- ‘బయోఫ్యూయల్ బ్రిక్స్’ తయారీ
- రైతులకు, పొలాలకు మేలు
పత్తి పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థంగా పడి ఉండే పత్తి కట్టె ఇప్పుడు రైతులకు ఆదాయవనరుగా మారింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ‘బయోఫ్యూయల్ బ్రిక్’ పరిశ్రమను ఏర్పాటు చేసిన ఓ కంపెనీ ఆ కట్టెను కొనుగోలు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. దాదాపు 3.60 లక్షల మంది రైతులు సాగుచేస్తుండగా పంట అనంతరం టన్నుల కొద్దీ పత్తి కట్టె పోగవుతోంది. సాధారణంగా రైతులు ఈ కట్టెను పొలాల్లోనే కాల్చేస్తుంటారు. అయితే కంపెనీ ప్రతినిధులే పొలాలకు వెళ్లి దాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో కంపెనీ రోజుకు 70 టన్నుల కట్టెను కొనుగోలు చేస్తోంది. ఇలా గత ఏడాది 9 వేల టన్నులు కొనుగోలు చేశారు. రైతులకు ఎకరాకు రూ.1000 చెల్లించి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పొలానికి ఒక యంత్రాన్ని పంపించి అక్కడే కట్టెను పిప్పిగా మార్చి తెచ్చుకుంటున్నారు. ఈ పిప్పిని యంత్రాల ద్వారా ‘బ్రిక్స్’గా తయారుచేసి సంచుల్లో నింపి రవాణా చేస్తుంటారు. ఎకరా పొలం నుంచి సేకరించిన కట్టెతో.. తేమశాతం, వృథా పోను 6 క్వింటాళ్ల బ్రిక్స్ తయారవుతాయి. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా అనేక పరిశ్రమలు ఈ బ్రిక్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. పత్తి ‘బ్రిక్స్’ వినియోగిస్తే పొగ రాకపోవడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుండటంతో ఎక్కువగా ఫార్మసీ, డెయిరీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ తోపాటు మహారాష్ట్రలోని పలు పరిశ్రమలకు వీటిని రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్రిక్స్ కిలో ధర రూ.6-7ల వరకు ఉంది.
*భూసారం దెబ్బతినకుండా..*
రైతులు పత్తి పంట పూర్తికాగానే కట్టెను తొలగించి పొలంలోనే కాల్చేస్తుండటంతో వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బ తింటుందని, మిత్రపురుగులు చనిపోతున్నాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. పొలం నుంచి పత్తి కట్టెను పూర్తిగా తరలించడంతో గులాబీ పురుగు వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.



