యాసంగిలోనూ సన్నధాన్యానికి బోనస్‌

  • ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

యాసంగి సన్న ధాన్యానికీ కనీస మద్దతు ధరతోపాటు బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దేశంలో క్వింటాకు రూ. 500 బోనస్‌ అందజేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు బోనస్‌ రూపేణా రైతులకు రూ.1700 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”రూ.20,687 కోట్ల రైతు రుణమాఫీ వలన సుమారు 25.65 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయంగా రూ.5,400 కోట్లు అందజేశాం. గత వానాకాలంలో రికార్డు స్థాయిలో 1.53 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. వరి దిగుబడిలో తెలంగాణ ఏపీని అధిగమించింది. వరి వేస్తే ఉరే అనే పరిస్థితిని దాటి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. యాసంగి పంటలకు ఏ సమస్య లేకుండా సాగునీరు అందించడంతో ఈ సీజన్‌ లోనూ రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు తొందరపడి సన్నాలను దళారులకు విక్రయించొద్దు” అని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Read More

రైతు భరోసా, పంటల బీమాకు…ఏఐ పరిజ్ఞానం కసరత్తు చేస్తున్న వ్యవసాయశాఖ

రైతు భరోసా,, పంటల బీమా పథకాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ) పరిజ్ఞానం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఉన్నతాధికారులు.. ఈ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయతల పెట్టిన రైతుభరోసా, పంటల బీమా పథకాల అమలులో ఏఐ పరిజ్ఞానం వాడాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి కమతంలో రైతులు వేసిన పంటలను గుర్తించి, దాన్ని ఫొటో తీసి, వ్యవసాయ విస్తరణాధికారులు యాప్‌లో నమోదు చేస్తుండగా ఆ వివరాలను ధ్రువీకరణ చేసుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. శనివారం ఒక ప్రైవేట్‌ సంస్థ ప్రతినిధులు ఒక మండలంలో ఏఐ సహకారంతో పంటల విస్తీర్ణం, సర్వే నంబర్ల వారీగా పంటల సాగు, గత ఐదేళ్ల కాలంలో సాగు వివరాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం వివిధ పంటల స్థితి, చీడపీడల తాకిడి వంటి విధానాలను వృద్ధి చేసిన అల్గారిథమ్‌ ప్రదర్శనను సైతం మంత్రి తుమ్మల తిలకించారు. ఇప్పటికే ఇక్రిశాట్‌, ఎన్‌ఆర్‌సీఎస్‌ సంస్థలు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా వానాకాలం పంటల సాగు వివరాలను సేకరిస్తున్నాయి. అన్ని సంస్థల నుంచి సమాచారం సేకరించిన తర్వాత రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా 'ఏఐ' సాయంతో సాంకేతికతను రూపొందించాలని కంపెనీలకు ఆయన సూచించారు. కృత్రిమ మేధను వ్యవసాయంతో అనుసంధానించేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ గోపి, జాయింట్‌ సెక్రటరీ ఉదయ్‌కుమార్‌లు గత రెండు నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించారు. తుది నివేదిక అందగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతితో అన్ని పథకాల అమలులో ఏఐ సాంకేతికతను వినియోగించి రైతులకు వేగవంతమైన సేవలు అందించనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
Read More

పంట వేసిన రైతులకే రైతు భరోసా

పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రబీ నుండి రైతులకు రూ.7,500 ఇస్తామని మంత్రి తెలియచేసారు. పంటల బీమాకు సంబంధించి ప్రతి రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కూడా చెప్పారు.

Read More

దసరా రోజున రైతు భరోసా

తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ రోజున ప్రారంభించి… అదేరోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు కలిపి రు. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7,500/-లు దసరా రోజున రైతుల ఖాతాలలో పడనున్నాయి. రైతు భరోసాను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

Read More

రైతు భరోసాకు ఎకరాల పరిమితిపై అభిప్రాయ సేకరణ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందచేసే రైతు భరోసాను ఎన్ని ఎకరాలకు అందివ్వాలనే దానిపై రైతులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయించాలని తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రోజుకు మూడు సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. స్థిరాస్థి, బంజరు, ఇతర సేద్య యోగ్యం కాని భూములకు రైతు భరోసా సాయం ఇవ్వరాదని పేర్కొంది. రైతుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

Read More

రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

- వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో తెలంగాణాలోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెండింగులో ఉన్న రైతుబీమా క్లెయిమ్‌ల పరిష్కారం గురించి, ఆయిల్‌పామ్‌ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయిలో సమన్వయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పంటరుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే మూడు నెలలలో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి తెలియజేశారు. ఎరువుల నాణ్యత, విత్తన నాణ్యత, భూసార పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.

Read More