మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజన యువకుడు చేపల వ్యాపారంలో సంచలనం సృష్టిస్తున్నాడు. అతడి విజయాలను మెచ్చిన అధికారులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అతడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సత్కారం అందుకోనున్నారు. అతడే యోహన్‌ అరవింద్‌ గావిత్‌. నందుర్బార్‌ జిల్లా నవాపుర్‌ తాలూకాలోని భావ్రేకు చెందిన అరవింద్‌ ఎనిమిదేళ్ల క్రితం చేపల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రభుత్వం నుంచి 60శాతం రాయితీ పొందాడు. ఈ పథకం ద్వారా అతడికి 18 బోనుల ఏర్పాటుకు సుమారు రూ.32.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో గావిత్‌ తన గ్రామంలోని సరస్సులో చేపల పెంపకం ప్రారంభించాడు. ఈ వ్యాపారం వల్ల ఆర్థికంగా లాభపడ్డాడు. అంతేకాకుండా తన చేపల చెరువులో చేప పిల్లలను పెంచి రైతులకు సరఫరా చేస్తున్నాడు. గావిత్‌ ప్రోత్సాహంతో భావ్రే, సమీప గ్రామాల రైతులు చేపల వ్యాపారం వైపు మొగ్గు చూపి సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టును పరిశీలించిన మహారాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దీనిపై కేంద్రానికి నివేదికను సమర్పించారు. అరవింద్‌ గావిత్‌ కృషికి గుర్తింపుగా గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలో రాష్ట్రపతి ఆయన్ను సన్మానించనున్నారు.