పండ్లలో చక్కెర శాతం పెంపునకు… పులిసిన పండ్ల రసం ద్రావణం

పులియబెట్టిన పండ్ల రసాల్లో ఉన్న పలురకాల సూక్ష్మజీవుల చర్య వలన ఇవి పంటలలో చక్కెర శాతాన్ని పెంచడానికి దోహదపడతాయి.
కావలసిన పదార్థాలు : బాగా మగ్గిన పండ్లు : 1 కిలో (అరటి, మామిడి, బొప్పాయి, మొ॥); బెల్లం : 1 కిలో.

తయారు చేసే పద్ధతి

  • ఒక కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి ఒక కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోయాలి.
  • కుండను ఒక గుడ్డతో మూతకట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజులపాటు ఉంచాలి.
  • ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారు 2.5 లీటర్ల వరకు ఉంటుంది.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పొలంలో పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
Read More

కాయ నాణ్యతకు… కాల్షియం ద్రావణం

మొక్కల్లో పూత కాయగా మారే క్రమంలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. దీనిని కూడా చాలా సులువుగా తయారు చేసుకునే ప్రక్రియ ఈ వ్యవసాయ విధానంలో కనిపిస్తుంది.

మనిషి ఎముక బలానికి కాల్షియం ఎంత అవసరమో, మొక్కకు అంతే అవసరం. దీనిని సహజ పద్దతుల్లో తయారు చేసుకోవడానికి సముద్రంలో, నదులలో దొరికే గవ్వలను లేదా గుడ్డు పెంకులను వెనిగర్‌తో కలిపితే ద్రవరూప కాల్షియం లభిస్తుంది. దీనిని మొక్కలకు అందించడం వల్ల ప్రధానంగా కాయ నాణ్యత, కాయ కోత తరువాత ఎక్కువ రోజుల నిల్వకు దోహదపడుతుంది.

కాల్షియంను ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ రూపంలో కూడా అందించవచ్చు. ఒక కిలో అల్లాన్ని మెత్తగా దంచి అందులో కిలో బెల్లాన్ని కలుపుకుని పదిహేనురోజుల పాటు వుంచి మొక్కలకు పూత దశ నుంచి స్ప్రే చేయాలి.

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

‘లాబ్’ (లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా)తో లాభాలు

మొక్కలకు కావలసిన పోషకాలను సహజంగా అందించడానికి లాక్టిక్ ఆసిడ్ బాసిల్లస్‌ను (లాబ్) ఉపయోగించాలి.
లాక్టిక్ ఆసిడ్ ద్రావణం తయారీ

ఇందులో ఉపయోగించుచున్న పదార్థాలలో సహజంగా ఉండే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన శిలీంధ్రాలు మరియు వైరస్ తెగుళ్ళ నియంత్రణలో ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు :
బియ్యపు కడుగు : 5 లీటర్లు
ఆవు పాలు : 10 లీటర్లు
బెల్లం : 1 కిలో

తయారు చేసే పద్ధతి :

  • 5 లీటర్ల బియ్యపు కడుగును ఒక కుండలో పోసి, మూతపెట్టి 7 రోజులు నీడలో ఉంచాలి.
  • 7 రోజుల తరువాత పై ద్రావణానికి 10 లీటర్ల ఆవుపాలను కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మూతపెట్టి మరలా 7 రోజులు నీడలో ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి దానికి బెల్లపు పొడిని కలపాలి.
  • మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి లీటర్ నీటికి 1 లేదా 2 మి.లీ. ద్రావణాన్ని కలిపి మె°క్కలపై స్ప్రే చేయాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను, పండ్ల తోటలలోను వాడవచ్చు.
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

మొక్కల ఎదుగుదలకు, ఫలదీకరణ శక్తి పెరగడానికి చేప అమినో ఆమ్లం

రైతు వారీగా అతి తక్కువ శ్రమ, స్వల్ప ఖర్చుతో తయారు చేసుకోగలిగేది చేప అమినో ఆమ్లం. చేపలతో అమినో ఆమ్లాలను తయారు చేసుకునే పద్ధతిని కొరియా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ చోహాన్ క్యూ రూపొందించారు. ఈ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాకృతిక రైతులు ఆచరిస్తున్నారు.

తయారు చేసే విధానం : ముందుగా చేప పొలుసులు, ఈకలు, తోకలు తొలగించాలి. తరువాత చేపను చిన్న, చిన్న ముక్కలుగా కోయాలి. చేప ముక్కలను తూకం వేసి దానికి సరిసమానంగా బెల్లం కలపాలి. వాటిని ఒక ప్లాస్టిక్ జాడి లేదా బకెట్‌లో మూడవ వంతు వరకు నింపుకుని పైన గుడ్డ కట్టి నీడలో పెట్టుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి కలియబెట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుండి 15 రోజుల్లో చిక్కటి ద్రావణం తయారవుతుంది. తయారైన ద్రావణం నుండి మధురమైన వాసన వస్తుంది. ఒకవేళ చేపల వాసన వస్తుంటే దానికి మరింత బెల్లం కలిపి మరో 4,5 రోజులుంచాలి.

తయారైన ద్రావణాన్ని లీటరు నీటికి 1 నుంచి 4 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. దీనిని అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు.
Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

చేప అమైనో ఆమ్లాల ద్రావణం / చేప – బెల్లం ద్రావణం

చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో

తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):

  • ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
  • కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి.
    సూచనః
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More

నేల సారవంతానికి ‘గార్బేజ్ ఎంజైమ్‌’

గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.

తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.

కావలసిన పదార్థాలు :

  • మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
  • కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
  • నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
  • నీరు Ð 10 పాళ్ళు

పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.

ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.

  • ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
  • పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
  • దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
  • పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
  • ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.
Read More
  • 1
  • 2