పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం నేడు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతించింది. టీ5 ప్లాస్టిక్ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఆరు మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాలి. ఈ పనులను విదేశీ కంపెనీ బావర్ చేపడుతోంది. ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్ల వంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. డయాఫ్రం వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు.







