తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలో గేదెల మరణాలు పరాన్నజీవి, వైరల్ సంక్రమణ (ఇన్ఫెక్షన్) వ్యాధుల కారణంగానే సంభవించినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి టి. శ్రీనివాస్ తెలిపారు. వ్యాధి సోకిన పశువుల నుంచి సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ”చనిపోయిన గేదెల్లో మొదట మెడవద్ద వాపు కనిపించి, తర్వాత చర్మం ఊడిపోవడం, బలహీనపడడం, మేత తీసుకోకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, శ్వాసకోశ సమస్యలు, కొన్నింటికి జ్వరం వచ్చింది. విజయవాడకు చెందిన వీబీఆర్‌ఐ, కాకినాడకు చెందిన ఆర్‌ఎఏడీడీఎల్ నిపుణుల బృందం వ్యాధిని నిర్ధారించింది. నీరు, పశుగ్రాసంలో ఎలాంటి విషపదార్థాలూ లేవని చెప్పింది”. పశువులకు క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయించి అవసరమైన టీకాలు వేయించాలని, గేదెలు, గొర్రెలు, మేకలకు వేర్వేరుగా మేత వేయాలని రైతులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో పశుపోషకులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా స్వల్పకాలిక రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తోందని శ్రీనివాస్ చెప్పారు.

27 Sep, 2025
