20 లక్షల టన్నుల బియ్యం, వడ్లు రాబోయే సంవత్సరంలో ఫిలిప్పీన్స్‌కి అవసరమని, సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఫిలిప్పీన్స్‌ వ్యవసాయశాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్‌ జూనియర్‌ బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. తెలంగాణ బియ్యం నాణ్యత బాగున్నాయని, అక్కడి నుంచి బియ్యం, వడ్లను దిగుమతి చేసుకోవాలని ఆసక్తితో ఉన్నామని ఫ్రాన్సిస్కో పేర్కొన్నారు. అందుకు ఉత్తమ్‌ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ బియ్యం నాణ్యతను అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఫిలిప్పీన్స్‌ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవడానికీ ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ మంత్రి ఆసక్తి చూపారని ఉత్తమకుమార్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.