వండని వంట… బీట్రూట్ లడ్డు
కావాల్సిన పదార్థాలు
- బీట్రూట్ ముక్కలు – పావు కేజీ
- బెల్లం – తురుము 50 గ్రాములు,
- తేనె – కొద్దిగా
- ఇలాచి పౌడర్ – కొద్దిగా
- బాదం, కిస్మిస్, జీడిపప్పు ముక్కలు – 50 గ్రాములు
- పల్లీలు – 50 గ్రాములు,
- నువ్వులు – 50 గ్రాములు.
తయారుచేయు విధానం:
ముందుగా పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని పక్కుకు పెట్టుకోవాలి. అదే జార్‌లో ముందుగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని పల్చటి క్లాత్‌తో గట్టిగా పిండాలి. ఆ జ్యూస్‌ని బీట్రూట్ జ్యూస్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆ ముద్దకి పైన పేర్కొన్న పల్లీలు నువ్వుల బెల్లం పొడిని మరియు కొద్దిగా ఇలాచీ పొడిని చిన్నచిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం ముక్కలను కలిపి అవసరాన్ని బట్టి తేనెను కలుపుతూ గుండ్రటి లడ్డూలు కట్టుకోవాలి.
ఇవి ఏరోజుకారోజు చేసుకుని తింటే బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు అప్పటికప్పుడు పిల్లలకి రుచికరమైన, బలవర్ధకరమైన ఆహారంగా చేసి ఇవ్వవచ్చు.
ఒకేరోజు మనము బీట్రూట్ లడ్డూలను, బీట్రూట్ జ్యూస్‌ను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు ఉన్నవాళ్లు చాలా నీటిని పోసి పిప్పి కదా అని దాన్ని వ్యర్థం చేస్తుంటారు. కాకపోతే తక్కువ నీటిని ఉపయోగించి క్యారెట్, బీట్‌రూట్ లడ్డూలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు.
- సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.






