ఎల్ నినో పరిస్థితులలో పంటల సాగుకు సూచనలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ప్రపంచ స్థాయిలో వచ్చే ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి, 9 నుండి 12 నెలల పాటు ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గి, ఎండలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 2026 ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం వుంది. ప్రస్తుత 2026–27 కాలంలో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం 2027 ఖరీఫ్ సీజన్ వరకు కొనసాగి వ్యవసాయం, తాగునీరు మరియు గ్రామీణ జీవనోపాధిని దెబ్బతీయవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 16 జూలై 26 నాటికీ సాధారణ వర్షపాతము 170 మి.మి.గాను 86 మి.మి నమోదు అయింది. అంటే దాదాపు 50 శాతము లోటు వర్షపాతము నమోదు అయింది. ముక్యముగా కోనసీమ, తూర్పు, పచ్చిమ గోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో దాదాపుగా 65 శాతము భారి లోటు వర్షపాతము నమోదు అయింది. అన్ని ప్రధాన జలాశయాలలో కలిపి 290.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది, గత ఏడాది ఇదే సమయానికి (8-7-26) ఈ నిల్వ 524.56 టీఎంసీలుగా ఉండేది.అంటే 55 శాతము తక్కువగా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వల్ల సాగునీటి ఇబ్బందులు రావచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖరిఫ్ లో సాధారణ సాగు ౩౦.84 లక్షల హెక్టార్లుకు గాను 6.7 లక్షల హెక్టార్లు అంటే 22 శాతం మాత్రమే సాగు అయింది. ప్రస్తుతానికి వరి 2.2 లక్షల హెక్టార్లు, ప్రత్తి 1.63 లక్షల హెక్టార్లు, కంది 70400 హెక్టార్లు, వేరుసెనగ 43000 హెక్టార్లు, మొక్కజొన్న 40700 హెక్టార్లు సాగు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలకుగాను, కర్నూల్, శ్రీకాకుళం, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలు తప్ప మిగిలిన 25 జిల్లాలలో 25 శాతము కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది.

పంటలపై ప్రభావం (దిగుబడి నష్టాలు):
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 11% తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షాధార పంటలకు 15- 20% నష్టం వాటిల్లవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య వ్యవసాయోత్పత్తి తగ్గుదల క్రింది విధంగా పంటల వారీగా అంచనా వేసినట్లు తెలియజేశారు.

పంట ప్రభావ అంచనా / దిగుబడి తగ్గుదల
మొక్కజొన్న 30% నుండి 35% వరకు తగ్గుదల
సజ్జ 25% నుండి 30% తగ్గుదల
వరి 10% నుండి 20% తగ్గుదల
పప్పుధాన్యాలు 15% నుండి 18% తగ్గుదల
వేరుశెనగ / పత్తి / చెరకు తీవ్రమైన నీటి కొరత వల్ల నాణ్యత, దిగుబడి దెబ్బతింటుంది (వేరుశెనగ పూర్తిగా నష్టపోవచ్చు)
జొన్న, రాగి కరువును తట్టుకోగలవు కాబట్టి వీటికి ప్రమాదం తక్కువ

ప్రస్తుతము సాగు చేసిన పంటల్లో సూచనలు

  • బోరు బావుల క్రింద సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలకు నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు వరుస విడిచి వరుసకు నీటిపారుదల అందించాలి.
  • కంది మరియు ఆముదంలో మొక్కల సాంద్రత తక్కువ చేయించడం వలన ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఆముదం మరియు కంది పంటలలో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటుగా నేలలో తేమను రక్షించుకోవచ్చు.
  • లోతు తక్కువ గల ఎర్ర గరప నేలల్లో పంట మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత ప్రతి రెండు సాళ్ళ మధ్య కట్టె నాగలి గానీ లేదా బోదె నాగలి గానీ నడిపినట్లు అయితే పొలమంతా బోదెలు-కాలువలు లాగా తయారు అవుతాయి. బోదెలు చేయడం వలన మొక్కల మొదళ్లకు తగినంత మట్టి సమకూరుతుంది. ఇలా బోదెలు -కాలువలు చేయడం వలన వర్షపు నీరు సాళ్లలో నిలబడి భూమిలోనికి ఇంకి పోతుంది, తద్వారా ఎక్కువ నీరు భూమి లోనికి ఇంకడం వలన భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంట మొక్కలకు అందించడం వలన దిగుబడి పెరుగుతుంది.
  • పంట వేసిన తరువాత వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా పంట అవశేషాలతో మల్చింగ్ (ఆచ్చాదన) చేయడం వలన భూమిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా ఉంటుంది. అలాగే కలుపు సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి కనుక నేలలో తేమ శాతాన్ని రక్షించుకోవచ్చు.
  • మెట్ట ప్రాంతాల్లో పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు నీటి కుంటలలో నిలువ చేసిన నీటిని, పంట కాలంలో ఎర్ర నేలల్లో పదిరోజులకు, నల్లరేగడి నేలల్లో 15 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, స్ప్రింకర్ల ద్వారా 20 మి.మీ.ఎర్ర నేలల్లో, 40 మి.మీ.నల్లరేగడి నేలల్లో అందించగలిగితే 20-30% దిగుబడి పెరుగుతుంది. చివరి దశలో బెట్ట వస్తే (కంది, ఆముదం వంటి దూర వరస పంటలకు) నీటి ట్యాంకర్ల ద్వారా రక్షక తడులు (Protective Irrigation) ఇవ్వాలి.

