చీడపీడల నివారణకు రైతులు వినియోగిస్తున్న క్రిమిసంహారక మందులు తర్వాత శాపంగా మారుతున్నాయి. వీటిలోని రసాయన అవశేషాలు పొలాలను విషతుల్యంగా మార్చుతున్నాయి. భూముల సారాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా కృత్రిమ సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తోంది ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం!
ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకం…
ఓయూ మైక్రో బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ సందీప్త బూర్గుల ఆధ్వర్యంలో విద్యార్థులు మూడేళ్ల నుంచి ఈ పరిశోధన చేస్తున్నారు. ముందుగా దేశ, విదేశాల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలు సేకరించి వాటికి భిన్నంగా ప్రయోగాలు ప్రారంభించారు. రైతులు పంట పొలాల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ వినియోగించినా… ఆ భూముల్లో కొన్ని సూక్ష్మజీవులు బతికే ఉన్నాయని గుర్తించారు. వీటిలో 12 రకాల సూక్ష్మజీవులను సేకరించి ప్రయోగశాలలో వడపోసి అయిదింటిని ఎంపిక చేసుకున్నారు. వీటిని కృత్రిమంగా పెంచి పంట పొలాల్లో ప్రవేశపెడితే భూముల్లో విష ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుంటుందని నిర్ధారణకు వచ్చారు.
ఏం చేశారంటే…
ఇంక్యుబేటర్లో పెంచిన సూక్ష్మజీవులను విషతుల్యమైన నేలల్లో విడిచి పెడితే 75 నుంచి 90 శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించాయని రుజువు చేశారు. వీరి పరిశోధనల పత్రాలను అంతర్జాతీయ జర్నల్ బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇటీవలే ప్రచురించింది. ఈ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్థలు ప్రయోగాలు చేస్తున్నా.. 90 శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలను తొలగించడం మెరుగైన విధానమని ప్రొఫెసర్ సందీప్త బూర్గుల తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని వివరించారు.
పండ్లు, కూరగాయల్లో…
రైతులు పండిస్తున్న పండ్లు, కూరగాయాల్లో ఈ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే తోటలున్న రైతులకు కృత్రిమ సూక్ష్మజీవులను అందించి ప్రయోగాత్మకంగా ఆ నేలల్లో వాటిని విడిచి పరీక్షించాలన్న ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు పండించే కొందరు రైతులతో మాట్లాడి వారి అనుమతితో సూక్ష్మజీవులను పంట పొల్లాల్లో చొప్పించనున్నారు. సంతృప్తికరమైన ఫలితాలొచ్చాక ఈ విధానానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేయనున్నామని పరిశోధక విద్యార్థులు తెలిపారు.
ప్రయోగం ఇలా…
- ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో నల్ల రేగడి, ఎర్రనేలల మట్టిని సేకరించారు. అందులోకి రైతులు సాధారణంగా వినియోగించే మోతాదు కంటే నాలుగైదు రెట్లు అధికంగా క్రిమి సంహారక మందును ఇంజక్షన్ల ద్వారా చొప్పించారు..
- సహజ సిద్ధమైన గాలి, వెలుతురు లభించే చోట ఆ మట్టి నమూనాలను ఉంచి, వాటిలోకి ఇంక్యుబేటర్లో పెంచిన సూక్ష్మజీవులను పంపించారు. వారం రోజులకోసారి మట్టి నమూనాలు, సూక్ష్మజీవులను పరిశీలించారు. ప్రతి 40 నిమిషాలకు సూక్ష్మజీవులు రెట్టింపు అవుతున్నాయని గుర్తించారు.
- మూడు వారాల్లో మట్టి నమూనాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాలు 75 నుంచి 90 శాతం తగ్గాయి. ఈ ఫలితాల ఆధారంగా మరింత మెరుగైన స్థితికి చేరుకునేందుకు మళ్లీ ప్రయోగాలు చేశారు.
- ఇంక్యుబేటర్ నుంచి వెలుపలికి తీసిన సూక్ష్మజీవులు ఎదగాలంటే 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలని తెలుసుకున్నారు. రెండున్న రేళ్లు ప్రయోగాలు చేశాక అనుకున్న ఫలితాలు వచ్చాయని ప్రొఫెసర్ సందీప్త తెలిపారు.

