యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు25 నుంచి సాగునీటి విడుదలప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలని ‘స్కివమ్’ నిర్ణయం ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాలానికి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణా నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టం సమృద్ధిగా ఉన్నందువల్ల ఆరుతడి, తరి కలిపి 42.11 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక, యాజమాన్య కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏఎం-స్కివమ్) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 19 సర్కిళ్ల ముఖ్య ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, యాసంగి పంటల లక్ష్యం, వానాకాలం పంటల సాగు వివరాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 17.92 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 24.19 లక్షల ఎకరాల్లో తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వాటితో పాటు నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని లిఫ్టులు కలిపి మొత్తం 365.28 టీఎంసీల నీటిని యాసంగి పంటలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి ప్రాజెక్టుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. పంటల దిగుబడిలో మేలైన ఫలితాలు వస్తున్నందువల్ల ఆన్ అండ్ ఆఫ్ (వార బందీ) పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. జనవరి 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టు రెండో థకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది వర్షాల మధ్య విరామం తక్కువగా ఉండటంతో నేలలో తేమ ఉన్నందువల్ల తక్కువ నీటి తడులు అవసరమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు శ్రీరామసాగర్ ఎగువ నుంచి గోదావరిలోకి నీటి ప్రవాహం వస్తోంది. దిగువన కూడా వినియోగించిన నీరు (రీ-జనరేషన్) వచ్చి కలుస్తోంది. దీంతో యాసంగిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. కాళేశ్వరం కింద 98,570 ఎకరాల ఆయకట్టు ఉండగా యాసంగిలో 93,070 ఎకరాలకు 7.1 టీఎంసీలు అందించాలని గజ్వేల్ ఈఎన్సీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రధానంగా అనంతగిరి, రంగనాయకసాగర్ జలాశయాల కింద ఈ ఆయకట్టు ఉంది. ఈ నీటి కేటాయింపులపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రతిపాదించిన మేరకు కేటాయింపులు సాధ్యం కాకపోవచ్చని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో కనీసం మూడు టీఎంసీలైనా రెండు జలాశయాలకు ఇవ్వాలని గజ్వేల్ ఈఎన్సీ సూచించినట్లు సమాచారం.


