వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయం
బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సులో భాగంగా విద్యార్థులతో జీవఎరువు (బయోఫెర్టిలైజర్)ల తయారీపై శిక్షణ ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. జీవ ఎరువుల ప్రాధాన్యం దృష్ట్యా ఉత్పత్తిని పెంచేందుకు పూనుకుంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులో విద్యాబోధన, సాగు క్షేత్రాల సందర్శన వంటివి ఉన్నాయి. జీవఎరువుల తయారీతో పాటు వాటి వినియోగం, నిర్వహణ, వ్యాపారంపై శిక్షణ ఇవ్వాలని భావించింది. మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జీవన ఎరువుల విశిష్టత, ప్రయోగశాలలో తయారీ, వాడే విధానాన్ని వివరించారు. ఈ సందర్బంగా అసోసియేట్ డీన్ గోవర్ధన్ మాట్లాడారు. ”ప్రస్తుతం జీవన ఎరువుల వినియోగం, లభ్యత తక్కువగా ఉన్నందున విద్యార్థులకు దీని తయారీపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. చదువు అనంతరం స్వయం ఉపాధికి ఇది దోహదపడుతుంది” అని డీన్ తెలిపారు.