వరి సాగు లో వర్షాభావ పరిస్థితులు లేదా సాగునీటి కొరత ఉంటే సూచనలు

  • పొలంలో నిరంతరం నీరు నిల్వ ఉంచకుండా ప్రత్యామ్నాయ తడి-పొడి (AWD) పద్ధతి పిలక దశలో, పై పాటుగా ఎరువులు వేసినప్పుడు అనుసరించాలి. కాలువల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. పొలాల గట్లను బలపరచి నీటి నష్టాన్ని తగ్గించాలి. పొలంలో పగుళ్లు రాకుండా తగిన తేమను నిలుపుకోవాలి.
  • నీటి లబ్యత తక్కువగా ఉన్న యెడల, మురుగు నీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 దేసిమేన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరుగా ఉపయోగించాలి.
  • వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్న జిల్లాల్లో, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు లో దమ్ము చేసి చదును, చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ పద్దతి లేదా SRI సాగు పాటించాలి.
  • తక్కువ కాలం మరియు బెట్టను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
  • ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు మరియు బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైన MTU1121, MTU1293, MTU1290 మరియు MTU1426 సాగు చేయాలి. తక్కువ వయస్సు (20–25 రోజుల) నారును ఉపయోగించాలి.
  • చాడు నేలలకు: ఇంద్ర,, MCM 103, MCM 125, MTU 1290, MTU 1293
  • నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చ॥మీ॥ కు 33 కుదుళ్ళు ఉండేలా చూడాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్లు నాటాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్ధారించాలి. దీర్గకాలిక, మద్యకాలిక మరియు స్వల్ప కాలిక రకాలు నాటినపుడు ఒక చధరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండాలి.
  • నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు.
  • ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో, ఉన్న నీటిని జీవ తడులకు వాడుకోవాలి.
  • నీరు తక్కువగా ఉన్నపుడు వరి పైరు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు ఆరుతడిలాగా నీటి తడులు పెడుతూ మరియు నీరు బయటకు పోకుండా పొలం గట్టును దృడంగా చేసుకోవాలి.
  • అధిక ఉషోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచు మంచి నీరు మార్చుకోవటం వలన చౌడు తీవ్రతను తగించుకోవచ్చు .
  • పంటలో గనుక జింక్ లోపం వచ్చినటైతే ఒక లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ (0.2%) కలపి పిచికారి చేసి నివారించుకోవాలి. జింక్ లోపం తీవ్రతను బట్టి 5 రోజుల కాలంలో రెండవ పిచికారి చేయాలి.
  • ఇనుము ధాతు లోపము నివారణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని (10 గ్రాముల అన్నభేది) వాడాలి.

ఎల్‌నినో / బెట్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు:
వర్షాలు సకాలములో లేని యెడల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

  • ఆగష్టు మాసములో : తేలికపాటి నేలలు : జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద మేత జొన్న, ఉలవలు
  • భరువైన నేలలు: ఆముదము, జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద, కంది ఉలవలు
  • ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటల సాగును సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది.
  • ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ పంట కాలం గల మినుములు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.

