కేంద్రం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. కానీ రైతుకు న్యాయమైన ధర అందడం లేదు. పక్కనే వున్న మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌లో ధర ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పండే పసుపులో కుర్కుమిన్ శాతం తక్కువగా వుంది. దీనికి కారణం కుర్కుమిన్ శాతం ఎక్కువగా వుండే విత్తనం అందుబాటులో లేకపోవడం. కేరళ ఏరోడ్ అనే విత్తనంలో కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమిలో నుండి పసుపు తవ్వడం, ఉడకపెట్టడం, పాలిష్ చేయడంలో యంత్రపరికరాలు అవసరం. ఆధునిక యంత్రాలు అందించడంలో కేంద్రానిదే బాధ్యత ఉంటుంది కాబట్టి వచ్చే సీజన్‌కు ముందే కేంద్రం చొరవతీసుకోవాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకోసం పనిచేయాలని, కుర్కుమిన్ శాతం ఎక్కువగా వుండే విత్తనాన్ని అందించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌కు కూడా సూచించామని రైతు కమీషన్ ఛైర్మన్ కోదండరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్ పాల్గొన్నారు.
2010 తర్వాత మళ్ళీ 2023 నుండి పసుపు ధరలు పెరగటంతో పసుపుని పండించే రైతులు సంతోషిస్తున్నారు. 2010లో అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు ధరలు కిలోకు 2.07 డాలర్లుగా గరిష్ట స్థాయిని నమోదు చేసాయి. అప్పటి నుండి మళ్ళీ ఆ స్థాయి ధరలు లభిస్తాయనే ఆశతో రైతులు పసుపుని సాగు చేస్తున్నారు. క్వింటాలుకి 15 వేల రూపాయల ధర 2010లో దేశంలోని పసుపు రైతులకు లభించింది. ఆ తర్వాత క్వింటాలు ధర 6 వేల రూపాయలకు మించలేదు. కొందరు రైతులు, వ్యాపారులు పసుపు పంటను నిల్వ చేసి, నష్టపోయారు. 2022-23 నుండి పసుపు ధరలో కొంత కదలిక వచ్చింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పసుపు ఎగుమతులు 11 శాతం వృద్ధి చెందాయి. అనేక సంవత్సరాల పాటు పసుపు ధరలు నిరాశాజనకంగా ఉండటం వల్ల రైతులు పసుపు సాగుని తగ్గించారు. 2021-22లో 3.49 లక్షల హెక్టార్లలో పసుపు పంట సాగయింది. 13.34 లక్షల టన్నుల పసుపు ఆ సంవత్సరం ఉత్పత్తయినట్లు అంచనా. ఆ సంవత్సరం 1.53 లక్షల టన్నుల ఎగుమతి ద్వారా దేశం 1784 కోట్ల రూపాయలు ఆర్జించింది. అదే సంవత్సరం 0.24 లక్షల టన్నుల కొన్ని రకాల పసుపు దిగుమతయింది. అందుకు 246 కోట్ల రూపాయలు ఖర్చవగా, నికరంగా రూ. 1538 కోట్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి లభించింది. యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్, నేపాల్, ఒమన్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ కింగ్‌డమ్, మలేసియాలు ముఖ్యంగా భారత్ నుండి పసుపుని దిగుమతి చేసుకున్నాయి. గత రెండు థాబ్దాలుగా పసుపు విస్తీర్ణం పెరుగుతుండగా దిగుబడుల్లో తగ్గుదల కనిపిస్తున్నది. 2015-16లో దేశపు సగటు ఉత్పత్తి హెక్టారుకి 5100 కిలోలుండగా 2021-22లో అది 3818 కిలోలకు తగ్గింది. 2021-22లో క్వింటాలు సగటు ఉత్పత్తి వ్యయం రూ. 8373 కాగా ధర మాత్రం రూ. 6100 గానే ఉంది. నష్టాలను భరించలేక గత రెండేళ్ళలో రైతులు వేరే పంటలకు మళ్ళారు. 