రైతు భరోసా,, పంటల బీమా పథకాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞానం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఉన్నతాధికారులు.. ఈ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయతల పెట్టిన రైతుభరోసా, పంటల బీమా పథకాల అమలులో ఏఐ పరిజ్ఞానం వాడాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి కమతంలో రైతులు వేసిన పంటలను గుర్తించి, దాన్ని ఫొటో తీసి, వ్యవసాయ విస్తరణాధికారులు యాప్‌లో నమోదు చేస్తుండగా ఆ వివరాలను ధ్రువీకరణ చేసుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. శనివారం ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ఒక మండలంలో ఏఐ సహకారంతో పంటల విస్తీర్ణం, సర్వే నంబర్ల వారీగా పంటల సాగు, గత ఐదేళ్ల కాలంలో సాగు వివరాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం వివిధ పంటల స్థితి, చీడపీడల తాకిడి వంటి విధానాలను వృద్ధి చేసిన అల్గారిథమ్ ప్రదర్శనను సైతం మంత్రి తుమ్మల తిలకించారు. ఇప్పటికే ఇక్రిశాట్, ఎన్‌ఆర్‌సీఎస్ సంస్థలు పైలట్ ప్రాజెక్టులో భాగంగా వానాకాలం పంటల సాగు వివరాలను సేకరిస్తున్నాయి. అన్ని సంస్థల నుంచి సమాచారం సేకరించిన తర్వాత రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా 'ఏఐ' సాయంతో సాంకేతికతను రూపొందించాలని కంపెనీలకు ఆయన సూచించారు. కృత్రిమ మేధను వ్యవసాయంతో అనుసంధానించేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, జాయింట్ సెక్రటరీ ఉదయ్‌కుమార్‌లు గత రెండు నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించారు. తుది నివేదిక అందగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతితో అన్ని పథకాల అమలులో ఏఐ సాంకేతికతను వినియోగించి రైతులకు వేగవంతమైన సేవలు అందించనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

4 Nov, 2024
