వండని వంట… దోసకాయ రోటి పచ్చడి

పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!

కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.

చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్కల ఆరోగ్యానికి ‘వర్మివాష్’

వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.

Read More

పొదుగు వాపు వ్యాధి (మాస్టైటిస్) కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాస్టైటిస్ అంటే క్షీర గ్రంధి లేక పొదుగు యొక్క వాపు. ఇది పొదుగు యొక్క భౌతిక, రసాయన మరియు సూక్ష్మజీవుల మార్పులను కలుగజేస్తుంది. ఇది ప్రధానంగా పాలలో సోమాటిక్ కణాల పెరుగుదల మరియు క్షీర కణజాలంలోని రోగ లక్షణ మార్పుల ద్వారా గుర్తించబడుతుంది. ఇది పాడి పరిశ్రమలో అత్యంత సాధారణమైన మరియు ఆర్థికంగా నష్టాన్ని కలిగించే వ్యాధులలో ఒకటి. ఇది పాల నాణ్యతను మరియు ఉత్పత్తిని తగ్గేలా చేస్తుంది. మాస్టైటిస్ అనే పదము గ్రీకు పదం. “మాస్టో” అంటే క్షీర గ్రంధిని సూచిస్తుంది మరియు “ఐటిస్” అంటే వాపు అని అర్థం.

పొదుగు వాపుకు ముందస్తు కారణాలు

  • సాధారణంగా పొదుగు వాపు ఎక్కువ ఈతలు ఈనిన పశువులలో చూడవచ్చు.
  • తక్కువ దిగుబడి నిచ్చే వాటికంటే అధిక దిగుబడినిచ్చే పాడి ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
  • అన్య దేశ మరియు సంకరజాతి ఆవులకు పొదుగు వాపు ఎక్కువగా వస్తుంది.
  • పొదుగు నుండి అసంపూర్ణంగా పాలు పితకడం
  • జన్యుపరమైన కారణాలు అనగా పొడవాటి చనులు, కిందకు ఉండే పొదుగు
  • గాయాలు గల చనులు, పొదుగు వ్యక్తిగత అపరిశుభ్రత, అపరిశుభ్ర మైన పరిసరాలు మొదలైనవి పొదుగు వాపు కు దోహదపడతాయి.

కారణాలు
పొదుగు వాపుకు కారణాలుగా వివిధ రకాల సూక్ష్మక్రిములు సూచింపబడతాయి. అవి బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు), వైరస్ (సూక్ష్మతి సూక్ష్మక్రిములు), ఫంగస్ (శిలీంద్రాలు) మరియు మైకోప్లాస్మా.
పొదుపు వాపుకు కారణమయ్యే అతి ముఖ్యమైన బ్యాక్టీరియాలు- స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే, స్ట్రెప్టోకోకస్ జూఎపిడెమికస్, స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్, క్లెబ్సియెల్లా, మైకోబాక్టీరియం బోవిస్, ఎస్చేరిచియా కోలై, బ్రూసెల్లా అబోర్టస్; సూడోమోనాస్ మొదలగునవి
మాస్టైటిస్కు కారణమయ్యే శిలీంధ్ర జీవులు- ట్రైకోస్పోరాన్, ఆస్పెర్‌గిల్లస్ ఫ్యూమిగాటస్, ఆస్పెర్‌గిల్లస్ మిడులస్; కాండిడా జాతులు.

వ్యాప్తి విధానం
చనుల యొక్క రంద్రాల ద్వారా ఇన్ఫెక్షన్ క్షీర గ్రంధికి చేరుకుంటుంది పొదుగు మరియు పర్యావరణం లో నివసించే సూక్ష్మ క్రిములు వంటివి అనుకూలమైన పరిస్థితులలో వృద్ది చెంది కణజాలాలపై దాడి చేయటం వలన చాలా హానికరమైన ప్రభావం ఏర్పడుతుంది. ఆవు యొక్క చర్మ ఉపరితలం మీద అనేక క్రిములు నివాసం కలిగి ఉండవచ్చు మరియు అక్కడ నుండి ఆ క్రిములు పాలు పితికే వారి ద్వారా కలుషితం చెంది వ్యాధి వచ్చే అవకాశం ఉండవచ్చు. పాలు పితికే వారి చేతులు, బట్టలు మరియు పాలు పితికే యంత్రాల కప్పుల ద్వారా వ్యాధి సోకిన పొదుగు భాగం నుండి వ్యాధి సోకని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గ్రంధి నుండి వచ్చే స్రవాలు, నేలను కలుషితము చేయడం ద్వారా వ్యాధి సంక్రమణ చెందుతుంది.