2022-23లో పంట విస్తీర్ణం 12 శాతం తగ్గినట్లు అంచనా వేశారు. విస్తీర్ణం తగ్గటం, ఎగుమతి గిరాకీ పెరగటం వల్ల 2023లో పసుపు ధరలు 70 శాతం పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు 1.58 డాలర్లు పలుకుతున్నది. దేశీయ మార్కెట్‌లో క్వింటాలు ధర 15 వేల రూపాయలు దాటింది. ఇంకా పెరగవచ్చనే ఆశాభావంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో క్వింటాలు ధర 16 వేల రూపాయల్ని దాటింది. నాణ్యతను బట్టి రైతులకు క్వింటాలు ధర 16 వేల రూపాయల్ని దాటింది. నాణ్యతను బట్టి రైతులకు క్వింటాలుకి 12 వేల నుండి 16 వేల రూపాయలు లభిస్తున్నాయి. అనేక సంవత్సరాల చేదు అనుభవం తర్వాత ఈ సంవత్సరం పసుపు రైతులు ఎంతో కొంత లాభాలను పొందుతున్నారు. గత రెండేళ్ళుగా నిల్వ పెట్టిన రైతులు, వ్యాపారులు లాభానికి అమ్ముకోగలుగుతున్నారు. రాబోయే సంవత్సరంలో పసుపు సాగు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిరాశలో మిర్చి రైతులు
2022-23లో మిర్చి పంటకు గరిష్ట స్థాయిలో ధరలు పలికాయి. ఒక రైతుకి క్వింటాలుకి 81 వేల రూపాయల ధర లభించినట్లు వార్తలొచ్చాయి. బ్యాడిగి రకానికి క్వింటాలుకి 50 వేల రూపాయలు, తేజ రకానికి 35 వేల రూపాయలు, ఇతర రకాలకు 25 వేల రూపాయలకు పైగా ధరలు లభించాయి. 2023-24 సీజనులో రైతులు మిర్చి పంట విస్తీర్ణాన్ని పెంచారు. ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలతో ధరలు సగానికి సగం తగ్గాయి. క్వింటాలుకి రూ. 10 వేల నుండి రూ. 15 వేల మధ్య ధరలు లభిస్తుండటంతో రైతులు నష్టపోతున్నామని వాపోతున్నారు. వాణిజ్య పంటల్లో ధరలు ఆటుపోట్లకు గురికావటం, సర్వసాధారణమై పోయింది. గత సంవత్సరం పత్తి, మిర్చి ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రెండింటి ధరలు తగ్గాయి.
ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారత దేశానికి 40 నుండి 45 శాతం వాటా ఉంటున్నది. దేశంలో తెలుగు రాష్ట్రాలు ముఖ్య ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎక్కువవుతుందనే అంచనాలు రావడం వల్ల దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ధరలు పతనమయ్యాయి. 2023 డిసెంబరులో క్వింటాలు మిర్చి ధర 315 డాలర్లుండగా 2024 మార్చికి 230 డాలర్లకు తగ్గింది. భారత దేశం నుండి ఎండుమిర్చిని దిగుమతి చేసుకునే దేశాల్లో థాయ్‌లాండ్, మలేసియా, శ్రీలంకలు ముఖ్యమైనవి. పచ్చిమిర్చి ఎక్కువగా యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు ఎగుమతి అవుతున్నాయి. థాయ్‌లాండ్‌లో కూడా ఎండుమిర్చిని బాగానే పండిస్తున్నారు. ప్రపంచ ఎండుమిర్చి ఉత్పత్తిలో ఆదేశానికి ఏడుశాతం వాటా ఉన్నది. ఈ సంవత్సరం ఆదేశంలో ఎండుమిర్చి ఉత్పత్తి ఆశాజనకంగా ఉండటం వల్ల అక్కడకు జరిగే ఎగుమతులు తగ్గవచ్చనే అనుమానంతో ఎగుమతిదార్లు కొనుగోళ్ళు తగ్గించారు. బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, బెనిన్, ఐవరేకోస్ట్, మయన్మార్ వంటి దేశాల్లో ఎండుమిర్చి ఉత్పత్తి పెరిగే అంచనాలుండటం వల్ల ఆదేశాలు కూడా ఎగుమతి మార్కెట్‌లో భారత ఎండుమిర్చితో పోటీపడే అవకాశం ఉంది. గుంటూరు మార్కెట్‌కు రోజుకి లక్ష టిక్కీలు (35 కిలోలవి) రావటం వల్ల మార్కెట్ ధరలు తగ్గుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చాలామంది రైతులు పంట కల్లాల నుండి మార్కెట్‌కు తరలించడం వల్ల సరఫరాపై నియంత్రణ ఉండటం లేదు. రైతులకు కొద్ది నెలల పాటు తాత్కాలికంగా నిల్వ చేసే సదుపాయాలు కూడా లేకపోవటం వల్ల ఇలా జరుగుతున్నది. వ్యాపారుల మధ్య ఐక్యత వల్ల రైతులకు ధరల్ని తగ్గిస్తున్నారని మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. మొదటి రకం మిర్చికే ధరలు సరిగా రాక పోవటం వల్ల, నాశిరకం మిర్చి ధరలు పదివేల రూపాయలకన్నా తక్కువ పలుకుతున్నాయి.