పండ్ల తోటలను (చీని, మామిడి లో) తీవ్ర కరువు సమయంలో చెట్లను కాపాడుకునే అత్యవసర పద్ధతులు:

  • పాదులలో అచ్ఛాధన (మల్చింగ్) చేసుకొని నీటి ఆవిరిని అరికట్టాలి. నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలి.
  • ఎండ తీవ్రతలేని సాయంత్రం సమయంలోనే పండ్ల తోటలకు సాధారణ తడిగానీ, లేదా ట్యాంకర్ల ద్వారా రక్షకతడిగానీ ఇవ్వాలి.
  • చెట్టు పాదులో ఒక వారం ఒక సగభాగం, మరుసటి వారం ఇంకో సగభాగంలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదాచేయవచ్చును. ఇది పార్షియల్ డ్రై రూట్ జోన్ తడి పద్ధతి అంటారు.
    • 1:1 నిష్పత్తిలో బంకమట్టి + సున్నం కలిపి కాండానికి పూస్తే చెట్లు ఎండకు ఎండిపోవడాన్ని తగ్గించవచ్చు.
    • పచ్చిరొట్ట పంటలు వేసుకొని, నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చు.
    • చెరువు మట్టిని వేసి నేలలో తేమను నిలిపే గుణాన్ని పెంచవచ్చు.
    • చెట్టు ఎండిపోతున్నప్పుడు బాగా ఎండిపోతున్న చెట్ల కొమ్మలన్నీ నరికి, ఒక్క ప్రధాన కొమ్మనే ఉంచాలి. ఈ పద్ధతి చెట్టు నీటి అవసరాన్ని తగ్గించి బ్రతికిస్తుంది. దీనిని డీ-హార్నింగ్ (De-horning) అంటారు.
    • పంట కోత అనంతరము కొమ్మలు కత్తిరించి, ఆ వ్యర్థాలను ముక్కలు చేసి, పాదుల్లోనే మల్చింగ్ గా వేయాలి. దీనివల్ల నేల తేమ ఆవిరి బాగా తగ్గుతుంది. ముఖ్యంగా చీడపీడలకు గురైన కొమ్మలను పూర్తిగా కత్తిరించాలి.
    • చెట్టుకు 40-50 కేజీల సేంద్రియ ఎరువు (పశువుల/గొర్రెల/కోళ్ల వ్యర్థాలు) వేయాలి. పండ్ల చెట్ల మధ్య వరుసల పచ్చిరొట్ట పంటలు వేసి 50% పూత దశలో భూమిలో దున్నాలి.
    • మొక్కల వేగవంతమైన పెరుగుదలకు మరియు పోషకాల లభ్యతకు తోడ్పడే పి.ఎస్.బి (PSB – ఫాస్ఫో బ్యాక్టీరియా) వంటి జీవన ఎరువులను వినియోగించాలి.
    • ఉద్యాన పంటలకు అత్యంత కీలకమైన పూత మరియు పిందె దశల్లో నీటి కొరత రాకుండా తగినంత నీరు కచ్చితంగా అందించాలి.

ఆకుకూరలు, కూరగాయలు:
• పొలంలో వర్షపు నీరు పొర్లిపోకుండా, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ (ఇంకుడు గుంత) ఏర్పాటు ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చు.
• తక్కువ నీరు & స్వల్ప కాలపరిమితి గల కూరగాయ పంటలను వేసుకోవాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే టొమాటో, మిర్చిలకు బదులు గోరుచిక్కుడు, చిక్కుడు, అలసంద. చిలగడదుంప, చామదుంప, కంద, ముల్లంగి, బీట్‌రూట్ , క్యారెట్ (కరుడ రకాలు: 80-90 రోజులు) వేసుకోవలెను.
• వివిధ రకాల ఆకుకూరలు తక్కువ కాలంలో పండుతాయి. కొత్తిమీర, గోంగూరలు డ్రిప్ + మైక్రో జెట్స్ ద్వారా తక్కువ నీటితో సాగు చేయవచ్చును.

ఆయిల్ పామ్ పంటల్లో:

