రఘోత్తమరెడ్డి గారి స్ఫూర్తితో ఇంటిపంట

వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటిపంటను నిర్వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇంటి పంటపై శ్రద్ధ ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్న ప్రాంతంలో అంటే పెరటిలో, బాల్కనీలో, మిద్దెమీద, గోడల మీద… ఎక్కడ అవకాశం ఉంటే ఆ స్థలంలో అవకాశం ఉన్న మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. కొంతమందికి ఇంటిపంట మీద ఆసక్తి ఉన్నా కూడా వివిధ రకాల కారణాల వలన ఇంటి పంటను మొదలు పెట్టడం వాయిదా వేసుకుంటూ పోతుంటారు. ఇలా వాయిదా వేసుకుంటూ పోయేవారికి వేరేవారి నుంచి స్ఫూర్తి లభించిందంటే వాయిదాలను ప్రక్కకు నెట్టి కార్యాచరణలోకి దిగుతారు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టే అనేకమందికి అప్పటికే ఇంటిపంటను నిర్వహిస్తున్న ఇంటి పంటదారులు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు. కాని ఇంటిపంట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇంటి పంటను మొదలు పెట్టిన వారు ఎక్కువ మంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. హైదరాబాదు నగరం అమీరుపేటలో గత ఆరు సంవత్సరాల నుంచి మిద్దెతోటను పెంచుతున్న తనకు రఘోత్తమరెడ్డి గారే స్ఫూర్తి అని అప్పారావు అంటున్నాడు.

అప్పారావు గారికి గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటిపంట మీద మక్కువ ఉన్నా కూడా ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కొనసాగిన కాలంలో పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టకుండా కేవలం కొన్ని మొక్కలను మాత్రం పెంచుకుంటూ వస్తూ 6 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. హైదరాబాదు నగరం అమీరుపేటలో మిద్దెమీద ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. తనకు ఇంటిపంటమీద మక్కువ పెరగటానికి ఇంటి పంట నిపుణుడు రఘోత్తమరెడ్డిగారే స్ఫూర్తి అని అప్పారావు వివరిస్తున్నాడు.

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలనే లక్ష్యంతో అప్పారావు ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను చిన్న చిన్న కంటెయినర్లను ఎక్కువగా మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నాడు. చిన్న కంటెయినర్లు అయితే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం తక్కువగా పడుతుంది. అంతేకాకుండా కంటెయినర్‌ బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చాలంటే సులభంగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తమ మిద్దెతోటలో చిన్న కంటెయినర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిమిశ్రమంలో 30 శాతం మట్టి, 30 శాతం వర్మికంపోస్టు, 30 శాతం కోకోపిట్‌ లేదా ఇసుక మిగిలిన 10 శాతం వేపపిండిని ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తరువాత అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంటాడు. వారి ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల పెంపకం చేస్తుంటారు. అరుదైన రకాలను దూర ప్రాంతాల నుంచి తెప్పించి పెంపకం చేయడం అప్పారావు గారికి ఇష్టం కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా విత్తనాలను తెప్పించి మొక్కల పెంపకం చేస్తున్నారు. వారి ఇంటి పంటలో 15 నుంచి 20 రకాల వంగ, 50 నుంచి 60 రకాల టమాటతో పాటు పొట్టి అరటి, చిన్న కంటెయినర్‌లో పెరిగే మునగ, సంపంగి, డ్రాగన్‌ ఫ్రూట్‌, బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు అరుదైన పూల మొక్కలు, ఆకుకూరలు అనేకం ఉన్నాయి. 

ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటపై పెట్టి ఇంటి పంట దారుల సంఖ్య పెంచడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొందిన అప్పారావు ఇంటి పంటను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తూ అనేకమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు.

పెంచుకుందాం… పంచుకుందాం…

అప్పారావు ఇంటి పంటను నిర్వహించడంతోపాటు ఇంటిపంటదారుల సంఖ్య పెరగటానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి అరుదైన రకాల విత్తనాలను, మొక్కలను తెప్పించి తన ఇంటి పంటలో పెంపకం చేసి విత్తనాలను అభివృద్ధి చేసి భారతదేశం మొత్తం అడిగిన వారికి ఉచితంగా అంటే రవాణా ఖర్చులు కూడా తానే భరిస్తూ విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. తన దగ్గర విత్తనాలను తీసుకున్న వారు అవకాశం ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలను అప్పారావు గారికి పంపిస్తుంటారు. వాటిని అప్పారావు గారు అవసరమయిన వారికి ఉచితంగా పంపిస్తుంటారు. ఈ విధంగా పెంచుకుందాం… పంచుకుందాం… అనే భావనతో ముందుకు సాగుతున్నారు.