వాణిజ్య పంటల ధరల్లో సాలెగూడు సామ్యం
మార్కెట్ వ్యవస్థలో ఏ వస్తువు, ఏ సేవలకైనా చెల్లించాల్సిన ధరలు సాలెగూడులా కనిపిస్తాయి. గిరాకీని మించిన సరఫరా ఉన్నప్పుడు మార్కెట్ ధరలు తగ్గటం, కొరత ఏర్పడటం వల్ల మరుసటి సంవత్సరం ధరలు పెరగటం, మళ్ళీ సరఫరా పెరగటంతో ఆ తర్వాతి సంవత్సరం ధరలు తగ్గటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల ధరల్ని, సరఫరా, గిరాకీలను పరిశీలిస్తే అవి ఒక సాలె గూడులా కనిపిస్తాయి. ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువుల విషయంలో సరఫరా, గిరాకీల మధ్య ఉన్న వ్యత్యాసాలను తక్కువ సమయంలో సరిచేయవచ్చు. కాని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సరఫరాను పెంచాలంటే కొన్ని ఉత్పత్తుల విషయంలో నాలుగైదు నెలలు, మరికొన్ని ఉత్పత్తుల విషయంలో పది, పన్నెండు నెలల సమయం అవసరమౌతుంది. అందువల్లనే వ్యవసాయ ఉత్పత్తుల ధరల సరళి సాలెగూడుల్ని తలపిస్తాయి. ఒక వ్యవసాయ ఉత్పత్తిని పూర్తిగా దేశీయంగా వినియోగిస్తే సాలెగూడులు చిన్నవిగా కనిపిస్తాయి. గింజధాన్యాలు, పప్పుధాన్యాల విషయంలో ఈ సరళి కనిపిస్తుంది. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఎగుమతులు, దిగుమతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దేశీయ మార్కెట్ ధరలపై అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటి ధరల సరళిని గమనిస్తే పెద్ద సాలెగూడులా కనిపిస్తాయి. పత్తి, మిర్చి, పసుపు, వంటనూనెలు, సుగంధద్రవ్యాల విషయంలో ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, వాటి ధరల సరళిలో సాలెగూడు ఆకారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, అందులో ఎగుమతి, దిగుమతి ప్రభావం ఎక్కువ వున్న ఉత్పత్తుల విషయంలో ధరల్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటి ధరల సరళిలో సాలెగూడు ఆకారాన్ని స్పష్టంగా గమనించవచ్చు
వాణిజ్య పంటలపై రైతులకు మోజు ఉండటానికి కారణం లాభాపేక్షయే. ఒక పది శాతం రైతులకు మంచి దిగుబడులు వచ్చిన సీజనులో ధరలు అధికంగా లభిస్తాయి. ఒక నలభై శాతం రైతులకు అధిక దిగుబడులు వచ్చిన సీజనులో తక్కువ ధరలు లభిస్తాయి. మరో నలభై శాతం రైతులకు తక్కువ దిగుబడులు లభించిన సమయంలో ఎక్కువ ధరలు లభిస్తాయి. మిగిలిన 10 శాతం రైతులకు తక్కువ దిగుబడులు వచ్చిన సంవత్సరాల్లో తక్కువ ధరలు లభిస్తాయి. మొదటి పదిశాతం మంది లాభాలార్జిస్తే చివరి పది శాతం రైతులు నష్టాలపాలై, అప్పుల్లో కూరుకుపోతారు. 80 శాతం మంది రైతులు రెండు, మూడు రకాల్లో ఉండి, మధ్యస్తంగా ఉండి, కొద్ది లాభాల్లో గానీ, కొద్ది నష్టాల్లో గానీ ఉండిపోతారు. ఐదేళ్ళ పాటు ఒకే పంటను సాగు చేసిన రైతులు ఒక సంవత్సరంలో మంచి లాభాలు, ఒక సంవత్సరంలో భారీ నష్టాలు, మూడు సంవత్సరాల్లో ఖర్చులు మాత్రమే రాబట్టుకునే పరిస్థితి ఉంటుంది. రెండు మూడు వాణిజ్య పంటలను మార్చి మార్చి సాగు చేసే రైతులు రాబోయే సీజన్‌లో మార్కెట్‌ను అంచనా వేయగల శక్తిని బట్టి లాభనష్టాలు ఉంటాయి.
గొర్రెదాటు వైఖరి
ఒక సంవత్సరం ఏయే వాణిజ్య పంటలకు మంచి ధరలు లభిస్తాయో తర్వాత సంవత్సరం చాలామంది రైతులు ఆ పంట సాగుని చేపట్టటం జరుగుతున్నది. విస్తీర్ణం పెరుగుతున్నట్లు అంచనా రాగానే మార్కెట్ ధరలను వ్యాపారులు తగ్గించేస్తారు. వాతావరణ పరిస్థితులు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ధరల్ని ఉత్పత్తి అంచనాలు, ఎగుమతి దిగుమతి అవకాశాలు నిర్దేశిస్తాయి. వాతావరణాన్ని, ధరల్ని సరిగా అంచనా వేయలేని రైతులు ప్రస్తుత ధరలను బట్టి రాబోయే పంట కాలంలో వేయాల్సిన పంటలను ఎంచుకుంటారు. ఎక్కువమంది రైతులు ప్రస్తుతం ధరలు బాగున్న పంటలను సాగు చేయటానికి ఇష్టపడుతున్నారు. దానితో ఉత్పత్తి పెరగటం వల్ల తర్వాతి పంట కాలంలో ధరలు తగ్గటం సాధారణంగా జరుగుతుంది. తరచుగా వాణిజ్య పంటల రైతులు నష్టపోతున్నందువల్ల వాటికి కూడా కనీస మద్దతు ధరల్ని ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీలో మహాపంచాయత్ నిర్వహించిన రైతు సంఘాలు అన్ని పంటలకు కనీస మద్దతు ధరల్ని నిర్ణయించాలని కోరారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తున్న 21 పంటలకు చట్టబద్ధ గారెంటీలను కోరారు. రైతు సంఘాల కోర్కెలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం లేదు. రైతు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయటానికి ప్రయత్నించింది. రైతులు పంటలను మార్కెట్‌కు తెచ్చే సమయంలో వ్యాపారులు కుమ్మక్కై ధరల్ని తగ్గిస్తున్నందుకు కొంతమేరకు మార్కెట్‌లో ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్ళు చేయటానికి నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని రైతు నాయకులు నొక్కి చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై కూడా క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు.
భవిష్యత్‌లో ధరలు
ప్రస్తుతం పసుపు ధరలు పదమూడేళ్ళ తర్వాత గరిష్ట స్థాయికి చేరితే, మిర్చి ధరలు గత సంవత్సరపు ధరలతో పోలిస్తే సగానికి పడిపోయాయి. పత్తి ధరలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. పత్తి, వరి, మొక్కజొన్నల ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి ఇంచుమించుగా ఉన్నాయి. బియ్యం ఎగుమతులపై విధించిన ఆంక్షల వల్ల వరి ధాన్యం ధరలకు కళ్ళెం పడింది. కాని సన్నరకం వడ్ల ధరలు కొంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మొక్కజొన్న ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల ధరలు కనీస మద్దతు ధరకు పైనే కదలాడుతున్నాయి. సరఫరా కన్నా గిరాకీ ఎక్కువగా ఉండటం వల్ల పసుపు ధరలు మరికొంత పెరగవచ్చనే అంచనాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. మిర్చి ధరల పతనం కూడా తాత్కాలికమే అని విశ్లేషకులు అంటున్నారు.2021-22లో భారతదేశంలో మిర్చిని 6.94 లక్షల హెక్టార్లలో సాగు చేసారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంవత్సరం ఉత్పత్తిని 15.78 లక్షల టన్నులుగా అంచనా వేశారు. సగటు దిగుబడి హెక్టారుకి 2689 కిలోలుగా లెక్క కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు లక్షల టన్నులు, తెలంగాణలో 4.33 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్‌లో 3.03 లక్షల టన్నులు, కర్నాటకలో 1.85 లక్షల టన్నులు, ఒడిస్సాలో 0.69 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంవత్సరం 5.57 లక్షల టన్నుల మిర్చి ఎగుమతుల ద్వారా రూ. 8581 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం ఆర్జించింది. 2022-23లో మిర్చి ఎగుమతులు 5.8 లక్షల టన్నులకు పెరిగాయి. 2023-24లో కూడా ఎగుమతి ఐదు లక్షల టన్నుల స్థాయి కన్నా తగ్గకపోవచ్చు. 2023 నవంబరులో కురిసిన అధిక వర్షాల వల్ల మధ్యప్రదేశ్‌లో మిర్చి పంట బాగా దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కూడా వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మిర్చి పంట నష్టపోయింది. ఐనా కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు బాగా ఉన్నందువల్ల, సరకు మార్కెట్లకు చేరటం వల్ల వ్యాపారులు ధరల్ని తగ్గించారు. రైతుల్ని కొన్నాళ్ళు సరుకుని నిలవపెట్టి, ఆలస్యంగా మార్కెట్‌కు తీసుకురమ్మని అధికారులు సలహా ఇస్తున్నారు. కాని అప్పుల్ని తీర్చాల్సిన అవసరం, నిలవపెట్టే సౌకర్యాలు, సామర్థ్యం లేకపోవటంతో రైతులు సరుకుని మార్కెట్‌కు తెస్తున్నారు. ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా లేకపోవటంతో వ్యాపారులు ఉత్సాహంగా కొనుగోళ్ళు చేయటం లేదు.
