ఔషధ మొక్క… రేల చెట్టు
రేలచెట్టు ఒక మధ్యమ పరిమాణం గల చెట్టు. ఇది వేగంగా పెరిగే 10-20 మీ. ఎత్తు పెరగే చెట్టు. ఆకులు 15-60 సెం.మీ. పొడవుంటాయి. ప్రతి పెద్ద ఆకులో 3-8 జతల చిన్న ఆకులుంటాయి. ప్రతి చిన్న ఆకు 7-21 సెం.మీ. పొడవు, 4-9 సెం.మీ. వెడల్పు వుంటుంది. పూలు 20-40 సెం.మీ. రెసిమ్‌లో ఏర్పడతాయి. ప్రతి పూవు 4-7 సెం.మీ. వ్యాసము ఉండి 5 పసుపు రంగు ఆకర్షక పత్రాలుంటాయి. కాయ 30-60 సెం.మీ. పొడవు, 1.5-3.5 సెం.మీ. వెడల్పు వుంటుంది. కాయలో గింజలుంటాయి. చెట్టు కొయ్య బలంగా వుండి, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది.
సాధారణ నామం : గోల్డెన్ షవర్ శాస్త్రీయ నామం : క్యాసియా ఫిస్ట్యులా కుటుంబం: సీసాల్పినియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో సెన్నోసైడ్స్, రీన్ గ్లూకోసైడ్స్, బార్సలాయిన్, ఎలోయిన్, ఫార్మిక్ ఆమ్లం, టానిన్లు, ఆక్సిఆంధ్రాక్వినోన్లు ఉంటాయి.
- మొక్క భాగాలన్నీ ముఖ్యంగా పండులోని గుజ్ౙు మలబద్ధకాన్ని పోగొట్టి మూలవ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.
వేర్లు చర్మవ్యాధులు, సిఫిలిస్ చికిత్సకు ఉపయోగపడతాయి.
వ్యవసాయరంగంలో
- రేల చెట్టు నీటి ద్రావణం (0.25%) రైజోపెర్తా డామినికపై బలమైన యాంటిఫీడెంట్ ప్రభావాన్ని చూపింది (రాజారామ్ శైలజ్, ఆమె అనుచరులు, 2013).
- రేల చెట్టు ఆకు ద్రావణం సైటోఫిలస్ ఒరైజెపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
- క్యాసియాటోరా ఇథైల్ ఎసిటేట్ ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 65% కన్నా ఎక్కువ యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రాజి, ఆమె అనుచరులు, 2016).
- రేల చెట్టు ఇథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై అధిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (చౌహాన్, అతని అనుచరులు, 2011).
- రేల చెట్టు ద్రావణం పీచ్ పండుఈగ, బాక్ట్రోసిరా జోనేట గణనీయమైన గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది. దీనిని పీచ్ పండుఈగ యాజమాన్యంలో ఉపయోగించవచ్చు. (ఇలియాస్, అతని అనుచరులు, 2017).
- రేల చెట్టు ద్రావణం రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజె చావు, పెద్ద పురుగుల విడుదలను తగ్గించడంపై అధిక ప్రభావాన్ని చూపింది (డెర్బలా, అతని అనుచరులు, 2012).
- వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వధాన్యంలో ఆశించే పురుగులను నివారించే లక్షణాలు గల 200 మొక్కలను గుర్తించారు. అందులో రేల చెట్టు కూడా ఒకటి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.