పొదుపు వాపు రకాలు
1) వ్యాధి లక్షణాల ఆధారంగా
a) క్లినికల్ మాస్టైటిస్
ఇందులో పొదుగు వాపు లక్షణాలైన వాపు, వేడి, ఎరుపు రంగు, తీవ్రమైన నొప్పి ఉంటుంది.
b) సబ్ క్లినికల్ మాస్టైటిస్
ఈ రకంలో పొదుగు నందు ఎటువంటి బాహ్య లక్షణాలు కనపడవు కానీ పాలలో మార్పులు అంటే సోమాటిక్ కణాలు, తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు) మరియు ఎపితీలియల్ కణాలలో మార్పు, పాల పిహెచ్ (PH)లో మార్పులు గమనించవచ్చు.
2) పొదుగు వాపు తీవ్రత ఆధారంగా
a) తేలికపాటి మాస్టైటిస్
పాలలో స్వల్ప మార్పులు, పలుకులు లేదా గడ్డ కట్టడం గమనించవచ్చు.
b) తీవ్రమైన మాస్టైటిస్
పాలలో మార్పులు మరియు పొదుగులో వాపు మరియు నొప్పితో పాటు మరింత స్పష్టమైన మార్పులు గమనించవచ్చు.
c) అతితీవ్రమైన మాస్టైటిస్
శారీరక సంబంధ సంకేతాలైన జ్వరం, ఆకలి లేకపోవటం మరియు తీవ్రమైన పొదుపు వాపు వంటి లక్షణాలను గమనించవచ్చు.
3) కాలవ్యవధి ఆధారంగా
a) అతి తీవ్రమైన మాస్టైటిస్
తీవ్రమైన లక్షణాలతో ఆకస్మికంగా ప్రారంభమవుతుంది తరచుగా శారీరక సంబంధమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
b) తీవ్రమైన మాస్టైటిస్
గుర్తించదగిన లక్షణాలతో త్వరగా ప్రారంభమవుతుంది
c) సబక్యూట్ (తక్కువ తీవ్రమైన) మాస్టైటిస్
తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటాయి ఇది తీవ్రమైన మాస్టైటిస్ కంటే తక్కువ తీవ్రమైనది
d) దీర్ఘకాలిక మాస్టైటిస్
నిరంతర వాపు కలిగి ఉండి సమయానుకూలంగా వ్యాధి లక్షణాలు కనబడతాయి.
4) కారణ కారక ఆధారంగా
a) సంక్రమించే (కంటేజియస్) మాస్టైటిస్
ఇది ప్రధానంగా పాలు పితికే ప్రక్రియలో ఒక ఆవు నుండి మరొక ఆవుకు వ్యాప్తిస్తుంది. కలుషితమైన పాలు పితికే పరికరాలు, చేతులు మరియు బెడ్డింగ్ వస్తువుల ద్వారా పాలు పితికే సమయంలో వ్యాప్తిస్తాయి.
వ్యాధికారకాలు: స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే మరియు మైకోప్లాస్మా జాతులు.
b) పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) మాస్టైటిస్
ఇది ఆవు పరిసరాలలో ఉన్న కలుషితమైన బెడ్డింగ్ వస్తువులు, నేల, నీరు మరియు ఎరువు వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా పాలు పితికే సమయాల మధ్య సంక్రమిస్తాయి వ్యాధికారకాలు: ఎస్చరీషియా కోలై, క్లెబ్సియెల్లా మరియు స్ట్రెప్టోకోకస్ యుబేరిస్.

వ్యాధి అభివృద్ధి చెందే ప్రక్రియ
ఇది మూడు దశలుగా వివరించవచ్చు. సూక్ష్మ క్రిములు చనుల ద్వారా చొరబడుట, ఇన్ఫెక్షన్ మరియు వాపు కలుగజేయుట.

  1. మొదట వ్యాధికారక సూక్ష్మ క్రిములు చనుమొనల చివర నుండి పాల గ్రంధిలోనికి చొరబడతాయి.
  2. ఇన్ఫెక్షన్ దశ అంటే వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెంది, క్షీర కణజాలంపై దాడి చేస్తాయి.
  3. వాపు దశలో పొదుగు యొక్క వాపు, పాలలో మార్పులు అంటే పాలుగడ్డ కట్టడం, విరిగిపోవడం అనే లక్షణాలు కలిగి ఉండవచ్చు.

పొదుగు వాపు లక్షణాలు
పొదుగుకు సంబంధించిన లక్షణాలు:

  • ఉద్దరoవాపు లేదా పొదుగు వాపు
  • గ్రంధి భాగం బాగా ఉబ్బిపోవడం
  • ఉష్ణోగ్రత పెరగడం, స్పర్శకు వేడిగా ఉండటం, ఎరుపు రంగులో మారడం
  • తీవ్రమైన నొప్పి
    పాలలో మార్పులు
  • పాలు నీరు లాగా ఉండటం
  • పాలు గడ్డకట్టడం లేదా రక్తపు చుక్కలు గమనించవచ్చు
  • కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వాసన కూడా గమనించవచ్చు.
    తీవ్రమైన మాస్టైటిస్ లో కనిపించే ఇతర శారీరక సంభందిత లక్షణాలు
  • జ్వరము
  • ఆహారం తినకపోవడం
  • నీరసంగా ఉండటం
  • దాహం ఎక్కువగా ఉండటం
  • డిహైడ్రేషన్
  • పాల ఉత్పత్తి తగ్గిపోవడం చూడవచ్చు.

మాస్టైటిస్ నిర్ధారణ పద్ధతులు
క్లినికల్ మాస్టైటిస్ ను కళ్ళతోనే పాలలో కలిగే మార్పుల ద్వారా గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి.

  1. భౌతిక పరిశీలన (ఫిజికల్ ఎగ్జామినేషన్): పొదుగు భాగాన్ని పరిశీలించి, వాపు, ఉష్ణోగ్రత, నొప్పిని గుర్తించడం. పాల ప్రవాహాన్ని గమనించడం. పాల రంగు, వాసన, గడ్డలు కట్టడం లాంటి లక్షణాలను పరిశీలించడం.
  2. క్యాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ (CMT): పాలలో సోమాటిక్ కణజాలాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు. పాలకు ఒక రియేజెంట్ ను జతచేసి దాని చిక్కదనాన్ని (జెల్ ఫార్మేషన్) గమనించడం ద్వారా మాస్టైటిస్ ను గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించడానికి ఈ టెస్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సరళమైన, త్వరిత పరీక్ష. తక్కువ ఖర్చుతో ఫీల్డ్‌లోనే నిర్వహించగలిగే పరీక్ష.

