కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ డైరెక్టర్
పంటల సాగుతో పాటు అన్న దాతలు ఉత్పత్తుల శుద్ధి, నిల్వ సౌకర్యాలతో అదనపు ఆదాయం పొందాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్కే మీనా సూచించారు. మౌలిక వసతుల నిధి కింద కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని, ఏఐఎఫ్‌లో తక్కువ వడ్డీతో రుణసాయం లభిస్తోందని దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్) సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోదాములు, శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఏఐఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల నిధి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఏఐఎఫ్ కింద సత్వరమే రుణాలు అందిస్తున్నామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ జీఎం ప్రశాంతకుమార్ వెల్లడించారు. ఏఐఎఫ్ ప్రగతిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు తెలంగాణ విభాగం అధికారి భుజంగరావు, రవితేజ ఇతర సిబ్బందిని ఆర్కే మీనా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.