నేల సారవంతానికి ‘గార్బేజ్ ఎంజైమ్‌’

గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.

తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.

కావలసిన పదార్థాలు :

  • మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
  • కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
  • నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
  • నీరు Ð 10 పాళ్ళు

పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.

ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.

  • ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
  • పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
  • దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
  • పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
  • ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.
Read More

కాలీఫ్లవర్ పచ్చడి

1) గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలని (కట్ చేసుకున్నవి) శుభ్రం చేయడానికి, ఉప్పు నీళ్లలో 4,5 నిమిషాలు ఉంచి, తర్వాత బయటికి తీసి, మళ్ళీ మంచినీటిలో కడిగి, ఆ ముక్కలను తడి లేకుండా బట్టతో తుడవాలి లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

2) రెండు లావుపాటి నిమ్మకాయల రసం పిండుకోవాలి, అందులోని గింజలను తీసివేయాలి.

3) 4, 5 వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చాగాదంచుకోవాలి.

4) రెండు టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు.

కాలీఫ్లవర్ ముక్కలను, నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, కారం, ఉప్పు… అన్నిటిని కలపాలి. ఓ పావుగంట నుంచి అరగంట వరకు అలా ఉంచాలి. (అన్నీ పచ్చివే.)

క్యాలీఫ్లవర్ ముక్కలకు పులుపు పట్టి, నములుతుంటే కరకర మంటాయి.

అన్నంలో కలుపుకున్నా, ఉప్మా లాంటి వాటిలోనూ, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంతో తింటే, ఓ ముద్ద ఎక్కువే తింటారు.

ఫ్రిజ్‌లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఏ రోజుకారోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

ఒక కాలీఫ్లవర్ పువ్వును, 3 లేదా 4 సార్లు ఇలా పచ్చడిగా పెట్టుకోవచ్చు.

  • రచన : తాయమ్మ కరుణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

బాగా కుట్టే (దూకుడుగా ఉన్న) తేనె పట్టులతో ఏ విధoగా వ్యవహరించాలి ?(How to deal with aggressive honey bee colonies ?)

ప్రతి తేనె పెంపకం పరిశ్రమలో కనీసం ఒకటి లేదా రెండు పట్టులు దూకుడుగా (Aggressive) ఉంటాయి. అనగా కుట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తేనెటీగల పెంపకందారులకు ఈ లక్షణం ఉన్న పట్టులంటే ఇష్టము. ఎందుకనగా ఇలాంటి పట్టులు మంచి తేనెను సేకరించే లక్షణము, వ్యాధి నిరోధక శక్తిని లేక ఇతర విలువైన లక్షణాలను కలిగి ఉంటాయని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దూకుడుగా వ్యవహరించే పట్టులకు నెమ్మదిగా ఉండు రాణి ఈగలను రక్షించాలనే మనస్సాక్షి గల తేనెటీగల పెంపకం దారులు ఏ సంకోచం లేకుండా చేస్తారు. తేనెటీగల పట్టులలో దూకుడు గల లక్షణం అనేది వంశపారంపర్యమైన లక్షణం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అంతేకాకుండా పెద్ద పట్టులు ఎప్పుడూ దూకుడుగానే ఉంటాయి. ఎందువలన అనగా ఆ పట్టులో ఎక్కువ సంఖ్యలో తేనెటీగలుంటాయి కాబట్టి ఏది ఏమైనా బలమైన సులువుగా యాజమాన్యం చేయగల పట్టులు అలానే ఉండాలనేది తేనెటీగల పెంపకందారుల లక్ష్యం కూడాను.

సామన్యమైన, సూటిగా రాణి ఈగ ఎంపిక అనేది బాగా స్థిరపడిన విషయమే కాకుండా ఈ ప్రక్రియ ఆ ప్రాంతంలో తేనెటీగల స్వభావమును మార్చుతుంది. సంవత్సరాలుగా తేనెటీగలను నెమ్మదిగా ఉండే, వ్యాధి నిరోధకత కల్గి, తేనె ఉత్పత్తి ఎక్కువగా చేయగల తక్కువ ప్రపోలిస్ ను, ఎక్కువ పుప్పొడిని సేకరించు లక్షణాలు గల పట్టుల ఈగలను (Selection) ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో గల పట్టులు ఖచ్చితంగా తేనెటీగల స్వభావము మీద ఆ ప్రాంత ప్రభావము ఉంటుంది. ఇంకా పొరుగువారి తేనె పట్టులకు చాలా దగ్గరగా పనిచేసినట్లయితే తరుచుగా ఆ ప్రాంతమంతటి మీద కలిగే ప్రభావముగా ఫలితం ఉంటుంది.

పోతుటీగలు వీటిన్నింటి మీద ఒక కారకము (Factor) ఎందువలన అనగా సగం జన్యు పదార్ధము పోతుటీగల వైపు నుండి వస్తుంది. పోతుటీగల లద్దె పురుగులను, కోశస్థ దశలను దూకుడుగా ఉన్న పట్టులలో నాశనం చేసినపుడు దూకుడు అనే లక్షణాన్ని మోసుకెళ్ళే పోతుటీగల జన్యువులు పట్టులో తగ్గిపోతాయి. ఇది ఒక ఎంపిక మాత్రమే అయినప్పుటికీ సమయం చాలా తీసుకునే (Time consuming) ప్రక్రియ. ఇంకొక ఎంపిక ఏమంటే పోతుటీగల కృత్రిమ మైనపు అట్టను పట్టుకు సరఫరా చేయడం లేదా మంచి పట్టుల నుండి పోతుటీగలున్న లద్దె పురుగుల ఫ్రేములను సరఫరా చేయవలెను.

బాగా కుట్టే స్వభావము గల పట్టులలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలు మనల్ని కుట్టకుండా రాణి ఈగను గుర్తించడం బహుశా అన్నిటికంటే కష్టమైన పని. తరచుగా ఇలాంటి పట్టులన్నింటిలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలుంటాయి. రాణి ఈగను కనగొనడం చాలా కష్టము. కొన్నిసార్లు అసాధ్యముగా అనిపిస్తుంది. సాధారణంగా బాగా కుట్టే పట్టులకు ఎక్కువ మోతాదులో పొగ ఇచ్చి బాగా కుట్టే స్వభావము గల పట్టులను పరిశీలిస్తుంటాము. రాణి ఈగ పట్టును వదిలి తేనె పెట్టెలో ఏ భాగములోకైనా వెళుతుంది. బాగా పొగబారించినపుడు కూలి ఈగలు పట్టులోను మరియు పట్టుకు వెలపల గుంపులు గుంపులుగా ఏర్పడతాయి, ఒకవేళ రాణి ఈగ ఈ గుంపులలో ఉన్నట్లయితే రాణి ఈగను గుర్తించడం అసాధ్యము.

బాగా కుట్టే పట్టులలో రాణి ఈగను కనుగొనడానికి రెండు పద్దతులున్నాయి. రెండు పద్దతులలో కొంత ఎక్కువ సమయము మరియు కృషి అవసరమవుతుంది. ఈ రెండు పద్దతులను కూడా కూలి ఈగలు ఆహారం సేకరణకు వెళ్ళినపుడు, వెచ్చని వాతావరణములో (Warm days) చేయవలసి ఉంటుంది. పొలములో ఎక్కువ మోతాదు లో పుప్పొడి మరియు మకరందము లభ్యమయ్యేటప్పుడు మంచిది. ఎందుకంటే ఎక్కువ కూలి ఈగలు పొలానికి వెళతాయి కాబట్టి.