కావాల్సిన పరికరాలు:

  • CMT ప్లేట్ (4 కువెట్లు ఉన్న ప్లాస్టిక్ ట్రే)
  • స్పెషల్ రియేజెంట్ (CMT, లిక్విడ్ ఆధారిత డిటర్జెంట్)
  • పాల నమూనాలు (ప్రతి ఉద్ధర భాగం నుంచి)

పరీక్ష పద్ధతి:

  1. గేదె యొక్క పొదుగు నాలుగు భాగాల నుండి పాలను CMT ప్లేట్‌లో ఒక్కో కువెట్లలో తీసుకోవాలి
  2. ప్రతి పాల నమూనాలోకి CMT రియేజెంట్ ను కలపాలి (సమాన 1:1 నిష్పత్తిలో)
  3. ప్లేట్‌ను సున్నితంగా 10 సెకన్లపాటు కలియబెట్టాలి
  4. జెల్ ఫార్మేషన్ స్థాయి (చిక్కదనం) ఆధారంగా ఫలితాన్ని గమనించాలి

ఫలితాల వివరణ:
రియాక్షన్ ఫలితాలు సోమాటిక్ సెల్ కౌంట్ అంచనా
పలుచగా ఉండి పాలలో ఎటువంటి మార్పు లేకపోవటం నెగటివ్ <200,000 కణాలు/ml చిక్కగా సబ్ క్లినికల్ మాస్టైటిస్ 200,000 – 500,000 స్పష్టమైన జెల్ పాజిటివ్ (క్లినికల్ మాస్టైటిస్) >500,000
చాలా గట్టి గడ్డలు శక్తివంతమైన పాజిటివ్ >1,000,000

జాగ్రత్తలు:
పరిశుభ్రమైన వాతావరణంలో చేయాలి
తాజా పాల నమూనాలను మాత్రమే ఉపయోగించాలి
వాసన లేదా రంగు మార్పుతో పాటు ఫలితాన్ని అర్థం చేసుకోవాలి

  1. పాల కల్చర్ మరియు సెన్సిటివిటీ టెస్ట్ (ABST): పాలు శుభ్రంగా సేకరించి, ల్యాబ్ లో కల్చర్ చేసి మాస్టైటిస్ కలిగించే బ్యాక్టీరియా ఏవో గుర్తించవచ్చు. తగిన యాంటీబయాటిక్ ను ఎంచుకునేందుకు ఈ టెస్ట్ చాలా దోహదపడుతుంది.
  2. సొమాటిక్ కణజాలం కౌంట్ (సొమాటిక్ సెల్ కౌంట్) (SCC): పాలలో తెల్ల రక్త కణాల సంఖ్య ఆధారంగా ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయవచ్చు. రెండు లక్షల కణాల కంటే ఎక్కువగా ఉంటే మాస్టైటిస్ ను సూచిస్తుంది.
  3. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్: పాలలో ఉన్న అయాన్ల పరిమాణం మార్పు ఆధారంగా పాలు మాస్టైటిస్ వలన ప్రభావితమైందో లేదో చెప్పగలదు. ఇది వేగమంతమైన ఫీల్డ్ టెస్ట్.
  4. పాల యొక్క పీహెచ్ (PH) పరీక్ష: మాస్టైటిస్ ఉన్న పాలలో పిహెచ్ పెరుగుతుంది. 6.6 కంటే ఎక్కువగా ఉంటుంది.
  5. తర్మోగ్రఫీ: ఇన్ఫ్రారేడ్ కెమెరాలతో పొదుగుభాగం ఉష్ణోగ్రతను అంచనా వేయడం ద్వారా గుర్తించవచ్చు. పొదుగు వాపు వ్యాధి సంభందమైన మార్పులను తేలికగా గుర్తించవచ్చు.

చికిత్స:
(A) యాంటీబయాటిక్స్ (Antibiotics)
• ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే బ్యాక్టీరియాలను వృద్ధిచెందకుండా, యాంటీబయాటిక్ లను ఉపయోగిస్తారు. ఇవి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ (ABST) ఆధారంగా ఇచ్చినట్లయితే చికిత్సకు అగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

ఇంట్రామామరీ యాంటీబయాటిక్స్ (పొదుగులోకి ప్రత్యక్షంగా ఇవ్వడం):
o Cloxacillin
o Amoxicillin
o Cephalosporins

సిస్టమిక్ యాంటీబయాటిక్స్ (ఇంజెక్షన్లు రూపంగా):
o Enrofloxacin
o Penicillins
o Oxytetracycline
o Cephalosporins

(B) యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందులు (Anti-inflammatory drugs)
• పొదుగు యొక్క వాపు మరియు నొప్పి తగ్గించడానికి ఈ మందులు వాడతారు.
ఉదాహరణలు:
o Flunixin meglumine
o Meloxicam

తీవ్రమైన కేసులలో శస్త్రచికిత్స:
వ్యాధి తీవ్రంగా ఉండి, చీముతో ఉన్నప్పుడు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వ్యాధిని నివారించడానికి, ఆ పొదుగు భాగాన్ని తొలగించడం అవసరమవుతుంది.

