సేంద్రియ రైతుల కోసం ‘ఏలూరు రైతు సంపద’
‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌ను ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉంచేందుకు ఈ ప్రత్యేక ప్లాట్‌ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్సైట్లో అప్లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి తీసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్లైన్లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందు బాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.
ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని సోమవారం పీజీఆర్ఎస్కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