వాస్తవంగా మిర్చి, పత్తి పంటల విషయంలో సరఫరా పెరగలేదు. ఐతే వివిధ దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా కొనుగోళ్ళు, దిగుమతి ఆర్డర్లు మందగించాయి. బట్టలకు, నూలుకి ఆర్డర్లు తగ్గినందువల్ల స్పిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశాయి. నిల్వలను వాడుతూ తాజా కొనుగోళ్ళను తగ్గించటం వల్ల మార్కెట్ నిస్తేజంగా ఉంది. మిర్చి విషయంలోనూ కొనుగోళ్ళు మందగించడం వల్ల ధరలు తగ్గుతున్నాయి. ఎగుమతుల మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి వల్ల వ్యాపారులు కొని, నిలవ పెట్టటానికి కూడా జంకుతున్నారు. కొద్దిమంది రైతులు ధైర్యం చేసి, శీతల గిడ్డంగులలో నిల్వ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 30 శాతం ఎగుమతి జరిగే మిర్చి పంట విషయంలో ఎగుమతులు మందగించటం వల్ల నైరాశ్యం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ సంస్థల ద్వారా కొనుగోళ్ళు జరిపి, మార్కెట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. రైతులు, కౌలుదార్లు తక్కువ ధరలకు అమ్మి నష్టపోవలసి వస్తున్నది. పత్తి, మిర్చి వంటి పంటల్లో కూలీల వినియోగం ఎక్కువ. కూలి రేట్లు ఏటేటా పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమౌతున్నది. ఒక క్వింటాలు మిర్చి ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయలు దాటుతున్నది. ప్రస్తుతం లభిస్తున్న ధరల వల్ల సగంమంది రైతులు నష్టాల పాలవుతున్నారు. పసుపు ధరలు పెరుగుతున్నందువల్ల రాబోయే సంవత్సరం (2024-25)లో ఆ పంట విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉంది. కాని పత్తి, మిర్చిని పండించే రైతులు ఆ రెండు పంటలను మార్చి, మార్చి వేస్తుంటారు. ఈ రెండు పంటలకు ధరలు తగ్గటం వల్ల వాటి బదులు ఏ పంటలు వేయాలో తెలియని స్థితిలో మెట్ట ప్రాంత రైతులుంటారు. గత పదేళ్ళుగా పసుపు రైతులెదుర్కున్న పరిస్థితుల్ని ఈ సంవత్సరం మిర్చి, పత్తిని సాగు చేసే రైతులు, కౌలుదార్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణ అనిశ్చితికి తోడు మార్కెట్ మాంద్యం కూడా ఎదురైతే రైతులు గట్టెక్కడం కష్టమే.
వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. విత్తనం నాటడం నుండి పంట కోత వరకు అన్ని వ్యవసాయ కార్యకలాపాలలో మహిళల పాత్ర విడదీయలేనిది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కుటుంబ వ్యవసాయంలో మహిళలు లేకుండా పంట పండించడం అసాధ్యమని చెప్పవచ్చు. మన దేశంలో సుమారు 78 శాతం మహిళలు వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 70 శాతం వ్యవసాయ పనులలో మహిళలు ముందుండి పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 50% మహిళలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వివిధ ఆహార ఉత్పత్తులలో 60% మహిళలు ఉత్పత్తి చేస్తున్నవే. అనాదిగా మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నప్పటికీ మహిళా సాధికారత ముఖ్యంగా ఆర్థిక సాధికారత అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ముఖ్యంగా మహిళల్లో ఆర్థిక సాధికారత, ఆరోగ్యం, పోషకాహార భద్రత, వ్యవసాయంలో బరువు పనులు, ముఖ్యంగా చాకిరి తగ్గించడం వంటి అంశాలపైనా ఈ రోజు ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను వివిధ కార్యక్రమాలలో భాగస్వామ్యులు చేయడంతోపాటు, మహిళా సంఘాల ద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.
ఆహారం, సౌందర్య సాధనాలు మరియు ఔషధ పరిశ్రమలకు పసుపు అత్యంత విలువైన మరియు ముఖ్యమైన ముడిసరుకు. భారతదేశంలో సుమారు 0.29 మిలియన్ హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు. తద్వారా ఏటా 1.1 మిలియన్ టన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రపంచంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో సుమారు 70 శాతం. తెలంగాణ రాష్ట్రంలో 0.3 మిలియన్ టన్నుల పసుపును సుమారు 49,000 హెక్టార్లల లో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. తెలంగాణ వాటా దేశ పసుపు ఉత్పత్తిలో సుమారు 29.5%. పూర్వపు నాలుగు జిల్లాలు కరీంనగర్ (29%), ఆదిలాబాద్ (23%), వరంగల్ (22%), నిజామాబాద్ (18%) రాష్ట్రంలోని పసుపు ఉత్పత్తిలో 92% వాటాను కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా మరియు వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాల సబ్సిడీల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పసుపుతో పాటు ఇతర వ్యవసాయోత్పత్తుల పెరుగుదలకు ఎంతో దోహదం చేశాయి. ఇక్కడ మనం ఒక సామెతను గుర్తు చేసుకోవాలి ”ధాన్యం ప్రాసెసింగ్, ధాన్యం ఉత్పత్తికి సమానం”. కావున పండించిన పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి, విలువ జోడించి నాణ్యమైన ఆహార పదార్థాలు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. తద్వారా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను తగ్గించి, ఇటు ఉత్పత్తిదారుడుకి మరియు వినియోగదారుడికి లాభంచేకూర్చేవిధంగా మహిళల ద్వారా పసుపుకు విలువ జోడించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల కూరలలో మరియు వివిధ రకాల ఆహార పదార్థాలలో పసుపు పొడి విరివిగా వినియోగిస్తున్నాం. మనం మార్కెట్లో చూసే చాలా రకాల ఆహార పదార్థాలలో పసుపు పొడి తో పాటు వాటి నుండి తీసిన ఓలియోరెసిన్, నూనె మరియు కర్క్యుమిన్ రంగు పదార్థాలను వివిధ రకాల మసాలాలు, ఊరగాయలు, సాస్ మరియు గ్రేవీస్, పొడి చేర్పులు, బేకింగ్ మిశ్రమాలు, టేస్ట్ మేకర్స్, మాంసాహార ఉత్పత్తులలో, బేకరీ, స్నాక్స్, చాక్లెట్, పానీయాల, సౌందర్య సాధనాలు, రోగనిరోధక ఏజెంట్, ఫార్మాస్యూటికల్స్ అప్లికేషన్స్, సబ్బులు, జీవ పురుగుమందు మరియు టూత్ పేస్ట్ తయారీలో భాగంగా పరిశ్రమల ముడిసరుకుగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు.
నిర్మాణం: మహిళలు వారి యొక్క గ్రామాలలో అందుబాటులో ఉన్న చిన్న పాటి 150 నుండి 250 చదరపు మీటర్ల షెడ్ లేక గోడౌన్ వంటి నిర్మాణంలో గాని లేదా పాత ఇల్లు, బిల్డింగ్ వంటి నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చేసి పసుపు పొడి యంత్రాలను వాటి సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసుకుని శుభ్రమైన పరిసరాలలో పసుపు కొమ్ములను పసుపు పొడిగా మార్చి మంచి అందమైన, సౌలభ్యంగా ఉండే ప్లాస్టిక్ కవర్, డబ్బాలు లేదా సీసాలలో నింపి మార్కెటింగ్ చేసినట్లయితే మంచి లాభం ఉంటుంది.
యంత్రాలు: నెలకు 15 టన్నుల పసుపు పొడి తయారు చేయడానికి ఈ క్రింది యంత్రాలు అవసరం. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు వాటి సామర్థ్యము, నిర్మాణం మొదలైన అంశాలపై నా ఆధారపడి వాటి ధరలు ఉంటాయి.
మనదేశంలో పసుపు కొమ్ములు లేదా పసుపు పొడి వ్యాపారం ప్రారంభించాలంటే కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) నుండి లైసెన్సు తీసుకోవాలి. అంతేకాకుండా సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలి.
Turmeric powder
కేంద్ర ఆహార భద్రత ప్రామాణిక సంస్థ (FSSAI) ప్రకారం మిరపకాయలు మరియు పసుపు పొడిలో ఈ క్రింద ప్రమాణాలు ఉండాలి.