  • రక్షక నీటి పారుదల మరియు తేమ సంరక్షణ చర్యలను చేపట్టండి. నేలలో తేమను కాపాడటానికి మరియు నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి, ఎండిన ఆకులు, ఖాళీ పండ్ల గుత్తులు లేదా సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి నేరుగా నేలలోనే మల్చింగ్ చేయండి.
  • అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయడం మానుకోండి.
  • వేసవిలో ఆకులను ఎక్కువగా కత్తిరించడాన్ని నివారించండి, ఎందుకంటే చెట్టు పైభాగం (canopy) తగ్గడం వల్ల వేడి ఒత్తిడి పెరగవచ్చు. ప్రతి చెట్టుకు కనీసం 35–40 పని చేసే ఆకులు ఉండేలా చూసుకోండి. పశు సంరక్షణకు సూచనలు
  • సన్నకారు రైతులు ఉలవలు వేసుకుని 10 నుంచి 15 పొట్టేలు పిల్లలు మేపుకుంటే ఒక్కొక్క పొట్టేలుపై పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుంది.
  • దాణా తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువగా పశువులకు ఇవ్వడం జరుగుతుంది. దీని వలన పాల దిగుబడి బాగా వచ్చినా పశువుల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గి చనిపోతాయి. కావున ఈ పద్దతిని ఆచరించకుండా చూడాలి.
  • Co F31, Australian Red Napier వంటి గడ్డి రకాలు తక్కువ నీటితో పండించవచ్చును. తద్వారా పచ్చి మేత కొరత తగ్గించవచ్చును.
  • పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పాదకత పెరగడానికి వాటి ఆహారంలో క్రమం తప్పకుండా మినరల్ మిక్స్ (ఖనిజ లవణాల మిశ్రమం) అందించాలి అని తెలపడము అయినది.
  • అవసరమైన టీకాలను, సరైన సమయంలో ఇవ్వాలి.

రైతులందరూ వాతావరణ భీమా WBCIS (Weather Based Crop Insurance Scheme) మరియు ప్రధానమంత్రి పంటల భీమా PMFBY (Pradhan Mantri Fasal Bima Yojana) పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించి, నీటి పొదుపు: నీటి వినియోగంలో జాగ్రత్త వహించాలి. భూమిలో తేమ ఆరిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

డా . బి. సహదేవ రెడ్డి, డా. పి.వి. రమేష్ బాబు, డా . య౦ .గిరిజా రాణి మరియు
డా . సి.హెచ్. శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, మారుటేరు. Ph: 9866787072

Read More

శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక

రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.

  1. పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
    పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:

ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.

బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).

సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.

డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.

  1. గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
    మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.

ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.

బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.

సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.

  1. పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
    తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.

ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.

సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.

డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.

రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:

  1. ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
  2. మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
  3. కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
  4. టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్‌.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
    ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.

తయారీకి కావలసిన పదార్థాలు :

  • 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
  • 200 లీ. నీరు * 2 కి. బెల్లం
  • ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా

తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.

ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.

ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.
Read More

వండని వంట… పచ్చిమిర్చి పచ్చడి

పచ్చిమిర్చిని కూరల్లో కారం కోసం వాడతాం కదా. కానీ, ఒక కూరగాయగా కూడా వాడుకోవచ్చు.

పచ్చిమిర్చిని తింటే, కడుపులో మంట వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి ఆహారంలో, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిమంచిదని చెప్తారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిన తర్వాత, దానికి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి మంచిదని చెప్తారు.

సరే ఆ సంగతి వదిలేసి, పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వాటికి సరిపడా చింతపండు, ఉప్పు, ఇంగువ.
నీటిలో కడిగి శుభ్రం చేసి, తేమ లేకుండా తుడిచిన పచ్చిమిర్చిని, ఉప్పును రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి దంచి, కొంచెం దంచిన తర్వాత, దానికి చింతపండు కలిపి దంచుకోవాలి. కావలసిన వారు జీలకర్ర వేసుకోవచ్చు.

ఆఖరున ఇంగువ కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇది అన్నం లోకి, రొట్టెలు, టిఫిన్స్ అన్నింటిలోకీ బాగుంటుంది.

ఆ పచ్చడికి కొత్తిమీర కలిపి చేస్తే , ‘పచ్చిమిర్చి కొత్తిమీర’ పచ్చడి అవుతుంది.

పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ మాత్రమే కలిపి చేస్తే, అది ‘పచ్చిమిర్చి కారం’ అవుతుంది.

