సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

తెలంగాణాలో సబ్సిడీపై పంట పొలాలకు సౌర విద్యుత్ కంచెలు

తెలంగాణలో అడవి జంతువుల వల్ల ఏటా 5 లక్షల ఎకరాల మేరకు పంట నష్టం వాటిల్లుతోంది. పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించే రైతుల పైనా అడవి పందులు, కోతులు దాడిచేసి గాయపరుస్తున్నాయి. గత పదేళ్లలో 40 మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా వంటి పథకాల్లోనూ జంతువుల ద్వారా జరిగే పంట నష్టాలకు పరిహారం లేదు. ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్ కంచెల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 50% సబ్సిడీతో పరికరాల కొనుగోలు సాయం అందించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వ్యవసాయ మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లో అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రంలో ఐదువేల గ్రామాల్లో సౌరవిద్యుత్ కంచెలను ఏర్పాటు చేయించగా సత్ఫలితాలువచ్చాయి. దీంతో తెలంగాణ లోనూ సౌరవిద్యుత్ కంచెలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. కంచె వేయాల్సిన ప్రాంతం, పరిమాణాన్ని బట్టి ఖర్చు ఉంటుంది.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More