రైతు ఆదాయం పెంపు లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంతో జాతీయ స్థాయిలో భద్రాద్రి జిల్లాకు గుర్తింపు లభించింది. భద్రాద్రి జిల్లా రైతులు మునగ సాగులో సాధించిన సత్ఫలితాలను ‘లక్ష్యసాధన జిల్లాలు'(యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అనే పేరుతో నీతిఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రత్యేకంగా వివరించింది. దాదాపు 50 శాతం అటవీ భూభాగమున్న ఈ జిల్లా జనాభాలో 37 శాతం గిరిజనులే. భారీ వర్షపాతం నమోదవుతున్నా సాగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేవు. అధిక పెట్టుబడి వ్యయంతో పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నా ఫలితం ఉండట్లేదు. పోషకాహారలేమి వల్ల జిల్లా ప్రజలు రక్తహీనత (అనీమియా)తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రైతుల ఆదాయం పెంచేందుకు ప్రయోగాత్మకంగా 415 ఎకరాల్లో మునగ పంటను సాగు చేయించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్శిటీ సహకారంతో అశ్వారావుపేట వ్యవసాయ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పంట సాగుపై రైతులకు మెలకువలు నేర్పారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లా యంత్రాంగం సహకారం అందించింది. మునగ మొక్కల సాగుతో రైతులకు మంచి ఆదాయం వచ్చింది. అంతర పంటలుగా కూరగాయల సాగుతో కూడా ఆదాయం సమకూరింది. మునగ ఆకులను కూరలుగా తినడంతోపాటు పశువులకు దాణాగా కూడా ఇచ్చారు. ఈ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందిన జమీల్ అనే రైతు కోళ్లకు మేతగా మునగాకును వినియోగించి సత్ఫలితాలు సాధించినట్లు తెలిపారని నీతిఆయోగ్ వివరించింది. మునగ సాగు వల్ల రైతుల ఆదాయం రెట్టింపు కావడమే కాకుండా.. దేశాన్ని అనీమియా రహిత భారత్‌గా మార్చేందుకు ఉపకరిస్తుందని స్పష్టం చేసింది.

22 Aug, 2025