ఈ పచ్చడికి ఉల్లిపాయ కలిపి చేస్తే, ఉల్లిపాయ పచ్చడి అవుతుంది. ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు.
ఒకే విధానంతో రకరకాల పచ్ౘ్ళ్లు చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… నల్లఈశ్వరి

సాధా రణ నామం: సర్పెంట్‌రూట్ ప్లాంట్
శాస్త్రీయ నామం: అరిస్టొలోకియా ఇండిక
కుటుంబం: అరిస్టోలోకియేసి

నల్లఈశ్వరి 5-6 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక తీగ. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఇవి తమలపాకు వాసన కలిగి దాదాపు దీర్ఘచతురస్రాకారంలో చివరి భాగంలో కొంచెం వెడల్పుగా, సూది లాంటి కొనగలిగి ఉంటాయి. పూవుల ఆకర్షణ పత్రావళి ఆకుపచ్చ ఛాయ గల వంగపండు రంగుతో చిన్న ఈగల వంటి కీటకాలు లోపలికి వెళితే బయటకు రావడానికి వీలు లేకుండా నూగు అమర్ౘ్బడిన గొట్టం లాంటి బోను వలే ఉంటుంది. కాయలు గుండ్రంగా ఉండి బద్ధలైతే ఉట్టి (తిరగబడిన గొడుగు) ఆకారంలో ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్కలోని అన్ని భాగాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. దీనిలో అరిస్టొలోకిక్ ఆమ్లాలు, ఆవిరయ్యే నూనె, టానిన్లు ఉంటాయి.
  • దీనిని పాము, పురుగుల కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • జ్వరం, గాయాలు, గుండెజబ్బులు, బొల్లి, కుష్టు, చర్మవ్యాధులు, మూర్ఛ, మానసిక వ్యాధుల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
  • దీని కషాయాన్ని వ్రణములు, ఉబ్బసం, బ్రాంకైటిస్ వ్యాదులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • నల్లఈశ్వరి మిథనాల్ ద్రావణాలు క్యూలెక్స్ జెలిడస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపాయి. (కామరాజ్, అతని అనుచరులు, 2010).
  • అరస్టొలోకియా ఆకు ఇథైల్ ఎసిటేట్ ద్రావణం (5%) స్పోడోప్టెరా లిటూరపై అధిక యాంటిఫీడెంట్ చర్య (56.06%), తినడాన్ని అరికట్టడానికి లీథల్ కాన్‌సెంట్రేషన్ (3.69%), లార్విసైడల్ (40.66%), పూపిసైడల్ (28%), మొత్తం చావు (68.66%), పొడిగించబడిన లార్వల్ ప్యూపల్ సమయం (12.04 -13.08 రోజులు) నమోదు చేసింది (బాస్కర్, అతని అనుచరులు, 2011).
  • అరిస్టొలోకియా బీటికా మిథనాల్ ద్రావణం ట్రైబోలియం కాస్టానియంపై మంచి కీటకనాశక చర్యను ప్రదర్శించింది (జ్బిలో, అతని అనుచరులు, 2006).
  • అరిస్టొలోకియా బ్రాక్టియోలేట కాయల హెక్సేన్ ద్రావణం (5%) జొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే ఖాప్రాబీటిల్, ట్రోగోడెర్మా గ్రానేరియం నుండి గింజలను కాపాడాయి (ఎలామిన్ అండ్ సత్తి, 2012).
  • నల్ల ఈశ్వరి మిథనాలిన్ ద్రావణంలో అరిస్టొలోకిక్ యాసిడ్, అరిస్టోలోకిక్ యాసిడ్ అనే రెండు మిశ్రమాలున్నాయి. అరిస్టోలోకిన్ యాసిడ్ అనోఫెలెస్ స్టెఫెన్సి లార్వాలపై అరిస్టాలోకిక్ యాసిడ్ కన్నా అధిక విషచర్యను ప్రదర్శించింది (ప్రదీప్ వెంకటరామన్, ఆమె అనుచరులు, 2015).
  • అరిస్టొలోకియా ఎలిగాన్స్, అరిస్టొలోకియా టగల ఆకుల ద్రావణాలు క్యాబేజి పంట నాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టిల్లాపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి (కాస్సి, 1983).