నివారణ మరియు నియంత్రణ:

  • ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రిoచడానికి వ్యాధిసోకిన పశువులను వేరుచేయాలి.
  • పశువైద్యులు సూచించిన విధంగా వ్యాధి సోకిన పశువులకు చికిత్సను క్రమం తప్పకుండా అందించాలి.
  • మాస్టైటిస్ ఉన్న పశువులను రోజుకు 3-4 సార్లు పాలను పూర్తిగా పిండాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
  • పాలు పితికే ప్రాంతాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాలి.
  • బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సరైన వెలుతురు, గాలి మరియు మంచి పారిశుధ్యాన్ని పాటించాలి.
  • పశువులకు శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • గడ్డి లేదా ఇసుక వంటి శుభ్రమైన మరియు పొడి బెడ్డింగ్ పదార్థాలను ఉపయోగించాలి.
  • విటమిన్లు మరియు ఖనిజ లవణాలతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని అందించడం ద్వారా పశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.
  • పాలు పితికే ముందు, తరువాత పొదుగును శుభ్రంగా కడిగి, మెత్తని పొడి గుడ్డతో తుడవాలి.
  • పాలు పితికేవారు చేతులు శుభ్రంగా కడుక్కొని పాలను పిండాలి.
  • పాలు పితికిన తర్వాత చనుమొనల ద్వారం దాదాపు ఇరవై నిమిషాలు తెరుచుకొని ఉంటుంది. ఈ సమయంలో సూక్ష్మక్రిములు పొదుగు లోనికి చొరబడి వ్యాధిని కలుగజేస్తాయి. అందువలన, పాలు పితికిన తర్వాత చనుమొనలను క్రిమిసంహారక ద్రావణంలో ముంచడం వల్ల పొదుగు వాపును నివారించవచ్చు. ఈ పద్ధతిని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు. దీని ద్వారా పొదుగు వాపుకు ప్రధాన కారణాలైన సూక్ష్మక్రిములు చనుమొనల నుంచి లోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. పోవిడోన్ ఐయోడిన్ లేదా క్లొర్‌హెక్సిడిన్ ఉత్పత్తులను టీట్ డిప్పింగ్ కొరకు ఉపయోగించవచ్చు.
  • తరచుగా CMT పరీక్షలు నిర్వహించడం ద్వారా సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించి చికిత్స చేయడంతో పొదుగు వాపును అరికట్టవచ్చు.
  • డ్రై కౌ థెరపీ (Dry Cow Therapy) పాటించడం ద్వారా పొదుగు వాపును నివారించవచ్చు.
    డ్రై కౌ థెరపీ అనేది పశువు పాలివ్వడం ఆపిన తర్వాత (లాక్టేషన్ ముగిసినప్పుడు), తదుపరి ప్రసవానికి ముందు ఉన్న డ్రై పీరియడ్ (సుమారు 60 రోజుల పాటు ఉంటుంది) సమయంలో పొదుగు లోనికి యాంటిబయాటిక్ లను వాడడం. ఈ చికిత్స ద్వారా:
    • డ్రై పీరియడ్ లోఉన్న మాస్టిటిస్ ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి
    • కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు
    • తదుపరి లాక్టేషన్‌కి మేలైన పాల ఉత్పత్తి కలుగుతుంది.
    డ్రై కౌ థెరపీ రకాలు
  1. బ్లాంకెట్ డ్రై కౌ థెరపీ (BDCT): ఇందులో ఇన్ఫెక్షన్ స్థితితో సంబంధం లేకుండా, పాలిచ్చే కాలం చివరిలో అన్ని పశువులకు యాంటీబయాటిక్స్‌ చికిత్స చేయడం జరుగుతుంది.
  2. సెలెక్టివ్ డ్రై కౌ థెరపీ (SDCT): కేవలం ఇన్ఫెక్షన్ ఉన్న లేదా అనుమానం ఉన్న పశువులకు మాత్రమే యాంటిబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది.

Dr పి. రేవతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్సు, ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్. Ph: 9966038791
Dr ఆర్. సుధాకర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ డిస్పెన్సరీ, దేవగుడి (మం), వై.యస్.ఆర్ కడప (జిల్లా), ఆంధ్రప్రదేశ్.

Read More

వండని వంట… మామిడికాయ కొబ్బరి పచ్చడి

పచ్చడి తయారీకి రెండు మామిడికాయలు, ఒక కొబ్బరి చిప్ప, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర, తగినంత కారం, ఉప్పు అవసరం.

మామిడి కాయల్ని కడిగి తుడిచి, ముక్కలుగా కోసుకోవాలి. అందులో జీడి ఉన్నా పిక్క ఉన్నా తీసెయ్యాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసుకొని, వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర రోటిలో వేసి దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్నా ఫరవాలేదు. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు దంచుకోవాలి. అంతే పచ్చడి రెడీ. రుచికరంగా ఉంటుంది. అవసరం అనుకున్నవారు, ఎండుమిర్చి, అవాలు, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోతే ఎలా అనుకునేవారు, పోపుకు బదులుగా, గానుగ నూనెను కానీ, నెయ్యిని కానీ, ‘మామిడి-కొబ్బరి’ పచ్చడి మీద వేసుకుని తినవచ్చు. ఈ సీజన్లో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.

  • పొనగంటి వేంకట రాజ్యలక్ష్మి, జమ్మికుంట

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల తయారీ, ప్రాముఖ్యత మరియు వినియోగం

ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం

ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:

  • నేల సారవంతత పెరుగుతుంది.
  • పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
  • నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
  • రసాయన అవశేషాలు తగ్గుతాయి.
  • ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
  1. జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి
    జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.
    తయారీకి కావలసిన పదార్థాలు
  • దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
  • ఆవు మూత్రం – 10 లీటర్లు
  • బెల్లం – 2 కిలోలు
  • శనగపిండి – 2 కిలోలు
  • పొలం మట్టి – 1 కిలో
  • నీరు – 200 లీటర్లు

ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
  • మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
  • పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
  • నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
  1. పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం

పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి.
ఉద్యాన పంటలపై ప్రభావం
పుష్పించే శాతం పెరుగుతుంది.

  • పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
  • పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
  • కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
    ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
  1. వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ

వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది.
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • కూరగాయలలో అధిక దిగుబడి.
  • పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
  • పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
  • మొక్కల వేర్ల అభివృద్ధి.
  1. వర్మివాష్

వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
వినియోగం
5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.

  • నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
  • ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
  1. బీజామృతం
    ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు
  • విత్తన వ్యాధుల నివారణ.
  • మొలక శాతం పెరుగుదల.
  1. వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు
    ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    ప్రయోజనాలు
  • తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
  • పర్యావరణానికి హాని లేకపోవడం.
  • ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
  1. అగ్నాస్త్రం
    అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని.
    పదార్థాలు:
    • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు
    • వేపాకు పేస్ట్: 5 కిలోలు
    • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు
    • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు
    • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో

తయారీ విధానం:

  1. ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
  2. ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
  3. తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
  4. చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.

  1. బ్రహ్మాస్త్రం.
    వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’.
    కావలసిన పదార్థాలు:
    • ఆవు మూత్రం: 20 లీటర్లు
    • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)

తయారీ విధానం:

  1. ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
  2. పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
  3. పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
  5. 48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి.
• ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు

  1. ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు
• చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు)
• నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి)
• ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది

తయారీ విధానం

  1. చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
  2. బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
  3. మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
  4. నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
  5. గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
  6. వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.

ఉపయోగించేపద్ధతి:
స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి.
• మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు.
• సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.

ఉపయోగాలు
• మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.
• ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి.
• పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది.
• నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

  1. మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు
• పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ).
• ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు).
• త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు.
గుంత లేదా కుప్ప పద్ధతి

  1. స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
  2. మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
  3. రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
  4. పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
  5. పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి.
    • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు.
    • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి.
    • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.

ఎరువు తయారీ సమయం
వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర

సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

ముగింపు
ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.

డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని
డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291

