మీనామృతం తయారుచేసి వడపోసేటప్పటికి అందులోని చేప ముక్కలు పూర్తిగా కరగకుండా కొంతమేరకు మిగిలే ఉంటాయి. అటువంటి చేప ముక్కలను పారేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. వీటిలోని ఉపయుక్త సూక్ష్మజీవులు (ఇండిజినెస్ మైక్రో ఆర్గానిజమ్స్ – ఐ.ఎం.ఓ.లు) లేదా మత్స్య సంజీవని నేలను సారవంతం చేస్తుంది. వేరు వ్యవస్థకు రక్షణగా ఉండి వేరుకుళ్లు, ఎండు తెగుళ్లు వంటి వాటి నుంచి వేర్లను కాపాడుతుంది. వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుంది. వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
మత్స్య సంజీవని తయారీకి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు (మీనామృతం తయారీలో మిగిలిన వాటితో పాటు తాజా చేప ముక్కలను కూడా వాడవచ్చు) – కిలో, నల్లబెల్లం – 500 గ్రాములు, దేశీ ఆవు నెయ్యి / వెన్న – 50 గ్రాములు, తాటికల్లు – 1 లీటరు, తేనె – 50 గ్రాములు, కాచి చల్లార్చిన నీరు – 5 లీటర్లు
మత్స్య సంజీవనిని తయారుచేసే పద్ధతి: ఒక మట్టి పాత్రలో 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి లేదా వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అందులో కిలో చేప ముక్కలను, అర కిలో బెల్లం ముక్కలను వేసి బాగా ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అడుగంటి మాడిపోకుండా తగినంత తాటికల్లు కలుపుతూ ఉండాలి. మరొక పాత్రలో 5 లీటర్ల మంచినీటిని మరిగించి చల్లారనివ్వాలి. ఒక మట్టికుండను తీసుకొని, అందులో కాచి చల్లార్చిన నీటిని, ఉడకబెట్టి చల్లార్చిన చేపముక్కలను వేయాలి. అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల తేనె కూడా పోసి ఒక శుభ్రమైన తడిలేని కర్రతో బాగా కలియబెట్టాలి. కుండపై మూత ఉంచి దళసరి గుడ్డను రెండు పొరలుగా తీసుకొని బిగించి కట్టాలి. ఈ కుండను ఎండ తగలని చల్లని ప్రదేశంలో నేలలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. 5Ð7 రోజుల తర్వాత కుండను వెలికి తీయాలి. కుండలో ఉపయుక్త సూక్ష్మజీవులు పూత పూసినట్టుగా, తెట్టులా తేలుతూ సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఊదా రంగులు కలగలసి ఉంటాయి. మత్స్య సంజీవని వాడే పద్ధతి: వంద కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుకు ఒక లీటరు చొప్పున మత్స్య సంజీవనిని కలిపి మొక్క పాదుల్లో చల్లాలి. వేప పిండి, ఆముదం చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రీయ ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు. 120 మైక్రాన్ల మెష్‌తో వడపోసి ఎకరానికి విడతకు 10 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా అందించవచ్చు. వంద లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవనిని కలిపి మె°క్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.
విపరీతమైన రపాయనాల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం విపరీతంగా తగ్గిపోయింది. పత్తిపాటి రామయ్య బెంగుళూరు వైదిక విజ్ఞాన వర్సిటీలో పి.హెచ్.డి. చేసి “రామబాణం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 40 రోజుల ప్రోగ్రాం. చిత్తూరు జిల్లా రైతు మునిరత్నం నాయుడు రామబాణాన్ని తయారు చేసి తన భూమిలో వేసిన తర్వాత 0.5 ఉండే సేంద్రియ కర్బనం 0.75 కి పెరిగింది.
తయారు చేసే విధానం
మొదటి రోజు రెండున్నర కిలోల అల్లం, రెండున్నర లీటర్ల నీటితో కలిపి బాగా రుబ్బి ఒక కుండలో పోయాలి. పోసిన తరువాత గుడ్డతో కుండని కట్టాలి. కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి.
ఆరవ రోజు ఉదయం 4 కి. ఆవుపేడ, 4 లీ. నీటితో కలిపి కుండకి గుడ్డకట్టి గుంతలో పెట్టాలి.
