తెలంగాణాలో ‘సహకార’ రైస్ మిల్లు, గోదాం నిర్మాణం
రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం, బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు కల్పించడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్- ఏఐఎఫ్) పథకం ముఖ్య ఉద్దేశాలు. దీని కింద తెలంగాణాలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో రూ.3.38 కోట్లతో నాలుగు టన్నుల రా రైస్ మిల్లు, 500 టన్నుల సామర్థ్యమున్న గోదాం నిర్మించారు. 3,993 మంది సభ్యులున్న ఈ సంఘం సుమారు రూ.36 లక్షల లాభంలో నడుస్తోంది. రా రైస్ మిల్లు, గోదాం నిర్మాణానికయ్యే వ్యయంలో రూ.67.72 లక్షలను ఏఐఎఫ్ పథకాన్ని అమలుకు చేసే నాబార్డుకు సంఘం చెల్లించింది. రూ.2.70 కోట్లను కేంద్రం రుణంగా అందజేసింది. గంభీరావుపేట మండలం గోరింటాలలో రా రైస్ మిల్లు, గోదాము నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ స్థలం కేటాయించారు. ఇటీవలే నిర్మాణం పూర్తయింది. రైస్ మిల్లు నిర్వహణ అనుభవం కోసం సమీపంలోని మరో రైస్ మిల్లుకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ చేస్తున్నారు. వచ్చే సీజన్ నుంచి సంఘం ఆధ్వర్యంలో సన్న ధాన్యం సేకరించి… మిల్లింగ్, మార్కెటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెటింగ్‌కు అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బియ్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘం పురోభివృద్ధికే వినియోగించనున్నారు. మిల్లు నిర్వహణతో సుమారు 20 మంది ఉపాధి పొందుతారు.