మొదటి పద్ధతిలో, మొదటిగా పట్టులో లద్దె పురుగులు, కోశస్థ దశలో ఉన్న (Brood nest) ఫ్రేములను గుర్తించి, పెట్టెతో సహా 50 నుండి 75 అడుగుల దూరం వరకు మోసుకెళ్ళి ఒక పొద చాటున లేక ఇతర అడ్డుగా ఉన్న (Obstrucion) నీడలేని ప్రదేశంలో ఉంచాలి. వయస్సు మళ్ళిన కూలి ఈగలు, పాలంకెళ్ళిన కూలి ఈగలు, కాపలా కాసే ఈగలతో సహా అన్ని తిరిగి వాటి పాత స్థానంలోకి ఎగరి వెళతాయి. కారణం వాటికి తెలిసిన వాటి పాత ఇల్లు అదే అని, దానిని కాపాడుకోవాలని అంతే తప్ప ఈ కొత్త స్థలం కాదు కాబట్టి. పైన చెప్పబడిన చిట్కా కూడ, కుట్టే ఈగల పట్టును తెరచి పరీక్షించునపుడు, మరియు ఇతరులకు చూపేటపుడు (Live demonstration) ఉపయోగపడుతుంది. పట్టును ఎత్తుకొని వేరే చోటుకి వెళ్ళడము ద్వారా ఎదురాడే కూలి ఈగలు ఎగిరి తిరిగి వాటి అసలు స్థానానికి వెళతాయి.

ఒకసారి లద్దె పురుగులున్న పెట్టె మరియు రాణి ఈగ, వేరు స్థానానికి మార్చినపుడు, తక్కువ పొగ అవసరముంటుంది. వెదకే విషయంలో మందుకు వెళ్ళవచ్చును. పొగ ఉపయోగించడం వల్ల తేనెటీగలకు రాణి ఈగతో సహా దిక్కు దిశ తెలియకుండా అవుతుంది. సాధారణ పరిస్థితులలో, నెమ్మదిగా ఉన్న పట్టులో రాణి ఈగ, లద్దెపురుగులున్న ప్రేములపై కనబడుతుంది. ఎక్కువ పొగ పట్టుకు ఇచ్చినపుడు రాణి ఈగ ఎక్కడైనా ఉండవచ్చును. రాణి ఈగను గుర్తించే రెండవ పద్ధతిలో (కుట్టే ఈగలు గల పట్టులలో) తేనె పట్టును విభజించి రాణి ఈగను వేరు పరుచు జల్లెడను ప్రతి భాగము (మీద పిల్లల గది మరియు తేనె గదిపై) పై ఉంచి పట్టు ద్వారమును మూసివేయవలెను. ఈ విధంగా చేయడం వల్ల మనకు రాణి ఈగ ఒక దానిలో ఖచ్చితంగా ఉoటుందని నమ్మవచ్చును. మూడు లేక నాలుగు రోజులు తర్వాత గుడ్లన్నీ రాణి ఈగ లేని భాగములో (Hive Part) పొదగబడతాయి. దేనిలో గుడ్లు ఉంటాయో దానిని (ఆ భాగమును) ఒక ప్రక్క ఉంచి అడుగు బల్ల మరియు పై మూతను పెట్టాలి. తిరిగి వయస్సు మళ్ళిన కూలి ఈగలు వాటి పాత స్థానమునకు తిరిగి వెళతాయి. అదే రోజున గాని, తరువాత రోజు గాని రాణి ఈగ కొరకు తక్కువ సంఖ్యలో ఉన్న కూలి ఈగలు పట్టులో తక్కువగా ఉన్నందువలన సులువుగా రాణి ఈగను కనగొనవచ్చును.

మన లక్ష్యం ఇక్కడ అసలు పట్టులో (Original) రాణి ఈగను తిరిగి ప్రవేశ పెట్టడం (Requeening). పట్టు తనంతట తానుగా రాణి ఈగను తయారు చేసుకోనివ్వకూడదు. అలా కొత్తగా వచ్చిన రాణి ఈగ తన తల్లి నుండి అనవసరమైన లక్షణాలు ఏమైన పొందుకొనవచ్చునని ఆలోచించాలి.

పట్టులో నూతనంగా తిరిగి రాణి ఈగను ఉత్పత్తి చేసుకోనవలయుననుకుంటే తగిన శ్రేష్టమైన మార్గము ఏమంటే ఒక వార్తా పత్రికను (News paper) పాత పట్టుపై ఉంచి పైభాగాన ఉంచే పిల్లల గదిని దానిపై పెట్టుకోవాలి. పై భాగమున ఉన్న పిల్లల గదిలో మంచి లక్షణాలు గల నూతనముగా సంపర్కము చెందిన రాణి ఈగ ఉండేటట్లుగా చూసుకొనవలెను. వార్తా పత్రికను కూలి ఈగలు నెమ్మదిగా నమిలి పట్టులు రెండు నెమ్మదిగా కలిసిపోతాయి.
మీ సొంత తేనె పట్టుల సామర్థ్యమును త్వర త్వరగా పెంచుకోవాలనుకుంటే మీరే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉండే ఫలవంతమైన తల్లియైన రాణి ఈగల ద్వారా చేసుకొనవచ్చును.

Smokers- పొగ డబ్బా
అనేక సంవత్సరముల వరకు తేనెటీగల పెంపకముదారులు మండే ఎండిన చెక్కను (punk wood), గట్టిగా కట్టిన ఎండుగడ్డిని మరియు ఇతరమైన వాటిని తేనెపట్టులో పొగబారించుటకు వాడేవారు. ఈ పదార్దములు మండి పొగను ఉత్పత్తి చేయుట వలన అట్టలపై అడ్డముగా పొగబారించేవారు. ఇవి కొద్దిమొత్తములోనే పొగ ఉత్పత్తి చేసేవి. కోపముతోవున్న పట్టులను అదుపుచేయుటకు సరిపడునంతగా ఉండేది కాదు

మోజస్ క్విన్బి(Moses Quinby) 1875వ సంవత్సరములో మొట్టమొదటి ఆచరణాత్మకమైన పొగడబ్బాని, ఈ పొగడబ్బాలో మంట మండించే స్తలము (fire pot) మరియు గాలితిత్తులు (bellows), ఒక విధముగా ఆధునిక తేనెటీగల పెంపకము చేపట్టిన తరువాత ఆలస్యముగా కనుగొనబడిన పొగడబ్బానుండి, పొగను గురిపెట్టి అవసరమైనచోటకు పడేలా గొట్టం ద్వారా పొగడబ్బా చివర కొనకు అమర్చబడివుంటుంది.

మండుచున్న పొగడబ్బాల వలన, చుట్టు ప్రక్కల వున్నకట్టెలు, గడ్డి అంటుకొని అనవసరమైన కార్చిచు ప్రారంభమవుతుంది. ఇది పొగడబ్బాలోని నిప్పు సులువుగా అంటుకొనే పదార్ధము లేక వేడినిప్పురవ్వలు పొగ మూతి నుండి వెలువడడము ద్వారా జరుగుతుంది. తేనెటీగల పెంపకముదారులు పొగడబ్బాను మండించిన తరువాత గుప్పెడు పచ్చగడ్డిని మంటపై భాగమున వుంచుతారు. ఎందుకనగా వేడి పొగను చల్లబరచి, మంటనుండి వెలువడు నిప్పురవ్వలను పొగడబ్బా మూతి నుండి (nozzle) వెలువడకుండా ఆపుతుంది. తేనెపట్టులున్న ప్రాంతములో కొన్నిసార్లు వాడిన పొగడబ్బాలో వున్న మంటను ఆర్పకుండా, బయట పడవేయడము వలన మంటల వ్యాప్తికి కారణమవుతంది.

