నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) కింద తెలంగాణలో 81 మందికి గొర్రెలు, మేకల పెంపకం ప్రాజెక్టుల మంజూరుకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యాసాచి ఘోష్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎన్ఎల్ఎం కింద ఒక్కో లబ్ధిదారుకు గొర్రెలు, మేకల పెంపకానికి రూ.కోటితో ప్రాజెక్టు మంజూరవుతుంది. ఇందులో రూ.50 లక్షలు సబ్సిడీ కాగా బ్యాంకుల నుంచి రూ.40 లక్షల రుణం పొందాలి. మిగిలిన రూ.10 లక్షలు లబ్ధిదారు వాటా. ఈ యూనిట్లకు 240 మంది దరఖాస్తు చేసుకోగా.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుదిజాబితా ఎంపిక కోసం సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ సంచాలకుడు గోపి, అదనపు సంచాలకురాలు మల్లీశ్వరి; గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

8 Feb, 2025