Read More

ఔషధ మొక్క – పిండిదొండ

సాధారణ నామం : కొండపిండి/పిండికూర శాస్త్రీయ నామం : ఏర్వ లానాట కుటుంబం: అమరాంథేసి

పిండి దొండ కొయ్యలాంటి కాండం కలిగి భూమిపై ప్రాకే మొక్క లేదా మెత్తగా వుండే బహువార్షిక మొక్క. కొన్నిసార్లు మొక్క మొదటి సంవత్సరంలోనే పూతకు వస్తుంది. పిండిదొండ సాధారణంగా భారతదేశంలో అన్ని చదరపు ప్రాంతాలలో పెరిగే కలుపు మొక్క. దీనివేరు కర్పూరం వంటి వాసన కలిగి ఉంటుంది. దీని ఎండిన పూలను బ్యూకల్లాన్, బూర్‌పేర్లతో అమ్ముతారు. దశపుష్పాలు అనే పవిత్ర పూలలో ఇది ఒకటి. ఇది కొమ్మలు, కొయ్యలాంటి వేరు వ్యవస్థ కలిగిన వార్షిక మొక్క. కాండాలు ఎక్కువగా పక్కకు ప్రాకుతూ దూరంగా విస్తరిస్తాయి. కొన్నిసార్లు 6 అ. పొడవు వరకు విస్తరిస్తాయి. కాడలు లేని ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. అవి కోడిగుడ్డు ఆకారంలో 0.5 అం. నుండి 1.5 అం. పొడవుంటాయి. ఆకు ఆండానికి అతికి వుండేచోట నుండి రెండు లేదా మూడు పూలతో చిన్న గుత్తులు ఏర్పడతాయి. పూలు 0.1 అం. పొడవుతో పింక్, ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులలో ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లతో సహా మొక్క అన్ని భాగాలు వివిధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి., ఇది మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
  • మొక్క ఆకులు సూప్ తయారీలో లేదా ఆకుకూరగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క పశువులు, కోళ్ళకు మేతగా పనికి వస్తుంది. ఈ మొక్క యాంటి మైక్రోబియల్ లక్షణాలు కలిగి చర్మవ్యాధుల కారకాల నుండి రక్షిస్తుంది., మూత్ర వర్థకంగా పనిచేస్తుంది.
  • నొప్పి, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపులోని పరాన్నజీవి నులి పురుగులను నివారిస్తుంది.
  • మొలల నుండి రక్తం స్రవించడాన్ని అరికడుతుంది. మూత్ర పిండాలు, గాల్‌బ్లాడర్‌లోని రాళ్ళను తొలగిస్తుంది. ఈ మొక్క ఒక ఔషధ టానిక్‌లా ఉపయోగపడుతుంది. జ్ఞానశక్తిని పెంచుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, జీర్ణ సమస్యల చికిత్సకుపయోగిస్తారు. మెడ, వెన్నునొప్పులు, జ్వరం, మూత్ర సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • హెపటైటిస్, లివర్ వాపులను సమర్ధవంతంగా నివారిస్తుంది. అనీమియా, ఆల్ౙిమర్, ఆర్థ్రెåటిస్, కొలెస్టరాల్, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణ వంటి ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • పిండి దొండ ఆకుల బెంజీన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. పూల బెంజీన్ ద్రావణం ట్రైకోస్పరా అసాహిపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. వేరు అసిటోన్ ద్రావణం కాండిడా పారాప్సిలాసిస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ట్రైకోస్పరా అసాహి, మ్యూకార్ ఇండికస్‌పై ఆకులు, పూల ద్రావణాల కన్నా అధిక యాంటి ఫంగల్ చర్యలను ప్రదర్శించింది (విద్య అండ్ ఉదయకుమార్, 2017).
  • పిండిదొండ, అకలైఫా ఇండికా, ఫిల్లాంతస్ అమర ఆకుల మిథనాల్ ద్రావణాలు పంటలలో బాక్టీరియా తెగుళ్ళు కల్గించే క్ఖా0తోమోనాస్ కాంపెస్ట్రిస్, మానవులలో వ్యాధులు కలిగించే యూరోనోమస్ హైడ్రోపిలా బాక్టీరియాల పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (బ్రిట్టో, అతని అనుచరులు, 2011).
  • పిండిదొండ వేరు ద్రావణం శనగ పంటనాశించే రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటాపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (మురుగేశ్వరి, ఆమె అనుచరులు, 2016).
  • పిండిదొండ, అబుటిలాన్ ఇండికం, అకలైఫా ఫ్రక్టికోసా, అకిరాంథస్ ఆస్పెరా, అడతోడ జీలానిక, మారేడు, ఆల్బిజియా అమర్, ఆండ్రోగ్రాఫిస్ లినియేట, ఆండ్రాగ్రాఫిన్ పానిక్యులేట, వేప, బుడ్డకాకర, క్యాసియా టోరా, బిళ్ళగన్నేరు, ఉమ్మెత్త, జిమ్నెమ సిల్వెస్టర్, తురకవేప, ఆసిమం కానమ్, ఆసిమం సాంక్టమ్, పెర్గులేరియండీమియా, ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ సొలానంనైగ్రం, సొలానం సురెట్రెన్స్, సొలానం ట్రైలోబేటం, ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్, వావిలాకుల నీటి ద్రావణాలను శనగపచ్చ పురుగు, హెలికోవర్పా ఆర్మిజెరా 6వ దశ లార్వాలపై యాంటీఫీడెంట్ చర్యను పరీక్షించారు. 6వ దశ లార్వాలో చావు శాతం ఈ క్రమంలో ఉంది. తురకవేప > వేప > సొలానం ట్రైలోబేటం > నేలవేము > మారేడు > ఆండ్రోగ్రాఫిస్ లీనియేట > సొలానం సురెట్రెన్స్ > బిళ్ళగన్నేరు > అడతోడ జీలానిక > అకలైఫా ఫ్రక్టికోసా > ఉమ్మెత్త > సొలానం నైగ్రం > ఆసిమం కానమ్ > ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ > ఆసిమం సాంక్టం > పెర్గులేరియా డీమియా > ఆల్బిజియా అమర > జిమ్మెమ సిల్వెస్టర్ > బుడ్డకాకర > వావిలాకు > వేప > కాసియా టోర > ట్రిబ్యులెస్ టెర్రెస్ట్రిస్ > ఉత్తరేణి > పిండిదొండ (రమ్య అండ్ జయకుమార్ రాజ్, 2009).
  • పిండిదొండ ద్రావణం చెరకు పంటలో నారు మొక్కల మాడుతెగులు, విత్తన మొలక శాతం తగ్గించే కర్వులేరియాల్యునేటని సమర్ధవంతంగా నివారించింది (నందిని అండ్ అంజనా, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777కు సంప్రదించండి

Read More

సాగు ఖర్చును తగ్గించే ‘మట్టికుండ రసాయనం’

తయారీ విధానం – కావల్సిన వస్తువులు :

  • 100 గ్రాముల విటెక్స్ నెగుండ ఆకులు (వావిలాకులు)
  • 100 గ్రాముల కలోట్రాపిస్ ఆకులు (జిల్లేడు)
  • 100 గ్రాముల వేపాకులు
  • 50 గ్రాముల పప్పు (ఏదైనా)
  • 1 లీటరు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ
  • 1.5 లీటర్లు మంచి నీరు ముందుగా మూడు రకాల ఆకులను మెత్తటి గంధంలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. దీనికి నీరును చేర్చాలి. దీనిని ఒక కుండలో పోసి మూతికి గుడ్డ కట్టాలి. కుండలోని మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తిర్లమర్ల కలపాలి (కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి). పదిహేను, ఇరవై రోజుల తరువాత సేంద్రియ జీవ రసాయనం తయారవుతుంది. తయారైన జీవ రసాయనాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పొలం మీద పిచికారి చేయాలి. ఇది ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. పిచికారీని ఆకుల మీదే చేయాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం పొద్దు గూంకే వేళలో పిచికారి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఇది వివిధ రకాల కీటకాలనాశినిగానే కాక మొక్కలకు పోషకాలను అందించి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా రసాయనాల వలన వాతావరణం, నేల విషపూరితం కాకుండా కాపాడుతుంది.
Read More

పశువులలో గర్భస్రావాలకు కారణాలు – నివారణ

చూడి పశువు నెలలు నిండక మునుపే పిండాన్ని లేదా చనిపోయిన దూడను ప్రసవించడానిని గర్భస్రావము లేదా ఈసుకుపోవడం అని అంటారు. పశువు ఈసుకుపోవడం వలన అనేక కష్టాలు కలుగుతాయి. పిండాన్ని లేదా దూడను కోల్పోవడం, పాడిని కోల్పవడం, పశువు గర్భకోశ వ్యాధుల బారిన పడడం, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, ఒక్కోసారి వ్యంధత్వం ప్రాప్తించడం, ఒట్ఠి పశువును దీర్ఘకాలం పాటు మేపవలసి రావడం లేదా అమ్మవలసి రావడం, ఒకవేళ గర్భస్రావం అంటువ్యాధి వల్లనయితే మిగిలిన పశువులు కూడా ముప్పు బారిన పడడం వంటి వాటి ద్వారా రైతుకు ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది.