Smoking Honey bee colonies-
తేనెపట్టు దూకుడుగాను మరియు పట్టులోని ఈగలు దాడిచేయుటకు ముందుగా నెమ్మదిగా వుంచుటకు పొగబారించుట ముఖ్యము. ఒక్కసారి కాపలాకాయు ఈగలు ప్రమాదమును పసిగట్టి నట్లయితే, హెచ్చరిక వాసనను (alarm odour) బయటకు పంపిస్తాయి. అలాంటి పరిస్థితిలో తరచుగా ఆ పట్టు మరియు చుట్టు ప్రక్కల వున్నపట్టులను నియంత్రించుట కష్టము.

తేనెపట్టులున్న ప్రాంతములోనికి ప్రవేశించుటకు ముందుగానే, పొగడబ్బాను వెలిగించుకొని సరైన స్థితిలో ప్రవేశించవలెను. పని ప్రారంభించుటకు ముందుగానే పట్టులన్నింటికి పొగనివ్వనవసరము లేదు. ఎందువలననగా ఎవైనా కంపనములు (vibrations) మొదటి పట్టునుండి వెలుపడినట్లయితే అవి ఇతర పట్టులను రేపుతాయి. అయినప్పటికిని పట్టులన్నింటికి స్టాండువద్ద పొగ బారించవలెను.

మొదటి పట్టును తెరచునపుడు పొగబారించునపుడు, గుర్తుపెట్టుకొనవలసినదేమనగా అన్ని పట్టులు ద్వారములవద్ద కాపలాకాయు కూలిఈగలుంటాయి. మకరందము లభించనప్పుడు పట్టుద్వారము వద్ద ఎక్కువ సంఖ్యలో కాపలాకాయు ఈగలుంటాయి మరియు కొద్ది సంఖ్యలో బాగా తేనె లభించు కాలములో కాపలా కాయు ఈగలుంటాయి. ఒక అడుగు దూరమునుండి రెండు లేక మూడుసార్లు పట్టుద్వారము వద్ద పొగను పారించిన యెడల, కాపలాకాయు ఈగలను నిరాయుధులుగా (disarm) చేస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ద్వారములున్నట్లయితే అన్ని ద్వారముల ముందు ఇలాగే పొగబారించవలెను. తరువాత పై మూతను తీసి పట్టుకొని, అలాగే పొగనివ్వవలెను. లోపలిమూతను వాడినపుడు కూడ ఇలానే పొగనివ్వవలెను

తరువాత సూపర్ గదిలోవున్న ఏ ఫ్రేమును తీయవలెనని చూడవలెను. చాల సుళువుగా తీయగల్గిన ఫ్రేము, మొదటి ఫ్రేము. ఈ ఫ్రేముమీదనే అతితక్కువ తేనెటీగలుంటాయి మరియు వికృతరూపము (burr) గల్గిన మైనపు అట్టలుంటాయి. ఈ విధముగా ఏ ఈగలు కూడా నలిగిపోకుండా, ఇతర ఫ్రేములపై వున్న తేనెటీగలకు కోపము రాకుండా చేయడము సులువు. సాధారణముగా ప్రక్కనున్న ఫ్రేమును మొదటిగా తీస్తారు. మొదటి ఫ్రేముల చివరలకు పొగబారించవలెను, ఈ విధముగా దారిలో ఈగలు లేకుండావుండి, చేతి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొనవచ్చును.

మొదటి ఫ్రేమును తీసినపుడు, పట్టుపరిశీలన మధ్యలోవున్నపుడు, అవసరమైనయెడల మరలా ఒకసారి పొగనివ్వవచ్చును. ఫ్రేముల మధ్యలో తేనెటీగలు అలవాటు పడియుండుటను చూడవచ్చును. ఎప్పుడైతే అయిదు నుండి పదిహేను ఈగలు రెండు ఫ్రేముల మధ్యవాటి తలలుంచి చూచుచున్నపుడు, పొగ ఇవ్వవలసిన సమయము అదే అని భావించవలెను. రెండు, మూడు పఫ్ ల పొగను ఫ్రేములపై అడ్డముగా బారించినపుడు నెమ్మదిగా తేనెటీగలన్నియు వెనుకకు వెళ్ళతాయి. రెండు ఫ్రేముల మధ్య తొంగి చూచుచున్న ఈగలు పొగ బారించినను వెళ్ళకపోయినట్లయితే, నెమ్మదిగా వుండకపోతే అవి ఎగిరి కుట్టవచ్చును. పట్టులోని ఈగలు ఒక్కొక్కటి రేపబడి, అన్ని ఈగలు కూడా ఈ విధముగా సహకరించి పనులు చేసుకుంటాయి.

Fuel for smokers – పొగడబ్బాలో వాడు ఇంధనము
పొగడబ్బాలో వాడవలసిన శ్రేష్ఠమైన ఇంధనము ఏది అనునది తేనెటీగల పెంపకదారుల మధ్య జరిగే తీవ్ర చర్చయైయున్నది. పొగ ఎందుకు తేనెటీగలను నెమ్మది పరుస్తుంది అను విషయమైన దానిలో తక్కువ పరిశోధన జరిగినది. ఆధునిక ఆలోచన ఏమనగా పట్టును తెరవగానే కూలిఈగలు హెచ్చరిక ఫిరమోనును స్పర్శకముల మీదవున్న స్పర్శగ్రాహకములు గ్రహించకపోవుట వలన అని. ఇది నిజమైనట్లయితే, ఏ ఇంధనమైనను ఎక్కువ పరిమాణములో పొగను ఉత్పత్తి చేయునదైతే తేనెటీగలను నెమ్మది పరుస్తుంది.
పొగడబ్బాలో వాడు ఇంధనము విషయమైన ముఖ్య సమస్య ఏమనగా ఎక్కువ సేపు మండకపోవుట, అనగా త్వరగా కాలిపోవుట మరియు పొగడబ్బాను నిరంతరముగా మండునట్లుగా రీచార్జి (recharge) చేయుట. తేనెటీగల పెంపకదారులు ఆకులను, గడ్డిని, గోనెసంచి గుడ్డలు లేక ఇతర పాతగుడ్డలు, అరిగిపోయిన త్రాళ్ళు, చెక్కపొట్టు, చెక్కముక్కలు ఒక అంగుళము సైజుగలవి (బ్లాక్స్ రూపములో తయారుచేసి) వాడుదురు. ఇవి ఎక్కువ సమయము మండుతాయి మరియు కొంతమంది తేనెటీగల పెంపకము దారులు వాడుచున్నారు.

  • డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి
    అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Phone: 9493304643
  • జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
Read More

పశుసంవర్ధక రంగంలో డిజిటల్ మార్పు: కృత్రిమ మేధస్సుతో రైతులకు సరికొత్త సేవలు

భారతదేశంలో పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారంగా నిలుస్తోంది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలు మరియు మొబైల్ ఆధారిత సేవలు రైతులకు పశువుల ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మరియు ఆర్థిక సేవలను సులభతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక రంగంలో సేవలందిస్తున్న ముఖ్యమైన AI ఆధారిత డిజిటల్ వేదికల గురించి తెలుసుకోవడం అవసరం.

పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాలలో రైతులకు డిజిటల్ సేవలు అందిస్తున్న ముఖ్యమైన ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు Stellapps, MoooFarm, Animall, Anitra AI, mooPay, AniMeta మరియు AgriTech. ఈ సంస్థలు డిజిటల్ పశు ఆరోగ్య సేవలు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, జాతి అభివృద్ధి, పాల ఉత్పత్తి నిర్వహణ, డిజిటల్ చెల్లింపులు మరియు AI ఆధారిత పశుసంపద నిర్వహణ వంటి రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి భారతదేశంలో పశుసంవర్ధక రంగ డిజిటలీకరణకు గణనీయంగా దోహదపడుతున్నాయి.

  1. Stellapps:
    భారతదేశంలో డైరీ రంగాన్ని డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్న ప్రముఖ అగ్రిటెక్ సంస్థ “Stellapps”. ఈ సంస్థ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పశుపోషకులకు సమగ్ర డిజిటల్ సేవలను అందిస్తోంది. Stellapps అభివృద్ధి చేసిన “mooOn” వంటి స్మార్ట్ సెన్సర్లు పశువుల ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఎద గుర్తింపు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఇవే కాకుండా పాల సేకరణ, పాల నాణ్యత పరీక్ష, శీతలీకరణ గొలుసు నిర్వహణ మరియు రైతులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
  2. MoooFarm
    ఇది ముఖ్యంగా పాల ఉత్పత్తిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేసి వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషణ మరియు ఉత్పత్తి పనితీరును పర్యవేక్షించవచ్చు. MoooFarm టెలీ-వెటర్నరీ సేవలను అందించడం ద్వారా రైతులు నిపుణులైన పశువైద్యులను ఆన్‌లైన్‌లో సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. పశువుల గర్భధారణ, ఈస్ట్రస్ చక్రం, టీకాల షెడ్యూల్ మరియు మేత నిర్వహణకు సంబంధించిన సూచనలు రైతులకు సమయానుకూలంగా అందుతాయి. దీనివల్ల పశువుల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుంది.

Animall
భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ పశువుల మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటి. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు ఆవులు, గేదెలు, మేకలు మరియు ఇతర పశువులను నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతు నుండి రైతుకే లావాదేవీలు జరగడం దీని ప్రత్యేకత. పశువుల జాతి, వయస్సు, పాల ఉత్పత్తి, ఆరోగ్య స్థితి వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతను పెంచుతుంది. Animall రైతులకు మార్కెట్ ధరల సమాచారం, కొనుగోలుదారుల వివరాలు మరియు పశుసంవర్ధకానికి సంబంధించిన వివిధ సలహాలను కూడా అందిస్తుంది. ఫలితంగా రైతులు తమ పశువులకు సరైన ధరను పొందగలుగుతున్నారు.

Anitra AI
Anitra AI అనేది కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఇది పశువుల గుర్తింపు, వాటి విలువ అంచనా, మేత నిర్వహణ మరియు ఆరోగ్య పర్యవేక్షణ వంటి సేవలను అందిస్తుంది. రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేయడం ద్వారా వాటి సుమారు మార్కెట్ విలువను తెలుసుకోవచ్చు. అలాగే మేత ఖర్చులను తగ్గించేందుకు సరైన మేత పరిమాణం మరియు పోషకాహార సూచనలు కూడా అందుబాటులో ఉంటాయి. పశువులకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, వాటి కొనుగోలు–అమ్మకాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వేదిక సహాయపడుతుంది. దీంతో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పశుసంవర్ధకాన్ని నిర్వహించి ఉత్పాదకతను పెంచుకోవచ్చు.

mooPay:
mooPay అనేది పాడి పరిశ్రమకు ప్రత్యేకంగా రూపొందించబడిన డిజిటల్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్. పశువుల కొనుగోలు, డైరీ అభివృద్ధి మరియు పశుసంవర్ధక కార్యకలాపాల కోసం రైతులకు రుణాలు, బీమా మరియు ఇతర ఆర్థిక సేవలను అందిస్తుంది. mooScore™ వంటి డిజిటల్ క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థల ద్వారా రైతుల ఆర్థిక అర్హతను అంచనా వేసి త్వరితగతిన రుణాలను మంజూరు చేస్తుంది. పాల సేకరణ కేంద్రాల ద్వారా చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అయ్యే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ విధంగా గ్రామీణ పశుపోషకులకు సులభంగా ఆర్థిక సేవలను అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోంది.

AniMeta AgriTech (YourFarm)
AniMeta AgriTech (YourFarm) అనేది పశువుల ఆరోగ్యం, పోషణ మరియు ఉత్పాదకత మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తున్న డిజిటల్ అగ్రిటెక్ సంస్థ. ఈ ప్లాట్‌ఫారమ్ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను ఉపయోగించి పశువులలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడుతుంది. రైతులకు మేత నిర్వహణ, పోషకాహార ప్రణాళికలు మరియు సంప్రదాయ చికిత్సలపై సూచనలు అందిస్తుంది. పశువుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పాల ఉత్పత్తి మరియు మొత్తం ఉత్పాదకతను పెంచడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ పశుసంవర్ధక పద్ధతుల ప్రాచుర్యానికి AniMeta AgriTech మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ వేదికలు పశుసంవర్ధక రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయి. పశువుల ఆరోగ్య పర్యవేక్షణ, మేత నిర్వహణ, పాల ఉత్పత్తి పెంపు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, ఆర్థిక సేవలు మరియు శాస్త్రీయ సలహాలను రైతులకు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీనివల్ల సమయం, శ్రమ మరియు ఖర్చు తగ్గడంతో పాటు పశువుల ఉత్పాదకత, రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిజిటల్ సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా, స్థిరంగా మరియు ఆధునికంగా తీర్చిదిద్దుకోవచ్చు. అందువల్ల రైతులు ఈ డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకొని, వాటిని తమ దైనందిన పశుసంవర్ధక కార్యకలాపాల్లో వినియోగించడం అవసరం.

సరిన్ కె. కున్నత్, అసోసియేట్ ప్రొఫెసర్, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పశువైద్య కళాశాల, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్-30. Ph: 9381572408

జె. సాయి ప్రసన్న, సీనియర్ శాస్త్రవేత్త, పశు పరిశోధనా కేంద్రం, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్. Ph: 8008910925

Read More

ఔషధ మొక్క… కిత్తనార

ఇది 30-60 సెం.మీ. పొడవుతో కండగల ఆకులు గల బహువార్షిక పొద. ఆకులు పదునుగా, అంచులు రంపపు పండ్ల వలే ఉంటాయి. ఇది 2 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత మొక్కలు పూతకు వస్తాయి. పూలు పసుపు పచ్చగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకుల కండలో తేమ ఎక్కువగా ఉండడం వలన ఎడారి ప్రాంతాలలో, మెట్ట ప్రాంతాలలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఇది పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : అగేవ్/సెంచురీప్లాంట్/రాకాసిమొక్క శాస్త్రీయ నామం : అగేవ్ అమెరికానా కుటుంబం: అగేవేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • దీని ఆకులు మరియు వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులలో ఐసోఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, కౌమారిన్స్, విటమిన్ ఎ, బి1, బి2, సి, డి, కె మొదలగునవి ఉంటాయి. ఆకుల నుండి లభించే నార అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
  • కిత్తనార మంచి విరేచనకారి. స్కర్వి, సిఫిలిస్, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • క్షయ, పచ్చ కామెర్లు, లివర్ వ్యాధుల నివారణకు కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో …

  • కిత్తనార ఆకుల ద్రావణం స్పర్శ, ఉదర విష చర్యల ద్వారా వరి పంటనాశించే ఆకుముడత పురుగుని నివారిస్తుంది (భాస్కరన్ అండ్ నారాయణసామి, 1995ఎ, ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2001).
  • కిత్తనార ఆకులను నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకుపయోగిస్తారు. (గ్రెయిన్‌గే అండ్ అమ్మద్, 1988).
  • కిత్తనార మొక్కలనారనుపయోగించి తాడు తయారు చేస్తారు. టాంజెనియాలో దీని ఆకుల రసాన్ని చెదల నివారణలో పురుగు మందుగా ఉపయోగిస్తారు (ఎమఋగ్వా, 2009).
  • కెన్యాలో ఈ మొక్కను ఇంటిలోపల, వెలుపల అలంకరణ మొక్కగాను, వ్యవసాయ క్షేత్రాలలో జీవకంచెగాను ఉపయోగిస్తారు. (ఎమఋగ్వా, 2009)
    కిత్తనార ఆకులలో వోలటైల్ ఆయిల్, సపానిన్స్, వేర్లలో క్రిస్టలైన్ సపానిన్స్ ఉంటాయి. కిత్తనార ఆకుల రసం పూసిన వాల్ పేపర్ చెదలను నివారిస్తుంది (చోప్రా అండ్ చోప్రా, 1933).
  • కిత్తనార (అగేవ్ టెక్విలానా) ఆకులు ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, టానిన్స్, ట్రైటెర్పీన్లు మరియు/లేదాస్టీరాయిడ్స్ కలిగి ఉండి వీటి రసం సిల్వర్ లీఫ్ తెల్లదోమ, బెమిసియా టబాసి మరియు నులిపురుగుల్ని 100% చంపింది (హెర్బర్డ్ డాక్టర్, అతని అనుచరులు, 2016)
  • వివిధ పంటలనాశించే పురుగుల నివారణకు వేప, పసుపు, వావిలాకు, గ్లెåరిసిడియా, ఆముదం, అరిస్టొలోకియా, అల్లం, కిత్తనార, సీతాఫలం, ఉమ్మెత్త, జిల్లేడు, మునగ, తూటాకు (ఐపోమియా), కొతిమీర ఆకులను వికర్షక, కీటకనాశక చర్యలు గల పురుగు మందులుగా ఉపయోగిస్తారు (నారాయణసామి, 2002).
  • కిత్తనార (అగేవ్ అమెరికానా, అగేవ్‌ఫెరాక్స్, అగేవ్ మోంటానా, అగేవ్ స్క్రాబ్రా, అగేవ్ మార్ౙినేట) ఆకుల క్రూడ్ ద్రావణాలను మాక్రోఫోమినా ఫేసియోలినా, ఆల్టర్నేరియా పోరి, ఆస్పర్ౙిల్లస్ అవమోరి, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం ఉడం, ఫ్యుజేరియం సొలానిల పెరుగుదలపై పరీక్షించారు. అన్ని ఆకుల ద్రావణాలు మాక్రోఫోమినా ఫేసియోలినా శిలీంద్ర పెరుగుదలను అత్యధికంగా అరికట్టాయి. అగేవ్ స్పీసిస్ ఆకుల నుండి వేరు చేసిన యాంటిఫంగల్ కాంపౌండ్‌ని వివిధ పంటలలో తెగుళ్ళ నివారణకు పర్యావరణహిత మొక్క ఆధారిత శిలీంద్రనాశనులుగా ఉపయోగించవచ్చు. (మహర్షి అండ్ ఠాకర్, 2014).
  • అగేవ్ స్పీసీస్ మరియు ఒపన్షియా స్పీసీస్ లని పూర్వకాలం నుండి వాణిజ్యపరంగా ఇథనాల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఈ రెండింటి జాతులు వేడి, పొడి వాతావరణాలలో తక్కువ నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుని ఎక్కువ జీవపదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి (కుష్‌మాన్, అతని అనుచరులు, 2015).
  • అగేవ్ సిసలానా ఆకుద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలిస్ స్టెఫెన్సిలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (సింగ్, అతని అనుచరులు, 2014).
  • ఒక కిలో కిత్తనార ఆకులను రాగిపాత్రలోని 10 లీ. వేడి నీటిలో ముంచి 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత ద్రావణాన్ని వడపోసి పంటపై పిచికారి చేసి వరి పంట నాశించే ఆకుముడత పురుగుని నివారించవచ్చు.(జీన్‌టెక్, 1998).
  • కిత్తనారు మొత్తం మొక్క ద్రావణం వికర్షక, పురుగు నాశక చర్యలు కలిగి చెదల నివారణ లక్షణాలు కలిగి ఉంది.
  • 1 కి. ఐపోమియా ఫిస్ట్యులా, 1 కి. కిత్తనార, 1 కి. ఉమ్మెత్త, 1కి. కానుగ, 1కి. సీతాఫలం, 1 కి. ఆర్ౙిమోన్ మెక్సికానా ఆకులను ముక్కలు చేసి పెద్దకుండలోని 10 లీ. ఆవుమూత్రంలో కనీసం 10 రోజులు నానబెట్టాలి. 10 రోజుల తర్వాత వడపోసి పురుగులాశించిన కూరగాయల పంటలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం కూరగాయల పంటలనాశించే కాయతొలుచు పురుగులు, ఆకుతినే పురుగులు, వేర్లను నష్టపరిచే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • ద్రాక్ష నాటడానికి 3 నెలల ముందు 10 అ. దూరంలో పొడవాటి కందకాల (ట్రెంచెస్)ను త్రవ్వాలి. ఈ కందకాలలో కోలింగి (టెఫ్రోసియా పర్పురియా), కిత్తనార (అగేవ్ స్పీసీస్) జిల్లేడు వంటి పచ్చి ఆకు ఎరువులను వేసి మట్టితో కప్పి కుళ్ళనివ్వాలి (రోహిణిరెడ్డి)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… దోసకాయ రోటి పచ్చడి

పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!

కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.

చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్కల ఆరోగ్యానికి ‘వర్మివాష్’

వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.

Read More

పొదుగు వాపు వ్యాధి (మాస్టైటిస్) కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాస్టైటిస్ అంటే క్షీర గ్రంధి లేక పొదుగు యొక్క వాపు. ఇది పొదుగు యొక్క భౌతిక, రసాయన మరియు సూక్ష్మజీవుల మార్పులను కలుగజేస్తుంది. ఇది ప్రధానంగా పాలలో సోమాటిక్ కణాల పెరుగుదల మరియు క్షీర కణజాలంలోని రోగ లక్షణ మార్పుల ద్వారా గుర్తించబడుతుంది. ఇది పాడి పరిశ్రమలో అత్యంత సాధారణమైన మరియు ఆర్థికంగా నష్టాన్ని కలిగించే వ్యాధులలో ఒకటి. ఇది పాల నాణ్యతను మరియు ఉత్పత్తిని తగ్గేలా చేస్తుంది. మాస్టైటిస్ అనే పదము గ్రీకు పదం. “మాస్టో” అంటే క్షీర గ్రంధిని సూచిస్తుంది మరియు “ఐటిస్” అంటే వాపు అని అర్థం.

పొదుగు వాపుకు ముందస్తు కారణాలు

  • సాధారణంగా పొదుగు వాపు ఎక్కువ ఈతలు ఈనిన పశువులలో చూడవచ్చు.
  • తక్కువ దిగుబడి నిచ్చే వాటికంటే అధిక దిగుబడినిచ్చే పాడి ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
  • అన్య దేశ మరియు సంకరజాతి ఆవులకు పొదుగు వాపు ఎక్కువగా వస్తుంది.
  • పొదుగు నుండి అసంపూర్ణంగా పాలు పితకడం
  • జన్యుపరమైన కారణాలు అనగా పొడవాటి చనులు, కిందకు ఉండే పొదుగు
  • గాయాలు గల చనులు, పొదుగు వ్యక్తిగత అపరిశుభ్రత, అపరిశుభ్ర మైన పరిసరాలు మొదలైనవి పొదుగు వాపు కు దోహదపడతాయి.

