గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి

  • 18 జిల్లాల్లో పెరుగుదల..
  • 2024-25 నీటి సంవత్సరంలో 32 శాతం అధికంగా వర్షాలు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలతో ప్రారంభమైన వర్షాలకు భూగర్భం కూడా చల్లబడింది. మండుటెండలతో అడుగంటాల్సిన మే నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 0.30 మీటర్లు పెరిగింది. గతేడాది మే నెలతో పోల్చితే 18 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

మే నెలలో అరుదుగా…
సాధారణంగా భూగర్భ జలాలు జూన్‌ నుంచి అక్టోబరు వరకు పెరుగుతాయి. అక్కడి నుంచి ఒకటి రెండు నెలలు నిలకడగా కొనసాగి ఆ తరువాత క్రమంగా లోతుకు వెళ్తాయి. అయితే, ఈ ఏడాది మే రెండో వారం చివర నుంచి వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు కూడా తార స్థాయిలో లేవు. దీంతోపాటు చాలా అరుదుగా వేసవి ముగియకుండానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు కురిశాయి. భూగర్భ జల వినియోగం తగ్గడంతోపాటు వర్షాలు కురవడం కారణంగా క్రమంగా నీటిమట్టం పైకి రావడం ప్రారంభమయింది. మే నెలలో ఇది చాలా అరుదు అని నిపుణులు పేర్కొంటున్నారు.

  • మే నెల రాష్ట్ర సరాసరి నీటి మట్టం 10.06 మీటర్లు. 2025 మే నెలలో ఇది 10.36 మీటర్లు. అంటే 0.30 మీటర్లు పెరిగింది.
  • గతేడాదితో పోల్చితే మే నెలలో 18 జిల్లాల్లో నీటి మట్టం పెరుగుదల ఉండగా భూపాలపల్లిలో అత్యధికంగా 3.05 మీటర్ల పెరుగుదల నమోదైంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 2.74, నల్గొండలో 2.32, సూర్యాపేటలో 1.70 మీటర్లు పెరిగింది. హైదరాబాద్‌, హనుమకొండలలో అత్యల్పంగా 0.17 మీటర్లు మాత్రమే పెరుగుదల రికార్డయింది.
  • 2024 మేతో పోల్చితే ఈ ఏడాది మేలో 15 జిల్లాల్లో తగ్గుదల నమోదయింది. ఎక్కువగా సంగారెడ్డి జిల్లాలో 1.61, వరంగల్‌ 0.04 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ కన్నా మే నెలలో మాత్రం ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ఈ ఏడాది భూగర్భ జలాల పురోగతి బాగుంటుందని రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్‌ లక్ష్మా పేర్కొన్నారు.

32 శాతం అధికంగా వర్షాలు
2024-25 నీటి సంవత్సరంలో (జూన్‌ నుంచి మే) 32 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వార్షిక వర్షపాతం 919 మి.మీటర్లకు గాను 1,216 మి.మీటర్లు అంటే 32 శాతం అధికంగా నమోదయింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా నారాయణపేట. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 618.9 మి.మీటర్లు కాగా 1,184.1 మి.మీటర్లు (91 శాతం) నమోదైంది. వనపర్తిలో 80 శాతం, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాలలలో 71 శాతం చొప్పున, నాగర్‌కర్నూల్‌లో 58 శాతం నమోదయింది. మహబూబాబాద్‌ జిల్లాలో 49 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 11 శాతం వర్షపాతం నమోదయింది. మరోవైపు రాష్ట్రంలో సగటున 116 రోజులు వర్షం కురిసింది. ఎక్కువ రోజులు వర్షం కురిసిన జిల్లాలలో కుమురంభీం ఆసిఫాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 101 రోజులు వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లాలో 99 రోజులు, మహబూబాబాద్‌లో 97. రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెంలలో 92 రోజుల చొప్పున.. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో 91 రోజుల చొప్పున వర్షం కురిసింది.