గర్భస్రావాలకు కారణాలు:

ప్రమాదాలు: చూడిపశువును ఇతర పశువులు పొడవటం కానీ, పోట్లాటల వలన గాయపడడం వల్ల కానీ గర్భస్రావాలు జరుగవచ్చు. ఏటవాలు ప్రదేశాలలో మేతమేయడానికి, కుంటలలో నీరు త్రాగడానికి వెళ్ళినపుడు ప్రమాదవశాత్తు జారిపడడం వల్ల, వాహనాల ప్రమాదాల వల్ల గర్భస్రావానికి అవకాశముంది.

పోషకాహార లోపం: గర్భస్థ పశువులకు అధిక మాంసకృత్తులు కలిగిన బలవర్ధకమైన సమగ్ర పౌష్ఠికాహారం అత్యవసరం. పచ్చిమేతలతో పాటు మిశ్రమ దాణా కూడా అవసరం. చూడి పశువు ఆకలితో మాడటం, పోషకాహార లోపం, విటమిన్ ఏ లోపం, అయోడిన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజ లవణాల లోపం వలన గర్భస్రావాలు జరుగవచ్చు.

జన్యుపరమైన కారణాలు: కొన్ని జన్యుపరమైన తేడాల వలన కూడా పిండ మరణాలు సంభవించవచ్చు.

జీవరసాల ఉత్పత్తిలో తేడా: గర్భస్థ పశువులలో చూడి పరిరక్షణ కొరకై కొన్ని రకాల జీవరసాలు లేదా హార్మోన్లు విడుదలవుతాయి. అందులో ప్రధానమయినది ‘ప్రొజెస్టిరోను’ అను జీవరసం. ఈ జీవరసం అండాశయం నుండి విడుదలవుతుంది. ఈ జీవరసం ఉత్పత్తి తగ్గి ఇతర హార్మోన్లు (ఈస్ట్రోజన్ వంటివి) అధికమైన వాటి నిష్పత్తిలో తేడా రావటం వలన గర్భస్రావాలు జరుగుతాయి. పిల్లిపెసర, ఉలవలు, చెరకు మొదలగు వాటిలో ఈస్ట్రోజన్ జీవరసం ఎక్కువగా ఉంటుంది. ఈ మేతలను పశువులకు ఎక్కువగా మేపడం వలన హార్మోన్ నిష్పత్తిలో తేడా వచ్చి గర్భస్రావాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. నిలువ ఉండి తడిచి బూజు పట్టిన మొక్కజొన్న లేదా దాణా మిశ్రమం చూడి పశువులకు మేపడం ద్వారా కూడా ఈసుకుపోతాయి. నాణ్యతలేని, సరిగ్గా పులియని సైలేజి కూడా గర్భస్రావాలకు కారణమే.

సూక్ష్మజీవులు: సూక్ష్మజీవులు అంటే బాక్టీరియా, వైరస్, ప్రొటోజోవా, కొన్ని రకాల ఫంగస్‌లు మొదలగునవి చూడి పశువులకు సోకినచో గర్భస్రావాలు జరుగుతాయి.

ఒత్తిడి: చూడి పశువు వేసవిలో అధికవేడికి, ఒకచోట నుండి మరియొక చోటికి వాహనములో తరలించడం వల్ల, కొన్ని రకాల శస్త్రచికిత్సలకు గురి అయినపుడు తీవ్రమైన అలసట, వత్తిడికి గురి అయి ఈసుకుపోతాయి.
రసాయనాలు, విషతుల్యమైన మొక్కలు తినడం: పశువులు ప్రమాదవశాత్తు నాఫ్తలీన్, పాదరసం, ఆర్సెనిక్, నైట్రేట్స్ వంటి రసాయన పదార్థాలను తినడం వలన, మేతకు వెళ్ళినపుడు కొన్ని రకాల విషతుల్యమయిన మొక్కలను మేయడం వలన ఈసుకుపోతాయి.