కారణాలు
పొదుగు వాపుకు కారణాలుగా వివిధ రకాల సూక్ష్మక్రిములు సూచింపబడతాయి. అవి బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు), వైరస్ (సూక్ష్మతి సూక్ష్మక్రిములు), ఫంగస్ (శిలీంద్రాలు) మరియు మైకోప్లాస్మా.
పొదుపు వాపుకు కారణమయ్యే అతి ముఖ్యమైన బ్యాక్టీరియాలు- స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే, స్ట్రెప్టోకోకస్ జూఎపిడెమికస్, స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్, క్లెబ్సియెల్లా, మైకోబాక్టీరియం బోవిస్, ఎస్చేరిచియా కోలై, బ్రూసెల్లా అబోర్టస్; సూడోమోనాస్ మొదలగునవి
మాస్టైటిస్కు కారణమయ్యే శిలీంధ్ర జీవులు- ట్రైకోస్పోరాన్, ఆస్పెర్‌గిల్లస్ ఫ్యూమిగాటస్, ఆస్పెర్‌గిల్లస్ మిడులస్; కాండిడా జాతులు.

వ్యాప్తి విధానం
చనుల యొక్క రంద్రాల ద్వారా ఇన్ఫెక్షన్ క్షీర గ్రంధికి చేరుకుంటుంది పొదుగు మరియు పర్యావరణం లో నివసించే సూక్ష్మ క్రిములు వంటివి అనుకూలమైన పరిస్థితులలో వృద్ది చెంది కణజాలాలపై దాడి చేయటం వలన చాలా హానికరమైన ప్రభావం ఏర్పడుతుంది. ఆవు యొక్క చర్మ ఉపరితలం మీద అనేక క్రిములు నివాసం కలిగి ఉండవచ్చు మరియు అక్కడ నుండి ఆ క్రిములు పాలు పితికే వారి ద్వారా కలుషితం చెంది వ్యాధి వచ్చే అవకాశం ఉండవచ్చు. పాలు పితికే వారి చేతులు, బట్టలు మరియు పాలు పితికే యంత్రాల కప్పుల ద్వారా వ్యాధి సోకిన పొదుగు భాగం నుండి వ్యాధి సోకని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గ్రంధి నుండి వచ్చే స్రవాలు, నేలను కలుషితము చేయడం ద్వారా వ్యాధి సంక్రమణ చెందుతుంది.

పొదుపు వాపు రకాలు
1) వ్యాధి లక్షణాల ఆధారంగా
a) క్లినికల్ మాస్టైటిస్
ఇందులో పొదుగు వాపు లక్షణాలైన వాపు, వేడి, ఎరుపు రంగు, తీవ్రమైన నొప్పి ఉంటుంది.
b) సబ్ క్లినికల్ మాస్టైటిస్
ఈ రకంలో పొదుగు నందు ఎటువంటి బాహ్య లక్షణాలు కనపడవు కానీ పాలలో మార్పులు అంటే సోమాటిక్ కణాలు, తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు) మరియు ఎపితీలియల్ కణాలలో మార్పు, పాల పిహెచ్ (PH)లో మార్పులు గమనించవచ్చు.
2) పొదుగు వాపు తీవ్రత ఆధారంగా
a) తేలికపాటి మాస్టైటిస్
పాలలో స్వల్ప మార్పులు, పలుకులు లేదా గడ్డ కట్టడం గమనించవచ్చు.
b) తీవ్రమైన మాస్టైటిస్
పాలలో మార్పులు మరియు పొదుగులో వాపు మరియు నొప్పితో పాటు మరింత స్పష్టమైన మార్పులు గమనించవచ్చు.
c) అతితీవ్రమైన మాస్టైటిస్
శారీరక సంబంధ సంకేతాలైన జ్వరం, ఆకలి లేకపోవటం మరియు తీవ్రమైన పొదుపు వాపు వంటి లక్షణాలను గమనించవచ్చు.
3) కాలవ్యవధి ఆధారంగా
a) అతి తీవ్రమైన మాస్టైటిస్
తీవ్రమైన లక్షణాలతో ఆకస్మికంగా ప్రారంభమవుతుంది తరచుగా శారీరక సంబంధమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
b) తీవ్రమైన మాస్టైటిస్
గుర్తించదగిన లక్షణాలతో త్వరగా ప్రారంభమవుతుంది
c) సబక్యూట్ (తక్కువ తీవ్రమైన) మాస్టైటిస్
తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటాయి ఇది తీవ్రమైన మాస్టైటిస్ కంటే తక్కువ తీవ్రమైనది
d) దీర్ఘకాలిక మాస్టైటిస్
నిరంతర వాపు కలిగి ఉండి సమయానుకూలంగా వ్యాధి లక్షణాలు కనబడతాయి.
4) కారణ కారక ఆధారంగా
a) సంక్రమించే (కంటేజియస్) మాస్టైటిస్
ఇది ప్రధానంగా పాలు పితికే ప్రక్రియలో ఒక ఆవు నుండి మరొక ఆవుకు వ్యాప్తిస్తుంది. కలుషితమైన పాలు పితికే పరికరాలు, చేతులు మరియు బెడ్డింగ్ వస్తువుల ద్వారా పాలు పితికే సమయంలో వ్యాప్తిస్తాయి.
వ్యాధికారకాలు: స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే మరియు మైకోప్లాస్మా జాతులు.
b) పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) మాస్టైటిస్
ఇది ఆవు పరిసరాలలో ఉన్న కలుషితమైన బెడ్డింగ్ వస్తువులు, నేల, నీరు మరియు ఎరువు వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా పాలు పితికే సమయాల మధ్య సంక్రమిస్తాయి వ్యాధికారకాలు: ఎస్చరీషియా కోలై, క్లెబ్సియెల్లా మరియు స్ట్రెప్టోకోకస్ యుబేరిస్.

వ్యాధి అభివృద్ధి చెందే ప్రక్రియ
ఇది మూడు దశలుగా వివరించవచ్చు. సూక్ష్మ క్రిములు చనుల ద్వారా చొరబడుట, ఇన్ఫెక్షన్ మరియు వాపు కలుగజేయుట.

  1. మొదట వ్యాధికారక సూక్ష్మ క్రిములు చనుమొనల చివర నుండి పాల గ్రంధిలోనికి చొరబడతాయి.
  2. ఇన్ఫెక్షన్ దశ అంటే వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెంది, క్షీర కణజాలంపై దాడి చేస్తాయి.
  3. వాపు దశలో పొదుగు యొక్క వాపు, పాలలో మార్పులు అంటే పాలుగడ్డ కట్టడం, విరిగిపోవడం అనే లక్షణాలు కలిగి ఉండవచ్చు.

