అధిక పోషక విలువలు గల తృణధాన్యాలు

ఆహారంలో మరింత ఎక్కువగా కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు వంటి తృణధాన్యాలను వినియోగించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ విస్తృతంగా పరిశోధనలను చేస్తోంది. వాతావరణ మార్పులకు తట్టుకునే, అధిక పోషక విలువలు కలిగిన, రైతులకు గిట్టుబాటు కలిగించే కొత్త వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు సృష్టిస్తున్నారు. ఆచార్యులు డా. ముతమిళవరసన్ నేతృత్వంలోని విద్యార్థులు కొర్రల్లో పోషక పదార్థాల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు జన్యు ఆధారిత అధ్యయనాలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశవిదేశాలలో సేకరించిన 156 కొర్ర రకాలపై విశ్లేషణలు చేసి తక్కువ ఫైటిక్ యాసిడ్ కలిగిన వాటిని అభివృద్ధి చేశారు. ల్యాబ్‌కు సమీపంలోని ఎకరం భూమిలో కొత్తగా సృష్టించిన కొర్ర వంగ డాలను పండించి ఫలితాలను సాధించారు. వీరి పరిశోధనలకు కేంద్ర సంస్థలు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి.

జావ.. దోసెలు.. ఉప్మా.. బియ్యం.. మినపగుళ్లతోనే కాదు. కొర్రలతోనూ దోసెలు చేసుకుని తినొచ్చంటూ తృణధాన్యాల పరిశోధన ప్రయోగశాల ప్రతినిధులు చెబుతున్నారు. దోసెలతోపాటు ఉప్మా, జావ కూడా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన రుచిని పరిచయం చేసేందుకు కొన్ని రెస్టారెంట్లలో సొంతంగా తయారు చేసి ఇస్తున్నారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తృణధాన్యాల్లో అధిక ఫైబర్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండడంతో సమతుల్య ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొర్రలు, రాగులు, సజ్ౙలు, అరికెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైతులకు ఉచితంగా వంగడాలు
కొర్రలు ఎక్కువగా తింటే జీర్ణం కాదని అపోహలున్నాయి. జన్యుపరమైన అంశాలను పరిశీలిస్తే కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణక్రియను స్వల్పంగా మందగిస్తుంది. అందుకే చాలామంది ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త రకం కొర్రల వంగడాలను రైతులతో సాగు చేయించాలని పరిశోధకులు నిర్ణయించారు. రెండు, మూడు సీజన్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కొత్త వంగడాలను పంపిణీ చేయించనున్నారు.

బియ్యంలో అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. సులభంగా ఎవరైనా తింటారు. పైగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయి. వారు కొర్రలు కొని వండుకుని ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఆయా రాష్ట్రాల్లో అల్పాహారంగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థించనున్నారు.
Read More

9 రకాల చిరుధాన్యాలతో 190 రకాల ఉత్పత్తులు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ మిల్లెట్స్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం (సీఓఈఎం) చిరుధాన్యాలను ‘రెడీ టూ ఈట్‌’లా సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ సంస్థ.. ఔత్సాహికులకు ఆయా సాంకేతికతలను అందిస్తోంది. మైసూరులోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఎఐ) లో గతేడాది డిసెంబరులో సీఓఈఎం ఏర్పాటైంది. ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ కేంద్రం.. చిరుధాన్యాలలో సాధించిన ఘన ఆవిష్కరణలు…

గంటకు 500 కిలోల సామర్థ్యం
చిరుధాన్యాల ఉత్పత్తిలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. రైతులు మాత్రం అవగాహన లేక నష్టపోతున్నారు. సీఓఈఎం ముందుగా రైతు నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. రూ.20 కోట్లతో 3 రకాల ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నేరుగా ఈ కేంద్రాలకు తరలించేలా అవగాహన కల్పించింది. ధాన్యం నాణ్యత, శుద్ధి, అనుబంధ ఉత్పత్తుల తయారీ రైతుల కళ్లముందే చేపడుతోంది. ప్రత్యేక ప్రాసెసింగ్‌ యంత్రాలతో గంటకు 500 కిలోల ధాన్యం శుద్ధి చేసి, ఉత్పత్తులనూ తయారు చేయడంతో రైతులకు కేంద్రంపై గురి కుదిరింది.

మెక్‌ డొనాల్డ్‌ మెచ్చింది
సీఓఈఎంలో జొన్న, రాగి, సజ్జ తదితర ధాన్యాలతో చేసిన బన్‌.. మెక్‌డొనాల్డ్‌ సంస్థకు ఎంతో నచ్చింది. దాన్ని ‘మిల్లెట్‌ బన్‌ బర్గర్‌’గా మార్చి ప్రపంచ విపణికి పరిచయం చేసింది.

వివిధ రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలు శుద్ధి చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలనూ ఈ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో వృథాగా పోనివ్వడం లేదు. రాగి పొట్టు నుంచి అయిల్‌, విరిగిన రాగులతో సేలాలు, పగుళ్లిచ్చిన గింజలతో ‘రాగి రైస్‌’, నూకతో రవ్వ, మురుకులు ఇలా.. ఒక్క రాగులతోనే 45 రకాల ఉత్పత్తులు చేస్తోంది. వాటికి అదనపు పోషకాలూ జోడిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో 9 రకాల ధాన్యాలను 190 రకాల ఉత్పత్తులుగా మలిచే వ్యవస్థలున్నాయి. బయో డిగ్రేడబుల్‌, తినదగిన ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు తయారు చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగులు, రుచులను చేర్చేందుకు ఎలక్ట్రానిక్స్‌ నోస్‌, మౌత్‌ అప్లికేషన్లు, ప్యాకేజింగ్‌ వ్యవస్థలూ తీసుకొచ్చింది.

నిల్వకు పెద్దపీట..

  • చిరు ధాన్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. వాటి పిండి, రవ్వ ఇతర ఉత్పత్తుల నిల్వ కాలం తక్కువ.
  • సీఓఈఎం ప్రత్యేక పద్ధతుల్లో 4-5 నెలలపాటు నిల్వ చేసుకునేలా చేసింది.
  • ఇందుకు తొలుత వైబ్రో క్లీనర్ల ద్వారా ధాన్యం శుభ్రం చేసి, స్టీమింగ్‌ ట్యాంకర్లు, డ్రైయర్‌ బెడ్ల ద్వారా ఆరబెట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకు నేలా పాలిష్‌ చేస్తోంది.
  • ఆ తర్వాత వినియోగదారుడికి అవసరమైన ఉత్పత్తులుగా మార్చుతోంది.
  • ధాన్యం నిల్వకూ ఈ కేంద్రంలోనే గోదాములు ఏర్పాటు చేసింది.
Read More