  • నల్లఈశ్వరి ఆకుల క్రూడ్ ద్రావణం మరియు ఆకుల నీటి ద్రావణం నుండి సంకలనం చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ హెలికోవర్పా ఆర్మిజరా 3వ దశ లార్వాలపై గరిష్ట యాంటిఫీడెంట్ మరియు లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. (శివ అండ్ సంతోష్ కుమార్, 2015).అరిస్టొలోకియా టగల యాంటిఫీడెంట్ లక్షణాలు నమోదు చేయబడ్డాయి. (కాస్సి, 1983).
  • అరిస్టొలోకియా టగల డైమండ్ బ్యాక్‌మాత్, ప్లుటెల్లా క్ౙెåలోస్టెల్లాపై కీటకనాశక లక్షణాలను చూపాయి (మొరాల్లోరెసెసస్, 1985).
  • అరిస్టొలోకియా టగల స్పోడోప్టెరా లిటూరపై వికర్షక, యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల దశలపై ఈ ప్రభావాలు ప్రస్పుటంగా కనిపించాయి. (లిట్ అండ్ రెజెసస్, 1990).
  • ఈ మొక్క క్రూడ్ ద్రావణం ఆసియాటిక్ మొక్కజొన్న కాండంతొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫర్నకాలిసీని నివారించింది (లిట్ అండ్ రెజెసస్, 1989).
  • ఈ మొక్క ద్రావణం డైమండ్ బ్యాక్ మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై విష చర్యను ప్రదర్శించింది (లిట్ అండ్ రెజెసస్, 1999)
  • ఈ మొక్క ఆకుల 5% ఇథైల్ అసిటేట్ ద్రావణం యాంటిఫీడెంట్, ఫీడింగ్ డిటరెంట్, లార్విసైడల్, ప్యూపిసైడల్, పూర్తిచావు, లార్వల్‌ప్యూపల్ సమయం పొడిగించబడటం వంటి చర్యలను ప్రదర్శించింది (భాస్కర్, అతని అనుచరులు, 2011)
  • నల్లఈశ్వరి ఆకుల ఆల్కహాల్ ద్రావణం (5%) 100% ప్రొడీనియాలిటూర, 3% ఆకుల ద్రావణం 100% యూప్రోక్టిస్ ఫ్రటర్నా; 3% ఆకులు, కాండాలు, లేదా కాయల ద్రావణం, 20% ఆకులు, కాండాల పొడి ద్రావణం 48% మామిడి తేనె మంచు పురుగు (హాపర్) పిల్ల పురుగులను చంపాయి. (పుట్ట రుద్రయ్య అండ్ సుబ్రమణ్యం, 1955Ð1956)
  • ఈశ్వరి వేరు ద్రావణం స్పోడోప్టెరా లిటూరపై గుడ్డు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది (అరివోలి అండ్ టెన్నిసస్, 2013).
  • ఈస్టర్న్ ఘాట్స్‌లోని ఎత్నిక్ కమ్యూనిటీలు నల్లఈశ్వరి ఆకుల ద్రావణాన్ని పురుగుల నివారణలో ఉపయోగించేవారు (శివరాజ్, అతని అనుచరులు, 2017).
  • అరిస్టొలోకియా బ్రాక్టియేట కంకిపొడిని వేరుశనగ పిండితో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ఎలుకల బొరియల దగ్గర ఉంచి ఎలుకలను నివారించవచ్చు (పటేల్, గుప్తా, అతని అనుచరులు, 1991).
  • పురుగుల యాజమాన్యానికి నల్లఈశ్వరి సిల్వర్ నానోపార్టికల్స్‌ని సిఫారసు చేశారు (యశుర్ అండ్ రాణి, 2015).
  • అరిస్టొలోకియా రింజెస్ వేరు పదార్థం వేర్‌హౌస్‌మాత్, ఎఫెస్టియా కౌటెల్లా పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ఐన్, అతని అనుచరులు, 2013).
  • నల్లఈశ్వరి ఆకుల నీటి ద్రావణం వరి పంటలో కాండం కుళ్ళు కలిగించే శిలీంద్రం, స్ల్కీరోషియం ఒరైజె పెరుగుదలనరికట్టింది (వెంకటేశ్వర్లు, అతని అనుచరులు, 2013). నేలవేము, జిల్లేడు, యూకలిప్టస్ 2% ఆకుల ద్రావణం రసాయన శిలీంద్రనాశనుల కన్నా అధిక సమర్ధవంతంగా కాండం కుళ్ళు తెగులును నివారించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More

