ఈ నెల 5న వనమహోత్సవం
కోటి మొక్కలు నాటాలని లక్ష్యం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ కాలుష్య నివారణ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలనేది లక్ష్యం. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