మొదటి రోజు పూడ్చిన అల్లం ద్రావణం కుండను 6వ రోజు సాయంత్రం 4 గంటలకు గుంతనుండి బయటకు తీసి అల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
11వ రోజు సాయంత్రం 6వ రోజు గుంతలో ఉంచిన ఆవుపేడ ద్రావణాన్ని బయటకు తీసి 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
16వ రోజు 8 కి. బెల్లం 8 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. అదే రోజు 3 లీ. ఆవుమూత్రాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
21వ రోజు 21/4 కి. ముడి ఇంగువ 21/4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. 16వ రోజు గుంతలో పెట్టిన బెల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
26 వ రోజు 4 కి. శనగపిండి 4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పాతిపెట్టి మట్టి కప్పాలి. 21వ రోజు గుంతలో పెట్టిన ఇంగువ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
31వ రోజు ఒకటిన్నర కిలోల ఆవుపెరుగు ఒకటిన్నర లీటర్ల నీటిలో కలిపి కుండను గుంతలో పాతి పెట్టి మట్టి కప్పాలి. 26వ రోజు పాతిపెట్టిన శనగ పిండిద్రావణాన్ని 200 లీ. నీటితో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
36వ రోజున 31వ రోజున కుండలో ఉంచిన ఆవు పెరుగు ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
అప్పటికి రామ బాణం ప్రయోగం పూర్తవుతుంది. తరువాత పొలాన్ని నాగలితో దున్నుకుని పైరు పెట్టుకుంటే సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75కి పెరిగి ఉంటుంది.
ఆయిల్‌పామ్ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించాలంటే సరైన పోషకాలు, నీటి యాజమాన్యంతో పాటు ఆకుల యాజమాన్యం (Frond Management) అత్యంత కీలకమైనది. తోటలోని చెట్లకు ఉండే ఆకుల సంఖ్య, వాటిని కత్తిరించే విధానం మరియు కత్తిరించిన ఆకులను సర్దే పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడే పూర్తి స్థాయి ఆకుల యాజమాన్య పద్ధతులు మరియు అనుసరించే విధానం
చెట్టుకు ఉండవలసిన ఆకుల సంఖ్య (Optimum Leaf Count) ఆయిల్‌పామ్ చెట్టు సూర్యరశ్మిని గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకోవడానికి ఆకులు ఎంతో అవసరం. అవసరానికి మించి ఆకులను కత్తిరించడం (Over-pruning) వల్ల దిగుబడి క్రమంగా తగ్గుతుంది. • చిన్న వయసు తోటలు (1-3 సంవత్సరాలు): చెట్టుకు ఉన్న అన్ని పచ్చని ఆకులను అలాగే ఉంచాలి. కేవలం ఎండిపోయిన ఆకులను మాత్రమే తీసివేయాలి. • దిగుబడినిచ్చే తోటలు (4-10 సంవత్సరాలు): ప్రతి చెట్టుకు కనీసం 40 నుండి 48 పచ్చని ఆకులు ఉండేలా చూసుకోవాలి. అంటే గెల కింద కనీసం రెండు వరసల ఆకులు ఉంచాలి. • పెద్ద వయసు తోటలు (10 సంవత్సరాలు పైబడినవి): ప్రతి చెట్టుకు కనీసం 32 నుండి 40 ఆకులు ఉండాలి. గెల కింద ఒక వరస ఆకును తప్పనిసరిగా ఉంచాలి.
ఆకులను కత్తిరించే సరైన పద్ధతి (Pruning Technique) ఆయిల్‌పామ్ తోటల్లో ఆకుల యాజమాన్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మరియు శాస్త్రవేత్తలచే సిఫార్సు చేయబడిన ఒక అద్భుతమైన సూత్రం “9-3 క్లాక్ రూల్” (9-3 Clock Rule). సాధారణంగా రైతులు ఏ ఆకులను ఉంచాలి, వేటిని కత్తిరించాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్లాక్ రూల్ (గడియార నియమం) ద్వారా ఆకుల కత్తిరింపు చాలా సులువుగా నిర్వహించవచ్చు.
