నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) కింద తెలంగాణలో 81 మందికి గొర్రెలు, మేకల పెంపకం ప్రాజెక్టుల మంజూరుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యాసాచి ఘోష్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎన్‌ఎల్‌ఎం కింద ఒక్కో లబ్ధిదారుకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.కోటితో ప్రాజెక్టు మంజూరవుతుంది. ఇందులో రూ.50 లక్షలు సబ్సిడీ కాగా బ్యాంకుల నుంచి రూ.40 లక్షల రుణం పొందాలి. మిగిలిన రూ.10 లక్షలు లబ్ధిదారు వాటా. ఈ యూనిట్లకు 240 మంది దరఖాస్తు చేసుకోగా.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుదిజాబితా ఎంపిక కోసం సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ సంచాలకుడు గోపి, అదనపు సంచాలకురాలు మల్లీశ్వరి; గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.
వ్యవసాయ విద్యార్థుల ఉపకారవేతనం రూ.10వేలు, రూ.12వేలకు పెంపు
వర్సిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని.. పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో అధికశాతం రీసైక్లింగ్ అవుతున్న నేపథ్యంలో.. వారికి సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనేది సర్కారు ఆలోచన. అందుకు అనుగుణంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మిరప సహా వివిధ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి.. అంతకంటే తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. యాదవ, కురబలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, సీఎం సూచనలను.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. అవి ఇలా ఉన్నాయి.
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు
వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. వ్యవసాయ, పశువైద్య విద్యార్థుల ఉపకారవేతనం రూ.7 వేల నుంచి రూ.10 వేలు.. పీజీ విద్యార్థులకు రూ.12 వేలకు పెంచారు.
కోకో, అంతరపంటల సాగుకు ప్రోత్సాహం
ఆయిల్ పామ్‌లో అంతరపంటగా కోకో సాగుకు ప్రోత్సాహం, ఆయిల్‌పామ్ విస్తరణ.. పీపీపీ విధానంలో పరిశ్రమల ఏర్పాటు అంతరపంటలు సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహకాలు, చిరుధాన్యాలు సాగుకు చేయూత… రైతులకు రాయితీలు, రైతు బజార్లలో పండ్లు, పూలు, కూరగాయల నిల్వకు సబ్జీ కూలర్లు.. 50% రాయితీపై అందజేత, జూన్‌లోనే నారుమళ్లకు సాగు నీరు విడుదల, ఆక్వా, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల వారీగా సెమినార్లు. రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో కార్యశాలలు ఉపాధి హామీ పథకంలో ఉద్యాన రంగానికి అధిక నిధులు. ఈ ఏడాది రూ.200 కోట్లతో పనులు, ఉద్యాన హబ్ రాయలసీమ.. అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు డ్రాగన్, అవకాడో తదితర పంటల సాగుకు ప్రోత్సాహం. ఆక్వా జోన్/ వెలుపల చెరువులు తవ్వాలంటే అనుమతులు తప్పనిసరి. అనుమతి లేకుండా సాగు చేస్తే జరిమానా.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు 17.03 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ అయ్యాయని, రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉన్నదని మంత్రి తుమ్మల అన్నారు. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ అయ్యాయని తెలిపారు. ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు, పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్ధతుధరకు సేకరించారని, ప్రత్తిపంటను పూర్తిగా సేకరించడానికి గడువుకోరారు మంత్రి తుమ్మల. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్దనుండి మద్ధతు ధరకు ప్రభుత్వం కోనుగోలు చేసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు పెరిగాయని, వరిపంటను మద్ధతు ధరకు ప్రభుత్వం కోనుగోలు చేస్తుందన్నారు యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 10,547 కోట్లు, ఖరీఫ్‌లో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు, 12,178.97 కోట్లు, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి కొన్నదన్నారు. అందుకు 1154 కోట్లు ఖర్చు అయిందని, ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగింపు ఉందని, పసుపు, మిరప పంటలకు మద్ధతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజప్తి చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భంది చర్యలు ప్రభుత్వం తీసుకున్నది అని, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుల కోసం విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతే అని మంత్రి తుమ్మల అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ఇండో క్లైమేట్ సెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌లోని పిజెటిఏయు ఆవరణలోని అగ్రి హబ్ కార్యాలయంలో ఉపకులపతి డాక్టర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్, ఇండో క్లైమేట్ సెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రామచంద్రలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. నేలలోని పోషకాల స్థాయిలని గుర్తించే సెన్సార్లు పై కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ యం. బలరాం, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంచాలకులు డాక్టర్ కె.