చపాట… వారసత్వ సత్తా

ఐదు దశాబ్దాల కిందటి నుంచే వరంగల్‌ మిర్చిగా సాగు.. నకిలీ బెడద లేకుండా రైతుల నుంచే మూల విత్తనాలు- రంగు, రుచిలో విశేష పేరు ప్రఖ్యాతులు, – జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌- ‘జీఐ’తో విదేశాల్లో మరింతగా డిమాండ్‌!, – వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలలో 25 వేలకు పైగా ఎకరాల్లో సాగు పెద్దగా కారం లేకుండా కొంచెం తీపి, సాధారణం కంటే మరింత ఎరుపు… కొంచెం లావు..పచ్చళ్లు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ.. విత్తనంలోనూ నాణ్యత..! ఇదీ చపాటా మిర్చి ప్రత్యేకత. ముడతలతో కనిపించే ఈ పంట ఐదు దశాబ్దాలుగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సాగవుతోంది. ఆహారంలో రంగుల వినియోగంపై నిషేధం ఉన్న దేశాల్లో.. ప్రత్యామ్నాయంగా చపాటా మిర్చిలోని ఓల్యూరోసిన్‌ అనే ఎర్ర రంగు ద్రావణాన్ని తీసి వాడుతుంటారు. దీంతో విదేశాల్లో చపాటాకు డిమాండ్‌ పెరిగింది. మూల విత్తనాలను రైతులే తయారు చేసుకుంటుండడంతో నకిలీ బెడద ఉండదు. అయితే, తెగుళ్లు, నల్లతామర, వైరస్‌ దాడి తీవ్రతతో కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి రావడం లేదు. రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చపాటా మిర్చికి తాజాగా భౌగోళిక గుర్తింపు (జీఐ) దక్కింది. ఈ మేరకు 2021 నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. జీఐ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ 2022లో ధరఖాస్తు చేయగా ఇటీవలే భారత పేటెంట్‌ కార్యాలయం (ఐపీవో) ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ, మార్కెటింగ్‌ అవకాశాలు పెరుగుతూ ఇది అన్నదాతలకూ లాభదాయకం కానుంది. దేశ, విదేశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెరుగవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.50 ఏళ్ళ కిందట పడిన విత్తనం 1972లో పరకాల మండలం నాగారం, నడికుడ, రంగాపురం, బంగ్లాపల్లి, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, వావిలాల తదితర గ్రామాల్లో చపాటా విత్తనాలను రైతులే తయారు చేస్తున్నారు. తొలుత నగర మిర్చిగా పిలిచినా… వరంగల్‌ మిర్చిగా మార్కెట్‌లో ప్రసిద్ధి చెందింది. లంబుకాయ, సింగిల్‌ పట్టి, డబుల్‌ పట్టి, టామట మిర్చిగానూ పేర్కొంటారు. చపాటాపై స్వీయ ప్రయోగం విజయవంతంతో విత్తనాలను ఇతర రైతులకు అందించారు. మొదటి కాతలో నాణ్యమైన, మంచి రంగుతో కూడిన కాయలను గ్రేడ్‌ చేసి 10-15 రోజులు, గింజలను వేరు చేసి మరో మూడు రోజులు ఎండబెడతారు. తర్వాత శుద్ధి చేసి భద్రపరుస్తారు. ఈ మిరప పొడిని పచ్చళ్లలో, ఎండు మిర్చిగా వాడుతుంటారు. విశిష్టత రీత్యా చపాటా మిర్చి సాగు పదేళ్ల నుంచి భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు విస్తరించింది. ఈ సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌లో 10 వేల, ఉమ్మడి ఖమ్మంలో 6 వేల, ఇతర జిల్లాల్లో 9 వేల ఎకరాల్లో పండిస్తున్నారు.మెక్సికన్‌ క్యాప్సికమ్‌లా.. మెక్సికన్‌ క్యాప్సికమ్‌ను పోలి ఉండే వరంగల్‌ చపాటా మిర్చి అరుదైన రకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పచ్చళ్లు చాలా రోజులు ఉండడంతో ఈ మిర్చికి దేశ, విదేశాల్లో డిమాండ్‌ నెలకొంది. ఆహార శుద్ధి పరిశ్రమలు, హోటళ్లు, బెవరేజెస్‌, పచ్చళ్ల తయారీతో పాటు లిప్‌స్టిక్‌, ఐస్‌క్రీంలో వినియోగిస్తుండడం విశేషం. ముఖ్యంగా థాయ్‌లాండ్‌, వియత్నాం, ఇంగ్లండ్‌, అమెరికా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. చపాటా మిర్చి ఉష్ణ విలువ 4000-8500 మధ్య స్కోవిల్లే హీట్‌ యూనిట్స్‌ మధ్య ఉంటుందని, అందుకే విదేశాల్లో బాగా వినియోగిస్తారని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Read More