గడియార నియమం (9-3 Clock Rule) అంటే ఏమిటి? మనం గడియారాన్ని చూసినప్పుడు 9 గంటల ముల్లు ఎడమవైపు సమాంతరంగా, 3 గంటల ముల్లు కుడివైపు సమాంతరంగా ఉంటాయి. ఆయిల్‌పామ్ చెట్టును కూడా ఒక పెద్ద గడియారంగా ఊహించుకుంటే, చెట్టు మధ్య భాగం నుండి సమాంతరంగా ఇరువైపులా విస్తరించి ఉండే ఆకులను ఈ సమయాలతో పోలుస్తారు. • నియమం యొక్క ముఖ్య ఉద్దేశం: చెట్టు కాండం నుండి భూమికి సమాంతరంగా (Horizontal) ఇరువైపులా ఉండే ఆకుల కంటే క్రింది భాగంలో ఉన్న ఆకులను మాత్రమే కత్తిరించాలి. • 9 మరియు 3 గంటల స్థానం: గడియారంలో 9 నుండి 3 గంటల రేఖకు పైభాగంలో ఉండే ఆకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.
ఈ నియమాన్ని ఎలా పాటించాలి?
సమాంతర రేఖను గుర్తించడం: చెట్టు వద్ద నిలబడి, కంటిచూపు మేర సమాంతరంగా (horizontal) ఉండే ఆకులను (9 మరియు 3 గంటల స్థానాలు) గుర్తించండి.
గెలల కింద ఆకులు: సాధారణంగా ఆయిల్‌పామ్ చెట్టులో గెలలు ఈ సమాంతర రేఖకు పైభాగంలో లేదా రేఖకు సరిగ్గా ఆనుకుని ఉంటాయి.
కత్తిరింపు పరిమితి: కేవలం 9 గంటల మార్కు మరియు 3 గంటల మార్కు కంటే క్రిందికి వేలాడుతున్న, లేదా ఎండిపోయిన ఆకులను మాత్రమే నరకాలి.
రెండు వరుసల సూత్రం: గెల బరువును మోయడానికి మరియు దానికి సరైన పోషకాలు అందడానికి, గెల ఉన్న మట్ట కింద కనీసం 1 నుండి 2 వరుసల పచ్చని ఆకులు (సమాంతర రేఖ పరిధిలో ఉన్నవి) ఖచ్చితంగా మిగిలి ఉండాలి.
9-3 క్లాక్ రూల్ పాటించడం వల్ల కలిగే లాభాలు • అధిక దిగుబడి (High Yield): చెట్టుకు కావలసినన్ని పచ్చని ఆకులు (సుమారు 40-48) లభించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి, గెలలు పెద్ద పరిమాణంలో ఊరుతాయి. • ఆడ పూల సంఖ్య పెరుగుదల: అవసరానికి మించి ఆకులు కత్తిరిస్తే (Over-pruning) చెట్టు ఒత్తిడికి లోనై మగ పూలు ఎక్కువగా వస్తాయి. ఈ రూల్ పాటించడం వల్ల ఆడ పూల సంఖ్య పెరిగి దిగుబడి స్థిరంగా ఉంటుంది. • గెలల రక్షణ: గెలల కింద ఉండే ఆకులు గెలలకు ఒక సపోర్టులా పనిచేస్తాయి. గెలలు కిందపడిపోకుండా లేదా కాండం నుండి విడిపోకుండా ఇవి కాపాడతాయి. • సులువైన కోత: ఏ ఆకులను ఉంచాలో కార్మికులకు సులభంగా అర్థమవుతుంది. దీనివల్ల తోట పని వేగంగా జరుగుతుంది.
గెలలు కోసే సమయంలో మరియు ఆకులను కత్తిరించేటప్పుడు (Pruning) కొన్ని జాగ్రత్తలు పాటించాలి: • మట్టను దగ్గరగా నరకడం: ఆకులను కత్తిరించేటప్పుడు కాండానికి వీలైనంత దగ్గరగా, నిలువుగా కాకుండా వాలుగా కత్తిరించాలి. • పంగలు మిగల్చకూడదు: కాండంపై ఎక్కువ పొడవు మట్టలను (Frond butts) వదిలేయకూడదు. అలా వదిలేస్తే, ఆ పంగలలో వర్షపు నీరు చేరి కుళ్లిపోవడం లేదా ఎలుకలు, పురుగులు ఆశ్రయం పొందడం జరుగుతుంది. • వ్యాధి సోకిన ఆకులు: పొడి తెగులు (Leaf blight) లేదా ఇతర వ్యాధులు సోకి పూర్తిగా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించి తోట బయట పడేయాలి.