పొదుగు వాపు లక్షణాలు
పొదుగుకు సంబంధించిన లక్షణాలు:

  • ఉద్దరoవాపు లేదా పొదుగు వాపు
  • గ్రంధి భాగం బాగా ఉబ్బిపోవడం
  • ఉష్ణోగ్రత పెరగడం, స్పర్శకు వేడిగా ఉండటం, ఎరుపు రంగులో మారడం
  • తీవ్రమైన నొప్పి
    పాలలో మార్పులు
  • పాలు నీరు లాగా ఉండటం
  • పాలు గడ్డకట్టడం లేదా రక్తపు చుక్కలు గమనించవచ్చు
  • కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వాసన కూడా గమనించవచ్చు.
    తీవ్రమైన మాస్టైటిస్ లో కనిపించే ఇతర శారీరక సంభందిత లక్షణాలు
  • జ్వరము
  • ఆహారం తినకపోవడం
  • నీరసంగా ఉండటం
  • దాహం ఎక్కువగా ఉండటం
  • డిహైడ్రేషన్
  • పాల ఉత్పత్తి తగ్గిపోవడం చూడవచ్చు.

మాస్టైటిస్ నిర్ధారణ పద్ధతులు
క్లినికల్ మాస్టైటిస్ ను కళ్ళతోనే పాలలో కలిగే మార్పుల ద్వారా గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి.

  1. భౌతిక పరిశీలన (ఫిజికల్ ఎగ్జామినేషన్): పొదుగు భాగాన్ని పరిశీలించి, వాపు, ఉష్ణోగ్రత, నొప్పిని గుర్తించడం. పాల ప్రవాహాన్ని గమనించడం. పాల రంగు, వాసన, గడ్డలు కట్టడం లాంటి లక్షణాలను పరిశీలించడం.
  2. క్యాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ (CMT): పాలలో సోమాటిక్ కణజాలాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు. పాలకు ఒక రియేజెంట్ ను జతచేసి దాని చిక్కదనాన్ని (జెల్ ఫార్మేషన్) గమనించడం ద్వారా మాస్టైటిస్ ను గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించడానికి ఈ టెస్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సరళమైన, త్వరిత పరీక్ష. తక్కువ ఖర్చుతో ఫీల్డ్‌లోనే నిర్వహించగలిగే పరీక్ష.

కావాల్సిన పరికరాలు:

  • CMT ప్లేట్ (4 కువెట్లు ఉన్న ప్లాస్టిక్ ట్రే)
  • స్పెషల్ రియేజెంట్ (CMT, లిక్విడ్ ఆధారిత డిటర్జెంట్)
  • పాల నమూనాలు (ప్రతి ఉద్ధర భాగం నుంచి)

పరీక్ష పద్ధతి:

  1. గేదె యొక్క పొదుగు నాలుగు భాగాల నుండి పాలను CMT ప్లేట్‌లో ఒక్కో కువెట్లలో తీసుకోవాలి
  2. ప్రతి పాల నమూనాలోకి CMT రియేజెంట్ ను కలపాలి (సమాన 1:1 నిష్పత్తిలో)
  3. ప్లేట్‌ను సున్నితంగా 10 సెకన్లపాటు కలియబెట్టాలి
  4. జెల్ ఫార్మేషన్ స్థాయి (చిక్కదనం) ఆధారంగా ఫలితాన్ని గమనించాలి

ఫలితాల వివరణ:
రియాక్షన్ ఫలితాలు సోమాటిక్ సెల్ కౌంట్ అంచనా
పలుచగా ఉండి పాలలో ఎటువంటి మార్పు లేకపోవటం నెగటివ్ <200,000 కణాలు/ml చిక్కగా సబ్ క్లినికల్ మాస్టైటిస్ 200,000 – 500,000 స్పష్టమైన జెల్ పాజిటివ్ (క్లినికల్ మాస్టైటిస్) >500,000
చాలా గట్టి గడ్డలు శక్తివంతమైన పాజిటివ్ >1,000,000

జాగ్రత్తలు:
పరిశుభ్రమైన వాతావరణంలో చేయాలి
తాజా పాల నమూనాలను మాత్రమే ఉపయోగించాలి
వాసన లేదా రంగు మార్పుతో పాటు ఫలితాన్ని అర్థం చేసుకోవాలి

  1. పాల కల్చర్ మరియు సెన్సిటివిటీ టెస్ట్ (ABST): పాలు శుభ్రంగా సేకరించి, ల్యాబ్ లో కల్చర్ చేసి మాస్టైటిస్ కలిగించే బ్యాక్టీరియా ఏవో గుర్తించవచ్చు. తగిన యాంటీబయాటిక్ ను ఎంచుకునేందుకు ఈ టెస్ట్ చాలా దోహదపడుతుంది.
  2. సొమాటిక్ కణజాలం కౌంట్ (సొమాటిక్ సెల్ కౌంట్) (SCC): పాలలో తెల్ల రక్త కణాల సంఖ్య ఆధారంగా ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయవచ్చు. రెండు లక్షల కణాల కంటే ఎక్కువగా ఉంటే మాస్టైటిస్ ను సూచిస్తుంది.
  3. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్: పాలలో ఉన్న అయాన్ల పరిమాణం మార్పు ఆధారంగా పాలు మాస్టైటిస్ వలన ప్రభావితమైందో లేదో చెప్పగలదు. ఇది వేగమంతమైన ఫీల్డ్ టెస్ట్.
  4. పాల యొక్క పీహెచ్ (PH) పరీక్ష: మాస్టైటిస్ ఉన్న పాలలో పిహెచ్ పెరుగుతుంది. 6.6 కంటే ఎక్కువగా ఉంటుంది.
  5. తర్మోగ్రఫీ: ఇన్ఫ్రారేడ్ కెమెరాలతో పొదుగుభాగం ఉష్ణోగ్రతను అంచనా వేయడం ద్వారా గుర్తించవచ్చు. పొదుగు వాపు వ్యాధి సంభందమైన మార్పులను తేలికగా గుర్తించవచ్చు.

చికిత్స:
(A) యాంటీబయాటిక్స్ (Antibiotics)
• ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే బ్యాక్టీరియాలను వృద్ధిచెందకుండా, యాంటీబయాటిక్ లను ఉపయోగిస్తారు. ఇవి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ (ABST) ఆధారంగా ఇచ్చినట్లయితే చికిత్సకు అగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

ఇంట్రామామరీ యాంటీబయాటిక్స్ (పొదుగులోకి ప్రత్యక్షంగా ఇవ్వడం):
o Cloxacillin
o Amoxicillin
o Cephalosporins

సిస్టమిక్ యాంటీబయాటిక్స్ (ఇంజెక్షన్లు రూపంగా):
o Enrofloxacin
o Penicillins
o Oxytetracycline
o Cephalosporins

(B) యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందులు (Anti-inflammatory drugs)
• పొదుగు యొక్క వాపు మరియు నొప్పి తగ్గించడానికి ఈ మందులు వాడతారు.
ఉదాహరణలు:
o Flunixin meglumine
o Meloxicam

తీవ్రమైన కేసులలో శస్త్రచికిత్స:
వ్యాధి తీవ్రంగా ఉండి, చీముతో ఉన్నప్పుడు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వ్యాధిని నివారించడానికి, ఆ పొదుగు భాగాన్ని తొలగించడం అవసరమవుతుంది.

