‘తెలంగాణ రైస్’ ఎగుమతులు పెరగాలి
బియ్యం ఎగుమతుల నిపుణుడు, వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ పురస్కార గ్రహీత సమరేందు మహంతి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్లో మంగళవారం బియ్యం ఎగుమతులపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 2014-2024 మధ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పటికే ‘తెలంగాణ రైస్’ అనే బ్రాండ్ పేరుతో ఇక్కడి బియ్యం ఫిలిప్పైన్స్కి ఎగుమతి అవుతున్నాయి. దాన్ని మరింత పెంచాలి’ అని సూచించారు. దీనికై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, పౌరసరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్ కొండిబ, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

