పచ్చని డాబా… ఆరోగ్యానికి బాట

పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.

ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.

మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.

మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.

కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.

మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.

ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.

ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.

డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365

Read More

సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర

సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా విజయవాడకు చెందిన వనఎర్త్ వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ వాట్సప్ గ్రూప్) సభ్యులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. హ్యాపీసండేలో భాగంగా నగర పాలక సంస్థ సహకారంతో స్థానిక ఇందిరా గాందీ స్టేడియంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి ఆదివారం నేరుగా రైతులే విక్రయించేలా ఏర్పాటు చేశారు. దీని ద్వారా అటు రైతులకు ఆదాయం వస్తుండగా.. ఇటు ఉదయపు నడకకు వచ్చే వారికి రసాయనాలు వాడని కూరగాయలు, ఆకుకూరలు లబిస్తున్నాయి. మిద్దెతోటలు పెంచే ఔత్సాహికుల ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. నాలుగు వారాల కిందట ఈ కార్యక్రమం మొదలు పెట్టగా మంచి స్పందన వస్తోందని సభ్యులు చెబుతున్నారు.

Read More

ఇంటిపంటల సంరక్షణకు మాలి

చెన్నై నగరంలో ఇంటిపంటను పెంచుకునేవారు ఏదైనా సమస్య ఎదురైతే ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తారు. కాసేపటికే ఓ మహిళ వచ్చి తోటను బాగుచేసి వెళ్తారు. అంతేకాదు, ఆ తోటకు కావాల్సినప్పుడల్లా కేర్‌ టేకర్‌గానూ ఉంటారు. నగర ఇళ్లలో తోటల పెంపకం కోసం ఈ తరహా మహిళలు ప్రత్యేక నిపుణులుగా ఎదిగారు. వాళ్లనే ‘మద్రాస్‌ మాలి’గా పిలుస్తున్నారు.

ఇంట్లో కాస్త ఖాళీ స్థలమున్నా ఏదో ఒక మొక్క వేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రత్యేకంగా నగరాల్లో ఇలాంటి ఆవరణ, మిద్దెతోటలు చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే చెన్నై రెసిలెన్స్‌ సెంటర్‌ (సీఆర్‌సి) స్వచ్చంద సంస్థ ఏళ్లుగా ఇంటి ఆవరణల్లో తోటలు పెంచేలా ప్రోత్సహిస్తోంది. వేలాది మంది ఈ ఒరవడికి అలవాటుపడ్డారుగానీ.. వారికి తోటపనిలో తరచుగా వచ్చే సమస్యల్ని తీర్చేందుకు నిపుణులు లేక నిరుత్సాహపడేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆలోచించిన సంస్థ సభ్యులు.. మహిళా తోట సంరక్షణ నిపుణుల్ని తీసుకొచ్చారు. స్వయం సహాయక బృంద సభ్యులు (ఎస్‌హెచ్‌జీ)గా ఉంటూ చురుకైన పాత్ర పోషించే 250మందిని చెన్నైలో ఎంపికచేశారు. రెండేళ్లు శిక్షణ ఇవ్వడంతో పాటు ‘మద్రాస్‌ ‘మాలి’ పేరుతో వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఇంటి తోటల్ని పెంచుతున్నవారికోసం వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

నెలనెలా ఆదాయం
మద్రాస్‌ మాలి.. ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలోని పేద, మధ్యతరగతి మహిళలకు ఆదాయవనరుగా మారుతోంది. ‘ఆసక్తి చూపినవారి తోటలకు కేర్‌టేకర్లుగా ఉంటారు. ప్రతీవారం వారి ఇళ్లను సందర్శిస్తారు. ఏ సమయంలో ఏ మొక్కలు నాటాలి. మంచి దిగుబడి ఎలా రాబట్టాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు నిర్వహణ… వంటివి వారికి వివరిస్తుంటారు. ఇలా నెలకు రూ.20వేల దాకా సంపాదిస్తున్నారు.