నివారణా చర్యలు

  1. ఈనడానికి సిద్ధముగê వున్న చూడి పశువులను ఇతర పశువులతో, మందతో మేతకు పంపకూడదు.
  2. చూడి పశువులను కొట్టడం, భయపెట్టి పరుగెత్తించడం చేయకూడదు.
  3. చూడి పశువును చల్లటి పాకలో ఉంచి, శుభ్రమయిన త్రాగు నీరు, మేత అందించి అధిక వేడి బారి నుండి కాపాడి శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలి.
  4. చూడి పశువుకు ఖనిజ లవణాలు, విటమిన్లు తగుపాళ్లలో ఉన్న నాణ్యమైన సమీకృత దాణా మిశ్రమమును, పచ్చి మేతలను, ఎండుగడ్డిని తగినంత అందించవలెను. బూజుపట్టిన దాణాను మేతగా వినియోగించకూడదు.
  5. మంచి గాలి, వెలుతురు వచ్చే పాకలో చూడి పశువులనుంచి, పాకలో బండలు జారుడు లేకుండా చూడాలి.
  6. చూడి దశను బట్టి పశువుకు తగినంత వ్యాయామం ఉండాలి.
  7. ఆంబోతులు, దున్నపోతుల ద్వారా సుఖ వ్యాధులు, ఆరోగ్యకరమైన పశువులకు సోకకుండా నివారించుటకు, కృత్రిమ గర్భధారణ ద్వారా మాత్రమే చూడి కట్టించవలెను.
  8. ఆంబోతులను చూడికట్టించడానికి వాడుతున్నట్లయితే, మూడు నెలలకు ఒకసారి ఆంబోతులకు, దున్నలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
  9. ప్రతి ఏటా పశువులన్నింటి రోగనిరోధక శక్తి పెంపొందించుటకు సంబంధిత వ్యాధులకు టీకాలు వేయించడం తప్పనిసరిగా చేయాలి.
  10. గర్భస్రావమైన పశువును ఇతర పశువులతో కలుపకుండా విడిగా ఉంచి వైద్యం చేయించాలి.
  11. ఈసుకుపోయిన పిండాన్ని, మాయను పాకకు దూరంగా లోతైన గోతిలో సున్నం వేసి పాతిపెట్టాలి. అశ్రద్ధ చేస్తే కుక్కలు వంటి జంతువులు పిండాన్ని తినడము లేదా దూరంగా లాక్కుపోవడం వలన వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
  12. గర్భస్రావమైన పశువు తినగా మిగిలిన గడ్డి, దాణాలను కాల్చి వేయాలి.
  13. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచి, అప్పుడప్పుడు క్రిమిసంహార మందులు పిచికారి చేయడం కూడా అవసరం.
  14. కొత్తగా కొన్న పశువులను కొంతకాలం పాటు మందతో కలుపకుండా పరిశీలనలో ఉంచుకోవడం సరియైన పద్ధతి.

డా. కె. జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, వెటర్నరీ సైన్స్ కాలేజి, ప్రొద్దుటూరు. ఫోన్: 9290661701

Read More

కోడిగుడ్లతో అమినో ఆమ్లం

ఎన్. గోపాల్‌క్రిష్ణన్ అనే అభ్యుదయ రైతు గుడ్లు, నిమ్మకాయలతో మొక్కల పెరుగుదలకు హార్మోన్ తయారు చేశారు. తమిళనాడులో అనేక మంది దీనిని ఉపయోగించి లాభాలు పొందుతున్నారు. ఆయన దీని తయారీ విధానం గురించి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

కావల్సిన వస్తువులు – తయారీ విధానం

  • 20-25 నిమ్మకాయలు
  • 250 గ్రాముల బెల్లం
  • 10-15 కోడి లేక బాతు గుడ్లు ఒక బకెట్‌లో నిమ్మకాయల రసాన్ని తీయాలి. దీనిలో బెల్లాన్ని కరగబెట్టాలి. ఈ రసంలో గుడ్లు మునిగేటట్లు ఉంచి గాలి చొరబడకుండా బకెట్‌కు మూత పెట్టి నీడలో పది రోజుల పాటు ఉంచాలి. గుడ్లు పెంకుతో సహా రసంలో కరిగి రబ్బరు బంతుల్లా తయారవుతాయి. పది రోజుల తరువాత రబ్బరు బంతుల్లా మారిన గుడ్లను చేతులతో నలిపి దాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో మరోసారి బెల్లం రసాన్ని కలపాలి. ఉదాహరణకు బకెట్‌లో రెండు లీటర్ల రసం ఉందంటే దానికి మరో రెండు లీటర్ల బెల్లం రసాన్ని కలపాలి. తిరిగి బకెట్‌కు గట్టిగా మూత పెట్టి మరో పది రోజులు ఉంచాలి. పది రోజుల తరువాత దీన్ని పంటల మీద ఉపయోగించవచ్చు. 10Ð15 మి.లీ. రసాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పంటల మీద స్ప్రే చేయాలి.

ఏ పంటలకు ఉపయోగపడుతుంది?
ఈ సేంద్రియ హార్మోన్‌ను వరి, గోధుమ, అరటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు. పిచికారి వేళలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం, సాయంత్రం పొద్దు మునిగే ముందు పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి పంచగవ్య, వర్మివాష్‌లను కూడా కలిపి వాడవవచ్చు. ద్రావణం తయారు చేసేటప్పుడు మూతకు చిన్న చిన్న రంధ్రాలు పెడితే మంచిది. దీనిని ఆరు మాసాల వరకు నిలువ చేసుకోవచ్చు.

Read More

వండని వంట… మామిడికాయ ఆవ బద్దలు

ఒక మామిడికాయను పిక్కతో సహా చిన్న ముక్కలుగా తరుగుకొని, ఆ ముక్కల్లో జీడి ఉంటే తీసేసి, పసుపు, ఉప్పు, కారం మెంతిపిండి కొంచెం, ఆవపిండి (కాయని బట్టి) గానుగనూనె వేసుకొని కలుపుకోవాలి. పోపు అవసరం లేదు. ఊరాక చాలా రుచిగా ఉంటుంది.

కేవలం మెంతిపిండి కారం వేసి కూడా చేస్తారు. వాటిని మామిడి మెంతిబద్దలు అంటారు. వీటికి జీడీ ఉన్న కాయలు బాగుంటాయి వగరుతో.

వేడి వేడి అన్నంలో, మామిడి ఆవబద్ద బాగుంటుంది. అవసరం అయిన వారు చేతిమీద కాస్తా నెయ్యి వేసి అన్నంలో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఉప్పు తగినంత వేస్తే, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

  • రచన: సంధ్యా శశికాంత్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More