నివారణ మరియు నియంత్రణ:

  • ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రిoచడానికి వ్యాధిసోకిన పశువులను వేరుచేయాలి.
  • పశువైద్యులు సూచించిన విధంగా వ్యాధి సోకిన పశువులకు చికిత్సను క్రమం తప్పకుండా అందించాలి.
  • మాస్టైటిస్ ఉన్న పశువులను రోజుకు 3-4 సార్లు పాలను పూర్తిగా పిండాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
  • పాలు పితికే ప్రాంతాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాలి.
  • బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సరైన వెలుతురు, గాలి మరియు మంచి పారిశుధ్యాన్ని పాటించాలి.
  • పశువులకు శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • గడ్డి లేదా ఇసుక వంటి శుభ్రమైన మరియు పొడి బెడ్డింగ్ పదార్థాలను ఉపయోగించాలి.
  • విటమిన్లు మరియు ఖనిజ లవణాలతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని అందించడం ద్వారా పశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.
  • పాలు పితికే ముందు, తరువాత పొదుగును శుభ్రంగా కడిగి, మెత్తని పొడి గుడ్డతో తుడవాలి.
  • పాలు పితికేవారు చేతులు శుభ్రంగా కడుక్కొని పాలను పిండాలి.
  • పాలు పితికిన తర్వాత చనుమొనల ద్వారం దాదాపు ఇరవై నిమిషాలు తెరుచుకొని ఉంటుంది. ఈ సమయంలో సూక్ష్మక్రిములు పొదుగు లోనికి చొరబడి వ్యాధిని కలుగజేస్తాయి. అందువలన, పాలు పితికిన తర్వాత చనుమొనలను క్రిమిసంహారక ద్రావణంలో ముంచడం వల్ల పొదుగు వాపును నివారించవచ్చు. ఈ పద్ధతిని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు. దీని ద్వారా పొదుగు వాపుకు ప్రధాన కారణాలైన సూక్ష్మక్రిములు చనుమొనల నుంచి లోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. పోవిడోన్ ఐయోడిన్ లేదా క్లొర్‌హెక్సిడిన్ ఉత్పత్తులను టీట్ డిప్పింగ్ కొరకు ఉపయోగించవచ్చు.
  • తరచుగా CMT పరీక్షలు నిర్వహించడం ద్వారా సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించి చికిత్స చేయడంతో పొదుగు వాపును అరికట్టవచ్చు.
  • డ్రై కౌ థెరపీ (Dry Cow Therapy) పాటించడం ద్వారా పొదుగు వాపును నివారించవచ్చు.
    డ్రై కౌ థెరపీ అనేది పశువు పాలివ్వడం ఆపిన తర్వాత (లాక్టేషన్ ముగిసినప్పుడు), తదుపరి ప్రసవానికి ముందు ఉన్న డ్రై పీరియడ్ (సుమారు 60 రోజుల పాటు ఉంటుంది) సమయంలో పొదుగు లోనికి యాంటిబయాటిక్ లను వాడడం. ఈ చికిత్స ద్వారా:
    • డ్రై పీరియడ్ లోఉన్న మాస్టిటిస్ ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి
    • కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు
    • తదుపరి లాక్టేషన్‌కి మేలైన పాల ఉత్పత్తి కలుగుతుంది.
    డ్రై కౌ థెరపీ రకాలు
  1. బ్లాంకెట్ డ్రై కౌ థెరపీ (BDCT): ఇందులో ఇన్ఫెక్షన్ స్థితితో సంబంధం లేకుండా, పాలిచ్చే కాలం చివరిలో అన్ని పశువులకు యాంటీబయాటిక్స్‌ చికిత్స చేయడం జరుగుతుంది.
  2. సెలెక్టివ్ డ్రై కౌ థెరపీ (SDCT): కేవలం ఇన్ఫెక్షన్ ఉన్న లేదా అనుమానం ఉన్న పశువులకు మాత్రమే యాంటిబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది.

Dr పి. రేవతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్సు, ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్. Ph: 9966038791
Dr ఆర్. సుధాకర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ డిస్పెన్సరీ, దేవగుడి (మం), వై.యస్.ఆర్ కడప (జిల్లా), ఆంధ్రప్రదేశ్.

Read More

వండని వంట… మామిడికాయ కొబ్బరి పచ్చడి

పచ్చడి తయారీకి రెండు మామిడికాయలు, ఒక కొబ్బరి చిప్ప, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర, తగినంత కారం, ఉప్పు అవసరం.

మామిడి కాయల్ని కడిగి తుడిచి, ముక్కలుగా కోసుకోవాలి. అందులో జీడి ఉన్నా పిక్క ఉన్నా తీసెయ్యాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసుకొని, వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర రోటిలో వేసి దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్నా ఫరవాలేదు. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు దంచుకోవాలి. అంతే పచ్చడి రెడీ. రుచికరంగా ఉంటుంది. అవసరం అనుకున్నవారు, ఎండుమిర్చి, అవాలు, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోతే ఎలా అనుకునేవారు, పోపుకు బదులుగా, గానుగ నూనెను కానీ, నెయ్యిని కానీ, ‘మామిడి-కొబ్బరి’ పచ్చడి మీద వేసుకుని తినవచ్చు. ఈ సీజన్లో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.

  • పొనగంటి వేంకట రాజ్యలక్ష్మి, జమ్మికుంట

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల తయారీ, ప్రాముఖ్యత మరియు వినియోగం

ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం

ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:

  • నేల సారవంతత పెరుగుతుంది.
  • పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
  • నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
  • రసాయన అవశేషాలు తగ్గుతాయి.
  • ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
  1. జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి
    జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.
    తయారీకి కావలసిన పదార్థాలు
  • దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
  • ఆవు మూత్రం – 10 లీటర్లు
  • బెల్లం – 2 కిలోలు
  • శనగపిండి – 2 కిలోలు
  • పొలం మట్టి – 1 కిలో
  • నీరు – 200 లీటర్లు

ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
  • మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
  • పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
  • నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
  1. పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం

పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి.
ఉద్యాన పంటలపై ప్రభావం
పుష్పించే శాతం పెరుగుతుంది.

  • పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
  • పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
  • కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
    ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
  1. వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ

వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది.
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • కూరగాయలలో అధిక దిగుబడి.
  • పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
  • పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
  • మొక్కల వేర్ల అభివృద్ధి.
  1. వర్మివాష్

వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
వినియోగం
5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.

  • నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
  • ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
  1. బీజామృతం
    ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు
  • విత్తన వ్యాధుల నివారణ.
  • మొలక శాతం పెరుగుదల.
  1. వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు
    ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    ప్రయోజనాలు
  • తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
  • పర్యావరణానికి హాని లేకపోవడం.
  • ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
  1. అగ్నాస్త్రం
    అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని.
    పదార్థాలు:
    • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు
    • వేపాకు పేస్ట్: 5 కిలోలు
    • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు
    • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు
    • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో

తయారీ విధానం:

  1. ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
  2. ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
  3. తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
  4. చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.

  1. బ్రహ్మాస్త్రం.
    వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’.
    కావలసిన పదార్థాలు:
    • ఆవు మూత్రం: 20 లీటర్లు
    • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)

తయారీ విధానం:

  1. ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
  2. పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
  3. పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
  5. 48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి.
• ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు

  1. ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు
• చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు)
• నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి)
• ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది

తయారీ విధానం

  1. చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
  2. బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
  3. మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
  4. నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
  5. గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
  6. వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.

ఉపయోగించేపద్ధతి:
స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి.
• మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు.
• సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.

ఉపయోగాలు
• మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.
• ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి.
• పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది.
• నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

  1. మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు
• పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ).
• ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు).
• త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు.
గుంత లేదా కుప్ప పద్ధతి

  1. స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
  2. మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
  3. రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
  4. పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
  5. పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి.
    • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు.
    • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి.
    • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.

ఎరువు తయారీ సమయం
వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర

సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

ముగింపు
ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.

డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని
డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291

Read More