- మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 31 వరకు నిర్వహిస్తున్న పశుఆరోగ్య శిబిరాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో ఆయన ప్రారంభించారు. అనంతరం లేగ దూడలకు నట్టల నివారణ మందు వేశారు. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12,220 గ్రామాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఎన్‌ఆర్‌జీఎస్ ద్వారా గోకులం షెడ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ దామోదర్ నాయుడు పాల్గొన్నారు.