పసుపు పంటలకు విలువ జోడించడం వలన కలిగే లాభ నష్టాల పైన వ్యాపార (SWOT) విశ్లేషణ
బలాలు:
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పసుపు యొక్క ప్రధాన ఉత్పత్తిదారు.
వివిధ జిల్లాలలో సారవంతమైన నేలలు ఉండడం
విస్తృత అనుకూలత/ఆమోదయోగ్యత/ దేశీయ ఞ ఎగుమతి మార్కెట్‌లు రెండింటికీ అనువైన మరియు అవసరమైన పసుపు రకాలను మన రాష్ట్రంలో సాగు చేస్తున్నాము.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో రైతులు మరియు వారి కుటుంబ సభ్యులకు పసుపు ప్రాథమిక ప్రాసెసింగ్ థలో చేపట్టవలసిన పసుపు తవ్వడం, శుభ్రపరచడం, రైజోమ్‌లను వేరు చేయడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం వంటి వాటిపైన విశేష అనుభవం ఉన్నది.
హైదరాబాద్ మరియు దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార, ఫార్మాస్యూటికల్, న్యూట్రాస్యూటికల్, ఆయుర్వేద, కాస్మోటిక్ వంటి తయారుచేసే కంపెనీలు ఎక్కువ మోతాదులో వస్తున్నాయి కాబట్టి వాటికి పసుపు ఒక ముఖ్యమైన ముడిసరుకు.
అన్ని రకాల రవాణా వ్యవస్థలు దేశం నలుమూలల నుండి మన రాష్ట్రానికి అభివృద్ధి చెంది ఉండటం వలన పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులను సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు
వేగవంతమైన పట్టణీకరణ మరియు పెరుగుతున్న టైర్-|| & టైర్ -3 నగరాలు
గ్రామీణ ప్రాంతాలలో కూడా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు పెరుగుతున్న అనుకూల వాతావరణం, ఆహారశుద్ధి పాలసీలు
వివిధ ప్రాంతాల ప్రజల రుచికి తగినటువంటి ఆహార పదార్థాలు, ఇతర స్నాక్స్, తిను బండారాలు మొదలైనవి తయారు చేసే ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉండడం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గ్రామీణ యువతీ యువకులు అధికంగా ఉండడం
ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు పంట కోత అనంతరం నష్టాలను తగ్గిస్తుంది. అన్ని కాలాలకు అనుగుణంగా పండే వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత పదార్థాలుగా మార్చడం ద్వారా అన్ని సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు.
బలహీనతలు
వర్షాధార పరిస్థితులు, పంట వైవిధ్యం లేకపోవడం
మెరుగైన ఫుడ్ ప్రాసెసింగ్ మిల్లుల నిర్వహణ పద్ధతులను అవలంబించలేదు తద్వారా ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలలో నాణ్యత లోపించడం, ఎక్కువ కాలం నిలువ చేయలేకపోవడం
వివిధ జిల్లాలలో పండించే పసుపు పంటకు అనువైనటువంటి ఆహార శుద్ధి పరిశ్రమలు లేకపోవడం.
ఎక్కువ మొత్తంలో ఆహారశుద్ధి పరిశ్రమలు పట్టణ ప్రాంతాలలో నెలకొల్పడం
మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో పంట చేతికి వచ్చినప్పుడు ధరల ఆటుపోట్లకు లోనవ్వడం
ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని సందర్భాల్లో పంట కోత సరైన నిల్వ చేసే గోడౌన్లు లేకపోవడం అనంతరం తీవ్ర నష్టం జరగడం
అవకాశాలు
జీవ సంబంధ కారకాలు, వాతావరణ (తేమ, అధిక లేదా చల్లని ఉష్ణోగ్రత) మార్పులను తట్టుకొనే వంగడాలను తయారు చేయడం
పండించిన మొత్తం పసుపు కొమ్ములు ఎక్కువ కాలం నిల్వ చేయడం, వివిధ రుచులతో కూడిన నాణ్యమైన ఆహారపదార్థాలను ప్రజలకు అందించడం కోసం సరికొత్త టెక్నాలజీ వృద్ధి చెందే అవకాశం
తక్కువ కాలవ్యవధి కలిగిన వంగడాల అభివృద్ధి
గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి మరియు విత్తనం నుండి తయారు చేసిన ఆహార పదార్థాలు వినియోగదారుడి వంటశాలకు చేరే వరకు విలువ గొలుసు (VALUE CHAIN)ను అభివృద్ధి పరచడం
భవిష్యత్తులో భౌగోళిక ప్రయోజనాలు, రవాణా సౌకర్యాల మూలంగా తెలంగాణలో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలకు మరింత గిరాకీ ఉండే అవకాశం ఉంది.