పి. వాణి, నేలల ఆరోగ్యం, యాజమాన్యం విభాగాధిపతి డాక్టర్ ఎ. మాధవి, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పశువైద్యాధికారి సూచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం, కొవ్వూరు మండలాల పరిధిలో 20 ఫారాల్లో సుమారు 40 వేల కోళ్లు వైరస్‌తో మృతి చెందినట్లు అధికారులు అంచనా వేశారు. పశువైద్య అధికారులు గ్రామాల్లో పర్యటించి మృతి చెందిన కోళ్లను బయటకు తీసుకురాకుండా ఫారం పరిధిలోనే పూడ్పించారు. కోళ్ల ఫారాల వద్ద బ్లీచింగ్, రసాయనాలు చల్లి పరిశుభ్ర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించినట్లు జిల్లా పశువైద్యాధికారి టి. శ్రీనివాసరావు తెలిపారు. 40 కోళ్ల నమూనాలను భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపించామన్నారు.
పూర్తి ప్రతిభ, సమర్థత, అనుభవాల ఆధారంగా విశ్వవిద్యాలయ అధికారుల నియామకం జరిపినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆల్దాస్ జానయ్య తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారుల నియామకం విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఎటువంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నియామకాలు పూర్తి చేసినట్లు వివరించారు. ఇటీవల నియమితులైన విశ్వవిద్యాలయ అధికారులు, ఇతర ఉన్నత అధికారుల పరిచయ కార్యక్రమం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగింది. ఉపకులపతి జానయ్య వీరందరినీ సమావేశానికి హాజరైన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులకు పరిచయం చేశారు. అనేక ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి విశ్వవిద్యాలయ అధికారులని నియమింప చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఈ కొత్త బృందం ”మంచి భవిష్యత్తుకి కొత్త ఆశలు”కల్పిస్తుందని జానయ్య అన్నారు. కొన్ని విభాగాల్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా విశ్వవిద్యాలయాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రానున్న ఏళ్ళల్లో దేశంలో 10 అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పి.జె.టి.ఎ.యు. స్థానం సాధించడానికి అందరము కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బోధన, బోధనేతర సిబ్బంది నిరంతర శిక్షణ, అధ్యయనం, సానుకూల దృక్పథంతో, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తే ఆ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా రైతాంగ సంక్షేమం పరమావధిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆల్దాస్ జానయ్య పిలుపునిచ్చారు. ఉపకులపతి సూచనలు, సలహాలతో విశ్వవిద్యాలయ స్థాయిని మరింత పెంచేందుకు కృషి చేస్తానని రిజిస్ట్రార్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్ స్పష్టం చేశారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ఇన్నేళ్లు బాధ్యతలు నిర్వర్తించడం వల్లనే నేడు తనకీ అవకాశం వచ్చిందని భావిస్తున్నానని ఆయనన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలు గురించి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ కె. ఝాన్సీ రాణి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం. బలరాం, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ ఎం. యాకాద్రి, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ కె.బి. ఈశ్వరి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సి.హెచ్. వేణుగోపాల్ రెడ్డి, సెంటర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చరల్ డైరెక్టర్ డాక్టర్ బి. బాలాజీ నాయక్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జె. శశికళ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎం. మల్లారెడ్డి, డైరెక్టర్, సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డాక్టర్ కె. సురేష్, డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ వి. రాములు, డైరెక్టర్, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డాక్టర్ కె.పి. వాణి, డైరెక్టర్, అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ జి. శ్రీనివాస్‌లు తమ అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలను గురించి వివరించారు. ఈ సందర్భంగా గతంలో విశ్వవిద్యాలయ అధికారులుగా పనిచేసిన డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డి. శివాజీలను సన్మానించారు. వారి సేవల్ని కొనియాడారు.
ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను ప్రతి పంటకూ విస్తరించాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. రైతులు దాదాపు 200 రకాల పంటలు పండిస్తుంటే.. కేవలం 60 పంటలకే బీమాను వర్తింపజేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అలాగే పంటల బీమా రంగంలో ఐదు ప్రభుత్వరంగ సంస్థలు, 15 ప్రైవేటు సంస్థలు మాత్రమే ఉన్నాయని.. భారీ సంఖ్యలో ఉన్న రైతులకు బీమాను సకాలంలో చెల్లించడానికి ఈ కొద్ది కంపెనీలు సరిపోనందున విస్తృతం చేయాలని కోరారు. మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. రిమోట్ సెన్సింగ్ డేటా ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయడం ద్వారా బీమా కంపెనీల చెల్లింపులను వేగవంతం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 20 దాకా ఉన్న బీమా కంపెనీల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుందని పేర్కొన్నారు.
కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం తెదేపా ఎంపీ బీకే పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24వ సంవత్సరం మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లలో సాగయిన కొబ్బరి తోటలనుంచి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉన్నదని చెప్పారు. 2022-23లో రాష్ట్రంలో రూ.2,763.23 కోట్ల విలువైన పంట ఉత్పత్తి వచ్చినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని, అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. తెల్లదోమలాంటి తెగుళ్లు వచ్చినా వాటి నియంత్రణకు కొబ్బరి బోర్డు వివిధ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసి 8 రకాల నియంత్రణ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.
* ఉడికించిన గుడ్లు, మాంసాన్ని వినియోగదారులు తీసుకోవచ్చు
* పశుసంవర్థకశాఖ డైరెక్టర్ దామోదరనాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కోళ్లు చనిపోయాయని, పెరటి కోళ్లతో పోలిస్తే, పౌల్ట్రీ ఫారాల్లో అధికంగా కోళ్లు మరణించినట్లు గుర్తించామని పశుసంవర్ధకశాఖ సంచాలకుడు దామోదరనాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు సరస్సు ప్రాంతానికి ఈ ఏడాది వలస పకక్షులు అధికంగా రావడం కూడా దీనికి ఒక కారణమని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోళ్ల రైతులు సరైన జీవ భద్రతా చర్యలు పాటించకపోవడంతో కొన్నిచోట్ల వ్యాధులు వ్యాప్తి చెందాయన్నారు. కోళ్ల పెంపకందారులకు పశువైద్యాధికారుల బృందాల ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నామని.. నమూనాలను విజయవాడలోని రాష్ట్రస్థాయి పశువ్యాధి నిర్ధారణశాలతోపాటు భోపాల్లోని హైసెక్యూరిటీ ల్యాబ్‌కు పంపామని వివరించారు. కోడిగుడ్లు, మాంసం వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు సంభవించినట్లు నిర్ధారణ కాలేదన్నారు. వినియోగదారులు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, నిస్సంకోచంగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తీసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. సమాఖ్య అధ్యకక్షుడు కె. సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, ఉపాధ్యకక్షుడు టి. కుటుంబరావు, సభ్యులు గంగాధర్‌రావు, సుబ్రమణ్యం తదితరులు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందించారు. కోళ్ల దాణాకు ఉపయోగించే మొక్కజొన్న దిగుమతులపై దిగుమతి సుంకం పూర్తిగా మినహాయించాలని కోరారు. గుడ్డు ధరల సమస్య పరిష్కారానికి కోళ్ల రైతులు, వ్యాపారులు, మధ్యవర్తులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని.. కోళ్ల పరిశ్రమకు 2015-20 నాటి పాలసీని సమీక్షించి.. పునరుద్ధరించాలని వినతి పత్రంలో సూచించారు. 2018-19 నాటి వడ్డీ రాయితీ బకాయిలను చెల్లించాలని.. రాబోయే ఐదేళ్లకు 4.5శాతం చొప్పున వడ్డీ రాయితీ ఇవ్వాలని, కోళ్ల పరిశ్రమ తీసుకున్న రుణాల చెల్లింపులపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని అభ్యర్థించారు. కోళ్ల పరిశ్రమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని వారు వివరించారు.