Read More

ఉద్యోగం తప్పనిసరి కాకపోతే…సమయాన్ని కుటుంబం కోసం కేటాయించడమే ఉత్తమం 

ప్రతిమనిషికి అన్నింటికంటే ముఖ్యం ఆనందం. ఆనందం కావాలంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యం సక్రమంగా లేకుండా వివిధ రకాల అనారోగాలతో ఇబ్బందులు పడేవారు ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించలేరు. ఎన్ని లక్షల కోట్లు డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అన్ని లక్షల కోట్లు వృథా అనే విషయం అందరికి తెలిసిందే కాని వాస్తవాన్ని గ్రహించలేకపోవచ్చు. కాని ఆ విషయం కరోనా తరువాత అందరికి తెలిసి వచ్చింది. లక్షల కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్‌ దెబ్బకు భయపడి ఇల్లుదాటి బటకు రాలేదు అనే విషయం మన అందరం ప్రత్యక్షంగా చూశాము. కరోనా వల్ల ఆరోగ్యం యొక్క విలువ ప్రతి ఒక్కరూ బాగా గ్రహించగలిగారు. సంపాదన కోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎంత సంపాదించినా కాని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సంపాదించిన సొమ్ము ఎందుకు పనికిరాకపోవచ్చు. కాబట్టి సంపాదన కంటే ఆరోగ్యం ముఖ్యం. కాని కొన్ని కనీస అవసరాలకు సంపాదన తప్పనిసరి కాబట్టి కనీస అవసరాల కొరకు తప్పనిసరిగా సంపాదన కోసం ప్రయత్నించాల్సిందే. కొంతమంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు  కనీస అవసరాల కొరకు భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరము లేకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరి ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం తమ అవసరాలకు సరిపోయినట్లయితే ఇంకొకరు తమ సమయాన్ని కుటుంబం కోసం, కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించినట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన పద్మిని గారు తన భర్త సాంబశివరావుగారి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం తమకు సరిపోతుంది కాబట్టి తాను ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన పూర్తి సమయాన్ని తమ కుటుంబం కోసం మరియు కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నారు.

పద్మిని గారిది వ్యవసాయ నేపథ్యం. తన చిన్నతనం నుంచి తండ్రితో కలిసి పొలాలకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యవసాయ మూలాలు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ కోవకే చెందిన పద్మిని గారికి కూడా చిన్నతనం నుంచి మొక్కలన్నా, పచ్చదనం అన్నా చాలా మక్కువ కాబట్టి ఉన్నత చదువులు చదివిన పద్మిని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చెయ్యకుండా తన భర్త సహాయ సహకారాలతో ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. భర్త ఉద్యోగ భాధ్యతల రీత్యా వివిధ ప్రాంతాలు తిరుగుతున్న సమయాలలో కూడా ప్రతి చోట మొక్కలు పెంచుతూ ప్రాంతం మారినపుడు అన్ని మొక్కలను తమతో పాటు రవాణా చేస్తూ ఉండేవారు. వేరేప్రాంతానికి మారవలసి వచ్చినపుడు ఇంటి సామను కంటే మొక్కలకు సంబంధించిన సామాను ఎక్కువగా ఉండేది. అయినా కాని ఏ మాత్రం ఆలోచించకుండా తాము మారిన కొత్త ప్రాంతానికి మొక్కలను కూడా మారుస్తూ వచ్చి నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు, మదీనాగూడలో సొంత ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటి మిద్దెమీద వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తూ వస్తున్నారు.

మిద్దె మీద మొక్కల పెంపకం చెయ్యాలి కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలోనే నీరు స్లాబులోకి ఇంకకుండా జాగ్రత్తలు వహించారు. స్లాబు మీద కూడా స్టాండ్లు ఏర్పాటు చేసి స్టాండ్‌ల మీదనే వివిధ రకాల కుండీలు, బకెట్ల లాంటివి ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. తాను ఇంటిపంటను చేసేది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి మొదటగా తమ ఆహారాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లకు ప్రాముఖ్యతను ఇచ్చి కొన్ని రకాల పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు సగానికి పైగా తామే సొంతంగా పండించుకుంటూ మిగతావి బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. పండ్ల విషయానికొస్తే జామ, దానిమ్మ, యాపిల్‌బేర్‌, అంజూర లాంటి పండ్లను సొంత మిద్దె తోట నుంచి పొందుతూ కొన్ని రకాలను బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు.

ప్రతిరోజు ఉదయం, సాయంకాలం కలిపి మూడు నుంచి నాలుగు గంటలు మిద్దెతోటకు కేటాయించి మొక్కలకు అవసరమయిన పనులను తానే సొంతంగా చేస్తూ శారీరక శ్రమకు అవకాశం ఇస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. విత్తనాలను కూడా తామే సొంతంగా తమ ఇంటి పంట నుంచి సేకరిస్తూ ఉపయోగిస్తుంటారు. మిరప, టమాట, వంగ లాంటి మొక్కలను కూడా సొంతంగా నారు పోసుకుంటుంటారు. కొమ్మల ద్వారా అభివృద్ధి చేయగల మొక్కలను కూడా సొంతంగా అభివృద్ధి చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు. చీడపీడల నివారణ కొరకు తప్పనిసరి పరిస్థితులలో ఎగ్‌ఎమినో యాసిడ్‌ లాంటివి పిచికారి చేస్తుంటారు. మొదటగా చీడపీడలు ఆశించిన ఆకులను, కొమ్మలను కడగడం లేదా అంతవరకు తుంచడం చేస్తుంటారు. మొక్కలకు పోషకాలకు గాను కిచెన్‌లో వృథాగా పడవేసే కూరగాయల, పండ్ల తొక్కలు, బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తుంటారు. సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు పశువుల ఎరువు లేదా మేకల ఎరువును అందిస్తుంటారు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం సంభాషణలు జరుపుతూ అవసరమయిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు.

మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలగాలి. ఆరోగ్యకరమైన ఆహారానికి కొంతలో కొంత సరైన దారి ఇంటి పంట అని గ్రహించిన పద్మిని తన చదువు అయిన తరువాత ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం, ఇంటిపంటకోసం కేటాయించి తోటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఇంటి పంటకు అవసరమయిన కుండీలు, ఎరువులు, ద్రావణాలు, విత్తనాలు, మొక్కలు మొదలగు వాటి కొరకు వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది. అలాంటి సమయాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అవుతుంది. కొన్నిసార్లు ఇంటి పంట అవసరాలకు దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చినప్పుడు అవి కొనుగోలు చేసే ధర కంటే రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావడంతో పాటు సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది. అలాంటి సమయాలలో పద్మిని భర్త సాంబశివరావు తోడుగా ఉంటూ ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంత దూరం అయినా రావడంతో పాటు డబ్బును, సమయాన్ని కేటాయించడానికి ఏమాత్రం వెనుకాడడు కాబట్టి తాను విజయవంతంగా ఇంటి పంటను నిర్వహించగలుగుతున్నాని భర్త సాంబశివరావుకి పద్మిని కృతజ్ఞతలు తెలియచేశారు.

ఆరోగ్యం విలువ అనంతం

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గతంలో మనిషి పుట్టింది సంపాదన కోసమే అన్నట్లు ప్రవర్తించారు. కాబట్టే తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సంపాదన కోసం తాపత్రయ పడ్డవారు చాలామంది ఉన్నారు. కాలం గడిచే కొలది డబ్బు అందరికి అందుబాటులోకి రావడంతో పాటు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత ఆరోగ్యం విలువ చాలా వరకు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఎదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పోయినప్పుడే దేని విలువ అయినా తెలిసేది అనే విషయం అక్షర సత్యం. కాబట్టే ఆరోగ్యంగా ఉన్నపుడు ఆరోగ్యం విలువ తెలుసుకొనని వారు ఆరోగ్యం పాడైపోయిన తరువాత ఆరోగ్యం విలువ గుర్తించగలుగుతున్నారు కాని కొన్ని సమయాలలో ఎంత గుర్తించినా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఎంత ఖర్చు పెట్టినా కూడా బాగు చేసుకోలేకపోతున్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా వచ్చిన రోగాల నుంచి బయట పడలేక ఇబ్బందులు పడిన వారి గురించి మనం ప్రతినిత్యం వింటూనే ఉంటాము. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఆరోగ్యం విలువ అనంతం అని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పద్మిని తమ కనీస అవసరాలు తన భర్త సంపాదనతో తీర్చుకోగలుగుతున్నారు కాబట్టి తన సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని నిర్ణయించుకొని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, మంచి నీరుతో పాటు మంచి ఆహారం తినగలగాలి. గాలి, నీరు ప్రకృతి నుంచి లభిస్తున్నాయి కాబట్టి తమ పరిధిలో ఉన్న ఆహారాన్ని ఎలాంటి విష రసాయనాలు లేకుండా తామే ఇంటి అవరణలోనే పండించుకోవాలనే లక్ష్యంతో ఎక్కువ ప్రాంతాలు తిరిగినా, ఎన్ని ఇళ్లు మారినా కూడా ఇంటి పంటను వదలకుండా కొనసాగిస్తూ తమ కుటుంబానికి అవసరమయిన కొంత ఆహారాన్ని తమ పరిధిలో పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

Read More