మొక్క వేర్ల పెరుగుదలను పెంచే ట్రైకోడెర్మా, సూడోమోనాస్
సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.
తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.
తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్‌ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.
వాటి మదర్ కల్చర్లను వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్‌ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.