కత్తిరించిన మట్టల పునరుద్ధరణ / సర్దడం కత్తిరించిన ఆయిల్‌పామ్ మట్టలను తోటలోనే సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా భూమికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఫ్రాండ్ స్టాకింగ్ అంటారు. • ఎల్-షేప్ (L-Shape) లేదా యూ-షేప్ (U-Shape) పద్ధతి: రెండు చెట్ల మధ్య వరుసలలో లేదా చెట్ల చుట్టూ పాదులకు ఇబ్బంది లేకుండా మట్టలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. • మల్చింగ్ (మట్టి తేమ సంరక్షణ): ఈ మట్టలను చెట్ల మధ్య వరుసల్లో వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడక తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. • సేంద్రీయ ఎరువుగా మార్పిడి: కాలక్రమేణా ఈ ఆకులు కుళ్లిపోయి భూమికి అవసరమైన హ్యూమస్ (సేంద్రీయ కర్బనం) మరియు పొటాషియం వంటి పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది. • కలుపు నివారణ: మట్టలు పరిచిన చోట కలుపు మొక్కలు మొలకెత్తవు.
ముఖ్యమైన సూచనలు:
వేసవి కాలంలో ఆకులను ఎక్కువగా కత్తిరించకూడదు. ఇది చెట్టుపై ఒత్తిడిని పెంచుతుంది.
మట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తులు లేదా చిక్కం (Chisel/Sickle) బాగా పదునుగా ఉండాలి, తద్వారా కాండం దెబ్బతినకుండా ఉంటుంది.
మట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ తోటలో పెట్టి తగులబెట్టకూడదు. దీనివల్ల మిత్రపురుగులు చనిపోవడమే కాకుండా చెట్లకు నష్టం జరుగుతుంది.
రైతులకు గమనిక: గెలలు కోయడం సులువుగా ఉంటుందని చాలామంది రైతులు ఆకులను ఎక్కువగా కత్తిరిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఆకులు తగ్గితే చెట్టు తక్కువ ఆహారాన్ని తయారుచేసుకుని, మగ పూత ఎక్కువగా వచ్చి గెలల సంఖ్య తగ్గిపోతుంది.
డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఆర్. రమేష్, డా. ఐ. కృష్ణ తేజ, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301
పంచగవ్యలోని దేశీ ఆవుపేడ, ఆవుమూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అనే 5 పదార్థాలతోపాటు ఇంకొక 5 మొక్కల కషాయాలను ఉపయోగించి తయారుచేసే సేంద్రియ ఉత్పత్తి “దశగవ్య”.
దశగవ్య తయారీకి కావలసిన మొక్కలు : వేప, జిల్లేడు, వావిలి, ఉమ్మెత్త, జట్రోఫా, కానుగ, అడ్డసరం (అడతొడా)
తయారు చేసే పద్ధతి : విడివిడిగా 1:1 నిష్పత్తిలో 1 కి. మొక్కల ఆకులను ఒక లీటరు ఆవు మూత్రంలో 10 రోజులు నానబెట్టి, వడపోసిన కషాయాన్ని 1 లీ. తీసుకుని 5 లీ. పంచగవ్యతో కలపాలి. ఈ మిశ్రమాన్ని 25 రోజులు నిల్వ వుంచి బాగా కలియ త్రిప్పి పంచగవ్యలో ఆకుల కషాయం పూర్తిగా కలిసి పోయేలా చూడాలి.
ఉపయోగించే పద్ధతి : దశగవ్య ద్రావణాన్ని వడపోస్తే స్ప్రేయర్ నాజిల్‌లో చెత్త, చెదారాలు అడ్డుపడకుండా ఉంటాయి.
3 లీ. దశగవ్య ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. కూరగాయలు, పండ్ల తోటల్లో పంట పెరుగుదల దశలో వారినికొకసారి పిచికారి చేయాలి.
విత్తనాలను విత్తే ముందు 3 శాతం ద్రావణంలో 20 నిమిషాలు నానబెట్టి మరునాడు ఉదయం విత్తితే మొలక శాతం పెరుగుతుంది.