తలసరి ఆదాయం పెరగడంతో వినియోగదారుడు నాణ్యమైన ఆహారం కోసం వెతకటం
ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలకు మరింత విలువ ఉండడం
తగినంత ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే రిటైల్ ధరల ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ ఉంటుంది
అపాయాలు
వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా సరైన సమయంలో తగినంత వర్షపాతం లేకపోవడం మరియు అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురవడం.
తక్కువ ఉత్పాదకత
ఈ ప్రాంతంలో కొత్త తెగుళ్లు మరియు వ్యాధులు
చిన్న మరియు మధ్య తరహా యూనిట్లలో నాణ్యత లోపించడం, ఎక్కువ కాలం నిలువ చేయలేకపోవడం
కల్తీ మరియు నాణ్యత లోపించడం
బహుళజాతి కంపెనీలు మరియు రిటైల్ సంస్థల నుండి తీవ్ర పోటీ ఉండడం.
మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మరియు సూక్ష్మతరహా ఆహారశుద్ధి పరిశ్రమలు మరియు మహిళలు నడుపుతున్నటువంటి అసంఘటిత కుటీర పరిశ్రమలను అధికారికంగా నమోదు చేసి వాటి ఆధునీకరణకు కావలసిన శాస్త్రీయ సాంకేతిక మద్దతుతో పాటు, వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అధికారికీకరణ, ఒక జిల్లా ఒక రకమైన ఆహార ఉత్పత్తి కేంద్రం వంటి విధానాలతో స్థానిక పంటలకు విలువ జోడించుట, రైతులకు గిట్టుబాటు ధర అందించడం, ఆయా ప్రాంత ప్రజలకు కావలసిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం, గ్రామీణ మహిళలు, స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా బృందాల ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి ముఖ్య ఉద్దేశాలతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన పథకాలను రాష్ట్రంలోని మహిళా రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు డ్వాక్రా బృందాలు ఉపయోగించుకుని రేపటి మహిళా సాధికారత కొరకు అడుగులు వేయవచ్చు.
కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PM-FME) స్కీం మరియు ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP) పథకాల ద్వారా నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలలో ఉన్నటువంటి సూక్ష్మ మరియు చిన్న తరహా ఆహారశుద్ధి మిల్లులు ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుండి లేదా అంతకంటే ఎక్కువ కాలం నుండి నడుస్తున్నటువంటి పసుపు పొడి మిల్లులు, కారం పొడి, మరియు మసాలా దినుసుల మిల్లులు మొదలైనటువంటి యూనిట్ యజమానులు PM-FME పథకం కింద అప్లికేషన్ పెట్టుకుంటే వారి యూనిట్ సాంకేతిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి కోసం సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. పెట్టుబడి కోటి రూపాయల వరకు ఉన్నా ప్రభుత్వం నుండి 10 లక్షల సబ్సిడీ సాయం అందుతుంది. 10 లక్షల లోపు ఉంటే 3.5 లక్షల సబ్సిడీ సాయం లభిస్తుంది. పైన పేర్కొన్న నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎక్కువగా పండిస్తున్నారు కావున ఈ జిల్లాలో కొత్త కుటీర పరిశ్రమలు మహిళలు ఒక బృందంగా ఏర్పడి పసుపుకు విలువ జోడిస్తే బాగా లాభం ఉంటుంది. ఈ కొత్త పరిశ్రమ ఏర్పాటుకు సుమారు 10 లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే 3.5 లక్షల సబ్సిడీ సాయం లభిస్తుంది. తద్వారా నెలకు 15 టన్నుల పసుపు పొడి తయారు చేసి అమ్మవచ్చు. దేశవ్యాప్తంగా మహిళలు మరియు మహిళా సంఘాలు నడుపుతున్నటువంటి సుమారు 31,195 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సుమారు 174.88 కోట్ల వ్యయంతో వివిధ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పారు. తద్వారా 17026 స్వయం సహాయక మహిళా బృందాలు లబ్ది పొందుతున్నారు. కావున మన రాష్ట్రంలో కూడా మహిళలు, డాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలు ముందుకు వచ్చి పసుపు పొడి మరియు ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలను PM-FME పథకం కింద నెలకొల్పి ఆదాయంతోపాటు మహిళా సాధికారత దిశగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎ. పోశాద్రి, యం. సునీల్ కుమార్, జి. శివ చరణ్, డి. మోహన్ దాస్, కె. రాజశేఖర్, వై. ప్రవీణ్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్. ఫోన్: 9492828965