వివరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘వరి లోనూ కొత్త రకం సాగును ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు కోరే రకాలకే రాయితీ వర్తింప చేయనున్నాం. 9.13 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సి కార్డులిచ్చి రూ. 4,474 కోట్లు రుణాలిచ్చాము. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. పంటల మార్పిడిలో భాగంగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులకు అండగా నిలిచేలా రూ.2,400 మద్దతు ధర ప్రకటించాం. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Read More