తెలంగాణలో పశువైద్య కోర్సుల్లో ప్రవేశాలకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఎప్‌సెట్ ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో మొదట్నుంచీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కళాశాలల్లో నిర్వహించే బీఎస్సీ వ్యవసాయం, బీటెక్ వ్యవసాయ ఇంజినీరింగ్, బీవీ ఎస్సీ కోర్సుల సీట్ల కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రవేశాలు జరుగుతున్నాయి. అగ్రివర్సిటీనే ఉమ్మడి నోటిఫికేషన్ వెలువరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఇందులో మిగిలిన వాటికంటే పశువైద్య కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మొదటి విడత పశువైద్య కోర్సుల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అగ్రి, ఉద్యానవర్సిటీ పరిదిలోని సీట్ల భర్తీ అయిన తర్వాతే మళ్లీ వెటర్నరీ కౌన్సెలింగుకు అవకాశం వస్తోంది. మూడో విడత కౌన్సెలింగులోనూ జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ, పీహెచ్‌డీతో పాటు పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలను సత్వరమే భర్తీ చేసి తరగతులను ప్రారంభించేందుకు వీలుగా ప్రత్యేక కౌన్సెలింగ్ కోసం పశువైద్య వర్సిటీ కోరగా ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఇకపై అగ్రివర్సిటీ, ఉద్యాన వర్సిటీల పరిధిలో మాత్రమే ప్రవేశాలు విడిగా జరగనున్నాయి.

13 May, 2026