ఔషధ మొక్క… సముద్రపాల

సముద్రపాల అడవిలో ఇతర పొదలపై లేదా చెట్లపై ప్రాకే పెద్ద తీగ. దాదాపు 10-15 మీ. వరకు ప్రాకుతుంది. దాదాపు మొక్కలోని అన్ని భాగాలు తెల్లని రోమాలతో కప్పబడి ఉంటాయి. కొమ్మలు కత్తిరించినపుడు తెల్లని పాలవంటి జిగట పదార్థం వస్తుంది. ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో ప్రతికణుపు వద్ద ఒకటి చొప్పున వస్తాయి. ఆకుల అడుగు భాగాన నూగు ఉంటుంది. పూలు పెద్దవిగా, గంట ఆకారంలో లేత వంగపండు రంగు లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి రక్షణ పత్రావళిలో కప్పబడి ఉంటాయి.

సాధారణ నామం : చంద్రపాల / కొక్కిత తీగ / ఎలిఫెంట్ క్రీపర్ శాస్త్రీయ నామం : ఆర్ౙిరీయా నెర్వోసా కుటుంబం: కన్వోల్యులేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేర్లు, ఆకులు, లేతకాండాలను, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తారు.
  • గింజలలో అరజైన్, ఐసోఅరజైన్, పెన్నిక్లావైన్ అనే రసాయనాలున్నాయి.
  • ఆకులు మరియు లేత కాండాలను అజీర్ణం, మలబద్ధకం నివారణలో ఉపయోగిస్తారు.
  • ఆకుల నుండి తయారు చేసిన మాత్రలను మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో :

  • సముద్రపాల కాయలలో స్టీరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టెర్పినాయిడ్స్ ఉంటాయి. వీటిలో లైసర్గమైడ్, స్టిగ్మాస్టన3, 5డైయిన్, ఎర్గాటమైన్ అనే మొక్కలకు పర్యావరణపరంగా ఉపయోగపడే ముఖ్యమైన జీవ చురుకుదనం గల పదార్థాలుంటాయి. వీటిని ఔషధాలు, డ్రగ్స్ ఫార్ములేషన్‌లో ఉపయోగిస్తారు (ఎకడె అండ్ మానిక్, 2015).
  • సముద్రపాల ఇథనాల్ ద్రావణాలు టెట్రోసైక్లిన్‌కి సమానంగా యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి. (మోడి, అతని అనుచరులు, 2010).
  • భారతదేశంలో సముద్ర పాల రసాన్ని, సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొంచం డిల్ గింజల పొడితో కలిపి స్కాబీస్ నివారణకు పైపూతగా పూస్తారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పుట్నాల పప్పు పచ్చడి

పుట్నాలపప్పు ఒక కప్పు, పదిహేను ఎండుమిర్చి, (మీ కారానికి తగ్గట్టు వేసుకోండి) కారానికి సరిపడా రాళ్ళ ఉప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి.

వెల్లుల్లిని ఇష్టపడనివాళ్ళు, ఇంగువ వేసుకోండి. లేదా మీ ఇష్టం!

మీకు ఇష్టమైతే, ఇందులో రెండురెబ్బల కరివేపాకు కూడా జోడించవచ్చు.

పైన చెప్పినవన్నీ తీసుకుని, తగినంత నీరు పోసి రోట్లో రుబ్బుకోవడమో, మిక్సీలో రుబ్బుకోవడమో మీ ఇష్టం.

అంతే, పప్పు పచ్చడి సిద్దం. పోపు, తాలింపు ఏమీ అవసరం లేదు.

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే, దీని రుచి అమోఘం. మేము ఎక్కువగా సాయంత్రాలు, చారు కాంబినేషన్‌తో కాని, పచ్చిపులుసుతో కానీ తింటుంటాం.

కొంచెం పెరుగుతో పల్ౘ్న చేసుకుని, ఇడ్లీ, దోశెల్లోకి తిన్నా ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.

(గమనికః శనగలను వేపితేనే, పుట్నాలు అవుతాయి. వేపినవి కద, పుట్నాలు వద్దు అనుకుంటే, శనగపప్పును నానబెట్టి, పుట్నాలకు బదులుగా వాడుకోవచ్చు)

రచన: శ్రీమతి పద్మావతి కొలను

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

బహుళ ప్రయోజనకారి ‘మైకోరైజా (వ్యామ్)’

