దేశంలో తొలిసారి నారావారిపల్లెలో పాడి పశువుల్లో ఎద క్రమబద్ధీకరణ
కొన్ని పశువులు ఎదకు రాకపోకపోవడం.. లేదంటే ఒకట్రెండు ఈతలకే వట్టిపోతుండటం లాంటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లె పరిసరాల్లో దేశంలోనే తొలిసారిగా ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణతో 30-40 శాతం చూలు కట్టు శాతం ఉండగా.. ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమంతో 63 శాతం పశువులు గర్భం దాల్చాయి. నారావారిపల్లె సహా చుట్టుపక్కల 29 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎదకు రాని పశువుల్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. తొలి విడతగా 172 మంది రైతులకు చెందిన 250 పశువులను ఎంపిక చేసుకుని మార్చి 29న పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 30 మంది పశు వైద్యులు, సహాయకులు ఎంపిక చేసుకున్న ప్రతి పశువు పునరుత్పాదక, గర్భాశయం, అండాశయ స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఎదకు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. పశువుకు ఆరోగ్య పరీక్షలు చేసి ఎదకు రాకపోవడానికి కారణాలను గుర్తించారు. ప్రతి పశువుకు డీవార్మింగ్ మాత్రలు, 20 కిలోల సమీకృత దాణా, 20 మినరల్ మాత్రలు, యాంటీ బయాటిక్ మందులతో కూడిన రూ. 1500 విలువైన కిట్‌ను రూ.400కే అందజేశారు. మే నెలలో మేలుజాతి ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో 156 వట్టి పోయిన పశువులు ఇప్పుడు చూలు కట్టాయి.
75 శాతం ఫలవంతం చేయడమే లక్ష్యం
ఎదకు రాని పాడి పశువు విలువ రూ. 15 వేలు మాత్రమే. అదే పశువు ఎదకు వచ్చి గర్భం దాల్చితే రూ.60-70 వేలు. ఆరు నెలల తర్వాత నారావారిపల్లెలోని 172 మంది రైతుల ఇళ్లలో పాల వెల్లువ ప్రారంభమవుతుంది. మంచి ఆదాయం లభించనుంది.
-ఎ. రవికుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి



