ఉద్యాన నగరి.. ఉపాధి సిరి
పచ్చదనం నిర్వహణపై యువత, రైతు కూలీలకు శిక్షణ ఉద్దండరాయునిపాలెంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం
అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే గత తెదేపా సర్కారు హయాంలోనే బృహత్ ప్రణాళిక తయారైంది. అందులో భాగంగానే రహదారులు, కూడళ్లలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో నర్సరీలు, పచ్చదనం నిర్వహణలో ఉపాధి అవకాశాలు భారీగా రానున్నట్లు సీఆర్డీఏ అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలోని యువత, రైతులు, రైతు కూలీలకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది.
రెండెకరాల్లో…
ఉద్దండరాయునిపాలెంలో పెద్ద నర్సరీ ఏర్పాటుకు సీఆర్డీఏకు 25 ఎకరాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇది గతంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి ఎదురుగా.. కరకట్ట దిగువున ఉంది. ఇక్కడ ఉద్యానశాఖతో కలిసి ఉమ్మడిగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు తలపోస్తున్నారు. తొలుత ఎకరా స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. అనంతరం మరో ఎకరా స్థలాన్ని శిక్షణ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.75 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. రాజధాని నిర్మాణం కారణంగా వ్యవసాయ పనుల్లేక కూలీలు ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకే దీనిని ఉద్దేశించారు. రైతులకిచ్చే రిటర్నబుల్ ప్లాట్లలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచనున్నారు. పలుచోట్ల నైబర్ హుడ్ పార్కులు, చిన్న, పెద్దవి కలిపి దాదాపు 400 ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతీ రహదారి పక్కన అవెన్యూ ప్లాంటేషన్ చేయనున్నారు. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు సీఆర్డీఏ ఉద్యాన శాఖ సహకారం తీసుకోనుంది. తర్ఫీదు ఇవ్వడం ద్వారా రాజధానిలోని నిరుద్యోగ యువత, రైతు కూలీలకు జీవనోపాధులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొక్కలకు అంట్లు కట్టడం, కొమ్మలు కత్తిరించడం, నర్సరీల నిర్వహణలో మెలకువలు, మొక్కల సంరక్షణ, తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అవసరమైన వారిని గుర్తించి, ప్రతి బ్యాచ్‌కు 50 మందికి చొప్పున తర్ఫీదు ఇస్తారు. ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.