ఇంటి పంటపై అవగాహన
ఇళ్లలోనే కాదు.. చెన్నైలోని 114 అంగన్వాడీ కేంద్రాలు, 16 ప్రభుత్వ పాఠశాలల్ని ‘మద్రాస్‌ మాలి’ సభ్యులు తోటలతో పర్యావరణహితంగా మార్చారు. అక్కడ పనిచేసే ఆడవారికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోని పిల్లలకు ఈ తోటల్లోని ఆరోగ్యకర కూరగాయలే వండి తినిపించేలా చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని వివిధ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో కలిసి ఆయా కాలనీల్లో పట్టణ తోటలమీద అవగాహన పెంచుతున్నారు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోన్న చెన్నైలాంటి నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నింటికీ పరిష్కారంగా మేం ‘మద్రాస్‌ మాలి’ వ్యవస్థను రూపొందించాం అని సంస్థ సభ్యులు అంటున్నారు.

Read More

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల

  • జిల్లాల వారిగా ఉద్యానపంటల ప్రగతిని వివరించిన అధికారులు
  • రైతులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం కావద్దని ఆదేశించిన మంత్రి
  • హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో పెద్దఎత్తున కూరగాయల సాగును చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
  • డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
  • కమిషనరేట్‌ అధికారులు హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్రంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించడం జరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ మంత్రికి వివరించడం జరిగింది. ఉద్యానపంటలను ప్రొత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున తుంపర మరియు బిందు సేద్య పరికరాలపై రాయితీ ఇవ్వడం జరుగుతున్నదని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న, సన్నకారు మరియు బిసి రైతులకు 90 శాతం రాయితీతో, ఇతరులకు 80 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు మరియు అన్ని వర్గాల రైతులకు 70 శాతం తుంపర సేద్య పరికరాలను అందించడం జరుగుతున్నదని, కేంద్రం ఇచ్చే సబ్సీడి కన్నా అదనంగా 45 శాతం సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు, 35 శాతం సబ్సిడీని చిన్న, సన్నకారు, బిసి రైతులు మరియు ఇతర రైతులకు ప్రభుత్వం అందచేయడం జరుగుతున్నదని మంత్రికి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29,821 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 81,942 ఎకరాల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 28,147 ఎకరాల విస్తీర్ణానికి బిందు మరియు తుంపర సేద్య పరికారాలు ఏర్పాటు చేయబడ్డాయి అని డైరెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులకు చెందిన 40,247 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టడం జరిగిందని, 2021-22 సంవత్సరంలో కొత్త జిల్లాలలో సాగులోకి తీసుకురాబడ్డ ఆయిల్‌ పామ్‌ తోటలు కాపుకు వచ్చాయని, ఆయా కంపెనీలు రైతుల వద్ద నుండి ఆయిల్‌ పామ్‌ గెలలను కొనుగోలు చేయడం జరుగుతున్నదని, ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌ కర్మాగారాలను ఏర్పరచడం జరుగుతున్నదని తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,25,000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ నాటుటకు నమోదు చేసుకోవడం జరిగిందని, 26 వేల ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో జూన్‌ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ ను పూర్తి చేసుకోవడం జరిగిందని డైరెక్టర్‌ మంత్రికి వివరించారు.
తుమ్మల మాట్లాడుతూ.. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసి, డిప్యూటి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలు అయిన రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా డిమాండుకు అనుకూలంగా కూరగాయల సాగును రైతులకు అందించాలని పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పురోగతి చాలా మందకోడిగా నడుస్తున్నదని, వారంవారిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలని డైరెక్టర్‌ని ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్‌ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పెంచడానికి, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ నర్సరీలలో ఎట్టి పరిస్థితులలో కూడా కల్లింగ్‌ మొక్కలు ఉండకూడదని, ఆయిల్‌ పామ్‌ రైతులకు ఆరోగ్యకరమైన, మంచి మొక్కలను అందించాలని ఇదివరకే నాటిన ఆయిల్‌ పామ్‌ తోటల రైతులకు, పంట యాజమాన్యం విషయంలో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, ఆవగాహన కల్పించాలని తద్వారా అనుకున్న సమయానికి ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మంత్రిగారు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ నెలాఖరు కల్లా ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, తదనుగుణంగా వారంవారిగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రిగారు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్‌ రావు, ఉద్యానశాఖ సంచాలకులు శ్రీమతి యాస్మిన్‌ బాషా మరియు ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More