మైకోరైజా బహుళ ప్రయోజనకారి. పంటలను వేరుకుళ్ళు, ఎండుతెగులు వంటి తెగుళ్ళనుండి కాపాడటమేగాక, వర్షాభావ పరిస్థితుల్లో సుదూర లోతులో ఉన్న నీరు, పోషకాలను సంగ్రహించి మొక్కల వేర్లకు అందిస్తుంది. మైకోరైజాను రైతు వ్యవసాయ క్షేత్రంలోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం : 4 మీ. పొడవు, వెడుల్పు, అరగజం లోతులో గొయ్యి తీసుకోవాలి. అందులో మట్టి మృదువుగా ఉంటే అదే మట్టిని వాడుకోవచ్చు లేదా బయట నుండి మెత్తని మన్ను సేకరించి ఎండబెట్టి శుద్ధి చేసుకుని గోతిలో నింపాలి. దానిలో మెత్తని పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టు కలుపుకోవాలి. గోతిలో ప్లాస్టిక్ షీట్ పరవాలి. అందులో ఎరువు కలిపిన మట్టిని వేసి దానిలో 100 గ్రా. మైకోరైజా కల్చర్ ని కలిపి దానిలో వివిధ రకాల పప్పుధాన్యపు గింజలు, తృణధాన్యపు గింజలు, కూరగాయల గింజలు వరుసల వారీగా విత్తుకుని 40 రోజుల వరకు పెంచాలి. పెరిగిన పైరుకు వారం రోజుల పాటు నీటి తడిని ఆపి మట్టి పొడిబారిన తర్వాత మొక్కలపై కాండాలను కోసి వేయాలి. వేర్లను మట్టితో పాటు పెకలించి పొడి చేసుకుని సంచుల్లో నింపుకోవాలి. క్వింటాళ్ల కొద్ది మైకోరైజా వేర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని మెత్తగా దంచి అన్ని రకాల పైర్ల సాగులో, నారు మడుల పెంపకంలో వినియోగించుకోవచ్చు.

Read More

ఔషధ మొక్క… కదంబం

కదంబం మధ్యస్థం నుండి పెద్దగా పెరిగే ఆకురాల్చే వృక్షం. దీని మాను స్థూపాకారంలో ఉంటుంది. శాఖలు సమాంతరంగా ఉండి శిఖర భాగం గుండ్రంగా ఉంటుంది. బెరడు చిక్కటి గోధుమ రంగులో ఉండి నిలువుగా పగుళ్ళు కలిగి పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు అండాకారం లేదా దీర్ఘ అండాకారంలో ఉండి ఎదురెదురుగా ఏర్పడతాయి. ఆకుల అడుగు భాగంలో నూగు ఉంటుంది. పూలు సువాసన కలిగి పసుపు లేదా నారింజ రంగులో గుండ్రంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి పండితే పసుపు రంగులోకి మారతాయి.

సాధారణ నామం : వైల్డ్ సింఖోన / రుద్రాక్షాంబ శాస్త్రీయ నామం : ఆంతోసిఫాలస్ కైనెన్సిస్, ఆంతోసిఫాలిస్ కదంబం కుటుంబం: రూబియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కదంబం బెరడు, ఆకులు, పండ్లు ఔషధగుణములు కలిగి ఉంటాయి. వాటిలో కాడంబైన్, ఆకడమైన్, బీటాసైటోస్టిరాల్ మొదలగు ఆల్కలాయిడ్లు మరియు కాదంబజెనిక్ ఆమ్లం ఉంటాయి.
  • కదంబం బెరడు టానిక్‌లా పనిచేస్తుంది. జ్వరాలను తగ్గిస్తుంది.
  • ఆకుల కషాయం పుండ్లు, గాయాలు మొదలైన వాటిని తగ్గిస్తుంది. పండ్లు కడుపులో వికారం మరియు జ్వరాలను తగ్గిస్తాయి.

వ్యవసాయరంగంలో…

  • కదంబం ఆకుల పెట్రోలియం ఈథర్, క్లోరోఫాం, అసిటోన్ ద్రావణాలు ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, సాల్మొనెల్లా టైఫా, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాన్డిడా ఆల్బికాన్స్‌పై యాంటీ బాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (చంద్రశేఖర్ అండ్ ప్రసన్న, 2009).
  • కదంబం క్లోరోఫాం ఫ్రాక్షన్ షిగెల్లా డిసెంటెరిమే, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గరిష్ట యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, క్యాండిడా ఆల్బికాన్స్‌పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (రఫ్షాంజని, ఆమె అనుచరులు, 2014).
  • కదంబం కాయలు మరియు పండ్లు ఆల్కహాలిక్ మరియు నీటి ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి.
  • కదంబం మిథనాల్ ఆకుద్రావణం మరియు బయోసింథసిస్ చేసిన నిమ్మగడ్డి గోల్డ్ నానోపార్టికల్స్ క్యూలెక్స్ క్వింక్వెఫాసియేటస్ మొదటిదశ లార్వాలు ప్యూపాలు, పెద్దపురుగుల జీవితకాలాన్ని పెంచాయి. ఈ మొక్కలో ఉన్న చురుకైన రసాయనాలు లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా అరికట్టాయి. (జయలలిత, ఆమె అనుచరులు, 2016)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More