సాగునీరు లక్ష్యం.. 42.11 లక్షల ఎకరాలు

యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు25 నుంచి సాగునీటి విడుదలప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలని ‘స్కివమ్‌’ నిర్ణయం ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాలానికి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణా నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టం సమృద్ధిగా ఉన్నందువల్ల ఆరుతడి, తరి కలిపి 42.11 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక, యాజమాన్య కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏఎం-స్కివమ్‌) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 19 సర్కిళ్ల ముఖ్య ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, యాసంగి పంటల లక్ష్యం, వానాకాలం పంటల సాగు వివరాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 17.92 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 24.19 లక్షల ఎకరాల్లో తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వాటితో పాటు నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని లిఫ్టులు కలిపి మొత్తం 365.28 టీఎంసీల నీటిని యాసంగి పంటలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి ప్రాజెక్టుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. పంటల దిగుబడిలో మేలైన ఫలితాలు వస్తున్నందువల్ల ఆన్‌ అండ్‌ ఆఫ్‌ (వార బందీ) పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. జనవరి 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు రెండో థకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది వర్షాల మధ్య విరామం తక్కువగా ఉండటంతో నేలలో తేమ ఉన్నందువల్ల తక్కువ నీటి తడులు అవసరమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు శ్రీరామసాగర్‌ ఎగువ నుంచి గోదావరిలోకి నీటి ప్రవాహం వస్తోంది. దిగువన కూడా వినియోగించిన నీరు (రీ-జనరేషన్‌) వచ్చి కలుస్తోంది. దీంతో యాసంగిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. కాళేశ్వరం కింద 98,570 ఎకరాల ఆయకట్టు ఉండగా యాసంగిలో 93,070 ఎకరాలకు 7.1 టీఎంసీలు అందించాలని గజ్వేల్‌ ఈఎన్సీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రధానంగా అనంతగిరి, రంగనాయకసాగర్‌ జలాశయాల కింద ఈ ఆయకట్టు ఉంది. ఈ నీటి కేటాయింపులపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రతిపాదించిన మేరకు కేటాయింపులు సాధ్యం కాకపోవచ్చని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో కనీసం మూడు టీఎంసీలైనా రెండు జలాశయాలకు ఇవ్వాలని గజ్వేల్‌ ఈఎన్సీ సూచించినట్లు సమాచారం.

Read More

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

నిపుణులతో చర్చించి సాగుపై నిర్ణయం : మంత్రి తుమ్మల
ఏలూరు జిల్లా కామవరపుకోటలో మంత్రి తుమ్మల పర్యటన
వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంట రైతన్నలకు సిరులు కురిపిస్తుందని, తెలంగాణలో సైతం సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో ఆదివారం వాణిజ్య పంట అయిన వక్క సాగును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ పంట సాగు చేస్తున్న రైతులతో సాగు పద్ధతులు,ఆ దాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో దీని విస్తరణ అవకాశాలపై నిపుణులతో చర్చించారు. వక్క సాగుకు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Read More

రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

- వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో తెలంగాణాలోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెండింగులో ఉన్న రైతుబీమా క్లెయిమ్‌ల పరిష్కారం గురించి, ఆయిల్‌పామ్‌ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయిలో సమన్వయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పంటరుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే మూడు నెలలలో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి తెలియజేశారు. ఎరువుల నాణ్యత, విత్తన నాణ్యత, భూసార పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.

Read More