9.8 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ.22 వేల కోట్లు
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోదీ
‘పీఎం కిసాన్ ‘సమ్మాన్ నిధి’ పథకం 19వ విడత కింద 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.22,000 కోట్లను ప్రధాని మోదీ సోమవారం బదిలీ చేశారు. బిహార్ లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులు విడుదల చేశారు. దేశ అన్నదాతలు తనకు గర్వకారణమని అంతకుముందు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో రూ. 3.5 లక్షల కోట్లు జమచేశామని పేర్కొన్నారు. గడచిన పదేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా వ్యవసాయ రంగం త్వరితగతిన అభివృద్ధి చెందిందని తెలిపారు. పంట వేయడానికి అయ్యే ఖర్చు తగ్గి రైతుల ఆదాయం పెరిగిందని అన్నారు.




