ప్రాంతాలవారీగా పంటల సాగుకు అనుగుణంగా రైతులకు మేలు జరిగేలా అగ్రిటెక్‌ విధానాల్ని అనుసరిస్తున్నామని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7,500 హెక్టార్లలో ఆటోమేషన్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపారు. రాయలసీమలో ఎక్కువగా వినియోగించనున్నట్లు వెల్లడించారు. సంప్రదాయ డ్రిప్‌ విధానానికి ఆటోమేషన్‌ను జత చేస్తే పంట ఉత్పత్తి వృద్ధితో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో అగ్రిటెక్‌పై వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫీసియో కార్యదర్శి రాజశేఖర్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 'మార్చి 2026 నాటికి 25 లక్షలమంది అగ్రిటెక్‌ ప్లాట్‌ఫారం అనుసంధానమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వ్యవసాయంలో ఏఐ వినియోగానికి సంబంధించి నీతి ఆయోగ్‌ సూచించిన 28 అంశాలకుగాను 18 అంశాల్లో ఇప్పటికే అమలు చేసి దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపాం. ఎరువులు, పురుగు మందుల వాడకం, విత్తనాలు చల్లడంలోనూ డ్రోన్లను వినియోగిస్తున్నాం. దీని వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. 2024-25 ఏడాదిలో 68 వేల హెక్టార్లు పురుగు మందుల పిచికారి చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 61 వేల హెక్టార్లలో పిచికారి జరిగింది' అని వివరించారు.. డ్రోన్‌ దీదీ, కిసాన్‌ డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక యాప్‌ను తయారు చేసి డ్రోన్‌ యజమానులు, రైతుల్ని ఒకే ప్లాట్‌ఫాం పైకి తీసుకొస్తున్నాం.. పురుగుల మందు వాడకం సాగు మొత్తం కాకుండా ఏ మొక్కకు అవసరమో దాన్ని గుర్తించి పిచికారి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా డ్రోన్‌ వినియోగ ఖర్చు కూడా తగ్గుతుంది. పరిమాణం చిన్నదిగా ఉండి తక్కువ సమయంలోనే ఛార్జీ అయ్యే, ఎక్కువ బరువు తీసుకెళ్లగలిగే డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఉద్యాన పంటల సాగులో రాయలసీమ గ్లోబల్‌ హబ్‌ మార్చేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఆహారశుద్ధి రంగంలో వాల్యూ చైన్‌ను విశ్లేషిస్తే రా మెటీరియల్‌ ఉత్పత్తి చేసే రైతులతో పోలిస్తే మిగతా ఎక్కువ ఆదాయం ఉంది. ఎఫ్‌పీవోలు, ఎంఎస్‌ఎంఈల ద్వారా వీరికి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఎక్స్‌పోర్ట్‌ ఓరియెంటెడ్‌ అగ్రి బిజినెస్‌ మోడల్స్‌, స్మార్ట్‌ ఫార్మింగ్‌ టెక్నాలజీస్‌ను అమలు చేస్తున్నామని అన్నారు.