సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం: మంత్రి తుమ్మల
- దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రాథమిక సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- ప్రాథమిక సహకార సంఘాలు ‘ఒన్ స్టాప్ సెంటర్’గా మారాలి
- ఎఫ్.పి.ఓ.లుగా ఎంపికైన ప్రాథమిక సహకార సంఘాలన్ని బిజినెస్ మోడల్స్‌తో సిద్ధం కావాలి
- ఎన్.సి.డి.సి. సహకారంతో రాష్ట్రంలో 311 ప్రాథమిక సంఘాలు ఎఫ్.పి.ఓ.లుగా మార్పు : మంత్రి తుమ్మల
ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరియు వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సహకార పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా, రైతులకు సంబంధించి అన్ని సేవల రూపకల్పనలో పాలుపంచుకొన్నట్లయితేనే ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనకారిగా ఉండగలమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నేడు ఎన్.సి.డి.సి. మరియు కోఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో 311 ఎఫ్.పి.ఓ.లతో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉండి సహకార రంగంలో దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా గెలిచిన ముల్కనూరు సహకార పరపతి సంఘ విజయాల్ని ప్రస్తావిస్తూ.. సహకార సంఘ బాధ్యతలు నీతిగా, నిజాయితీగా చేస్తు, సంఘ అభివృద్ధికి పాటుపాడితే ముల్కనూరు లాంటి సహకార సంస్థలు మరిన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం ద్వారా 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్న సందర్భములో, ఇప్పటికే ఉన్న ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ‘రైతు ఉత్పత్తి సంఘలుగా’ మార్చి, వారికి మరింత ఆర్థికతోడ్పాటు అందించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, తదనుగుణంగా ‘నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో, నిర్లిప్తంగా ఉన్న తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్‌ను క్లస్టర్ బేస్‌డ్ బిజినెస్ ఆర్గనైజేషన్‌గా నియమించి దాని ద్వారా రాష్ట్రంలో 311 సహకార పరపతి సంఘాలను ఎఫ్.పి.ఓ.లుగా ఎన్నిక చేయడం జరిగిందని, వీటికి ఒక్కొకదానికి 15 లక్షల ఈక్విటీ గ్రాంటు మరియు 18 లక్షల మేనేజ్ మెంట్ ఖర్చు (మొత్తం 33 లక్షలు) అనగా 311 ఎఫ్.పి.ఓ.లకు సుమారు 167.93 కోట్లు (సిబిబిఓ ఇచ్చే రూ 21 లక్షలు / ఎఫ్.పి.ఓ.తో కల్పి) మంజూరు చేయగా ఈ రోజు మొదటి విడతాగా 9 కోట్లు 85 లక్షల 40 వేల రూపాయలు (ప్రతి పి.ఎ.సి.ఎస్.కు 3,16,849 రూ) విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఎఫ్.పి.ఓ.లకు 2 కోట్లు వరకు లోన్ గ్యారంటీ సౌకర్యం కూడా ఉందని, కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకొని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడి మీద ఉందన్నారు. ఈ సందర్భముగా మెడ్చల్ జిల్లా మరియు కొన్ని జిల్లాలలో సహకార పరపతి సంఘాలు సాధించిన విజయాలు ఊటంకిస్తూ రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిదీ అని, ఆదేవిధంగా వ్యవసాయంలో ఎరువుల మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి సహకార సంఘం తీసుకోవల్సిందిగా సూచించారు.
రైతులకు కావాల్సిన అన్ని అవసరాలను, అనగా మట్టినమూనాలు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, నిల్వ ప్రాసెసింగ్, మార్కెటింగ్, డైరి, పౌల్ట్రీ ఇలా అన్నీ రంగాలలో వాటి సేవలను విస్తరించే విధంగా బిజినెస్ మోడల్ రూపకల్పన చేసుకోవాలని, అదే విధంగా సంఘ సమావేశాలలో ఆయరంగాల్లో నిష్ణాతుల సేవలను ఆహ్వానించి, వారి సలహాలు, సూచనలు పొంది సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ సందర్భముగా మంత్రితోపాటు ఎన్.సి.డి.సి. రీజనల్ డైరెక్టర్ శార్దూల్, తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ మోహన రెడ్డి, టి.జి.సి.ఎ.బి. ఛైర్మన్ రవీందర్ రావుతో పాటు డి.సి.సి.బి.ల ఛైర్మన్‌లు, కోఆపరేటివ్ సిబ్బంది, రాష్ట్రం నలుమూలాల నుండి వచ్చిన 311 సొసైటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.