నారు మొక్కల వేర్లను నాటే ముందు 20 నిమిషాలు దశ గవ్యద్రావణంలో ముంచి నాటితే వేర్లు వృద్ధి చెందుతాయి.
దశగవ్య వాడకం వలన కలిగే ప్రయోజనాలు
పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెరుగుతాయి.
పేనుబంక, తామరపురుగులు, నల్లులు, ఇతర రసం పీల్చే పురుగులు నివారించబడతాయి.
రాజస్థాన్‌లోని అల్వర్ నగరానికి చెందిన యువ ఐఏఎస్ అధికారి ప్రేమ్ ప్రకాశ్ మీనా పాలీహౌస్‌లో మట్టి లేని సాగు (హైడ్రోపోనిక్) విధానంలో చేపట్టిన క్యాప్సికం సాగు, సాధించిన విజయం ఆ చుట్టుపక్కల రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వీడియో చూసి ప్రేమ్ ప్రకాశ్ ఈ హైటెక్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దిల్లీ, గురుగ్రామ్ వంటి మెట్రోపాలిటన్ నగరాల మార్కెట్లకు దిగుబడులను సరఫరా చేస్తున్నారు. అల్వర్ నగర సమీపంలో ప్రేమ్ ప్రకాశ్ కుటుంబానికి అయిదెకరాల పొలం ఉంది. ప్రస్తుతం సాగు బాధ్యతలను ఆయన తండ్రి కదురాం మీనా పర్యవేక్షిస్తున్నారు. ఒక పాలీహౌస్‌తో ప్రారంభించిన ఈ సాగు డిమాండు పెరడగంతో మూడు పాలీహౌస్‌లకు చేరింది. పాలీహౌస్‌ల మీద ఉద్యాన శాఖ ఇస్తున్న 70 శాతం రాయితీ పెట్టుబడి భారాన్ని తగ్గించింది. జైపుర్ నుంచి నాణ్యమైన ఎరుపు, పసుపు క్యాప్సికం విత్తనాలు తెప్పించారు. మొత్తం 18,000 మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గతేడాది 32 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 40 టన్నులు అంచనా వేస్తున్నారు.
దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి, నాణ్యతను బట్టి టన్ను రూ.2 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం రూ.50 వేలు, నెల క్రితం రూ. లక్ష నుంచి రూ.1.10 లక్షలు పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,422 హెక్టార్లలో దానిమ్మ పంటను సాగు చేస్తుండగా 3.85 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 11 వేల హెక్టార్లలో దానిమ్మ పండిస్తున్నారు. స్థానికంగా ఫ్రూట్ కవర్స్ ప్లాంట్ కవర్స్ విధానంతో దానిమ్మ పండ్ల నాణ్యత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
వంద పంతాల తమలపాకుల ధర రూ.7 వేలకు ఎగబాకింది. గతేడాది ఇదే రోజుల్లో రూ.2,500 నుంచి రూ.3,000 మాత్రమే ఉంది. రైతుల నుంచి వ్యాపారులు ఒక పంతం (కట్టకు 170-180 ఆకులు) రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో తమలపాకు సాగు ఎక్కువ. చింతలపూడి, ములుకుదురు, మాచవరం, ఆరెమండ, దండమూడి, నిడుబ్రోలు తదితర ప్రాంతాల్లో సుమారు 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మహారాష్ట్ర, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతవుతాయి. ఇటీవలి తుపాను ప్రభావంతో కడప, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతున్న తమలపాకు మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో దిగుబడులపై ప్రభావం పడింది. గతంలో ఎకరాకు 3 వేల పంతాల లోపు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 800 నుంచి 1200 లోపు మాత్రమే వస్తుండటం.. ధర పెరుగుదలకు దోహదపడిందని రైతులు చెబుతున్నారు. ధర పెరగడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.
గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్-స్మామ్) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.
మార్గదర్శకాలు… పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్ కిట్ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.
సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు… విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్, కలుపు తీసే యంత్రాలు, పవర్ టిల్లర్లు, వీడర్లు, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, స్ట్రాబాలర్లు, బండ్ ఫార్మర్ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.
పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్, వర్జీనియాబంచ్ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు.