81 గ్రామాలలో అన్ని ఇళ్లపై, వ్యవసాయ బోర్లకు సౌర ఫలకాలు
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో పూర్తిగా సౌర విద్యుత్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పుపై, వ్యవసాయ బోర్లకు, ఇతర కరెంటు కనెక్షన్లన్నింటికీ సౌరవిద్యుత్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.1,273 కోట్లతో సౌర ఫలకాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ రెడ్కో ప్రకటన జారీచేసింది. ఇందులో రూ.400 కోట్లను రాయితీగా కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నెల 24లోగా టెండర్లను దాఖలు చేయాలని సూచించింది. ఈ గ్రామాల్లో 16,840 బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సౌర విద్యుత్ ఏర్పాటు అనంతరం అక్కడ వచ్చే కరెంటును బోరుకు వాడుకోగా మిగిలింది సాధారణ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. అలా సరఫరా చేసినందుకు బోరు యజమానికి యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల వారికి పంటల సాగుతోనే కాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ధరల్లో 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.4.50 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లించనుంది.

